నారా లోకేష్ డబుల్ సెంచరీ.. తెలుగుదేశం డబుల్ హ్యాపీ!
రాజకీయాలలో తొలి అడుగులు వేయకముందే.. తొక్కేద్దామని చూసిన వక్రబుద్ధి నేతల దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఎగసిన కేరటం నారా లోకేష్. బాడీ షేమింగ్ సహా, అహారపు అలవాట్లనూ గేలి చేసి రాజకీయంగా అణగదొక్కేయాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టి పరిణితి చెందిన నేతగా ఎదిగిన నాయకుడు నారా లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్న నిబద్దత గల కార్యదక్షకుడు నారా లోకేష్. నారా లోకేష్ ప్రస్తావనకు ముందు ఎందుకు ఇన్ని విశేషణలు అన్న ప్రశ్నకు ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాలుగేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకతవకలను ఎండగడుతూ కక్షపూరిత రాజకీయాల కుతంత్రాలతో నలిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తూ, మూర్ఖత్వం మూర్తిభవించిన ప్రభుత్వాధినేత జగన్ తీసుకొచ్చిన విధానాలతో విసిగిపోయిన ప్రజలకు అండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో కీలకమైన మైలురాయికి చేరుకుంది. గురువారం (ఆగస్టు 31)లోకేష్ పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది.
రాయలసీమలోని లోకేష్ స్వస్థలం కుప్పం నుంచి ఈ ఏడాది జనవరి 27న పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్ 200 రోజులుగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పర్యటిస్తున్న లోకేష్ ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 16 వందలకుపైగా గ్రామాలను, సుమారు రెండు వందల మండలాలు, మున్సిపాలిటీలను కవర్ చేశారు. మొత్తంగా 200 రోజులలో 2,710 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ సభలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల వద్ద సెల్ఫీలు దిగుతూ.. జగన్ సర్కార్ వైఫల్యాలను సమస్యలను ఎత్తి చూపుతూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా ఉండే సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎలా పరిష్కరిస్తాహామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
విపక్ష నేతగా జగన్ చేసిన పాదయాత్ర చూసిన వారంతా.. ఆ పాదయాత్రకు భిన్నంగా లోకేష్ కదులు తున్న తీరు చూసి అచ్చెరువోందుతున్నారు. నిబద్ధత, సంకల్పంతో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కనుగొనడం కోసం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న లోకేష్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. లోకేష్ పాదయాత్రలో కాళ్ల బొబ్బల కథలు లేవు.. వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్ మెంట్ల ప్రచారం లేదు. కాళ్లకు బొబ్బలని, చేతులకు గాయాలనే మెలో డ్రామాలు లేవు. కావాలని ప్రత్యర్థులను తూలనాడి అల్లర్లు చేయడం అసలే లేదు. పెయిడ్ ఆర్టిస్టులతో సెంటిమెంట్ పండించే టాలెంట్ కనిపించడం లేదు. పాదయాత్ర వెళ్లిన చోట పేదవాళ్ళు పెట్టే బుక్కెడు బువ్వను కడుపులోకి పోకుండా పెదవులను తాకించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే పాదయాత్రకు ఎక్కడా బ్రేకుల్లేవు. వీకెండ్ సెలవలు లేవు. కేవలం ప్రజల సమస్యలు ప్రస్తావిస్తూ, ఆ సమస్యలను సృష్టించిన ప్రభుత్వంపై పదునైన మాటలతో విమర్శలు చేస్తూ లోకేష్ అధికార పార్టీ గుండెల్లో గుబులు రేపుతున్నారు. లోకేషా.. పాదయాత్రనా అని ఎగతాళిగా మాట్లాడిన నోళ్లతోనే శభాష్ లోకేష్ అనిపించుకుంటున్నారు.
ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పగలు పాదయాత్ర, సాయంత్రం సభ, విరామ సమయంలో నేతలు, కార్యకర్తలతో మాటా మంతీ.. ఇలా రోజంతా క్షణం తీరిక లేకుండా లోకేష్ పాదయాత్ర కు కొత్త నిర్వచనం చెప్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను వేధిస్తోందని తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని వదిలి పెట్టబోమంటూ హెచ్చరిస్తున్నారు. రెడ్ డైరీని పట్టుకొని వారి పేర్లు రిజిస్టర్ చేస్తున్నామంటూ ఊరూరా చెబుతున్నారు. మొత్తంగా పాదయాత్రకు ముందు లోకేష్ వేరు. పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. మాట తీరు మారింది.. నడవడిక మారింది. నేతలను ఆప్యాయం పిలవడం తెలిసింది.. ప్రజలకు అండగా ఉండడం తెలుసుకున్నారు. లోకేష్‌లో సరికొత్త రాజకీయ నాయకుడు కనపడుతున్నాడని రాజకీయ విశ్లేషకులే ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఇక లోకేష్ పాదయాత్ర డబుల్ సెంచరీ రోజున టీడీపీ భారీ కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు. నేటి యువగళం పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబాలు పాల్గొననున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గం నుండి గురువారం ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి నరసన్నపాలెం, సీతంపేట, బయ్యనగూడెం, కొయ్యలగూడెం మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. భోజన విరామం తర్వాత గవరవరం, పొంగుటూరుల్లో లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు. రాత్రికి పొంగుటూరు విడిది కేంద్రంలో బస చేయనున్నారు.