షాక్‌లో పుష్ప ఫ్యామిలీ..!
posted on Aug 22, 2023 @ 4:34PM
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ఫ. ఈ చిత్రం మొదటి భాగం.. దేశవ్యాప్తంగా వసూళ్ల రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం రెండో భాగం.. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. అయితే ఈ చిత్ర తొలి భాగంలో హీరో అల్లు అర్జున్.. ఎర్రచందనం స్మగ్లర్‌గా అందరికీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంటే.. రియల్ లైఫ్‌లో మాత్రం.. అల్లు అర్జున్‌తో పాటు ఆయన మామ గారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు.
అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు.. తన వంతు ప్రయత్నాలు చేసుకొంటున్నారు. అయితే ఆగస్ట్ 19వ తేదీన నాగార్జున సాగర్‌లో కంచర్ల కన్వెన్షన్ ప్లేస్ పేరుతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన రెండు రోజులకే అంటే ఆగస్ట్ 21వ తేదీన.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగనున్న 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో అల్లు అర్జున్ మామ గారు పేరు లేదు. ఆ అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే నోముల భగత్ పేరునే పార్టీ అధినేత ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ మామకు కేసీఆర్ ఝలక్ ఇచ్చినట్లు అయింది. మరోవైపు 2014లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహింపట్నం అసెంబ్లీ స్థానం నుంచి నాటి టీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. ఇక నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ కోసం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనే ఓ చర్చ సైతం స్థానికంగా కొన.. సాగుతోంది.
ఇక 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, హోం శాఖ మాజీ మంత్రి కె. జానారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత నోముల నర్సింహయ్య మరణంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన కుమారుడు నోములు భగత్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయన ఘన విజయం సాధించారు. కానీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ నోముల భగత్‌కే బీఆర్ఎస్ అధినాయకత్వం టికెట్ కేటాయించడం గమనార్హం.