గోషామహల్, నాంపల్లి అభ్యర్థులు ఎందుకు పెండింగ్ ?
posted on Aug 22, 2023 @ 2:29PM
కేసీఆర్ మొదటి జాబితాలో పెండింగ్ లో పెట్టిన నాలుగు స్థానాల్లో రెండు అసెంబ్లీ హైద్రాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఒకటి గోషామహల్ అయితే రెండోది నాంపల్లి. గోషామహల్ అసెంబ్లీ స్థానానికి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిద్యం వహిస్తుండగా నాంపల్లి నియోజక వర్గానికి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రాతినిద్యం వహిస్తున్నారు.
ప్రస్తుతం రాజాసింగ్ బిజెపి నుంచి బహిష్కృతులయ్యారు. ఈ సారి ఆయన రాజకీయ భవితవ్యం ఇంకా తేల లేదు. తాను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవచ్చని రాజాసింగ్ ఇప్పటికే ప్రకటించారు. బిజెపి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. సిట్టింగ్ బిజెపి స్థానాన్ని బిఆర్ఎస్ వదులుకోబోతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. 2018లో ఈ స్థానం నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్ బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి రాజా సింగ్ చేతిలో పరాజయం చెందారు. అంతకుముందు ప్రేమ్ సింగ్ రాథోడ్ బిజెపి నుంచి మహరాజ్ గంజ్ ఎమ్మెల్యేగా గెలిచారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అత్యధికంగా ఉన్నారు. ఉత్తరాది అభ్యర్థిని రంగంలో దించాలని బిఆర్ఎస్ భావిస్తోంది. తన ఓటమి తర్వాత గోషామహల్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా కొనసాగిన రాథోడ్ ప్రస్తుతం తప్పుకున్నారు.టిక్కెట్ కోసం కూడా ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. అయితే బిఆర్ఎస్ నుంచి మరో నేత నందకిషోర్ పేరు గోషామహల్ అభ్యర్థి అని వినిపిస్తుంది. బిజెపి బీ టీం అని నింద ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ అభ్యర్థి గోషామహల్ నుంచి బలహీన అభ్యర్థిని రంగంలో దించవచ్చన్న టాక్ ఉంది.
కాగా నాంపల్లి స్థానానికి ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ మిత్ర పక్షం అని ప్రకటించారు. కమ్యూనిస్ట్ పార్టీలతో మిత్ర ధర్మం నెరవేర్చని కేసీఆర్ మజ్లిస్ తో మిత్ర ధర్మం పాటించవచ్చు అని పరిశీలకులు అంటున్నారు. కాని పైకి మాత్రం వెల్లడించకపోవచ్చు.