ఏపీలో బీజేపీది డబుల్ గేమా? వైసీపీ కోసమే వ్యూహాలా?

దక్షిణాదిలో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించేందుకు  బీజేపీ పట్టువీడని విక్రమార్కునిలా  సాగిస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా కొనసాగుతున్నాయి. ఆ పార్టీ అధినాయకత్వం  ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రూపొందిస్తోంది. కొత్త ఎత్తులు వేస్తున్నది. అయితే తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అడుగులు ముందుకు పడటం అటుంచి వెనక్కు పడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది.   ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ ఏమి చేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోతున్నది.  ఏపీలో బీజేపీ పయనం ఓటమి నుంచి ఓటమికి అన్నట్లుగా తయారైంది. పేరుకే ఏపీలో ఆ పార్టీకి జనసేన రూపంలో మిత్రపక్షం ఉంది. అయితే ఆ రెండు పార్టీల మధ్యా మైత్రి రాజుగారి దివ్య వస్త్రాలుగానే చెప్పుకోవాలి.  ఈ నాలుగేళ్లలో జరిగిన ఉప ఎన్నికలలో అయితేనేమి, స్థానిక ఎన్నికలలో అయితేనేమీ ఆ రెండు పార్టీలూ కలిసి నడిచింది లేదు. పైపెచ్చు ఇటీవలి కాలం వరకూ ఏపీలో బీజేపీ చేపట్టిన  ప్రతి కార్యక్రమం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఏదో ఒక మేర ప్రయోజనం చేకూర్చేదిగానే ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషణలు చేస్తున్నారు.     రాష్ట్ర  ప్రయోజనాలతో  పాటుగా దేశ ప్రయోజనాలను సైతం దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తున్న  వైసీపీ అరాచక, అసమర్ధ పాలన  కొనసాగింపునకు బీజేపీ తెర వెనక  కుట్రలు పన్నుతోందన్న అనుమానాలు రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్రపగ్గాలు చేపట్టడానికి ముందు వరకూ రాష్ట్ర బీజేపీ వైసీపీకి బీ టీమ్ లా పని చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీలోని సీనియర్లే పదే పదే అధిష్ఠానం వద్దకు తీసుకువెళ్లారు. ఫిర్యాదులు చేశారు. అయినా దీర్ఘ కాలం పాటు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ హై కమాండ్ ఎట్లకేలకు సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను పురంధేశ్వరికి అప్పగించింది. ఇది జరిగిన తరువాత కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీలోని వైసీపీ సర్కార్ తో రహస్య మైత్రిని కొనసాగిస్తూనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పొత్తుల విషయంలో ప్రతిష్ఠంభణను కొనసాగిస్తూ.. పరోక్షంగా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కోసం ప్రయత్నిస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  అందులో భాగంగానే తెలుగు దేశం పార్టీని ఒంటరిని చేసేందుకు   జనసేన పార్టీతో మైత్రిని కొనసాగిస్తున్నదని అంటున్నారు. అలా మైత్రి కొనసాగిస్తూ.. తెలుగుదేశం పార్టీతో  జనసేన దూరం పెరిగే విధంగా పావులు కదుపుతున్నదని అంటున్నారు.    గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి 23 సీట్లే వచ్చినా, 40 శాతం ఓట్లు తెచ్చుకుని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది.  గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగిస్తోంది.  జగన్ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు.  జగన్ రెడ్డి సొంతంగా చేయించుకున్న సర్వేలు, ఐప్యాక్ నిర్వహించిన సర్వేలే కాకుండా జాతీయ స్థాయి సంస్థలు మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ నిర్వహించిన సర్వేలలో కూడా పొత్తులతో సంబంధం లేకుండా  ఏపీలో అత్యధిక పార్లమెంటు స్థానాలను తెలుగుదేశం గెలుచుకుంటుందని చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు జనం ముఖం చాటేస్తుండటం, అదే సమయంలో చంద్రబాబు సభలకు, నారా లోకేష్ పాదయాత్రకు జనం పోటెత్తుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం ఏమిటన్నది అందరికీ ప్రస్ఫుటంగా అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నది. గత నాలుగేళ్లుగా జగన్ రెడ్డి ఆర్థిక అవకతవకలకు సహకరించిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు అదే జగన్ రెడ్డి ఆర్థిక అరాచకత్వంపై, అడ్డగోలు అప్పులపై గణాంకాలతో విమర్శలు గుప్పిస్తున్నది. జగన్ రెడ్డి నిర్వాకానికి ఇంత కాలం సహకారం అందించి వంత పాడింది తామేనన్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నది.  బీజేపీని దూరం పెట్టి అయినా సరే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు సాగుదామని భావిస్తున్న విషయాన్ని పలు సందర్భాలలో జనసేనాని పవన్ కల్యాన్ పరోక్షంగానైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నే బీజేపీ రాష్ట్ర  పార్టీ అధ్యక్షుడిని మార్చడం, పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించడం చేసింది.   అయితే బీజేపీ మూవ్ పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఓ వంక జనసేన నేత పవన్ కళ్యాణ్  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో అడుగులు వేస్తుంటే..  పవన్ ను దగ్గరకు తీసి  ఆ పార్టీని తెలుగుదేశంకు  దూరం చేయాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా చేయడం ద్వారా రాష్ట్రంలో ముక్కోణపు పోరు అనివార్యమయ్యే పరిస్థితి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నదని చెబుతున్నారు.   

తగ్గేదేలే.. వైసీపీలో కాకరేపుతున్న పిల్లి సుభాష్ కామెంట్స్!

ఎన్నికల ఏడాదిలో అధికార  వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇందులో మాజీ మంత్రులు, సీనియర్ నేతల స్థానాలు కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా, ఇటు గుంటూరులో అంబటి రాంబాబు, విడదల రజనీ,  విశాఖలో అవంతి,   గోదావరిలో పిల్లి చంద్రబోస్ ఇలా బడా బడా నేతల జిల్లాలు, స్థానాలలోనే ఈ అంతర్గత యుద్ధం నడుస్తున్నది. కాస్త బుజ్జగించి.. మరికాస్త లాలించి ఈ నేతలను శాంతిపజేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నా.. ఈ అంతర్గత చిచ్చు తగ్గినట్లే తగ్గి మళ్ళీ రాజుకుంటోంది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నేతలు కొందరికి వారి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పొసగడం లేదు. అందుకే ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను విడదీసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మీడియా ముందే ఇష్టం వచ్చినట్లు ఆల్టిమేటాలు జారీ చేస్తున్నారు.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ టికెట్‌ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామచంద్రాపురం ఎమ్మెల్యేగా శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఈయన జగన్‌ మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇక్కడ నుండి సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుండి జగన్ తోనే ఉన్న పిల్లిని ఎమ్మెల్సీని చేసి మంత్రిగా చేశారు. అయితే, ఆ తర్వాత మండలి రద్దు చేస్తానంటూ పిల్లితో రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. ఈసారి ఎలాగైనా రామచంద్రపురం నుండి తాను కానీ, తన కుమారుడు కానీ పోటీ చేయాలని పిల్లి సుభాష్ భావిస్తున్నారు. కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే చెల్లుబోయిన ఈసారి కూడా తనకే టికెట్ రావడం ఖాయమని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కొంత కాలంగా ఇక్కడ వార్ నడుస్తుంది. ఇప్పటికే పిల్లి సుభాష్ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయనున్నట్లు వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. వైసీపీ పెద్దలు ఈ విషయంపై పిల్లి సుభాష్, ఎమ్మెల్యే చెల్లుబోయినతో సంప్రదింపులు జరిపి సీఎం జగన్ వద్దకు పంచాయతీ తీసుకెళ్లారు. మరోవైపు ఎమ్మెల్యే చెల్లుబోయినను ఈసారి పార్లమెంటుకు పోటీ చేయించనున్నట్లు కూడా ఊహాగానాలు బయటకొచ్చాయి. దీంతో పిల్లి అప్పటికి కాస్త శాంతించినట్లు కనిపించారు. కానీ, ఏమైందో ఏమో మళ్ళీ ఇప్పుడు తగ్గేదేలే అంటూ బయటకొచ్చారు. తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురంలో పోటీ చేసేది తన కుమారుడేనని తేల్చి చెప్పారు. తాజాగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. త్వరలోనే తన కుమారుడు సీఎం వైఎస్‌ జగన్‌ తో భేటీ అవుతారని.. కార్యకర్తల అభీష్టాన్ని సీఎంకు తెలుపుతాడని వెల్లడించారు. సీఎం నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని.. తమ కుమారుడిని ఆశీర్వదించాలని కార్యకర్తలను కోరారు. కానీ, ఎమ్మెల్యే చెల్లుబోయిన మాత్రం చాపకింద నీరులాగా నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అటు జిల్లా పార్టీ నుండి వైసీపీ అధిష్టానం వరకూ వీరవిధేయుడిగా ఉంటూ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని మంతనాలు జరుపుతున్నారు. దీంతో ఈ సమస్య నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నది. మొత్తం మీద రామచంద్రాపురంలో పార్టీ పరిస్థితి, నేతల తీరు జగన్ కు తలనొప్పిగానే మారిందని అంటున్నారు పరిశీలకులు.

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మార్పులు తథ్యం.. ఎప్పుడంటే?

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక విలక్షణ రాజకీయ నేత. ఆయన ఏ పథకం ప్రకటించినా,  ఏ కార్యక్రమం చేపట్టినా  సంచలనంగానే ఉంటుంది. ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా వారిని దిగ్భ్రమలో ముంచెత్తేలా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. తెలంగాణ సాకారం అయితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించడం దగ్గర నుంచీ, తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ ను (అప్పుడు టీఆర్ఎస్) కాంగ్రెస్ లో విలీనం చేస్తాననడం వరకూ ఆయన మాటే ఒక సంచలనం, ప్రకటన మరో సంచలనం అన్నట్లుగానే సాగింది. ప్రకటనలు చేయడం తరువాత వాటి గురించి పూర్తిగా విస్మరించడం ఒక విధానంగా కేసీఆర్ డెవలప్ చేశారు. తాజాగా ఆయన ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేశారు. ఏకంగా 115 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా ప్రకటించి సంచలనం సృష్టించారు. పార్టీలో తన మాటే శాసనం అన్న పరిస్థితి ఉందని అందరికీ చాటేందుకు ఆయనీ ఎత్తుగడ వేశారు. అయితే ఆయన ఎత్తుగడ ఫలించినట్లు కనిపించదు.  ఎందుకంటే ఆయన ఇలా జాబితా ప్రకటించారో లేదో.. అలా అసమ్మతి భగ్గుమంది. కేసీఆర్ కు అత్యంత విశ్వాస పాత్రులుగా గుర్పింపు పొందిన నేతలే అసమ్మతి గళం ఎత్తారు. టికెట్ లభించని పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకున్న తరువాత కూడా ఆయన అసమ్మతి రాగం ఆలపిస్తూనే ఉన్నారు. రాజయ్య వంటి వారు తమ ధిక్కారాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. మైనంపాటి వంటి నేతలైతే బహిరంగ సమావేశాలు నిర్వహించి మరీ తిరుగుబావుటా ఎగుర వేశారు. అనూహ్యంగా పార్టీ పునాదులే కదిలిపోయేంతగా అసమ్మతి వెల్లువెత్తడంతో కేసీఆర్ వెనక్కు తగ్గక తప్పలేదు. టికెట్ ప్రకటించిన వారందరికీ పార్టీ బీఫారం దక్కుతుందన్న గ్యారంటీ లేదని ఆయన తన ప్రకటనలో సవరణలు ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో టికెట్  దక్కని వారు ఇప్పటికే ధిక్కారం తెలియజేస్తుంటే.. రేపు టికెట్ వచ్చిందని ప్రస్తుతం ఆనందంలో ఉన్న నేతలలో కొందరికి రేపు బీఫారంలు అందక నిరసన గళం వినిపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   115 మందితో బీఆర్‌ఎస్‌ తొలిజాబితా ప్రకటించిన  కేసీఆర్‌ వారందరికీ , బీ ఫారం ఇస్తారా? అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు జాబితాలో ఉన్న వారందరికీ  బీఫారాలు దక్కుతాయన్న నమ్మకం లేదని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. కచ్చితంగా కేసీఆర్ ఇప్పుడు ప్రకటించిన జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటాయని అంటున్నారు.  తొలి జాబితాలో పేరు ఉన్న మైనంపల్లి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మైనంపాటి హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. తాను, తన కుమారుడు ఇద్దరం కచ్చితంగా వచ్చే ఎన్నికల బరిలో దిగుతామని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మైనంపల్లి పార్టీ మారడం ఖాయమైతే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరొకరిని కేసీఆర్ నిలబెట్టాల్సి ఉంటుంది.  ఇక ఖమ్మంలో ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు తిరుగుబావుటా ఎగురవేశారు. తుమ్మల పార్టీ వీడితే ఆ ప్రభావం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ బీఆర్ఎస్ ను వీడటం వల్ల జరిగిన నష్టం చాలదన్నట్లు తుమ్మల కూడా పార్టీ మారితే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకోవలసిన పరిస్థితి ఎదురౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో డాక్టర్ ప్రహ్లాద్, నకిరేకల్ లో మాజీ ఎమ్మెల్యే వీరేశంలు కూడా బీఆర్ఎస్ ను వీడే యోచన చేస్తున్నారు.  నాగార్జున సాగర్ లో బీఆర్ఎస్ వర్గాలు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్  అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.   అక్కడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ   కడారి అంజయ్యయాదవ్‌ కూడా పార్టీ వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.   హైదరాబాద్‌  అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు సీటి వ్వడంపై, సీనియర్‌ దుర్గాప్రసాద్‌రెడ్డి అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్ని ల్లోనే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయన డీపీరెడ్డి..ఈసారి టికెట్‌ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. అయితే మళ్లీ కాలేరు పేరు ప్రకటించడంతో అక్కడ కూడా అసమ్మతి తీవ్రంగా వ్యక్తం అవుతోంది.  పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కనీసంలో కనీసం పాతిక స్థానాలలో బీఆర్ఎస్ విజయంపై అసమ్మతి ప్రభావం తీవ్రంగా ఉంటుందనీ, 40 స్థానాలకు పైగా అసమ్మతి ప్రభావం గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే తాను ప్రకటించిన జాబితా విషయంలో స్వయంగా కేసీఆర్ పునరాలోచనలో పడ్డారనీ, రానున్న రోజులలో ఈ జాబితాలో కచ్చితంగా మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంత లేదన్న పాతిక నుంచి ముఫ్పై నియోజకవర్గాలలో ఆభ్యర్థులను మార్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ సీనియర్లు చెబుతున్నారు.    తాజాగా 34 నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే  జరుగుతోందని చెబుతున్నారు. అభ్యర్థులపై వ్యతిరేకత పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తమయ్యారనీ, తాను ప్రకటించిన జాబితా కేవలం ప్రతిపాదిత జాబితా మాత్రమేనంటూ అసంతృప్తిలో ఉన్న నేతలకు వర్తమానం పంపుతున్నారనీ,   ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అసలు జాబితా విడుదల చేస్తామనీ చెబుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తొంది.  అన్నిటికీ మించి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్  అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కొన్ని అభ్యర్థిత్వాలపై పునరాలోచన జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.   

త్వరలో డీఎస్సీ.. జగన్ మరో దగాకోరు కార్యక్రమమేనా?

ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్.. అధికారంలోకి రాగానే ముందుగా మెగా డీఎస్సీ.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు.. తమ్ముళ్లూ వింటున్నారా.. ఆ దేవుని దయతో.. మీ అందరి దీవెనలతో వచ్చేది మన ప్రభుత్వమే.. అధికారం రాగానే మీ అందరికీ ఉద్యోగాలొస్తాయ్. ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పిన మాట.   జగన్ హామీలు ఇవ్వడం మాత్రమే కాదు.. ఎన్నికల ప్రచార చిత్రాలలో కూడా ఇదే జొప్పించి ప్రజలను మభ్యపెట్టారు.  జగనన్న వస్తాడు.. మాకు ఉద్యోగాలొస్తాయని పదుల కొద్దీ ప్రచార చిత్రాలు నిరుద్యోగుల మీదకి వదిలారు. ఇప్పటికీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవి మన కళ్ళకి కనిపిస్తాయి. కానీ, నాలుగేళ్లలో వచ్చింది వాలంటీర్ ఉద్యోగాలు.. గ్రామ సచివాలయంలో పోస్టులు. అది కూడా వైసీపీ కార్యకర్తలకేనని వాళ్ళే చెప్పుకుంటున్నారు.  అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని జగన్ మోహన్ రెడ్డి చెప్పి నాలుగున్నరేళ్లు అయింది. నాలుగేళ్ళ అధికారాన్ని కూడా అనుభవించారు. కానీ, ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఓ సారి జాబ్ క్యాలెండ్ ప్రకటించినా అందులో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు 50కి మించలేదు. అదేమంటే ఓ సారి అనుమతి ఇవ్వలేదంటారు.. మరోసారి జీవో ఇస్తున్నాం అంటారు.. మరోసారి ఏపీపీఎస్సీ రూల్స్ మేరకే చేస్తున్నామని సెలవిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మూడు సార్లు డీఎస్సీ ప్రకటిస్తే ఇప్పుడు జగన్ నాలుగేళ్ళలో ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే డీఎస్సీ ప్రకటించారు. అందులో కూడా యాభై లోపే చెప్పుకోదగ్గ ఉద్యోగాలున్నాయి.  అయితే  ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఓ జిత్తుల మారి  ఎత్తుకు సిద్దమవుతున్నట్లు నిరుద్యోగ వర్గాలలో చర్చ మొదలైంది. త్వరలోనే ప్రభుత్వం భారీ స్థాయిలో డీఎస్సీ ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు చెప్తున్నారు.  ఏపీలో ఎన్నికలకు ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ ఖరారైతే ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, నియామకాలు ఉండవు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు తెలియనిదేమీ కాదు. అయినా.. డీఎస్సీ ప్రకటించి మరోసారి నిరుద్యోగులను దగా చేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ప్రభుత్వం కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను భర్తీ చేయాలని ఏపీపీఎస్సీకి జీవో ఇవ్వాలి. అక్కడ మళ్ళీ చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. నిజంగా భర్తీ చేయాలనుకుంటే ఈ పని ఎప్పుడో చేసేవారు. కానీ, ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే ఎన్నికలకు ముందు ఎందుకు చేస్తున్నారో తెలియనిదేమీ కాదు. ఏపీపీఎస్సీ భర్తీ చేసినా చేయకపోయినా ముందు మేము ప్రకటించామని చెప్పుకోవడమే ప్రభుత్వానికి కావాల్సింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అదే పనిలో ఉన్నట్లు కనిపిస్తున్నది.  రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయకపోతారా? తమకి ఉద్యోగాలు రాకపోతాయా అని నిరీక్షిస్తున్నారు. లక్షల మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. గ్రూప్ 1 నుండి వీఆర్ఏల వరకూ.. వైద్య విభాగం నుండి పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల వరకూ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది పోస్టులు భర్తీ చేస్తామని జగన్ ఇచ్చిన హామీతో నాలుగేళ్లుగా నిరుద్యోగుల జీవితం పుస్తకాలకే పరిమితమైంది. అలాంటి వారిని ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం ఉతుత్తి జీవోలతో మోసం చేసేందుకు సిద్దమైనట్లు కనిపిస్తుంది.

 బిఆర్ఎస్ లో అసమ్మతి.. పక్క పార్టీల వైపు చూపులు

తెలంగాణ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ రాజుకుంటుంది. పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో కూడా టికెట్లు దొరకని పక్షంలో బిజెపి గూటికి చేరాలని యోచిస్తున్నారు. బీఆర్ ఎస్ పార్టీ టికెట్ కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించిన ఆశావహులు భంగపడ్డారు. కేసీఆర్ ప్రకటించిన మొదటి జాబితాలో 115 మంది అభ్యర్థులు ఉన్నారు. ఏడు చోట్ల అభ్యర్థుల మార్పు జరిగింది. మిగతా వారు సేమ్ టు సేమ్. అంతా పాత ముఖాలే. వీరిపై భూ కబ్జా, అవినీతి ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో తన ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేశారు. దళిత బంధు సాంక్షన్ చేయించినందుకు గాను పర్సంటేజిలు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని చెబుతూనే సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించేశారు. హైదరాబాద్ లోని గోషామహల్, నాంపల్లితో బాటు జనగామ, నర్సాపూర్   నియోజకవర్గ  అభ్యర్థుల పేర్లు  ప్రకటించలేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పై భూ కబ్జా ఆరోపణలు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై సర్పంచ్ నవ్యతో మిస్ బిహేవియర్  ఆరోపణల నేపథ్యంలో అవకాశం కోల్పోయారు. వీరిరువురు వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేల గెలిచినప్పటికీ ఈ సారి టికెట్ లభించకపోవడం చర్చనీయాంశమైంది.   ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేది డిఫరెంట్ స్టోరీ. రెండు పర్యాయాలు ఆమె గెలిచినప్పటికీ మూడో సారి టికెట్ రాలేదు. మంత్రిగా అవకాశం ఇవ్వాల్సి వస్తుందని తనకు టికెట్ ఇవ్వలేదని రేఖానాయక్ అంటోంది.  రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేసిన రేఖారాణికి ఈ సారి  ఖానాపూర్ టికెట్  దక్కకపోవడంతో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టికెట్ రాకపోతే ఇతర పార్టీల వైపు చూడటం సహజం. కానీ రేఖారాణి పరిస్థితి భిన్నం. తన భర్త మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో రేఖారాణి కూడా కాంగ్రెస్  పార్టీ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. బిఆర్ఎస్ లో అధిష్టానం టికెట్ నిరాకరిస్తే కాంగ్రెస్ లో క్యాడర్ ఆమెకు సహకరించడం లేదు. అక్కడ‘‘రేఖక్కా నువ్వు రాకక్క’’ అనే నినాదం  కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తోంది. కాంగ్రెస్ లో అప్పటికే టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం రేఖారాణి రాకను వ్యతిరేకిస్తున్నారు.ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్ సీటు. బిఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ఎస్టీ కాదని రేఖారాణి ఆరోపణ. జాన్సన్ క్రిస్టియన్ అని రేఖారాణి తొలుత నుండి వాదిస్తోంది. ఎన్నికల డిక్లరేషన్ లో జాన్సన్  ఇచ్చే అఫిడవిట్ ను బట్టి లీగల్ కోర్స్ కోసం రేఖారాణి సిద్దంగా ఉంది.  సాధారణంగా ఆయా పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఆశావహులు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావ్ పరిస్థితి ఇందుకు భిన్నమనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మల్కాజ్ గిరి బీఆర్ ఎస్ అభ్యర్థిగా మైనంపల్లి అని కేసీఆర్ ప్రకటించారు.  115 అభ్యర్థుల్లో  మైనంపల్లి ఒకరు. ఆయనకు పోటీగా మరో అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీలో లేరు. అయినా మైనంపల్లిపై వేటు వేసే ఆలోచనలో పార్టీ అధిష్టానం చేసింది. మళ్లీ బిఆర్ఎస్ ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది.అభ్యర్థుల పేర్లను ప్రకటించే రోజే తిరుమలలో మైనంపల్లి మంత్రి హరీష్ రావ్ ను నీ అంతు చూస్తా అని బెదిరించడాన్ని పార్టీ సీరియస్ గానే తీసుకుంది. మంత్రి కేటీఆర్, ఎంఎల్ సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. మైనంపల్లి వ్యాఖ్యలను తప్పు పట్టారు. వాళ్లు హరీష్ రావ్ కు మద్దతుగా నిలిచారు.  అమెరికా నుండి ఇండియాకు వచ్చిన మైనంపల్లి మెదక్ నియోజకవర్గం నుంచి రాజకీయాలు ప్రారంభించి రామాయంపేట ఉప ఎన్నికలో టీడీపీ నుంచి 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జరిగిన శాసనసభా ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  2014లో మైనంపల్లి మల్కాజ్ గిరి టిడిపి టికెట్ ఆశించి భంగపడ్డారు.  అదే సంవత్సరం టీడీపీ నుంచి కాంగ్రెస్ లో జంప్ అయి అక్కడ కూడా టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మల్కాజ్ గిరి లోకసభ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హన్మంత్ రావ్ టీఆర్ఎస్ లోతిరుగులేని నాయకుడిగా ఎదిగారు. గ్రేటర్ టిఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ ఎంఎల్ సిగా ఎన్నికైన ఏడాదిలోపు జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రాంచందర్ రావ్ పై  మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ లో అప్రతిహాతంగా కొనసాగుతున్న మైనంపల్లి పుత్రవాత్సల్యంతో ఈ సారి మెదక్ టికెట్ ఆశించారు. సిట్టింగ్  ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కి వెళ్లడంతో మైనంపల్లి తట్టుకోలేకపోయారు. సిట్టింగ్ అయిన తనకు మల్కాజ్ గిరి టికెట్ రావడంలో సంతోషం కన్నా కొడుకుకు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి ఎక్కువ డిసపాయింట్ అయ్యారు.  పార్టీ మారే ఆలోచనలో మైనంపల్లి ఉన్నారు. ఎమ్మెల్యేగా తన మీద ఆశలు పెట్టుకున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని మైనంపల్లి రూట్ మార్చారు. వారం రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లి అభిప్రాయాన్ని తీసుకుంటానని మైనంపల్లి చెబుతున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అని మైనంపల్లి ముందున్న సవాల్ అయితే మైనంపల్లి కాకపోతే ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది బిఆర్ఎస్ ముందున్న సవాల్.  తనతో బాటు కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని మైనం పాటి తెగేసి చెప్పారు.  కెసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వర రావ్ కు ఈసారి చుక్కెదురైంది. గత ఎన్నికలలో పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల కు పాలేరు టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ పక్కకు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో బలమైన నేతగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆహ్వానం మేరకు ఖమ్మం జిల్లా కు చెందిన ఈ నేత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 లో బిఆర్ఎస్ అభ్యర్థిగా  పోటీ చేసిఓడిపోయినప్పటికీ మంత్రయ్యారు. 2019లో పాలేరు నుంచి అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి టికెట్ కూడా లభించలేదు. ఇటీవల తుమ్మల ఖమ్మంజిల్లాలో బలప్రదర్శన నిర్వహించారు. గులాబీ జెండా లేకుండానే తుమ్మల రోడ్ షో చేపట్టారు. తాను ప్రజా క్షేత్రంలో ఉంటానని  ప్రకటించి బిఆర్ఎస్ కు దూరమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ మొదటి జాబితా రానుంది. కాంగ్రెస్ లో టికెట్ రాని వారు ఇతర పార్టీల్లో చేరే అవకాశాలున్నాయి.  జంప్ జిలానీలకు చక్కటి అవకాశం లభించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

విద్యాదీవెన బటన్ నొక్కుడు కార్యక్రమంలోనూ జగన్ అదే తీరు!

సీఎం జగన్ సోమవారం(ఆగస్టు 29) చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించారు. జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులు విడుదల చేశారు. బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి నిధులు బదిలీ చేసినట్లు జగన్‌ ఘనంగా చాటుకున్నారు. అయితే ఆయన బటన్ అయితే నొక్కేశారు కానీ సదరు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ విద్యాదీవెన డబ్బులు ఇంకా నాలుగు వాయిదాలు చెల్లించాల్సి ఉంది.  విద్యాదీవెన అనేది వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఒక పథకం. గతంలో ఇలా ప్రభుత్వాలు ఏదైనా ఒక పథకం తీసుకొస్తే.. ఆ పథకం ప్రారంభించే సమయంలో అట్టహాసంగా సభ ఏర్పాటు చేసి ప్రజలకు దానిపై వివరణ ఇచ్చే వారు.  కానీ  వైసీపీ ప్రభుత్వం మాత్రం పథకం ప్రారంభంతో పాటు దాన్ని విడతల వారీగా అమలు చేస్తూ..  ప్రతి విడతకు అట్టహాసంగా, ఆర్భాటంగా  సభలు నిర్వహించి ఆ సభల నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. అమ్మ ఒడి,  రైతు భరోసా, విద్యా దీవెన ఇలా ఏ పథకం తీసుకున్నా అంతే. అన్నీ పథకాల సొమ్ములూ విడతల వారీగా ఇవ్వడం.. అలా ఇస్తున్న ప్రతి విడతకి కోటాను కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ కు   ఆనవాయితీగా మారిపోయింది.  తాజాగా నగరిలో నిర్వహించిన కార్యక్రమం కూడా అంతే. విద్యాదీవెన ఒక విడత నిధులను విడుదల చేస్తున్నట్లు బటన్ నొక్కి చెప్పారు. ఒక్క పథకాన్ని నాలుగు వాయిదాల్లో అమలు చేస్తూ.. నాలుగు సార్లు బటన్లు నొక్కడానికి కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు, బహిరంగసభలు ఏర్పాటు చేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీ ప్రచారం కోసం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వాడుతున్నారు. ఇక, నగరి సభలో సీఎం జగన్  ప్రసంగం కూడా అక్షరం పొల్లుపోకుండా  పాత పాటే పాడారు. యధావిధిగా చంద్రబాబు దుర్మార్గుడు, మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. కుట్రలు, కుతంత్రాలు చేసి గెలవాలని చూస్తున్నారంటూ అదే ఊక దంపుడు ప్రసంగం చేశారు.   పుంగనూరు, అంగళ్లలో కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించి చంద్రబాబు లబ్ధి పొందాలని చూశారని.. పోలీసులపై దాడులు చేయించారని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన ఫొటోకే దండ వేసిన చంద్రబాబు.. ఇప్పుడు నాణెం విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని విమర్శలు చేశారు. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు ఫిర్యాదుపై మాట్లాడిన సీఎం జగన్.. చంద్రబాబే దొంగ ఓట్లు సృష్టించి ఆయనే ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు.  గత  నాలుగేళ్ళలో సీఎం జగన్ దాదాపుగా ఇదే పాట పాడుతున్నారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నట్లుగా తన వైఫల్యాలన్నిటకీ   చంద్రబాబే కారణమని.. కోర్టుల నుండి దర్యాప్తు సంస్థల వరకూ అన్నిటినీ చంద్రబాబే మేనేజ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  బహుశా తొలి రోజు నుండి సీఎంకు స్క్రిప్ట్ రాసిచ్చే వారికి కొత్తగా ఏం రాయాలో తెలియలేదేమో పాపం..  అదే పాత క్యాసెట్ ముందుకీ వెనక్కీ తిప్పి ప్లే చేస్తున్నారు. ఇక జగన్ ఆరోపణల విషయానికి వస్తే పుంగనూరు, అంగళ్లలో ఏం జరిగిందో అందరూ చూసారు. కేసులు కూడా పెట్టారు. వైసీపీ రౌడీల దౌర్జన్యాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఓట్ల తొలగింపుపై ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘమే విచారించి అధికారులపై వేటు కూడా వేసింది. ఈ తతంగాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారుప.  స్థానిక సంస్థల ఎన్నికల నుండి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ పక్క రాష్ట్రాల నుండి వైసీపీ నేతలు మనుషులను తరలించి భారీగా దొంగఓట్లు వేయించిన వైనం కూడా వీడియోల ద్వారా రాష్ట్రప్రజలు వీక్షించారు.   అయినా, జగన్ మాత్రం చంద్రబాబే ఇవన్నీ చేయించారని చెప్పడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. జగన్ మోహన్ రెడ్డి వాలకం చూస్తుంటే జనం ఏం చెప్పినా వింటార్లే అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇలా అన్నిటికీ చంద్రబాబే అంటున్నారు. అదే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన నుండి విశాఖ సభ, బస్సు యాత్రలో చేసిన సాంకేతిక ఆరోపణలకు, లోకేష్ పాదయాత్రలో సంధించిన ప్రశ్నలకు ఒక్కటంటే ఒక్క దానికి కూడా సమాధానం రావడం లేదు. విపక్ష నేతగా ఉన్నప్పుడు అస్తమానూ నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ డైలాగులు దంచిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత   ప్రజలకు మేము ఇది చేశాం.. ఈ అభివృద్ధి సాధించాం అని చెప్పుకోవడానికి ఏమీ కనిపించడం లేదు. దీంతో ఆయన ఎంతసేపూ చంద్రబాబు సెంట్రిక్ గా పరమ రొటీన్ ఆరోపణలు. విమర్శలు గుప్పిస్తూ తన భుజాలను తానే చరుచుకుంటున్నారని,  ప్రజలు అన్నీ చూస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మంత్రి రోజా భర్త సెల్వమణిపై అరెస్టు వారెంట్

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా భర్తపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. తన పరువుకు నష్టం కలిగించేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారంటూ సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ర్ బోత్రా ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో విచారణకు గైర్హాజర్ కావడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.  మంత్రి రోజా భర్త సెల్వమణికి చెన్నై జార్జిటౌన్ కోర్టు అరెస్ట్ వారెంట్.. తన పరువుకి భంగం కలిగేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశాడని సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా ఫిర్యాదు.. కేసు విచారణకు సెల్వమణి, లాయర్ హాజరుకాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.  సెల్వమణి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి విదితమే. అయితే ఆయన ఓ కేసులో అరెస్టు అయిన సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్వమణి ముకుంద్ చంద్ బోత్రా కారణంగా తాను పలు ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయంటూ ముకుంద్ చంద్ బోత్రా కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణలో ఉండగానే ముంకుంద్ చంద్ బోత్రా కన్నుమూశారు. అ యితే ఆయన కుమారుడు గగన్ బోత్రా కేసు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు సోమవారం (ఆగస్టు 28)న విచారణకు వచ్చింది. అయితే ఈ విచారణకు సెల్వమణి కానీ, ఆయన తరఫు న్యాయవాది కానీ హాజరు కాలేదు. గతంలో కూడా వీరు విారణకు గైర్హాజర్ అయ్యారు. దీంతో సెల్వమణి గైర్హాజర్ ను కోర్టు సీరియస్ గా తీసుకుని నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇలా ఉండగా తనపై జారీ అయిన అరెస్టు వారెంట్ పై సెల్వమణి స్పందించలేదు.  

అదానీ గ్రూపు నిబంధనల ఉల్లంఘన వాస్తవమే.. సెబీ దర్యాప్తులో వెల్లడి

అదానీ గ్రూప్ పై హిడెన్ బర్గ్ నివేదికలోని అంశాలు అక్షర సత్యాలని తేలిపోయింది. అమెరికా స్థావరంగా పని చేస్తున్న పట్టుమని పది మంది  సిబ్బంది లేని షార్ట్ సెల్లర్ స్టాక్ బ్రోకర్ సంస్థ హిడెన్ బర్గ్ నివేదిక ఆధారంగా  నిందలు వేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆదాని ఇప్పుడు తేలుకుట్టిన దొంగలా మౌనంగా ఉన్నారు. ఔను హిడెన్ బర్గ్ నివేదిక లోని అంశాలు వాస్తవమేనని, అదానీ గ్రూపు కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డాయనీ సెబీ దర్యాప్తు బట్టబయలు చేసింది. హిడెన్ బర్గ్ నివేదిక బయటకు రాగానే అదానీ వ్యాపార సామ్రాజ్యం ఒక్క సారిగా కుదేలైంది. ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌ ద్వారా అదానీ గ్రూప్‌ తన లిస్టెడ్‌ కంపెనీల షేర్లను అడ్డగోలుగా పెంచుకుందన్నది హిండెన్‌బర్గ్‌ నివేదిక  పేర్కొంది. అయితే ఈ నివేదిక అబద్ధాల పుట్ట అంటూ అదానీ గ్రూప్ అప్పట్లో ఖండించింది. అయితే ఇప్పుడు ఆ ఆరోపణలు వాస్తవమేనని సెబీ దర్యాప్తు తేల్చింది. సెబీ దర్యాప్తు వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాకపోయినప్పటికీ.. తమ వ్యాపారాలను కుదేలు చేయడానికి కుట్ర జరుగుతోందనీ, హిడెన్ బర్గ్ నివేదిక అందులో భాగమేననీ అదానీ గ్రూప్ అప్పట్లో గగ్గోలు పెట్టింది. అదానీకి మద్దతుగా, వ్యతిరేకంగా అప్పట్లో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. పార్లమెంటు వదికగా చర్చోపచర్చలు, ఆరోపణల పర్వం కొనసాగింది.  కార్పొరేట్  రాజకీయ అక్రమ సంబంధాలపై పాత చర్చ కొత్తగా తెరమీదకు వచ్చింది. భారత వ్యాపార దిగ్గజాలలో ఒకరైన విప్రో ప్రేమ్ జీ ప్రమేయంపై కూడా అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.  2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించి  ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నట్లు అనుమానిస్తున్న కుట్రలో భాగంగా అదానీని టార్గెట్ చేశారని కూడా అప్పట్లో ఆరోపణలు వెలువడ్డాయి.  ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అదానీ వ్యవహారంలో అంటీ ముట్టనట్లు ఉన్నట్లు కనిపించినా, ఆ గ్రూపు కంపెనీలు నిలదొక్కుకోవడానికి తెరవెనుక చేయగలిగినంతా చేసింది. అందులో భాగంగానే అదానీ వ్యవహారంలో కుట్ర కోణాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లుగా చెప్పిన  భారత దర్యాప్తు సంస్థలు విప్రో  యజమాని  పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ ప్రమేయం ఉన్నట్లుగా లీకులిచ్చాయి.    ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో అప్పట్లో వచ్చిన కథనం తార్కానం అని చెబుతారు. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడిసతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్ఛంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ  ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తోందని ఆర్గనైజర్‌ ఆ కథనంలో పేర్కొంది. ఆర్గనైజర్‌ కథనం ప్రకారం, ఆస్ట్రేలియాలో పర్యావరణ పరిరక్షణ ముస్గులో పనిచేస్తున్న బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బీబీఎఫ్) అనే స్వచ్చంద సంస్థ,  Adaniwatch.org అనే వెబ్‌సైట్‌ను నడుపుతోంది. అదానీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌కు అజీమ్ ప్రేమ్‌జీ నిర్వహించే సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, ఒమిడ్యార్, బిల్ గేట్స్‌లు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు.  హిండెన్‌బర్గ్ కేవలం బంటు. అసలు సూత్రధారి అజీమ్ ప్రేమ్‌జీ అతని కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల సంస్థలు, వ్యక్తులు  అని ఆర్గనైజర్‌ పేర్కొంది. అలాగే  ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ ( సిపిఎం నేత సీతారం ఏచూరి భార్య) కూడా అదానీ వ్యతిరేక కుట్రలో భాగస్వామిగా ఉన్నారని ఆస్ట్రేలియాలో అదానీ కాల్ ప్రాజెక్ట్స్ కు వ్యతిరేకంగా 2017లోనే  ది వైర్ కథనాలు రాసిందని కూడా ఆర్గనైజర్‌ పేర్కొంది. అదానీ ఒక సాకు మాత్రమే  అజీమ్ ప్రేమ్‌జీ లక్ష్యం మోడీ. అందుకే ఆల్ట్‌న్యూస్, ది వైర్, ది కారవాన్, ది న్యూస్ మినిట్ వంటి మోదీ వ్యతిరేక వెబ్‌సైట్‌లన్నింటికీ ప్రేమ్ జీ  భారీ మొత్తంలో డబ్బు ఇస్తున్నారని ఆర్గనైజర్‌ ఆ కథనంలో ఆరోపించింది. అయితే అదానీని అడ్డం పెట్టుకుని మోడీని రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్ర కోణ ఉందంటూ అప్పట్లో ఆర్గనైజన్ వండి వార్చిన కథనాలన్నీ అవాస్తవాలని తాజాగా సెబీ దర్యాప్తులో బట్టబయలైంది.  నిబంధనల ప్రకారం ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌ ఏవీ భారత లిస్టెడ్‌ కంపెనీల ఈక్విటీలో ఎఫ్‌పీఐల ద్వారా 10 శాతం వాటాకు మించి కొనుగోలు చేయరాదు. అంతకు మించితే ఆ విషయాన్ని వెంటనే సంబంధిత కంపెనీ వెంటనే రెగ్యులేటరీ సంస్థలకు తెలియజేయాలి. అప్పుడు ఆ పెట్టుబడులను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)గా పరిగణిస్తారు. ఈ విషయంలోనూ అదానీ గ్రూప్‌ నిబంధనలను అడ్డగోలుగా తుంగలో తొక్కినట్టు సెబీ గుర్తించింది.  మరోవైపు సుప్రీంకోర్టులో మంగళవారం( ఆగస్టు 29) అదానీ గ్రూప్‌ పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల కేసు విచారణకు రానుంది. దీనిపై తమ దర్యాప్తు కూడా దాదాపు పూర్తయిందని సెబీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో సెబీ, సుప్రీం కోర్టు.. అదానీ గ్రూప్‌ అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా సెబీ దర్యాప్తులో అదానీ గ్రూపు ఉల్లంఘనలు బట్టబయలయ్యాయన్న వార్తలపై ఈ గ్రూపు ఇంత వరకూ స్పందించలేదు.  

టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలపై హై కోర్టులో పిల్

తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.   నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా  ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన సవాల్ చేశారు. ఈ ముగ్గురిరీ టీటీడీ సభ్యులుగా తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.  టీటీడీ బోర్డు సభ్యుల నియామకం విషయం  కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని అటువంటి బోర్డులో నేర చరితులు, మద్యం వ్యాపారులకు స్థానం కల్పించడం సరికాదని ఆయనా పిటిషన్ లో పేర్కొన్నారు. అసలు టీటీడీ బోర్డు చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత జగన్ సర్కార్ బోర్డు సభ్యులను నియమించింది. అలా నియమించిన వారిలో నేర చరితులు, అవినీతి, కుంభకోణం కేసుల్లో జైలుకు వెళ్లి అప్రూవర్ గా మారి బెయిలుపై బయటకు వచ్చిన వారి పేర్లు ఉండటంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.

ఇండియా కూటమిలోకి వైసీపీ.. పీకే మధ్యవర్తిత్వం?

ఏదో ఒకటి చేయాలి.. మరోసారి అధికారంలోకి రావాలి. ఇప్పుడు అధికారం కోల్పోతే మళ్ళీ అవకాశం రావడం అసాధ్యం. ఈసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే రాజధాని, పోలవరాన్ని పరుగులు పెట్టించడం ఖాయం. అవి రెండూ పూర్తయితే ఏపీలో మళ్ళీ వైసీపీకి అవకాశం దక్కడం దుర్లభం. అందుకు ఇప్పుడే మరోసారి అధికారాన్ని దక్కించుకొని ఏపీ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్నది జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆయన నాలుగేళ్ళపాలనతోనే ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు సర్వేలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అధికారం టీడీపీదేనని ఆ సర్వేలు తేల్చేయడంతో వైసీపీ వర్గాలలో గుబులు రేగుతున్నది. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్.. ఇప్పటికే పలు విధాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎత్తులు వేస్తున్నారు.  సొంత మీడియాతో పాటు పలు సంస్థలు సర్వేల ద్వారా వైసీపీకి అనుకూలంగా  భారీ ఎత్తున మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందాలు జగన్ విజయమే లక్ష్యంగా  ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం కసరత్తులు మొదలు పెట్టాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏకమైతే వైసీపీకి అధికారం దక్కడం అసాధ్యమన్న భావనలో ఉన్న  వైసీపీ పెద్దలు విపక్షాల ఐక్యతను భగ్నం చేయడానికి శతధా ప్రయత్నిస్తున్నాయి.  దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని జనసేన నేతలపై పరుష వ్యాఖ్యలకు దిగుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా టీడీపీతో కలిస్తే కేంద్రంలో తమ పప్పులు ఉడకవని భయపడుతున్న వైసీపీ.. బీజేపీతో రహస్య స్నేహబంధం కొనసాగేలా చూసుకోవాలని తాపత్రయ పడుతుంది. చాలాకాలంగా టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బీజేపీ పెద్దలు కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగడం ఈ పొత్తులపై పాజిటివ్ సంకేతాలనే ఇస్తోంది. దీంతో టీడీపీతో బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లేనని రాజకీయ వర్గాలలో వినిపిస్తుండగా.. ఇక వైసీపీకి మిగిలింది ఇండియా కూటమే. మరోవైపు కాంగ్రెస్ అధ్వర్యంలోని ఇండియా కూటమి కూడా దక్షణాది రాష్ట్రాలలో తమతో కలిసి వచ్చే వారి కోసం గేట్లు తెరిచి ఆహ్వానిస్తుంది.  ఈ పరిస్థితుల్లో  వైసీపీ ఇప్పుడు మరో కొత్త ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. అదే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలోకి వైసీపీ చేరే ప్రయత్నాలు సాగుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి.  జగన్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్  ఈ మేరకు మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నది.  కాగా, ఈ మధ్యనే పీకే చంద్రబాబుతో భేటీ అయ్యారన్న ప్రచారం ఒకటి బయటకి వచ్చింది. ఇండియా కూటమిలోకి చేరేందుకు చంద్రబాబు పీకేతో చర్చలు జరిపారని ఈ ప్రచారం సారాంశం. అయితే, నిజానికి ఇండియా కూటమిలోకి సన్నాహాలు చేసుకుంటున్నది వైసీపీయేనని,  వారు చేసే పనుల్ని ఇతర పార్టీలు చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారంలోకి తీసుకురావడం జగన్ మోహన్ రెడ్డి రివర్స్ వ్యూహంలో భాగమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. త్వరలోనే ఇండియా కూటమిలోకి వైసీపీ అనే పొలిటికల్ ఇష్యు బయటకొస్తుందన్నది ఎ చెప్తున్నారు. మరి అదే నిజమైతే బీజేపీ ఎలా స్పందిస్తుందన్నదని చూడాల్సి ఉంది.

ఎన్టీఆర్ స్మారణ నాణెం ఎక్కడ తయారైందదో తెలుసా?.. దీని వెల ఎంతంటే?

స్మారక నాణెం అనేది ఒక సంఘటన, మహోన్నత వ్యక్తి లేదా చిరస్మరణీయమైన మైలురాయిని గౌరవించుకోవడానికి  జారీ  చేస్తారు. ఆలా జారీ చేసిన నాణేలను  సాధారణ చలామణిలో ఉపయోగించరు. వీటిని కేవలం ముద్రించి సేకరణ వస్తువులుగా విక్రయిస్తారు. వీటిని జనం కొనుక్కుని అపురూపంగా దాచుకుంటారు.  అలాంటి అపురూపమైన వ్యక్తి కనుకనే.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రూపొందించింది. ఈ నాణెం సోమవారం (ఆగస్టు 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ శతాబ్దం ఎన్టీఆర్ ది అని ప్రతి తెలుగువాడూ గర్వంగా చెప్పుకోదగ్గ మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది. సినీ, రాజకీయ రంగాలలో అనితర సాధ్యమని చెప్పదగ్గ ఘనతలు సాధించిన ఎన్టీఆర్ స్మృత్యర్థం విడుదల చేసిన స్మారణ నాణెం ఎక్కడ తయారైందో తెలుసా. ప్రతి తెలుగువాడూ గర్వించదగ్గ ఎన్టీఆర్ స్మారణ నాణేన్ని తెలుగుగడ్డపైనే తయారు చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో   తయారైంది. ఒక వ్యక్తి పేరు మీద విడుదలైన నాణెం హైదరాబాద్  మింట్ లో తయారవ్వడం ఇదే మొదటి సారి.   తొలి విడతలో 12 వేల స్మారక నాణేలు ముద్రించారు. దీని ముఖ విలువ వంద రూపాయలే అయినా.. దీనిని సొంతం చేసుకోవాలంటే  రూ. 4,160 చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది.  అయితే  డిమాండ్‍కి తగినంతగా నాణేల సరఫరా లేదు.  ఈ రూ.100 నాణెం 44 మిమీ వ్యాసం కలిగి ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో రూపొందించబడింది. దీన్ని ఏదైనా బ్యాంకులో లేదా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం ధర రూ. 4,160 ఉంటుంది.   నాణెంతో పాటు, తెలుగు ప్రైడ్‌గా పేరొందిన ఎన్టీఆర్‌ చరిత్రాత్మక జీవిత ప్రయాణాన్ని వివరించే నాలుగు పేజీల పుస్తకాన్ని కూడా  కొనుగోలుదారులకు ఈ నాణెంతో పాటు  అందిస్తారు. నాణేనికి ఒకవైపు మూడు సింహాలు, అశోకచక్రం ఉండగా, మరో వైపు హిందీలో  నందమూరి తారక రామారావు శతజయంతి’ అని చెక్కబడిన ఎన్టీఆర్ చిత్రం ఉంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను సూచించేందుకు నాణెం 1923-2023 అని కూడా ఉంటుంది. ఈ నాణాన్ని హైదరాబాదులోని మింట్ కాంపౌండ్‌లోనే ముద్రించబడటం విశేషం. అయితే 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్ బొమ్మలను ఆయన కుటుంబ సభ్యునే ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.  NTR రూపంతో నాణెం ముద్రించడం పట్ల నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాణెం విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. 

జగనన్నను మించిన దైవమున్నదా? రోజా కొత్త భజన

కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ   ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండీ   ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఈ కొత్త దేముడి భజన వేరే లెవల్ లో సాగుతోంది. ఇంతకీ ఈ కొత్త దేముడెవరంటారా? సందేహమెందుకు వైసీపీ నేతలు, మంత్రులూ చెబుతున్న కొత్త దేముడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డే. అవును ఎన్నికల సమయం ముంచుకు వస్తున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్ లో ఉంది. కేసులు, అరెస్టులు, లాఠీ దెబ్బలు, పథకాల కోత బెదరింపులు ఇవేవీ ప్రజల మీద పని చేయడం లేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలలో మరోసారి విజయం సాధించాలంటే కొత్త ముఖాలను ఎన్నికల బరిలో దింపడం వినా మరో మార్గం లేదని భావిస్తున్నారు. దీంతో సీనియర్లు, జూనియర్లు, మంత్రులు, మాజీ మంత్రులు అన్న తేడా లేకుండా వైసీపీలో చాలా మంది సిట్టింగులకు టికెట్ భయం పట్టుకుంది. ప్రజలలో పలుకుబడి ఉన్న వారు టికెట్ రాకపోతే పార్టీకి గుడ్ బై కొట్టేసి వెళ్లి పోతారు. అధినేత తీరు నచ్చకపోయినా ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసి పార్టీ వదిలేస్తారు. కానీ కొందరు మంత్రులు, మాజీ మంత్రులకు ఆ పరిస్థితి లేదు. అందుకే వారు తమ అధినేతను కొత్త దేముడిగా, కొంగొత్త దేవుడిగా కీర్తిస్తూ టెకెట్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో రోజు చేసిన ప్రసంగం వింటే ఈ తరహా భజనలో ఆమె ఆరితేరారని అనిపించక మానదు. నగరిలో సోమవారం (ఆగస్టు 28) జగనన్న విద్యాదీవెన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రోజా ప్రసంగించారు. ఆకాశమే హద్దుగా పొగడ్తల వర్షం కురిపించేశారు. నగరి నియోజకవర్గానికి జగన్  తొలిసారిగా విచ్చేశారని చెప్పిన మంత్రి రోజా జగనన్నను మించి దైవమున్నాదా అన్న రీతిలో పొగడ్తల వర్షం కురిపించేశారు. పనిలో పనిగా విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలూ గుప్పించేశారు. ఇక జగన్ విషయంలో ఆమె ప్రశంసలు అన్ని హద్దులనూ మీరిపోయాయి. జగన్ ను కొత్త దేముడిని చేసేశాయి. ఆమె ఏ స్థాయిలో నేత విడిచి సాము చేశారంటే ‘మీరు రాముడిని పూజించినా... అల్లా ను ఆరాధించినా, ఏసు ప్రభువును ప్రార్ధించినా... మిమ్మల్ని ఉన్నత విద్యలు చదివించేది మాత్రం ఆ దేవుడు పంపిన జగనన్నే’అనేశారు. అదే వేదిక మీద కూర్చున్న జగన్ ఈ ప్రసంగం వింటూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇంతకీ రోజాకు పొగడ్తలు కొత్తేమీ కాదు. గతంలో తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఈ స్థాయికి పెద్దగా తగ్గకుండానే ఆమె చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. అదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ తరువాత తెలుగుదేశం వీడి కాంగ్రెస్ పంచన చేరుందుకు ప్రయత్నించిన సమయంలో వైఎస్ పైనా పొగడ్తలు కురిపించారు. ఇప్పుడు జగనన్న ను పొగుడుతున్నారు. అయినా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కుతుందా లేదా అన్న టెన్షన్ లో ఉన్న రోజా జగన్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగడితే  పాస్ మార్కులు పడతాయని భావిస్తున్నట్లున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. నగరిలో ప్రస్తుతం రోజాకు ఎదురుగాలి వీస్తున్నదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డితో పొసగకపోవడం, నియోజవకర్గంలో కూడా ఆమెకు వ్యతిరేకంగా పని చేసే గ్రూపు పెద్దిరెడ్డిఆశీస్సులతో బలోపేతం కావడంతో ఆమెకు ఒకింత చిక్కులు తప్పడం లేదని అంటున్నారు. ఇక అన్నిటికీ మించి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఆమెకు కనీస సమాచారం అందని పరిస్థితి ఉందని చెబుతున్నారు. వీటన్నిటికీ మించి గతంలో గడపగడపకూ కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్ లో పని తీరు మెరుగుపరచుకోవాలంటూ జగన్ మందలించిన నేతలలో రోజా కూడా ఒకరని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో నగరి నియోజకవర్గ వైసీపీ టికెట్ రోజాకు దక్కే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న గుసగుసలు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్న నేపథ్యంలో రోజా జగన్ పై ప్రశసంల వర్షం కురిపించడం, అపర దేవుడిగా కీర్తించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ టికెట్ కోసం కోటి విద్యలు అంటూ  వైసీపీ శ్రేణుల నుంచే సెటైర్లు పేలుతున్నాయి. 

పైన పటారం లోన లొటారం!

ఏపీలో ఎన్నికలకు ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోగా ఎలాగైనా విశాఖను రాజధానిగా చేయాలన్నది వైసీపీ ప్రభుత్వం ఆలోచన. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉండడంతో  ప్రభుత్వం చేసేందుకు ఏమీ లేదు. చేయగలిగిందీ ఏమీ లేదు. దీంతో అనధికారికంగానైనా విశాఖను పరిపాలన  రాజధాని చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశపడుతున్నారు. కనీసం సీఎంఓను విశాఖలో ఏర్పాటు చేసి చూడండి నేను విశాఖ నుండే పరిపాలన చేస్తున్నానని చూపించాలని, చెప్పుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం రుషికొండపై భవంతులు కడుతున్నారు. ఇక్కడ కట్టేది సచివాలయం కోసమేనని ముందు వైసీపీ అధికారిక ట్విట్టర్ లో ప్రకటించి మళ్ళీ కాదని ఆ ట్వీట్ ను ఉపసంహరించుకుని నాలిక్కొరుక్కుంది.  రుషికొండపై నిర్మాణంలో ఉన్న భవనాలు రాజధాని కోసం కాదని ప్రభుత్వం చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. కనీసం దసరాకైనా విశాఖ నుండి పరిపాలన చేయాలని ఆశపడుతున్న జగన్.. ఇప్పటికే విశాఖ నగరంలో కొన్ని మార్పులు, చేర్పులకు ఆదేశాలిచ్చారు.  ఇందులో భాగంగానే విశాఖ నగరంలో కొన్ని బ్యూటిఫికేషన్ పనులు కూడా చేస్తున్నారు. కొన్ని కొన్ని పార్కులు, రోడ్లు, రహదారులు, బస్టాండ్లు, మెయిన్ సెంటర్లు ఇలా పలుచోట్ల పలు రకాల సుందరీకరణ పనులు చేస్తున్నారు. అయితే, వీటి వ్యవహారం పైన పటారం లోన లొటారం అనే సామెత సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు జీవీఎంసీ సుందరీకరణ పనులు చేసుకుంటూ వెళ్తుంటే ముందు చేసినవి మరమ్మత్తులకు వస్తున్నాయని నగర వాసులు నవ్వుకుంటున్నారు. కొత్తగా భవనాలు కడితే కృంగిపోతున్నాయని.. లైటింగ్ ఏర్పాటు చేస్తే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు వెలగడం లేదని వాపోతున్నారు. ఈ పనులు తీసుకున్న కాంట్రాక్టర్లు, సంస్థలు అతి తక్కువకు దక్కించుకొని మరీ నాసిరకంగా పనులు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కూడా కళ్ళ ముందే కనిపిస్తున్నది. ఓల్డ్ మోడల్ లో ఉన్న బస్ స్టాండల రూపు రేకలు మార్చాలని.. 'బస్ బే' అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీలోని 99 వార్డులలో బస్ స్టాండ్ల రూపు రేఖలు మార్చాల్సి ఉంది. పాతగా ఉన్న బస్ స్టాండ్లను నూతనంగా మార్చి ఇతర దేశాలలో ఉన్న స్థాయిలో కనిపించేలా అభివృద్ధి చేయాలన్నది దీని కాన్సప్ట్. మరీ పాత బడిన వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు రూ.40 నుండి రూ.50 లక్షల వరకూ కూడా ఒక్కో దానికి బడ్జెట్ కేటాయించగా.. అన్నీ బాగున్న బస్ స్టాండ్లకు కనీసం బస్ బే అని డిజిటల్ గా మార్చేందుకు రూ.40 నుండి రూ.50 వేలు  కేటాయించారు. ఈ క్రమంలో ఇలా భవనంతో సహా నిర్మించిన రెండు మూడు బస్ బేలను నగర మేయర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇది చూడడానికి అందంగా, సరికొత్తగా ఫారిన్ మోడల్ గా ఉండడంతో ఇదేదో బాగుందని అంతా అనుకున్నారు. అయితే, ఇంకా ఈ ప్రాజెక్ట్ పూర్తి కానేలేదు. కొన్ని చోట్ల పనులు సాగుతూనే ఉన్నాయి. అంతలోనే సిటీ నడిబొడ్డున కట్టిన బస్ షెల్టర్ ఒకటి కుంగిపోయింది. ఒక్కసారిగా అది పక్కకు ఒరిగిపోయింది. ఆ టైంలో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం లేదు. ప్రయాణికులు ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించేదని అంటున్నారు. కాగా, నలభై లక్షల రూపాయలతో నిర్మించిన ఈ బస్ షెల్టరును కూడా మేయరే ప్రారంభించారు. కానీ, ఇప్పుడు ఇలా ఒక్కసారిగా ఇది కృంగిపోయింది. ఇది ఒక్కటే కాదు.. చాలా చోట్ల ఇదే పరిస్థితి. బస్ బే అని ఫారిన్ కంట్రీలో ఉన్నట్లు కనిపించాలని పెట్టిన బోర్డులు కూడా కొన్ని చోట్ల ఊడి వేలాడుతున్నాయి. ఈ మోడ్రన్ బస్ స్టేషన్ల పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణం భారీ అవినీతి అంటూ విపక్షాలు గట్టిగా విమర్శలు చేస్తున్నాయి. బస్ స్టాండే కట్టలేని వారు మూడు రాజధానులు కడతారా, పోలవరం కట్టగలరా అంటూ భారీ సెటైర్లే వేస్తున్నాయి.

ఎర్రచందనం స్మగ్లర్లకు అండ ఎవరు విజయసాయీ?

స్పందన జీవ లక్షణం, ప్రతి స్పందన మనిషి లక్షణం.. ఈ లక్షణాలు నూటికి నూరు శాతం ఉన్న వ్యక్తి అధికార జగన్ పార్టీలో ఎవరైనా ఉన్నారా? అంటే.. ఆ పార్టీ తొలి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక్కరే ఉన్నారని వైసీపీలోని ఆయన వ్యతిరేక వర్గం పెద్ద గొంతేసుకుని చెబుతారు. దేశంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. దానిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లకు ఆపాదిస్తూ.. ట్విట్టర్ వేదికగా స్పందించడం ఆయన విజయసాయిరెడ్డికి ఉన్న ప్రత్యేక లక్షణం అంటారు. అలా పోలికలు ఆపాదిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలు ఒక్కొక్కసారి బూమరాంగ్ అవుతుంటాయనీ, వాటి వల్ల పార్టీకి పూడ్చలేని నష్టం వాటిల్లుతున్నదని కూడా చెబుతారు. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ వైసీపీకి గట్టిగానే తగిలింది. ఇటీవల పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. దీంతో  అల్లు అర్జున్ ను అభినందిస్తూ పలువురు ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా అభినందించారు. వెంటనే విజయసాయి ట్విట్టర్ వేదికగా తన వ్యంగ్య వైభవానికి నగిషీలు అద్దుతూ రంగంలోకి వచ్చేశారు.  అల్లు అర్జున్ అభినందించడంతో ఊరుకోకుండా పనిలో పనిగా చంద్రబాబుపై సెటైర్లు వేయడానికి ప్రయత్నించి భంగపడ్డారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టి వైసీపీని నవ్వుల పాలు చేసింది. ఇంతకీ ఆయన ఆ ట్వీట్ లో ఏమన్నారంటే.. నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా దానిని తనకే ఆపాదించుకుంటారు చంద్రబాబు గారు. పుష్ప హీరో అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్పూర్తి అని అన్నా అంటారు.  తన హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది. ఎందరో పుష్పరాజ్‌లను నేనే తయారు చేశా. పుష్ప పార్ట్ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ అని బాబు బాంబు పేలుస్తాడేమో అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతే వైసీపీలోని ఆయన వ్యతిరేకులే కాకుండా, తెలుగుదేశం శ్రేణులు కూడా విజయసాయి ట్వీట్ పై తమదైన స్టైల్ లో రివర్స్ సెటైర్లు గుప్పించేశారు.  ఆ ట్వీట్ల సారాంశమేంటంటే..  విజయసాయిరెడ్డిగారు చెప్పేది నిజమే.. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రత్యేక  టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశారని.. ఆ టాస్క్‌ఫోర్స్‌కు అధిపతిగా నీతి నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారిని నియమించారని.. ఆ క్రమంలో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న తమిళ కూలీలపై కాల్పులు జరిపితే.. 20 మంది  మరణించారు. ఆ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విజయసాయిరెడ్డి మరిచిపోయి ఉంటారు.  అదీకాక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ.... అటు ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లోనే కాకుండా..  ఇటు శేషాచలం అడవుల్లో పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు పట్టుబడ్డారు.  అదే విధంగా రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనాన్ని తరలిస్తూ కూలీలను రెడ్ హ్యాండెడ్‌గా టాస్క్ ఫోర్స్ పోలీసులు  పట్టుకొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. కానీ  జగన్ ప్రభుత్వం గద్దెనెక్కన తర్వాత.. ఎర్రచందనం స్మగ్లింగ్ అనే మాటే వినపడం లేదని.. దీంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోయిందా? లేకుంటే స్మగ్లింగ్ జరుగుతోందా? జరుగుతుంటే సైలెంట్‌గా జరుగుతోందా?  ఓ వేళ స్మగ్లింగ్ ఆగిపోతే ? ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమైనా పట్టిష్టమైన ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందా? అదీకాక జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లో శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం కానీ.. వాటిని ఎత్తుకెళ్తున్న కూలీలు కానీ పట్టుబడ్డారంటూ ఏక్కడా ఒక్క వార్త కూడా అటు మీడియాలో కానీ.. ఇటు సోషల్ మీడియాలో కానీ రాలేదు, దీంతో శేషాచలం అడవులు, ఎర్రచందనం, ఎర్రచందనం స్మగ్లింగ్ అనే పదాలు తెలుగు ప్రజలు దాదాపుగా మరిచిపోయారని.. కానీ పుష్ప సినిమా విడుదల సందర్భంగా... ఎర్రచందనం స్మగ్లింగ్ విషయం ప్రజలకు గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత ఆ విషయం కూడా ప్రజలు మరిచిపోతున్న తరుణంలో.. పుష్ప సినిమా హీరో పుష్ప అలియాస్ ఫుష్పరాజ్‌గా నటించిన అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం.. ఈ నేపథ్యంలో విజయాసాయిరెడ్డి.. ఇలా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడుపై వ్యంగ్యంగా స్పందించడంతో.. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శేషాచలం అడవుల్లో చోటు చేసుకొన్న సంఘటనలు కళ్ల ముందు కదలాడాయని విజయసాయిరెడ్డి వ్యతిరేకులు ట్వీట్టర్ వేదికగా గుర్తు చేస్తున్నారు.  అదీకాక తిరుమల కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది.. అందుకు ఆటు శేషాచలం  అడవుల్లో ఉండాల్సిన వైపు వెళ్లాల్సిన కృూర మృగాలు..  అలిపిరి మెట్ల మార్గం వైపునకు దూసుకు వచ్చి శ్రీవారి భక్తులపై దాడులకు పాల్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.   అయినా తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ.. అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన కొల్లం గంగిరెడ్డి బెయిల్‌పై విడుదల చేయించింది నాటి సీఎం చంద్రబాబు హయాంలోనేనా?.... లేకుంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన వెంటనేనా? అనేది మాత్రం తమకు గుర్తుకు రావడం లేదని ఈ సందర్భంగా విజయసాయి వ్యతిరేకులు సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. 

గన్నవరం సరే.. గుడివాడ మాటేంటి?

గన్నవరం  ఇన్‌ఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్ పేరు ప్రకటించిన తెలుగుదేశం  పార్టీ అభ్యర్థి ఆయనేనన్న క్లారిటీ పార్టీ శ్రేణులకు ఇచ్చేసింది.  అయితే గన్నవరం నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న గుడివాడ నియోజకవర్గం విషయంలో మాత్రం ఇంకా పార్టీ ఇన్ చార్జ్ నియామకం విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. దీంతో  అక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగేదెవరన్న విషయంలో క్లారిటీ లేక తెలుగుదేశం శ్రేణులు అయోమయంలో ఉన్నాయి.  గుడివాడలో  తెలుగుదేశం నాయకులు రావి వెంకటేశ్వరరావు, ఎన్నారై వెనిగండ్ల రాము.. ఎవరికీ వారు  పార్టీని ప్రజలలోకి తీసుకువేళ్లేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.  రానున్న ఎన్నికల్లో వీరిద్దరిలో ఎవరికి సీటు వస్తుందనే విషయంలో పార్టీలో ఒకింత అయోమయం నెలకొని ఉంది.  వీరిద్దరిలో ఎవరో ఒకరికి సీటు ఇస్తారా? లేకుంటే మ కొత్త వారిని తీసుకు వచ్చి గుడివాడ అసెంబ్లీ సీటు అప్పగిస్తారా? అదీ ఇదీ కాకుంటే.. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఇక్కడ నుంచి బరిలోకి దింపే అవకాశాలున్నాయా? అనే సందేహాలు నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.  గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని.. వరుసగా నాలుగు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  తొలుత రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగానే గెలుపొందినా.. ఆ తర్వాత ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుని మరో రెండు సార్లు విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో  వైసీపీ అధికారంలోకి రాగానే గన్నవరం ఎమ్మెల్యే కొడాలి నానికి జగన్ తన కేబినెట్ లో స్థానం కల్పించారు.   అయితే తొలిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైనే కాకుండా ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై కొడాలి నాని బూతులతో విరుచుకుపడారన్న సంగతి తెలిసిందే.  అంతేకాకుండా   గుడివాడ నా అడ్డా.  ఇక్కడ నుంచి ప్రతిపక్ష పార్టీల తరఫున ఎవరు బరిలో నిలిచినా.. గెలిచేది మాత్రం నేనే అంటూ.. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ లాగా తగ్గేదే లే అన్న స్టైల్లో కొడాలి నాని పంచ్ డైలాగులు విసురుతుండటం కద్దు. దీంతో గుడివాడలో కొడాలి నానికి పోటీగా సరి అభ్యర్థిని  బరిలోకి దింపితే తప్ప ఇక్కడ తెలుగుదేశం విజయకేతనం ఎదురవేయడం కష్టమన్న అభిప్రాయం క్యక్తమౌతోంది.  ఎందుకంటే.. దాదాపు రెండు దశాబ్దాలుగా  కొడాలి నాని.. గుడివాడ ఎమ్మెల్యేగా,   దాదాపు మూడేళ్ల పాటు మంత్రిగా కూడా పని చేశారు. కానీ గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం నోచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కనీసంలో కనీసంగా గుడివాడ బస్టాండ్ అయినా ఆయన బాగు చేస్తే సరిపోయేదని..  ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. 2021 జులై మొదటి వారంలో గుడివాడ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం అప్పటి రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో కలిసి..   మంత్రి హోదాలో కొడాలి నాని  శంకుస్థాపన కూడా చేశారని.. అంతేకాదు.. ఈ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం కోట్ల రూపాయిలు కేటాయించామని ఈ సందర్భంగా ప్రకటించారు. కానీ రెండేళ్లు గడిచినా.. నేటికీ గుడివాడ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం కనీసం ఒక ఇటుక రాయి కూడా పడలేదంటే.. గుడివాడ లొ ప్రగతి పురుగతి ఏంటన్నది సువువుగానే అవగతమౌతుంది.   దీంతో రెండు దశాబ్దాలుగా కొడాలి నాని నియోజకవర్గ అభివృద్ధికి వీసమెత్తు పని కూడా చేయలేదనీ,  అలాంటి కొడాలి నానిని ఓటమి పాలు చేసేందుకు జస్ట్ కొద్దిగా కష్టపడితే చాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. గుడివాడ ప్రజలు నానిని ఓడించి ఇంటికి పంపడానికి రెడీ ఉన్నారని అంటున్నారు. అందుకే జాప్యం లేకుండా గుడివాడలో   తెలుగుదేశం అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగించడం సరికాదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అందుకే గుడివాడ నుంచి పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..  వెంటనే ప్రకటించేస్తే.. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావ్ పేరు ప్రకటించినట్లు.. గుడివాడలో కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీ పేరు ప్రకటిస్తే.. ఆ తర్వాత వ్యవహారాన్ని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులే చూసుకుంటాయని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

జగన్ పక్కన పెట్టేశారా?.. వంశీ కొంపమునిగినట్లేనా?

అలా  వైసీపీకి రాజీనామా చేసి.. ఇలా తెలుగుదేశంలో  చేరగానే యార్లగడ్డ వెంకట్రావ్‌ని గన్నవరం పార్టీ ఇన్‌చార్జీగా తెలుగుదేశం అగ్రనాయకత్వం నియమించేసింది. దీంతో యార్లగడ్డ.. త్వరలో గన్నవరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే నియోజకవర్గంలో పలు మండలాల్లోని  వైసీపీ  శ్రేణులు.. గన్నవరం వచ్చి మరీ.. వెంకట్రావ్ సమక్షంలో పసుపు పార్టీ తీర్థం పుచ్చేసుకుంటున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ  అభ్యర్థి ఎవరు? వల్లభనేని వంశీనా? లేక  దుట్టా రామచంద్రరావా? అనే ఓ చర్చ నియోజవకర్గంలో జోరందుకుంది. కారణమేమిటంటే.. వచ్చే ఎన్నికల్లో  వైసీపీ  అభ్యర్థిగా దుట్టా రామచంద్రరావుని బరిలోకి దింపేందుకు ఆ పార్టీ ధ్యక్షుడు, ముఖ్యమంత్రి  జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌లో గన్నవరం నియోజకవర్గ నేత దుట్టా రామచంద్రరావుతోపాటు ఆయన కుమార్తె, అల్లుడు.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గన్నవరం ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని నిలబెడతామంటూ దుట్టా రామచంద్రరావుకు   జగన్ హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే సీఎం జగన్‌తో భేటీ అనంతరం దుట్టా రామచంద్రరావు.. మీడియాతో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారంటున్నారు.  మరోవైపు రానున్న ఎన్నికల్లో గన్నవరం ఫ్యాన్ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీనే అంటూ ఓ ప్రచారం అయితే ఇప్పటికే నియోజకవర్గంలో కొన సాగుతోంది. కానీ నియోజకవర్గాల వారీగా జరిపిన సర్వేల నివేదికను ఇప్పటికే ఐ ప్యాక్.. జగన్‌కు అందించిందనీ, ఆ నివేదికల ప్రకారం.. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం అవ్వడంలో  రానున్న ఎన్నికల్లో వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే.. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందని సీఎం భావిస్తున్నారనీ, అందుకే ఆయన  దుట్టా రామచంద్రరావు  వైపే మొగ్గు చూపుతున్నారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.  ఇక ఎన్నికలు జరగనున్న కొద్ది రోజుల ముందు.. నీవు గెలువవంటూ ఐ ప్యాక్ నివేదిక ఇచ్చింది ఏం చేద్దాం నీవే చెప్పు అంటూ వల్లభనేని వంశీని జగన్ పక్కన పెట్టేయడం ఖాయమంటున్నారు.   అదీకాక.. గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్ర రావు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగా ఉన్నాయని.... అలాగే ఆయన అల్లుడు శివభరత్‌రెడ్డి.. సీఎం  జగన్ భార్య   భారతి సమీప బంధువన్న సంగతి అందరికీ తెలిసిందేనని... అయితే గత ఎన్నికల వేళ.. గన్నవరం టికెట్ కోసం శివభరత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని... కానీ నాడు ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్‌ను ఆ పార్టీ అధినేత జగన్ ఎంపిక చేయడంతో.. ఈ సారి శివభరత్‌రెడ్డికి టికెట్ ఇస్తే.. వల్లభనేని వంశీని మోసం చేసినట్లు అందరికీ క్లియర్‌కట్‌గా అర్థమైపోతుందని..  అందుకే మద్యే మార్గంగా దుట్టా రామచంద్రరావుని గన్నవరం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపనున్నారన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. అంతేకాకుండా గెలిపించిన పార్టీపై రాళ్లు వేసి..  జగన్‌ని మనసా వాచా కర్మణా నమ్మి వెళ్లిన వల్లభనేని వంశీని  జగన్ నిలువునా ముంచేసేలా ఉన్నారని వంశీ అనుచరులు సైతం ఆందోళన చెందుతున్నారు. 

ఎన్టీఆర్ వందరూపాయల వెండి నాణెం విడుదల

శక పురుషుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం విడుదల  అయ్యింది. సోమవారం (ఆగస్టు 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. విశ్వ విఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వంద రూపాయల వెండి నాణెం ఆవిష్కరణ  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ గర్వకారణం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ పెదవాడి అన్నంగిన్నెగా మారిన ఎన్టీఆర్ తెలుగు ప్రజలకే కాదు.. రాజకీయాలతో కొద్ద పాటి పరిచయం ఉన్న ప్రతి వారికీ చిరపరిచితమైన పేరు.  సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు ఎన్టీఆర్.   ఒక సినిమా హీరోగా ఆయన తాను  జీవించిన  పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.   రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.  రాముడు ఎలా ఉంటాడాంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. లక్షలాది మందికి చిరస్మరణీయుడు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఓ తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  ఆ నాణేన్ని ఈ రోజు విడుదల చేసింది. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదలకు  ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గత ఏడాది  జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపిన సంగతి విదితమే. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ ను విడుదల అయ్యింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో  ఎన్టీర్ బోమ్మతో ఉన్న వందరూపాయల నాణెం విడుదల రాష్ట్రపతి ముర్ము విడుదల చేశారు.   ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయనతో పరిచయం ఉన్న వారు, సన్నిహితులు, రాజకీయ వేత్తలు ఇలా దాదాపు 300 మందికి పైగా ఆహ్వానితులు హాజరు అయ్యారు.  https://www.youtube.com/watch?v=vld5EfjuKUk