జాబిల్లిపై ఇండియా వెన్నెల అడుగు
posted on Aug 23, 2023 @ 1:45PM
బాబిల్లిపై వెన్నెల అడుగు.. చంద్రయాన్ 3 కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఘట్టం మరి కొద్ది సేపటిలో సాక్షాత్కారం అవుతుంది. భారత దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం చంద్రయాన్ 3 మిషన్ కీలక దశకు చేరుకుంది. ఒక ఇండియానే కాదు యావత్ ప్రపంచం చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనున్న మహత్తర సన్నివేశాన్ని వీక్షించేందుకు కళ్లు విప్పార్చుకుని చూస్తోంది. ఈ అద్భుత ఘట్టాన్ని యావత్ భారత్ ప్రత్యక్షంగా వీక్షించనుంది. ఇందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది.
చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియను యావత్ దేశంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. బుధవారం( ఆగస్టు 23) సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 కాలూనుతుంది ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై పరిశోధనలు చేస్తోంది. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జూలై 14న చేపట్టగా.. అప్పటి నుంచి క్రమక్రమంగా చంద్రయాన్ చంద్రుడి వద్దకు వెడుతూ.. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలో ప్రవేశించింది. ఆ తర్వాత క్రమంగా దూరాన్ని అధిగమిస్తూ బుదవారం (ఆగస్టు 23) చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై అడుగిడనుంది. వాస్తవానికి 17 నిమిషాలు ముందుగా అంటే 5.47 నిమిషాలకు ల్యాండ్ కావల్సి ఉండగా.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసి 6.04 గంటలకు ఫిక్స్ అయ్యింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే చంద్రుడి పైకి ల్యాండర్, రోవర్ పంపిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే సోవియట్ యూనియన్, అమెరికా, చైనా చంద్రుడి పైకి రోవర్లను పంపాయి. అయితే చంద్రుని దక్షణ ధృవాన్ని టార్గెట్ చేసిన తొలి దేశం మాత్రం ఇండియాయే అవుతుంది.
అంటే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పూర్తయితే దక్షిణ ధృవంపై దిగిన తొలిదేశం గా జాబిల్లిపై భారత పతాకం సగర్వంగా రెపరెపలాడుతుంది. నిజానికి చంద్రుడిపై అడుగిడేందుకు భారత్ కు ఇది రెండో ప్రయత్నం. దాదాపు నాలుగేళ్ల క్రితం చంద్రయాన్-2ని ప్రయోగించి విఫలమైంది. చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయ్యే సమయంలో సమస్యల్లో చిక్కుకుంది. ఆ మిషన్ విఫలమవ్వడంతో ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. ఇస్రో, చంద్రయాన్ 2 అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకుందని, చంద్రయాన్-3 మిషన్‌ను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్-2లో ఉపయోగించిన ‘సక్సెస్-బేస్డ్ డిజైన్’ కాకుండా చంద్రయాన్-3 కోసం ఇస్రో ‘ఫెయిల్యూర్-బేస్డ్ డిజైన్’ వ్యూహాన్ని అనుసరించింది. ఈ విధానం పొటెన్షియల్ ఫెయిల్యూర్ సినారియోలను అంచనా వేస్తుంది, వాటిని ఎదుర్కోవడానికి చర్యలను అమలు చేస్తుంది. తద్వారా విజయవంతమైన ల్యాండింగ్‌ను నిర్ధారిస్తుంది. కాగా, గతంలో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయిన చంద్రయాన్ 2 ఆర్బిటార్ మాత్రం ఇంకా పనిచేస్తోంది. ఇప్పుడీ ఆర్బిటార్.. విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేట్ అయినట్టు ఇస్రో తెలిపింది. వెల్‌కం బడ్డీ అంటూ చంద్రయాన్ 2 ఆర్బిటార్.. ల్యాండర్ మాడ్యూల్ కు స్వాగతం పలికింది.
చంద్రుని దక్షణ ధృవంపై అడుగు పెట్టనున్న మధుర క్షణాల కోసం ఇండియాతోపాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అద్భుత ఘట్టాన్ని యావత్ భారత్ లైవ్‌లో వీక్షించనుంది. ఎక్కడికక్కడ స్కూల్స్, కాలేజీలతో పాటు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ ప్రయోగాన్ని ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దాయాది దేశం పాకిస్థాన్ కూడా మన చంద్రయాన్ 3పై ప్రశంసలు కురిపించింది. పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ ఛౌదరీ చంద్రయాన్-3 ప్రయోగాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పాక్ మీడియా ఈ చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రయోగాన్ని ప్రసారం చేయాలని కూడా పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు మన దేశంలో ప్రముఖ దేవస్థానాలలో కూడా చంద్రయాన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు జరుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రతి భారతీయుడు చంద్రయాన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.