కేసీఆర్ కోసం జగన్.. జగన్ కోసం షర్మిల.. పాపం కాంగ్రెస్
posted on Aug 22, 2023 @ 10:56AM
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో నానాటికీ తీసికట్లు నాగంభొట్లు అన్నట్లుగా తయారౌతోంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో నామ మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ ను బలోపేతం చేసే ఉద్దేశంతో అధిష్ఠానం షర్మిల అనే తురఫు ముక్కను ఉపయోగించాలని శతథా ప్రయత్నిస్తోంది. అందుకే తెలంగాణలో వైఎస్సార్టీపీ పేర సొంత కుంపటి పెట్టుకుని తన మానాన తాను నడక దారిలో సాగుతున్న షర్మిలకు కాంగ్రెస్ గాలం వేసింది.
2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించారు. తానే అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో పరుగులు పెట్టించారు. ఫండింగ్ ఎంత ఖర్చు చేశారు.. ప్రణాళికలు ఎవరు రచించారన్నది తెలియదు కానీ వైఎస్ఆర్టీపీ ఆరంభంలో దూకుడుగానే ఉంటూ వచ్చింది. నాయకుల చేరికలు, పాదయాత్ర, ధర్నాలు, నిరసనలు, ప్రభుత్వంపై విమర్శలు.. ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది. కానీ ఆ తర్వాతే తేడా కొట్టింది. ఎంత చేసినా ప్రజల్లోకి పార్టీ వెళ్లలేకపోయింది. మరోవైపు కీలక నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. షర్మిల ఎంత కష్టపడినా, పాదయాత్ర, దీక్షలు, ప్రధాన రాజకీయ పార్టీలను మించి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించినా ఆ రాష్ట్ర జనం మాత్రం షర్మిలను పదె్దగా విశ్వసించినట్లు కనబడదు. సమైక్య వాది అయిన రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని తీసుకు వస్తానంటూ ఆమె తెలంగాణలో చేస్తున్న రాజకీయం ఏ మాత్రం ఆమెకు ప్రజాదరణను తీసుకువస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
సరిగ్గా ఇదే సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్లైంది. కర్నాటకలో సాధించగలిగినప్పుడు దేశం మొత్తం ఎందుకు సాధించలేం అనుకుంది. అలాగే ఏపీలో కూడా బలోపేతం కాగలమన్న విశ్వాసం వచ్చింది. అప్పుడే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని ఆమెకు ఏపీ పగ్గాలప్పగిస్తే తమ పని సులువు అవుతుందని భావించింది. అంతే వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న కేవీపీ, కర్నాటక డిప్యూటీ సీఎం డీకేలను రంగంలోకి దింపింది. కాగల కార్యం వారే తీరుస్తారని భావించింది. అనుకున్నట్లే అంతా జరుగుతోందని కాంగ్రెస్ భావించింది. అంతా బానే ఉందనుకుంటున్న సమయంలో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ఏపీలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చేసిన సూచనల్ని షర్మిల తిరస్కరించినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. తన రాజకీయం తెలంగాణకు మాత్రమే పరిమితమని కాంగ్రెస్ కు తేటతెల్లం చేశారని అంటున్నారు. అయితే షర్మిల పార్టీని విలీనం చేసుకుని ఆమె తెలంగాణలో క్రియాశీలంగా పని చేస్తే అది తమకు తీరని నష్టం చేస్తుందని భావించిన కాంగ్రెస్ అందుకు తిరస్కరించిందని చెబుతున్నారు. దీంతో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదన ప్రతిపాదన దశలోనే ఆగిపోయిందని చెబుతున్నారు. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ బాధ్యతలు తీసుకుంటే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ బావిస్తోంది. మొత్తంగా షర్మిల రాజకీయం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్ రెడ్డి, కేసీఆర్ ల మైత్రిలో భాగంగానే షర్మిల తెలంగాణలో పని చేస్తున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఆమె తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువ కాలాని ప్రయత్నిస్తున్నా జనం పట్టించుకోలేదు. కానీ ఆమెను అందరి కన్నా ఎక్కువగా పట్టించుకుని ఆమెకు, ఆమె పార్టీకి హైప్ ఇవ్వడానికి కేసీఆర్ సర్కార్ చేయగలిగినంతా చేసింది. చేస్తోంది. అరెస్టులు, హౌస్ అరెస్టులతో ఆమె నిత్యం వార్తలలో నిలిచేలా కేసీఆర్ సర్కార్ సహకారం అందిస్తోంది.
దీంతో ఆమె కేసీఆర్ కోసం తెలంగాణలో జగన్ బాణంగా పని చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నతో విబేధాల కారణంగా తెలంగాణలో పార్టీ అని షర్మిల చెప్పడంలో లాజిక్ కనిపించడం లేదనీ, నిజంగా అన్న జగన్ తో విభేదాలు ఉంటే.. ఆమె ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు.