రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. కేసీఆర్ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ
posted on Aug 23, 2023 @ 10:58AM
కేబినెట్ విస్తరణ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రిదే. తేన కేబినెట్ లో ఎవరు ఉండాలి, ఎవరిని తొలగించాలన్న నిర్ణయాధికారంలో మరొకరి జోక్యానికి తావేలేదు. రాజ్యాంగ బద్ధంగా అది ముఖ్యమంత్రికి సంక్రమించిన అధికారం. సీఎం ప్రతిపాదించి పంపిన వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం మాత్రమే గవర్నర్ చేయాల్సింది. చేయగలిగింది. ఈ వ్యవహారంలో కానీ విషయంలో కానీ ఎవరికీ ఎటువంటి అనుమానాలూ, సందేహాలూ లేవు. కానీ తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేసీఆర్ తలపెట్టిన మంత్రివర్గ విస్తరణ రాజకీయవర్గాలలోనే కాదు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ రేపుతోంది. ఏం జురుగుతుంది? ఏం జరగబోతోంది? అన్న సస్పెన్స్ రేపుతోంది.
ఇంతకీ విషయమేమిటంటే.. రానున్న అసెబ్లీ ఎన్నికలలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను 105 పేర్లతో కేసీఆర్ ప్రకటించారు. అలా ప్రకటించిన వెంటనే ఇలా మంత్రివర్గ విస్తరణకు రెడీ అయ్యారు. మంత్రివర్గంలోకి పట్నం మహేందర్‌రెడ్డిని తీసుకోవాలని ప్రభుత్వం భావించారు. ప్రమాణ స్వీకారం కోసం సమయం కేటాయించాలంటూ రాజ్‌భవన్‌కు సోమవారమే ప్రభుత్వం వర్తమానం పంపింది. సప్తమి రోజున మంచి ముహూర్తం కనుక ఆ రోజు అంటే బుధవారం(ఆగస్టు 23)న ఆ కార్యక్రమం ఖరారు చేయాలని విజ్ణప్తి కూడా చేసింది. ఉదయం 11.30 గంటలకు మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రభుత్వం నుంచి లీకులు కూడా వచ్చాయి.
స్వయంగా పట్నం మహేందర్ రెడ్డే మీడియాతో చిట్ చాట్ చేస్తూ తన ప్రమాణ స్వీకారం బుధవారం (ఆగస్టు 23) ఉదయం పదకొండున్నరకు ఉంటుందని కూడా చెప్పారు. అయితే రాజ్ భవన్ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. అప్పాయింట్ మెంట్ కూడా ఫిక్స్ కలేదు. ఆమె డెంటల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనీ, అందుకే అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదనీ రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం (ఆగస్టు 21 వరకూ పుదుచ్చేరిలో ఉన్నారు. మంగళవారం అంతా ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం తమ వినతి మేరకు బుధవారం (ఆగస్టు 23) ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిపించేందుకు ఎటువంటి అవాంతరం ఉండదని భావించినప్పటికీ రాజ్‌భవన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఉత్కంఠ మొదలైంది. ఆమె నుంచి ఎప్పుడు సమాచారం వస్తుందా అని టెన్షన్ పడుతోంది. రాజ్ భవన్, ప్రగతి భవన్ విభేదాలే ఈ జాప్యానికి కారణమా అన్న అనుమానాలూ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.