ఉద్యమ కారులకు కారులో చోటేది?
posted on Aug 22, 2023 @ 1:36PM
తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. అధికారికంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి ఎన్నికల నగారా మోగించేశారు. సీఎం కేసీఆర్ సోమవారం(ఆగస్టు 21) 115 మందితో కూడిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం సిట్టింగ్ లకే సీట్లు కేటాయించారు. అటు కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుండగా.. మిగతా కేసీఆర్ కుటుంబ సభ్యులకు కూడా వారి వారి సిట్టింగ్ స్థానాలలోనే సీట్లు ఖరారు చేశారు. బీఆర్ఎస్ జాబితా బయటకు రావడంతో ఇక అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టగా.. టికెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తులు మెల్లిగా తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలు రచించుకొనే పనిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు. మరొక్క వారం రోజులు ఆగితే ఈ అసంతృప్తులలో ఎంత మంది పార్టీలో ఉంటారో.. రెబల్స్ గా మారేది ఎవరో.. పార్టీని వీడి మరో పార్టీకి జంప్ చేసేది ఎవరో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
యధావిధిగా ఈసారి ఎన్నికలలో కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కాలం నుండి కీలకంగా పని చేసిన కొందరిని పక్కన పెట్టేశారు. గత ఎన్నికలలో కూడా తెలంగాణ ఉద్యమ నేతలకు అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. ఈసారి కూడా అదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఉద్యమకారులకు కొందరికి మొండి చేయి మిగిలించి బంగారు తెలంగాణ కోసమే అంటూ పక్క పార్టీల నుండి వచ్చిన వలస వచ్చిన నేతలకు టికెట్లు లభించాయి. నిజానికి 2014లో పెద్ద ఎత్తున ఉద్యమ నేతలకు టికెట్లు ఇచ్చారు. వారిలో కొద్ది మంది మినహా అంతా ఓటమి పాలయ్యారు. ఆ
తరువాత బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేర టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వలసలను ప్రోత్సహించారు. అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీలో వారిదే హవా.. వారికే సీట్లు దక్కుతున్నాయి. దీంతో ఉద్యమకారులకు ఎలాంటి పదవులూ లేకుండా పోయాయి. దీంతో కొంతమంది ఇప్పటికే తమదారి తాము చూసుకోగా.. ఒకరిద్దరు సొంత పార్టీలతో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి కలిసి నడిచిన నల్గొండ జిల్లాకు చెందిన చాడ కిషన్ రెడ్డి, వేముల వీరేశం, ఖమ్మం జిల్లాకు చెందిన బొమ్మెర రామ్మూర్తి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్ గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కేఎస్ రత్నం లాంటి చాలామంది సీనియర్ నేతలకు ఈ సారి జాబితాలో కూడా చోటు దక్కలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య, ఉప్పల్ సుభాష్ రెడ్డి, ఖానాపూర్ రేఖా నాయక్, వేములవాడ చెన్నమనేని రమేష్, వైరా రాములు నాయక్, బోథ్ రాథోడ్ బాపూరావు, అసిఫాబాద్ ఆత్రం సక్కు, కామారెడ్డి గంప గోవర్ధన్ తదితరులు సిట్టింగులే అయినా వీరెవరికీ ఈసారి కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదు. వీరిలో దాదాపుగా అందరూ ఉద్యమ కాలం నుంచీ పార్టీతో కలిసి నడిచిన వారే. ఒకరిద్దరు మాత్రమే ఇతర కారణాల చేత టికెట్లు దక్కించుకోలేకపోయారు. దీంతో వీరంతా అసంతృప్తితో తమ తదుపరి కార్యాచరణను రచించుకొనే పనిలో పడ్డారు.
ఈ నేతల్లో చాలామంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. విలువైన భవిష్యత్తును వదులుకొని ఆనాటి టీఆర్ఎస్ జెండా మోశారు. సకల జనుల సమ్మె నుండి వంటా వార్పు వరకు వారే ముందు నడిచారు. పోలీసులతో దెబ్బలు తిన్నారు. కోర్టుల్లో కేసులు ఎదుర్కొన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత తమ త్యాగానికి గుర్తింపు లభిస్తుందని సంబరపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి. ఉద్యమ కాలంలో ఎవరి చేతిలో అయితే వారు తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొన్నారో.. ఇప్పుడు వారే అధికారాన్ని చెలాయిస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు. కొద్దో గొప్పో మొన్నటిదాకా ఎంతో కొంత విలువ ఉంది. ఈసారి అయినా టికెట్లు దక్కకపోతుందా అని ఆశతో ఉన్నా.. ఇప్పుడిక ఆ ఆశలు కూడా ఆవిరవడంతో తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు.