హస్తినకు చంద్రబాబు.. ఎందుకో తెలుసా?
posted on Aug 23, 2023 @ 3:15PM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఆయన ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం... ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఓటర్ల జాబితా నుంచి ప్రతిపక్ష టీడీపీ సానుభూతి పరుల ఓట్లను భారీగా తొలగించడమే కాకుండా.. దొంగ ఓట్లను సైతం అత్యధిక సంఖ్యలో ఓటర్ల జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిసి ఈ అంశాన్ని వివరించనున్నారు.
అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎంకే మీనాను ఢిల్లీకి పిలుపించుకొని.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొంటున్న అవకతవకలపై వివరణ కోరడం.. వాటిని సాధ్యమైనంత త్వరగా సరి చేయాలని.. ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. కానీ ఆ ఆదేశాల అమలు మాత్రం రాష్ట్రంలో నత్తనడకతో పోటీ పడుతున్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆ సంగతిని కూడా చంద్రబాబు.. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా అధికార జగన్ పార్టీ పావులు కదుపుతోంది. ఆ క్రమంలో.. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో ఓటర్లను తొలగించి ఆ స్థానంలో దొంగ ఓట్లను చేర్చిందనే ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న వ్యవహరాన్ని.. స్థానిక శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్.. కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాదారాలతో సహా ఫిర్యాదు చేయడంతో.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి.. ఓటర్ల జాబితాలో అవకతవకలు నిజమేనని నిర్ధారించుకొని.. అందుకు సంబంధించి పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం.. ఆ క్రమంలో సదరు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే.
ఇంకోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఓటర్ల జాబితాను దొంగ ఓటర్లతో నింపేస్తున్నారని.. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు స్పందించడం లేదని.. సదరు అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.
ఓ వైపు ఎన్నికలకు అట్టే సమయం లేదు... మరోవైపు మళ్లీ వరుసగా రెండో సారి అధికారంలోకి రావడం కోసం.. ఈ తరహా అరాచకానికి జగన్ పార్టీ తెర తీసిందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో జీరో హౌస్ నెంబర్లతో.. లక్షలాది ఓటర్ల పేర్లుతో జాబితాలు సైతం ఇప్పటికే సిద్దం చేసినట్లు పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే హల్ చల్ చేస్తోంది.