రాజకీయ వైరంతో దార్శనికుడి ప్రతిభను మరుగున పడేయలేరు!
రాజకీయవైరంతో ఒక దార్శనికుడిని మరుగున పడేయాలను కోవడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోగలమనుకోవడం లాంటి భ్రాంతి మాత్రమే. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విషయంలో అది పదే పదే రుజువౌతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సాధించిన నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారు చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఉంటారు.
రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న, వచ్చిన గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తుందేమో కాని అనితర సాధ్యం అనదగ్గ రీతిలో ఆయన సాధించిన విజయాలు, ఆయన చొరవవల్లే.. ఔను కేవలం ఆయన చొరవ, దూరదృష్టి కారణంగానే జంటనగరాలకు అదనంగా ఆయన నిర్మించిన సైబరాబాద్ మహానగరం, హైదరాబాద్ కు అనేమిటి.. యావద్దేశానికే తలమానికం అనదగ్గ ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్, ఇండియన్ ఇనిస్టిట్యట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైన క్రీడా ప్రాంగణాలు.. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా ఒకటనేమిటి హైదరాబాద్ విశ్వనగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు దోహదపడిన ప్రతి ప్రగతి నిర్మాణంలోనూ చెరిగిపోని విధంగా చంద్రబాబు ముద్ర ఉంది. ఉంటుంది
అనడంలో సందేహమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం, చేపట్టిన ప్రతి కార్యక్రమం, ఏర్పాటు చేసిన ప్రతి సంస్థ.. రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంతోనే చేశారు. వర్తమానం గురించి మాత్రమే కాదు భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగారు. ఆ దార్శనికతే చంద్రబాబుకు ఒక విశిష్ట నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా ఆయన అమెరికా వీధుల్లో ఫైళ్లు పట్టుకుని తిరిగి మరీ ప్రపంచ ప్రఖ్యాల సంస్థలను ఆహ్వానించారు. ఆయన సింప్లిసిటీ, ఆయన దూరదృష్టి కారణంగానే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న సమయంలో దేశంలో ఏ రాష్ట్రానికీ రాని విధంగా ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు హైదరాబాద్ కు తరలివచ్చాయి.
అలా చంద్రబాబు కృషి వల్ల హైదరాబాద్ వచ్చిన ఐఐఐటీ హెచ్ బుధవారం (ఆగస్టు 23) సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాల్లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఆయన బుధవారం ( ఆగస్టు 23) విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ రంగ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులతో చర్చిస్తారు. వారి ప్రశ్నలకు సమాధానమిస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే 1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ రంగాలలో దేశంలోనే నంబర్ వన్ గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ బెంగళూరును అధిగమించి మరీ ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
హైదరాబాద్ నలుచెరగులా జరిగిన అభివృద్థిలో ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే రాజకీయంగా ఉన్న విభేదాలతో దార్శనికుడి ప్రతిభ మరుగున పడేయాలన్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. ఐఐఐటీ హెచ్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా దాదాపుగా జాతీయ పత్రికలన్నీ ఆ సంస్థ ఉన్నతి గురించీ, అది హైదరాబాద్ లో ఏర్పాటు కావడం వెనుక ఉన్న చంద్రబాబు దార్శనికత గురించీ ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాయి. చంద్రబాబు వంటి దార్శనికుడి అవసరం దేశానికి ఎంతో అవసరమంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు.