కవిత మాటల మర్మంమేటి? కామారెడ్డి మతలబేంటి?
posted on Aug 23, 2023 @ 12:58PM
రోగం ఒకటైతే మందు మరొకటి అన్నట్లుగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీరు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గజ్వేల్ లో ఓటమి భయంతోనే ఆయన సేఫ్ సైడ్ గా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నారని విపక్షాలు అంటుంటే.. సొంత పార్టీలోని అసమ్మతి నేతలు, నిరాశ చెందిన ఆశావహులు మాత్రం తన కుమార్తె కల్వకుంట్ల కవిత కోసమే ఆయన కామారెడ్డిని కూడా ఎంచుకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు.
రెండు స్థానాలలోనూ విజయం సాధించి.. ఆ తరువాత కామారెడ్డి స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో కవితకు టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలన్న వ్యూహం కేసీఆర్ ది అని అంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం లక్ష్యంగా కసరత్తులు ప్రారంభించేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, అసమ్మతి వంటి అంశాలను అధిగమించడానికి తనదైన శైలిలో వ్యూహాలు రూపొందిస్తున్నారు. అన్నిటికీ మించి మిగిలిన రాజకీయ ప్రత్యర్థుల కంటే ముందుగానే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేశారు. అలా ప్రకటించి తాంబూలాలిచ్చేశాను ఇక తన్నుకు చావండి అన్నట్లుగా పార్టీలోని అసమ్మతికి ఆయన టార్గెట్ నిర్దేశించేశారు. అసమ్మతి ఏమైనా భగ్గు మంటే రోజుల వ్యవధిలో అది పార్టీపై చూపే ప్రభావాన్ని తగ్గించేయవచ్చన్నది ఆయన వ్యూహంలా కనిపిస్తోంది.
అలాగే జాబితా అనంతరం పార్టీలో ఉండేవారెవరు? వెళ్లే వారెవరు అన్నది తేలిపోతే ఇక ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే జాబితాలో పేరుండి కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్న మైనంపల్లిని ఎలా డీల్ చేయాలన్న విషయంలో ఆయన తొలుత ఉదారంగా వ్యవహరించినా.. రోజులు గడిచే కొద్దీ కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. బుధవారం (ఆగస్టు 23) ఆమె మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అయితే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న నిర్ణయం తనకోసమే అంటూ వస్తున్న విమర్శలకు ఆమె ఇసుమంతైనాన స్పందించలేదు.
అలసా విషయమే తనకు తెలియనట్లుగా పూర్తిగా నాన్ సింక్ ఇష్యూ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పార్టీలను చెరిగి పారేశారు. నెహ్రూ నుంచి మొదలు పెట్టి మోడీ వరకూ అందరిపైనా విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని తాను టేకప్ చేస్తాననీ, ఈ విషయంలో అన్ని పార్టీలనూ కలుపుకుని పోవడానికి ప్రయత్నిస్తానని వెల్లడించారు. ఆమె మాటలు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ అంశాన్ని డైవర్ట్ చేసి డైల్యూట్ చేయడమే లక్ష్యంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మహిళలకు సరైన ప్రాతినిథ్యం లేదంటూ వస్తున్న విమర్శలపై ఆమె మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అంశం పూర్తిగా తన సొంత అంశమన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలకు చట్ట సభలలో సరైన ప్రాతినిథ్యం లేకపోవడం దారుణమని పునరుద్ఘాటించిన కవిత.. దేశ వ్యాప్తంగా 14 లక్షల పైచిలుకు మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారన్నారు.
కానీ పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా వుందన్నారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో మహిళలకు సముచిత స్థానం దక్కలేదన్న విమర్శలకు ఆమె బదులిస్తూ కేసీఆర్ ను సమర్ధించారు. నెహ్రూ కేబినెట్ లో ఒకే ఒక్క మహిళలకు స్థానం ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే ప్రస్తుత మోడీ కేబినెట్ లో నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ మాత్రమే ఉన్నారని ఎత్తి చూపారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవని విమర్శించారు. 1996 లో తొలిసారి దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. 2010 లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందన్నారు. కానీ ఇప్పటి వరకూ ఆ బిల్లుకు మోక్షం కలగకపోవడానికి కారణమెవరని నిలదీశారు.
దశాబ్ద కాలంగా లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నా.. మహిళా రిజర్వేషన్ బిల్లు ను పాస్ చేయకుండా మోడీని అడ్డుకున్నదెవరని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో డిసెంబర్ లో ధర్నా చేస్తానని తెలిపారు. సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీకి, బీజేపీ మహిళా నేతలకు ఆహ్వానాలు పంపుతామన్నారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకి పడుతుంది అన్న ఎంపీ ఆరవింద్ వ్యాఖ్యలతో ఈవీఎంలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానం వాస్తవమేనని అనిపిస్తోందని కవిత అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.