ఎన్టీఆర్ వందరూపాయల వెండి నాణెం విడుదల

శక పురుషుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం విడుదల  అయ్యింది. సోమవారం (ఆగస్టు 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. విశ్వ విఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వంద రూపాయల వెండి నాణెం ఆవిష్కరణ  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ గర్వకారణం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ పెదవాడి అన్నంగిన్నెగా మారిన ఎన్టీఆర్ తెలుగు ప్రజలకే కాదు.. రాజకీయాలతో కొద్ద పాటి పరిచయం ఉన్న ప్రతి వారికీ చిరపరిచితమైన పేరు.  సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు ఎన్టీఆర్.   ఒక సినిమా హీరోగా ఆయన తాను  జీవించిన  పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.   రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.  రాముడు ఎలా ఉంటాడాంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. లక్షలాది మందికి చిరస్మరణీయుడు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఓ తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  ఆ నాణేన్ని ఈ రోజు విడుదల చేసింది. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదలకు  ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గత ఏడాది  జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపిన సంగతి విదితమే. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ ను విడుదల అయ్యింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో  ఎన్టీర్ బోమ్మతో ఉన్న వందరూపాయల నాణెం విడుదల రాష్ట్రపతి ముర్ము విడుదల చేశారు.   ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయనతో పరిచయం ఉన్న వారు, సన్నిహితులు, రాజకీయ వేత్తలు ఇలా దాదాపు 300 మందికి పైగా ఆహ్వానితులు హాజరు అయ్యారు.  https://www.youtube.com/watch?v=vld5EfjuKUk

నాస్తికుడిని కాదు.. పరమభక్తుడిని: భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి  చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌ పదవిలో కొనసాగిన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఆలా ముగియగానే అలా  అయన స్థానంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేసేసి నియమించేశారు. వాస్తవానికి గతంలో వైవీ నియామకం విషయంలో చెలరేగిన దుమారం, నేపధ్యంలో ఈసారి అయినా, హిందూ ధర్మం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్న వారికి, టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.  భూమన గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు. ఇప్పుడు   జగన్ రెడ్డి మరో మారు ఆయనకు ఆవకాశం కల్పించారు.   టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సిద్ధ రాఘవరావు పేర్లు కూడా వినిపించాయి. చివరకు  భూమనను ఆ పదవి వరించింది. అయితే అదేమీ పాపమో, అదెక్కడి శాపమో కానీ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2006 నుంచి 2008 వరకు) టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్నప్పుడే భూమనపై అనేక ఆరోపణలొచ్చాయి... నిజ నిజాలు ఏమో కానీ, ఏడుకొండల పవిత్రతను రెండు కొండలకు కుదించాలనే  దివ్యమైన  సంకల్పం భూమన కరుణాకర రెడ్డిదే అంటారు. అలాగే, మిగిలిన్ ఐదు కొండలపై చర్చిలు నిర్మించాలనే  సంకల్పం విషయంలోనూ భూమన భూమిక ఉందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే భూమన పై టీటీడీ నిధుల దుర్వినియోగం, వంటి  ఆరోపణలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి ఈరోజు... జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, బాబాయ్ టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి కొండపై యధేచ్చగా సాగుతున్న అన్యమత ప్రచారం, ఆస్తులు విక్రయం, నిధుల కైంకర్యం, తిరుమల  ఆధ్యాత్మిక స్థాయిని దిగజార్చి, వ్యాపార కేంద్రంగా మార్చేందుకు సాగుతున్న ప్రయత్నాల వంటి అనేక ఆకృత్యాలకు  భూమన కరుణాకర రెడ్డి ఆద్యుడనే అరోపణలున్నాయి. అందుకే ఇప్పడు కూడా ప్రతిపక్షాలతో పాటు   హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు కరుణాకర రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఈ అన్నిటినీ మించి, ఆయనపై అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ వినిపించే ప్రధాన ఆరోపణ, ఆయన నాస్తికుడు.    వెంకన్న స్వామినే కాదు, అసలు దేవుడినే నమ్మని వ్యక్తి గా  భూమన చెప్పుకుంటారు. కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకన్న దేవుడు, భూమన వారి దృష్టిలో కేవలం ఓ  నల్ల రాయి . అవును ఆయనే స్వయంగా ఈ మాట అన్నారు. అంతే కాదు,  మండే ఎండలో అయినా చెప్పులు లేకుండా కాలినడకన కొండనెక్కే భక్తులనూ  అవహేళన చేసిన చరిత్ర భూమనకుందని ఆయన ఒకప్పటి మిత్రులు ఇప్పుడు సోషల్ మీడియాలో  పాత  సంగతులను   గుర్తు చేస్తున్నారు.  అలాగే, సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ  మాజీ ప్రధాన కార్యదర్శి, ఐవైఆర్ కృష్ణా రావు మొదలు అనేక మంది భూమన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.  భూమన నియామకం వెనక  రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సేవా కార్యక్రమల పేరిట టీటీడీ నిధులను దారి మళ్ళించి పందారం చేసిన విధంగా, రేపటి ఎన్నికలలో గెలిచేందుకు టీటీడీ నిధులను  సేవ  పేరున పందారం చేసే కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. మరో వంక   స్వామీ నీ కొద్దీ అన్యమత నాస్తిక చైర్మన్  యాష్ ట్యాగ్ తో భూమన నియామకానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భక్తులు తమ మొర నేరుగా స్వామి వారికే వినిపించుకుంటున్నారు. అలాగే శాపనార్ధాలు పెడుతున్నారు.  కాగా ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనదైన స్టైల్ లో స్పందించి సమాధానమిచ్చారు.  తిరుపతిలో రచయిత భుమాన్ రాసిన 'మూడు తరాల మనిషి భూమన్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.    తాను నాస్తికుడిని కానని చెప్పుకున్నారు.  17 ఏళ్ల క్రితమే  భక్తి శ్రద్ధతతో టీటీడీ చైర్మన్ బాధ్యతలను నిర్వర్తించి స్వామి వారి దయకు పాత్రుడనయ్యానని చెప్పారు.  

టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా దేశ్ పాండే ప్రమాణం

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఆర్వీ దేశ్ పాండే ప్రమాణ స్వీకారం చేశారు.  టీటీడీ పాలక మండలి సభ్యులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం( ఆగస్టు 25)  రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 24 మందిలో కొత్తగా 18 మంది కొత్త సభ్యులు నియమితులు కాగా,  ఆరుగురు పాతవారినే కొనసాగించింది. ఈ నూతన పాలక మండలిలో మహారాష్ట్ర నుంచి ముగ్గురిని తీసుకోగా.. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఇద్దరికి  అవకాశం దక్కింది. వీరిలో కర్నాటక నుంచి క  దేశ్ పాండేకు అవకాశం కల్పించింది.

గన్నవరంపై వైసీపీ ఆశలు వదిలేసుకున్నట్లేనా?

నడమంత్రపు సిరి ఎక్కువ కాలం నిలవదనే సామెత అందరికీ తెలిసిందే. అదే రాజకీయాలలో అయితే అనుకోకుండా కలిసి వచ్చిన నాయకత్వ అవకాశం కూడా ఎక్కువ కాలం నిలవదు. ఈ మాట గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సరిగ్గా సరిపోతుంది. వంశీ ఏమీ విద్యార్థి స్థాయి నుండి ఎదిగిన నేత కాదు.. వాళ్ళ కుటుంబం కూడా రాజకీయాలలో ఉన్న దాఖలాలు లేవు. కానీ, దివంగత నేత పరిటాల రవి పుణ్యమా అని.. హీరో నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులతో ఈజీగా తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. స్వతహాగా తెలివితో పాటు కొంత ఆర్ధిక పుష్టి కూడా ఉండడం.. యువకుడు కావడంతో పార్టీ అధినాయకత్వం కూడా ఎంకరేజ్ చేసింది. కానీ, ఉన్న తెలివికి తోడు రాజకీయంగా కలిసి రావడంతో ఆ తెలివి కాస్త అతి తెలివిగా మారింది. రాజకీయంగా ఓనమాలు నేర్పిన పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని నోటికి వచ్చినట్లు దూషిస్తూ తానే హీరో అనుకుని చెలరేగిపోయారు. ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఆ పార్టీ బీఫామ్ కారణమే సంగతి మరచి ఆ పార్టీ పెద్దలను వ్యక్తిగతంగా కూడా తూలనాడారు.  ప్రస్తుతం అనధికారకంగానైనా వైసీపీ ఎమ్మెల్యేగా  ఉన్న వంశీ.. వచ్చే ఎన్నికలలో అదే గన్నవరం నుండి వైసీపీ  అభ్యర్థిగా పోటీ చేయడం కూడా దాదాపు ఖాయమే. ఇంతవరకూ వంశీకి బాగానే కలిసి వచ్చినా ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అనే చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన స్థానికంగా ప్రదర్శించిన దూకుడే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్ధకంగా మారినట్లు కనిపిస్తుంది. గతంలో 2014, 2019 ఎన్నికలలో టీడీపీ నుండి గెలిచిన వంశీ స్థానిక వైసీపీ నేతలపై తీవ్రమైన దూకుడు ప్రదర్శించారు. అడ్డు తగిలిన వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం.. అనుచరులతో బెదిరించడం వంటి చేష్టలకు పాల్పడ్డారని ఇప్పుడు ఆయనున్న పార్టీ వైసీపీ కార్యకర్తలే బహిరంగంగా చెప్తున్నారు. అప్పట్లో  తెలుగుదేశం అధినాయకులు మందలించినా ఖాతరు చేసేవారు కాదన్న ప్రచారం కూడా ఉంది. అప్పుడు వంశీ వేధింపుల బాధితులైన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు గన్నవరంలో ఆయన నాయకత్వాన్ని సహించలేకపోతున్నారట. ఇప్పటికే ఇక్కడ వైసీపీ ఇంచార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన యార్లగడ్డతో గత ఎన్నికలలో భారీగా ఖర్చు పెట్టించిన వైసీపీ ఇప్పుడు వంశీని చేర్చుకొని యార్లగడ్డను ముంచేసింది. ఈ క్రమంలోనే అతను టీడీపీలో చేరిపోయారు. అంతకు ముందు 2014 ఎన్నికలలో వంశీపై పోటీ చేసిన వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు కూడా ఇప్పుడు వైసీపీని వీడడం ఖాయంగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతున్నది. వంశీ నాయకత్వంలో పనిచేసేందుకు వైసీపీ కార్యకర్తలెవరూ ఇష్టపడడం లేదని దుట్టా బహిరంగంగా, బాహాటంగా చెప్తున్నారు. దుట్టా కూడా పార్టీని వీడితే నష్టమని భావించిన వైసీపీ అధిష్టానం మచిలీపట్నం ఎంపీ   బాలశౌరిని రాయబారానికి పంపింది. దుట్టా ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన బాలసౌరి.. దుట్టా వైసీపీకి విధేయుడని గన్నవరంలో పార్టీ విజయానికి పని చేస్తారని చెప్పుకొచ్చారు.  కానీ భేటీ అనంతరం దుట్టా రామచంద్రరావు మాత్రం మరోలా మాట్లాడారు. మూడు నెలల క్రితమే సీఎం జగన్ తనను పిలిచి నియోజకవర్గ పరిస్థితి గురించి అడిగారని.. అప్పుడే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా సీఎంకు చెప్పానని.. ఈరోజు కూడా బాలశౌరితో అదే విషయాలు చెప్పానని అన్నారు. వంశీతో కలిసి పనిచేస్తానని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కాస్త ముందో వెనకో ఆయన కూడా పార్టీని వీడడం ఖాయం అనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ వైసీపీలోనే ఉన్నా వంశీ కోసం పనిచేయరన్నది మాత్రం స్పష్టమైపోయిందని చెబుతున్నారు. అలాగే పార్టీలో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నేతలు కొందరు యార్లగడ్డతో వెళ్లిపోగా.. ఉన్న వారు వంశీ కోసం పనిచేసే పరిస్థితిలో లేరు. దీంతో ఇప్పుడు వంశీతో ఆయనతో పాటు టీడీపీ నుండి వచ్చిన వారే కనిపిస్తున్నారు. గత ఎన్నికలలో 838 ఓట్లతో గెలిచి బయటపడిన వంశీ ఈసారి వ్యక్తిగత వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడైతే గెలవడం అసంభవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆసుపత్రికి వైసీపీ రంగులు.. వైసీపీ పిచ్చికి పరాకాష్ట!

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. గుడి.. బడి, చెట్టు.. పుట్ట, ప్రాణం పొసే ఆసుపత్రి.. చివరి మజిలీ స్మశానం, కుప్ప తొట్టె.. సెప్టిక్ ట్యాంక్, కరెంట్ స్థంభం.. బోరింగ్ పంపు సెట్టు కాదేదీ వైసీపీ రంగులకనర్హం అన్నట్లుగా చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే దేవాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రులకు, విద్యుత్ స్తంభాలకు, కరెంట్ వైర్లకు, స్మశానంలో సమాధులకు, పశువుల ఆసుపత్రిలో బోనులకు, పబ్లిక్ టాయిలెట్స్ ను సైతం వదలకుండా అన్నిటికీ వైసీపీ రంగులేశారు. గతంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి పార్టీ జెండా రంగులు వేసి చివాట్లు తిన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే చిక్కీల ప్యాకెట్‌ కవర్ ను పార్టీ జెండా రంగుతో పులిమేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు.  గడచిన నాలుగేళ్ళలో వైసీపీ పాలన అంతా విగ్రహాలు, రంగుల చుట్టూనే తిరుగుతుంది. ప్రభుత్వ కార్యాయాలయాల దగ్గర్నుంచి, యూనివర్సిటీల పేరు మార్పు వరకూ.. విగ్రహాల దగ్గర్నుంచి, నిగ్రహం కోల్పోయి బూతులు మాట్లాడడం వరకూ వైసీపీ నేతలు పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. ఈ రంగుల పిచ్చి ఏంటని ఇప్పటికే పదులసార్లు కోర్టు చేత మొట్టికాయలు వేయించుకుని తల బొప్పి కడుతున్నా.. వైసీపీ నేతల తీరుమాత్రం మారడం లేదు. ఇంకా చెప్పాలంటే మీకు పిచ్చి పట్టిందిరా నాయనా ఎక్కడికైనా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని.. ప్రతిపక్షాలు, సామాన్యులు గగ్గోలు పెడుతున్నా.. నవ్వి పోదురు నాకేంటి అనేలా ఉంది వైసీపీ నేతల వ్యవహారం. చేసింది.. చేసేది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువ.. పావలా కోడికి ముప్పావల మసాలా నూరినట్లుంది వైసీపీ నేతల ప్రచార పిచ్చి. గతంలో ఇలాంటి రంగుల పిచ్చి ఘటనలను చాలానే చూడగా ఇప్పుడు మరోసారి తమ పిచ్చి పరాకాష్టకు చేరిందని నిరూపించుకున్నారు వైసీపీ నేతలు. సీఎం సొంత జిల్లా కడప జిల్లా పోరుమామిళ్లలో ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో ఇక్కడ 30 పడకల ఆసుపత్రిగా ఉండగా.. తాజాగా దానిని 50 పడకలుగా అప్ గ్రేడ్ చేశారు. దీని అభివృద్ధికి పెట్టిందేమో కొంచమే కానీ.. ఆసుపత్రికి వైసీపీ రంగులేసేందుకు మాత్రం భారీగా ఖర్చు పెట్టేశారు. కేవలం 20 పడకలు పెంచేసి ఆసుపత్రిని వైసీపీ కార్యాలయం మాదిరిగా రంగులేసుకున్నారు. దీనిపై ఇప్పుడు తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇలాగే పంచాయతీ కార్యాలయాలకు, పాఠశాలలకు, ప్రభుత్వ వాహనాలకు, చివరకు చెత్తను తరలించే వాహనాలకు కూడా వైసీపీ రంగులను వేయడం తీవ్ర వివాదాస్పదమయ్యింది.  వైసీపీ రంగుల పిచ్చితో అప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మేధావులు కోర్టులను ఆశ్రయించగా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టారు. చివరికి కోర్టు ఆదేశాలతో ఆ రంగులను తొలగించాల్సి వచ్చింది. జగన్ సర్కార్ తీరుతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదంతా ప్రజల సొమ్మే. ఇప్పుడు కూడా ఆసుపత్రికి వైసీపీ రంగులేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలే వైరల్ అవుతున్నాయి. అయినా సరే అధికారుల్లో ఎటువంటి చలనం లేకుండా పోయింది. మళ్ళీ దీనికి కూడా ఆ కోర్టులే కల్పించుకొని ఆదేశాలిస్తే తప్ప ఈ ప్రభుత్వంలో చలనం ఉండదేమో. ప్రజల సొమ్ముతో పార్టీ రంగులు వేసుకోవడం.. కోర్టుతో చీవాట్లు తిని మళ్ళీ ఆ ప్రజల సొమ్ముతోనే వాటిని తొలగించడం.. బహుశా ఇలాంటి ముఖ్యమంత్రిని తెలుగు రాష్ట్రాల ప్రజలు గతంలో ఎన్నడూ చూసి ఉండరేమో!

వైసీపీ బస్సుయాత్ర.. మరో పరాభవం తప్పదా?

ఏపీలో వైసీపీకి ఉక్కపోత మొదలైంది. ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది. కుంటుపడిన అభివృద్ధి, నెరవేరని హామీలు, కక్ష పూరిత రాజకీయాలు, పన్నుల బాదుడు, పెరిగిన ధరలు, భూ కబ్జాలు, నేతల రౌడీయిజం, ఎదిరించిన వారిపై బెదిరింపులు ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ఇప్పుడు ప్రజలలో వైసీపీ నేతలు పలుచన అయిపోయారు. ప్రశాంతంగా జీవనం సాగించాల్సిన ప్రజలు శాంతిభద్రల లేమితో బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన రావడం, అభివృద్ధి కుంటుపడి  ఉపాధి కరవై వలసలు అనివార్యం కావడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు తమకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో ప్రజలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లేందుకు మొహం చాటేస్తున్నారు. నాలుగేళ్ళలో చేసిందేంటని ప్రజలు నిలదీస్తుండడంతో వైసీపీ నేతలు సహనం కోల్పోతున్నారు. దీంతో కొందరు వైసీపీ నేతలు ప్రజలపై చిందులేయడంతో ప్రజలు వెనకా ముందు లేకుండా కడిగిపారేస్తున్నారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గడపగడపకు ప్రభుత్వం, ఏపీ నీడ్స్ జగన్ లాంటి కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికీ ఈ కార్యక్రమాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయితే, పలు చోట్ల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు మొహం చాటేశారు. ప్రజల ఆగ్రహాన్ని చవిచూసిన నేతలు ఏదో మొక్కుబడిగా ఈ కార్యక్రమాలను మమా అనిపించేశారు. కాగా, ఇప్పుడు సీఎం జగన్ మరో కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. పాజిటివ్ నెగటివ్ ప్రజల నుండి ఎలాంటి స్పందన  వచ్చినా  ఇందుకోసం వంద రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ బస్సు యాత్రగా దీన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తున్నది.  వైసీపీ ఈ వంద రోజుల బస్సు యాత్రను ఏ జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షుల అధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంచార్జిలు అందరూ పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. బస్సుయాత్ర ద్వారా అందరు వైసీపీ నేతలు నియోజకవర్గాలను చుట్టేసి అన్ని వర్గాలను కలవాలన్నది ఆలోచన. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను దగ్గర నుండి ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారాలను కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం నుండి వంద రోజుల పాటు నేతలంతా ప్రజలలో ఉండాలని.. ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన నిర్ణయాలకు వెనకబడబోమని వైసీపీ పెద్దల నుండి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తున్నది. ప్రజల స్పందనను కూడా ముందే ఊహించిన కార్యక్రమ రూపకర్తలు.. ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చినా కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరాల్సిందేనని డిసైడ్ చేశారట. అయితే, ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ నేతలకు మరో సినిమా తప్పదా అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాలలో  వ్యక్తమౌతున్నాయి. కేవలం ప్రజల నుండి మాత్రమే కాదు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నేతలలో కూడా కొందరు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంక్షేమ పథకాల పేరిట ఎవరితో ఎలాంటి అవసరం లేకుండా బటన్ నొక్కి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుండగా.. అభివృద్ధి పనులపై ప్రజల నుండి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని.. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనులు కావడం లేదని, చేసిన పనులకు కూడా బిల్లులు రాక తీవ్రంగా నష్టపోయామని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులలో వారి వద్దకు వెళ్తే స్పందన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  మరోవైపు ఈ బస్సు యాత్ర జిల్లా అధ్యక్షుల చేతుల మీదగా జరగాలని ఆదేశించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులతో పాత నేతలకు ఇంకా సమన్వయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షులు పెత్తనం చెలాయించడం పాత నేతలు ఎలా తీసుకుంటారన్నది పలు అనుమానాలకు తావిస్తుంది. పలు ప్రభుత్వ వర్గాలలో కూడా ప్రభుత్వంపై పీకల వరకు కోపం దాగి ఉంది. నిధుల కొరతతో బిల్లులు రాక.. స్థానిక నేతల నుండి తీవ్ర ఒత్తిళ్లు ఉండగా.. ఇప్పుడు అక్కడిక్కడే ఎమ్మెల్యేలు సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలివ్వనున్న నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ప్రశ్నార్ధకమే. మొత్తంగా చూస్తే ఘోర విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్తే ఏమవుతుందన్నది ఆసక్తికరంగా కనిపిస్తుంది.

టీటీడీ పాలక మండలిలో కూడా ఐదుగురు వారే?!

విపక్షంలో ఉండగా వైసీపీ తరచూ చేసిన ఆరోపణ, విమర్శ ఏమిటంటే... ప్రభుత్వంలో, ప్రభుత్వ పదవులలో, నామినేడెట్ పోస్టులలో, కీలక ఆధికారులలో అత్యధికులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని నియమిస్తున్నారు. మిగిలిన సామాజిక వర్గాల వారికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు అంటూ నాడు ఊరూవాడా ఏకం చేసిన వైసీపీ.. అప్పట్లో ఏ సమాజిక వర్గం వారు ఏయే పోస్టులలో ఉన్నారు.. ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తోంది అంటూ వివరాలతో సహా ప్రభుత్వం ప్రకటించినా పట్టించుకోలేదు. సరే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్నది ఏమిటి?  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతనంగా ఏర్పాటైన బోర్డు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ బోర్డు సభ్యులను సుధీర్ఘ చర్చోప చర్చల అనంతరం, అర్హులైన అభ్యర్ధుల సామాజిక స్థితిగతులను బట్టీ, వారి పరపతిని బట్టీ ఎంపిక చేస్తుంటారు. అలాంటిది ఈసారి బోర్డు సభ్యుల జాబితాలో ఇద్దరు నేర చరిత్ర ఉన్న వారిని ఎంపిక చేయడం విస్మయానికి గురి చేసింది. సర్వత్రా విమర్శలకు తావిచ్చింది ఇప్పటికే కొన్నాళ్ళు జైలు జీవితాన్ని గడిపిన వారు.. నేరాన్ని అంగీకరించిన వారు.. బెయిల్ పై ఉన్నవారికి టీడీపీ పదవులు కట్టబెట్టడంతో హిందూ ధార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వ తీరును ఏకి పారేస్తున్నాయి.  టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక  టీటీడీ పాలకమండలిలో   సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సొంత సామజిక వర్గానికి పెద్ద పీట వేయడం విశేషం. తాజాగా టీటీడీ ప్రకటించిన పాలకమండలి జాబితాలో 24 మంది సభ్యులు ఉండగా అందులో ఐదుగురు రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఆర్. వెంకట సుబ్బారెడ్డి, వై. సీతారామిరెడ్డి, పి. శరత్ చంద్రారెడ్డి, తెలంగాణ ఎంపీ రంజిత్ కుమార్ సతీమణి సీతా రంజిత్ రెడ్డి, సామూల రామ్ రెడ్డి, ఎస్సార్ విశ్వనాథరెడ్డి టీటీడీ పాలక మండలిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. వీరిలో బెంగళూరులో సీఎం జగన్ బంగ్లా ఉన్న యలహంక ప్రాంత ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాధ్ రెడ్డి ఇప్పటికే టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ఉండగా.. ఇప్పుడు మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం విశేషం.  ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా గత నాలుగేళ్లుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు.. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పదవిని అప్పగించింది. తిరుమల కొండపైన చైర్మన్ తర్వాత కీలక పదవులైన.. ఈవో, జేఈవోలు కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారే. ఇప్పుడు 24 మంది సభ్యులలో ఐదుగురు సభ్యులను కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే అప్పగించారు. మరోవైపు తిరుపతి కొండ కింద తిరుపతి పట్టణం, తిరుపతి రూరల్ లో కూడా ఆ సామాజికవర్గం వారికే పదవులు కట్టబెట్టారు. జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటివరకు తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవిలో ఉండగా.. ఈ మధ్యనే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఆ పదవి అప్పగించారు. తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు, తిరుపతి ఆర్డీవో, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఇలా ఎక్కడ చూసినా కీలక ఉన్నత పదవులలో ఆ సామాజికవర్గం వారే కనిపిస్తున్నారు.  నిజానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కీలక పదవులు, ఉన్నతాధికారులు, నామినేటెడ్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల సలహాదారులు ఇలా ఎక్కడ చూసినా ఆ సామజిక వర్గానికి చెందిన వారి పేర్లే వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ఏ మాత్రం పట్టించుకోని జగన్.. రెడ్డి సామజిక వర్గానికే పదవులలో పెద్ద పీఠ వేస్తూనే ఉన్నారు. ఎవరు ఎన్ని అన్నా.. ఎంతగా దుమ్మెత్తి పోసినా ప్రభుత్వంలో ఎలాంటి బెరుకూ కనిపించడం లేదు. జవాబుదారీతనం ఇసుమంతైనా కనిపించడం లేదు. 

టీటీడీ పాలకమండలా నిందితుల పునరావాస కేంద్రమా?

తెలిసే చేస్తున్నారో లేక కావాలనే కించపరిచేలా చేస్తున్నారో.. ప్రజలంటే చేతకాని వారికింద జమకట్టేసి పెత్తనం చెలాయిస్తున్నారో కానీ కలియుగ   దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం విషయంలో ఏపీ ప్రభుత్వం లెక్కలేని తనంగా నిర్ణయాలను తీసుకుంటున్నది. తాజాగా టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియగానే ఆ స్థానంలో భూమన కరణాకర రెడ్డిని కూర్చోబెట్టారు. ఈ సేవా పదవి కోసం ఎంతో మంది పడిగాపులు కాస్తుండగా భూమనకు రెండోసారి ఈ పదవిని కట్టబెట్టారు. ఈ నియామకం తీవ్ర వివాదాస్పదం అయింది.  నాస్తికుడైన భూమనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తాయి. అదలా ఉండగానే భక్తులపై చిరుతల దాడులు, నడక మార్గంలో వన్య ప్రాణుల సంచారం, భక్తుల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తగా.. కాలినడకన వెళ్లే భక్తులకు ఊత కర్రలు ఇచ్చి క్రూర మృగాలను తరమడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. అదలా ఉండగానే ఇప్పుడు టీటీడీ పాలక మండలి సభ్యులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం( ఆగస్టు 25)  రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 24 మందిలో కొత్తగా 18 మంది కొత్త సభ్యులు నియమితులు కాగా,  ఆరుగురు పాతవారినే కొనసాగించింది. ఈ నూతన పాలక మండలిలో మహారాష్ట్ర నుంచి ముగ్గురిని తీసుకోగా.. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఇద్దరికి  అవకాశం దక్కింది. ఈ బోర్డులో ఎమ్మెల్యే కోటాలో పోన్నాడ సతీష్, సామినేని ఉదయభాను, తిప్పేస్వామికి అవకాశం దక్కగా.. తెలంగాణ నుంచి శరత్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ రంజీత్ కుమార్ సతీమణి సీతారెడ్డికి చోటు దక్కింది. కడప నుంచి మాసీమ బాబు, యానదయ్య, కర్నూలు నుంచి సీతారామిరెడ్డి, గోదావరి జిల్లా నుండి సుబ్బారాజు, సిద్దారాఘరావు కుమారుడు సుధీర్, అనంతపురం నుంచి అశ్వథామ నాయక్ పేర్లు ఉన్నాయి. మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్, తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండేకు అవకాశం కల్పించారు.  అయితే, జగన్ సర్కార్ ప్రకటించిన ఈ నూతన పాలక మండలిలో ఇద్దరికి అవకాశం ఇవ్వడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. వారిలో ఒకరు డిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టై, అప్రూవర్‌గా మారి బెయిలుపై వచ్చిన శరత్‌చంద్రారెడ్డి, మరొకరు 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడి అరెస్టై ఉద్వాసనకు గురైన  యూరాలజిస్ట్ డాక్టర్ కేతన్ దేశాయ్. వీరిరువురినీ టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడంతో టీటీడీ దొరికిపోయిన దొంగలకు పునరావాస కేంద్రంగా మారిందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితుడైన శరత్ చంద్రరెడ్డి లిక్కర్ స్కాంలో అరెస్టైన సైంగతి తెలిసిందే. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రరెడ్డి వైసీపీ ఎంపీ విజసాయిరెడ్డి అల్లుడి సోదరుడు.  ఢిల్లీ లిక్కర్ కేసులో  అరెస్టై, ఈ తరువాత అప్రూవర్ గా మారడంతో బెయిలు లభించి బయటకు వచ్చారు.   ఇక పోతే వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ పూర్తిగా శరత్ చంద్రారెడ్డి చేతుల్లోకి వెళ్లగా అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ఆ తర్వాత కూడా శరత్ చంద్రారెడ్డి వ్యాపార సంస్థ అయిన అరబిందోకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కట్టబెట్టారు. కాగా ఇప్పుడు ఏకంగా అతి పవిత్రమైన టీటీడీ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరుగా కూడా నియమించారు. ఏ ప్రాతిపదికన ఈయనను నియమించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కేసులో అప్రూవర్‌గా మారాడమంటే నేరం అంగీకరించినట్లే అర్ధం. అలాంటి నేరస్తుడికి మళ్లీ కోర్డు బెయిల్ రద్దు చేసి జైలుకు పంపిస్తే, స్వామివారి పవిత్రతకు అర్ధం ఏముంటుందని భక్తులు నిలదీస్తున్నారు.  ఇక 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడి అరెస్టై ఉద్వాసనకు గురైన  యూరాలజిస్ట్ డాక్టర్ కేతన్ దేశాయ్ కి కూడా వైసీపీ ముఖ్యమంత్రి జగన్  టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఆయనపై నేరారోపణలు ఉన్నాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారు. అయినా డాక్టర్ కేతన్ దేశాయ్ కి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం లభించడానికి కారణం ఆయన స్వస్థలం గుజరాత్ కావడమేనా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయన భారీ అవినీతికి పాల్పడ్డారని కేంద్ర దర్యాప్తు సంస్థ  సీబీఐ తేల్చిన కేతన్ దేశాయ్ ని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో చోటు కల్పించడం ఏంటంటూ కొంతమంది ప్రశ్నిస్తుండగా.. తాజాగా ఈ అంశం సోషల్ మీడియాలోనూ చర్చనియాంశమైంది. గుజరాత్‌లో మెడికల్ సీట్ల వ్యవహారంలో.. అక్రమాలకు పాల్పడిన దేశాయ్‌ను వెతికి మరీ టీటీడీ పాలకవర్గంలో నియమించడం సిగ్గుచేటని భక్తులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రాజకీయ నిరుద్యోగులను చట్టసభలకు నామినేట్ చేసినట్లు కళంకితులను తీసుకొచ్చి ఆశ్రయం కల్పించడానికి  టీటీడీని అపవిత్రంగా మార్చేస్తున్నారని జగన్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వైసీపీలో మ్యుజికల్ చైర్స్

ఏపీలో అధికార పార్టీ వైసీపీ పనైపోయిందన్న చర్చ గత కొంత కాలంగా రాజకీయ వర్గాలలో తీవ్రంగా జరుగుతోంది. ఇప్పటికే పలు సర్వేలలో వైసీపీకి ఈసారి ఘోర పరాజయం తప్పదనే విషయం బయటపడగా.. ప్రజలలో తీవ్రంగా కనిపిస్తున్న అసంతృప్తితో పలువురు పరిశీలకులు కూడా ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టేశారు. మాకు తిరుగే లేదని.. మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని మరోసారి అందలం ఎక్కిస్తాయని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం తెగ మధనపడిపోతున్నారు. అంతేకాదు, ప్రజలలో అసంతృప్తిని దారి మళ్లించి మాఫీ అయ్యేలా చేసుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు  చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని నేతల మీదకి మళ్లించి.. ఆయా స్థానాలలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.  తాజాగా మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టు డే  ఓ సర్వే నిర్వహించింది. అయితే, ఈ సర్వేలో వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వే తేల్చింది.  ఈ 15 ఎంపీ సీట్లను కూడా టీడీపీ ఒంటరిగానే సాధించేస్తుందని చెప్పడం మరో విశేషం. అదే సమయంలో వైసీపీ 3-4 సీట్లకే పరిమితమవుతుందని చెప్పగా.. మిగిలిన సీట్లలో హోరా హోరీ పోటీ ఉంటుందని..  రాజకీయ సమీకణాలను బట్టి ఆయా స్థానాలలో ఫలితాలు ఉండనున్నాయని వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. ఇన్నాళ్ళూ పెయిడ్ సర్వేలతో ఏపీ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసిన వైసీపీ అండ్ కో కు ఇండియా టుడే సర్వేతో కాళ్ళ కింద భూమి కదిలినట్లైంది. దీంతో నష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టింది. వైసీపీ ప్రజలలో అసంతృప్తి ఎక్కువగా ఉన్న ఎంపీలను పోటీ నుండి తప్పించేసే పని మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. మరోవైపు వివిధ నియోజకవర్గాల్లో గ్రాఫ్ మెరుగుపడని ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానాల మార్పులో భాగంగా శ్రీకాకుళం ఎంపీగా ధర్మాన సోదరుల్లో ఒకరిని, లేదంటే స్పీకర్ తమ్మినేనిని రంగంలోకి దింపనున్నారట. తనయుడికి ఎమ్మెల్యే సీటు ఇస్తే తమ్మినేని ఎంపీగా పోటీకి వెళ్లడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇక అనకాపల్లి ఎంపీ సత్యవతిని అసెంబ్లీకి పంపి మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాస్ లలో ఒకరిని ఎంపీగా పోటీ చేయించనున్నారట. అలాగే కాకినాడ ఎంపీ వంగవీటి గీతను తప్పించి మాజీమంత్రి కురసాల కన్నబాబు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.  ఇక, అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని పోటీ నుండి తప్పించి ఇక్కడ కూడా ఎవరొకరు ఎమ్మెల్యేను దింపనున్నట్లు తెలుస్తుంది. అమలాపురం ఎంపీగా మంత్రి విశ్వరూప్ పోటీ చేయనుండగా.. బదులుగా ఆయన తనయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా, రామచంద్రాపురంలో మంత్రి వేణు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు మధ్య పంచాయితీ తెలిసిందే. దీనికి పరిష్కారంగా వేణును రాజమండ్రి ఎంపీగా బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఇక నరసాపురం ఎంపీగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీగా మాజీమంత్రి ఆళ్ల నాని, లేదా ప్రముఖ పారిశ్రామికవేత్త అరసవెల్లి అరవింద్, నరసరావుపేట నుండి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును పొన్నూరు ఎమ్మెల్యేగా సీటు ఇచ్చి.. ఇక్కడ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఎంపీగా పోటీకి దించనున్నట్లు తెలుస్తుంది.  ఇక రాయలసీమ విషయానికి వస్తే.. గూడూరు ఎంపీగా ఉన్న డాక్టర్ మద్దిల గురుమూర్తిని గూడూరు అసెంబ్లీకి పంపి.. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ ను తిరుపతి ఎంపీగా పోటీ చేయించనున్నారట. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఈసారి ఎన్నికల నుండి తప్పించనుండగా.. ఈ స్థానంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ను ఎంపీగా పోటీ చేయిన్చానున్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ వైసీపీ అధిష్టానం ప్రణాళిక కాగా.. ఇందులో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్లమెంటుకు వెళ్లేందుకు ఇష్టపడతారన్నది చూడాల్సి ఉంది.

ఖమ్మం కయ్యం...  బిఆర్ఎస్ కు ముచ్చెమటలు 

అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టింది. జిల్లాలోని పదికి పది స్థానాలను కైవసం చేసుకోవడానికి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు అర్జెంటుగా వచ్చి నన్ను కలవాలని కబురు పంపారు. ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రేస్ గూటికి చేరిన పొంగులేటి అక్కడ బలమైన నేత. కాంగ్రేస్ పార్టీకి మంచి పట్టు ఉంది. పొత్తు లేదని డిక్లేర్ కావడంతో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఓవైపు కాంగ్రేస్, మరో వైపు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ కు పట్టు లేదనే చెప్పాలి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావ్ పాలేరు సీటు ఆశించి భంగ పడ్డారు. తెలుగు దేశం పార్టీలో అత్యంత బలమైన నేతల్లో తుమ్మల ఒకరు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ మాటలకు ఆకర్షితులై టిఆర్ఎస్ లో చేరారు. ఏరు దాటక ముందు వీర మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అనే రకం కేసీఆర్.  గత ఎన్నికలలో  ఖమ్మం జిల్లాలో కేవల ఒకే ఒక స్థానం  గెలుచుకున్న కారు పార్టీ  జిల్లాలో 10 స్థానాలు గెల్చుకోవడం సందేహాస్పదమే. ఎందుకంటే నిన్న తుమ్మల నాగేశ్వర రావ్ చేపట్టిన బల ప్రదర్శన బిఆర్ఎస్ కు ముచ్చెమటలు పుట్టిస్తోంది. గులాబీ జెండాలు లేకుండానే ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో బలమైన నేత చేజారిపోవడం ఖాయమని తెలుస్తోంది. తుమ్మల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మరో సమాచారం. తుమ్మల పార్టీ వీడితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో బలమైన నేతలు ఆయా పార్టీలో చేరే సమయంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పొంగులేటి చేరిన సమయంలో కాంగ్రేస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.   మరో వైపు తెలంగాణపై  బిజెపి కూడా పూర్తి ఫోకస్ పెట్టింది. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో బిజెపి అధిష్టానం దూకుడు పెంచింది. ఇప్పటికే పలు సభలు , సమావేశాలు ఏర్పాటు చేసిన బిజెపి ..తాజాగా ఈ నెల 27 న ఖమ్మం లో భారీ సభ నిర్వహించబోతుంది. భారీ చేరికలు కూడా ఉండవచ్చు. ఈ సభ కు ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకాబోతున్నారు. అమిత్‌షా తొలిసారిగా ఖమ్మంలో పర్యటిస్తుండటంతో ప్రజలు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని.. అందుకే సువిశాల మైదానాన్ని ఎంపిక చేశామని బిజెపి నేతలు అంటున్నారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.వాస్తవానికి బిజెపి బహిరంగ సభ ఈ నెల 15 జరగాల్సి ఉంది. ఖమ్మంలో భారీ వర్షాలు, వరదల వల్ల బిజెపి బహిరంగ సభ వాయిదా పడింది.  కేసీఆర్ అహంకారం దిగిపోవాలంటే ఈ  సారి బీఆర్ఎస్  మళ్లీ అధికారంలో రావొద్దని తెలంగాణ బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పిలుపునిస్తున్నారు. కేసీఆర్ పోటీ చేయబోయే గజ్వేల్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ కు జిల్లాలోని అన్నిస్థానాలను గల్లంతు చేయాలని ప్రతి పక్షాలు చూస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే కేసీఆర్ తల బొప్పికట్టేట్టు ఉంది. నో డౌట్.

వామ్మో.. గవర్నర్, కేసీఆర్ మధ్య ఇంత సయోధ్యా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడుటలో సిద్ధహస్తులు. ఉద్యమ నేతగా ఉన్నప్పటి నుంచీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లుగా ఆయనను తెలిసిన వారంతా రెండో ఆలోచన లేకుండా ఈ మాట చెబుతారు. తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ ( అప్పుడు టీఆర్ఎస్)ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ప్రకటించడం నుంచి.. దళితులకు మూడెకరాల భూమి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడు వరకూ ఆయన అవసరార్ధం ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ పబ్బం గడవగానే వాటిని విస్మరించారు. అయితే ఆయన వాగ్ధాటి, మాటల మాయాజాలం కారణంగా ఆయన వాగ్దాన భంగాలు ప్రజలకు పెద్దగా గుర్తుండవు. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ తమిళసై పై ఎక్కడ లేని గౌరవాభిమానాలూ ప్రదర్శిస్తున్న సీఎం కేసీఆర్ గత మూడేళ్లుగా ఆమెకు ప్రోటాకాల్ ఇవ్వడం నుంచీ ప్రతి విషయంలోనూ ఆమెను విస్మరించారు. పక్కన పెట్టారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ  ఆ వ్యవస్థలు మరింత మెరుగ్గా పటిష్టంగా పని చేయడానికి దోహదపడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుంది.  కానీ ఆ ఘర్షణ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే మాత్రం ఆ వ్యవస్థలు భ్రష్టు పట్టడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించదు. తెలంగాణలో గత మూడేళ్లుగా అదే జరిగింది. జరుగుతోంది. అవసరార్దం తప్ప ప్రభుత్వం రాజ్ భవన్ ను పట్టించుకోవడం లేదు. ఈ వివాదం ముదిరి ఎంత వరకూ వెళ్లిందంటే.. రాజ్ భవన్, తెరాస సర్కార్ విభేదాలు  హస్తిన చేరాయి. స్వయంగా గవర్నర్ తమిళసై తెరాస సర్కార్ తీరుపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. విలేకరుల సమావేశంపెట్టి మరీ తనను కేసీఆర్ సర్కార్ అవమానిస్తున్నదంటూ.. విమర్శలు గుప్పించారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు.ప్రతిగా మంత్రులూ మీడియా ముందుకు వచ్చారు. రాజ్ భవన్ బీజేపీ కార్యాలయంగా మారిపోయిందంటూ ఎదురుదాడికి దిగారు. తెలంగాణ గవర్నర్ తమిళిశై, సీఎం కేసీఆర్‌ మధ్య సయోధ్యలేదన్న విషయం రహస్యమేమీ కాదు.   ఆమెను గవర్నర్ గా అవసరమైనప్పుడు మాత్రమే గుర్తిస్తారు. మరే సందర్భంలోనూ ఆమెకు ప్రోటోకాల్ కూడా ఇవ్వరు. వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు  ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం  ఎంతమాత్రం అభిలషణీయం కాదు.   ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే,  అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం కూడా తగ్గేదేలా అన్నట్లుగా పరస్పర విమర్శలతో బహిరంగ రచ్చకు ఎంత మాత్రం వెనుకాడని పరిస్థితి నిన్న మొన్నటి వరకూ నెలకొని ఉంది. ఇరువురి మధ్యా విభేదాల కారణంగా రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయం కోర్టు వరకూ వెళ్లింది.   అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య అగాధంపై కోర్టు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. అప్పట్లో విభేదాలన్నీ సమసిపోయి ఆల్ ఈజ్ వెల్ అన్న వాతావరణం కనిపించినా.. తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక తాజాగా మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలున్నాయా అనిపించేలా వాతావరణం మారిపోయింది. పట్నం ప్రమాణ స్వీకారోత్సవం తరువాత కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో ముఖాముఖీ చర్చలు జరిపారు. ఆ మరుసటి రోజే గవర్నర్ ను సచివాలయ సందర్శనకు ఆహ్వానించారు. సచివాలయంలోకి ఆమెను స్వయంగా తోడ్కోని వెళ్లారు. సచివాలయంలో నూతనంగా నిర్మించి ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళి సైతో కలిసి పాల్గొన్నారు. ఆనంతరం సచివాలయంలోని తన ఛాంబర్ కు తీసుకు వెళ్లి ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే.. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా హాజరు కావాల్సిన గవర్నర్ తమిళి సైను ఆ కార్యక్రమానికి ఆహ్వానించనే లేదు. ఇంత కాలం కనీసం గవర్నర్ ఉనికినే విస్మరించిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు తమిళిసై పై ఇంత గౌరవాభిమానాలు ఎందుకు ఒలకబోస్తోందంటే.. అది అంతే  అని సమాధానపడాల్సిందే.  

అప్పూ లేదు.. అప్పాయింట్ మెంటూ లేదు.. హస్తినలో జగన్ పరువు గంగపాలు!

అప్పు అప్పు.. ఏపీ ప్రభుత్వానికి తెల్లారి లేచిన దగ్గర నుంచీ ఇదే యావ. ఏదైనా చేయండి ఈ నెల అప్పు దొరికేలా చూడండి. కేంద్రం అడిగినవన్నీ చేద్దాం కొత్త అప్పుకు అనుమతి వచ్చేలా చేయండి. మీరు ఎవరినైనా కలవండి.. అప్పు దొరకకుండా రాష్ట్రానికి  మాత్రం రావద్దు. మీరు తెచ్చే అప్పుతోనే ఇప్పుడు మన ప్రభుత్వం నడవాల్సి ఉంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకోండి. ఇదీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుల సృష్టి కోసం ఢిల్లీలో తాను నియమించుకున్న బృందానికి ఇచ్చిన, ఇస్తున్న ఆదేశాలు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అప్పు కోసం నానా తిప్పలు పడుతుంది. ఇప్పటికే కేంద్రం ఏం చెప్పినా కాదనకుండా చేస్తూ ప్లీజ్ ఈ ఒక్కసారికి అప్పు ఇవ్వండి అంటూ కేంద్ర పెద్దల వద్ద జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న విన్నపాలు అన్నీ ఇన్నీ కాదు. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నుండి సీపీఎస్ రద్దు వరకూ కేంద్రం పెట్టిన ఆంక్షలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తూ వచ్చారు. వాటి బదులు  అప్పు లాగేశారు.  అయినా, ప్రభుత్వం నడిచే పరిస్థితి కనిపించడం లేదు. ఏ నెలకి ఆ నెల వచ్చిన ఆదాయానికి తోడు కొంత అప్పు చేసి జీతాలు, పెన్షన్లు ఇవ్వడంతోనే సరిపోతుంది. ఈ నెల ఇప్పటికి కూడా ఇంకా కొన్ని జీతాలు పెండింగ్ లోనే ఉన్నాయి. మరో వారం రోజులలో మరో నెల కూడా రాబోతుంది. మరోవైపేమో బటన్ నొక్కి చెల్లించాల్సిన పథకాలు బోలెడు ఉన్నాయి. ఇటు ప్రభుత్వ ఖర్చులకు.. అటు పథకాలకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు తెచ్చారు.. కార్పొరేషన్ల రుణాలను అందిన వరకు ప్రభుత్వ ఖజానాలకు మళ్లించేసుకున్నారు. పంచాయతీల ఆదాయాన్ని కూడా ఖజానాలో జమ చేసుకుంటున్నారు. రోడ్లు, డ్రైనేజీలకు గానీ.. కొత్తగా ఇటుక పెట్టేందుకు కూడా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. ముందు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వక కాంట్రాక్టర్లు బాబోయ్ ఏపీ అంటూ రాష్ట్రం సరిహద్దు దాటి వెళ్లిపోయారు. ఇన్ని చేసినా ప్రభుత్వం నడిచే పరిస్థితి కానరావడం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే కొత్త అప్పు పుట్టి తీరాలి. దీంతో కొత్త అప్పుల కోసం వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో నియమించుకున్న హైలెవల్ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్న ఈ కమిటీ ఇప్పుడు ఏపీ లిక్కర్ బాండ్లను చూపించి కొత్త అప్పు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.  అయితే కేంద్రం మాత్రం ఇక  మీకు అప్పు పుట్టేందుకు వీలుగా ఎలాంటి సలహాలు, ఆదేశాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిందని అంటున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఢిల్లీలో ఏపీ అప్పుల కమిటీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కానీ, కేంద్రం పెద్దలు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఇప్పుడు సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట. జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారట.  అయితే కేంద్రంలో జగన్ పరిస్థితి కూడా ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక మీదట ఓ లెక్క అన్నట్లు తయారైందని పరిశీలకులు అంటున్నారు. గతంలో సీఎం కోరడం తరువాయి ప్రధాని, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మంత్రులు ఆఘమేఘాల మీద అప్పాయింట్ మెంట్ ఇచ్చేసేవారు. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు జగన్ తో భేటీ అయ్యేవారు. కానీ ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.   సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు ఢిల్లీలో అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ప్రధాని మోడీ కాకపోయినా కనీసం అమిత్ షాతో అయినా అపాయింట్మెంట్ కావాలని కోరినా కేంద్రం నుండి ఎలాంటి అనుకూలత కనిపించడం లేదని చెప్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ అన్నీ లెక్కలేసుకొని ఆచితూచి అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే ఏపీలో పొత్తుల ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. సోమవారం (ఆగస్టు 28) తెలుగుదేశం అధినేత   చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉంది.ఆ విషయంలో ఇప్పటికే బీజేపీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు భేటీ అయ్యే వరకూ  జగన్ కు కేంద్రం పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకడం దుర్లభమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఒకవేళ చంద్రబాబు భేటీలో పొత్తుల చర్చలు సఫలీకృతమైతే ఇక జగన్ కు అపాయింట్ మెంట్ దొరికే అవకాశమే లేదని అంటున్నారు.   

ఈ సారి మంగళగిరి చినబాబుదే!

తెలుగుదేశం జాతీయ కార్యదర్శి  నారా లోకేష్ విజయం ఈ సారి నల్లేరుమీద బండినడకే అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు.  నారా లోకేష్ కూడా మరోసారి మంగళగిరి నుండే పోటీ చేస్తా.. గెలిచి తీరుతా కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. అయితే అదే సమయంలో వైసీపీ నుండి మాత్రం తమ పార్టీ విజయంపై ఇసుమంతైనా  ధీమా వ్యక్తం కావడం లేదు. మరోసారి లోకేష్ ను ఓడిస్తాం అని ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణారెడ్డి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. మరోసారి మంగళగిరిలో విజయం మాదే అంటూ వైసీపీ నుండి ప్రకటనలు లేవు. దీంతో అసలేం జరుగుతోంది? మంగళగిరిలో ఈసారి ప్రజల మూడ్ ఎలా ఉండబోతుంది? టీడీపీ ధీమాకి కారణం ఏంటి? వైసీపీ మౌనం వెనుక ఉన్న భయం ఏమిటి?  అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.   వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి 2014, 2019లలో రెండు సార్లు మంగళగిరి నుంచి గెలిచారు. 2014లో జస్ట్ 12 ఓట్ల తేడాతో బయటపడిన ఆర్కే 2019లో నారా లోకేష్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజానికి ఈ మెజారిటీ కూడా అంత గొప్పదేమీ కాదు. ఎందుకంటే రాష్ట్రమంతా చంద్రబాబు వేవ్ కనిపిస్తున్న 2014 ఎన్నికలలో గెలిచిన ఆర్కే.. 2019 జగన్ వేవ్ లో కూడా జస్ట్ 5 వేల మెజార్టీ అంటే అది అతిపెద్ద గెలుపేమీ కాదు. మరి ఈసారి ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఆర్కే అక్కడ విజయం సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకవైపు ప్రభుత్వంపై అసంతృప్తితో పాటు ఆర్కేకు  కూడా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ మరోసారి ఆర్కేకు మంగళగిరిలో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేదని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మంగళగిరి నుండి ఈసారి ఆర్కేను తప్పించడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. మరి ఆర్కేను తప్పిస్తే ఇక్కడ నుండి లోకేష్ మీద పోటీ చేసే నాయకులెవరు? దీనికి వైసీపీ వర్గాల నుండి రెండు మూడు అప్షన్లు వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ నుంచి ఆర్కేపై పోటీ చేసి.. ఆ తర్వాత వైసీపీలో చేరిన గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల్లో ఒకరిని మంగళగిరి  బరిలో దించేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ముగ్గురిలో గంజి చిరంజీవికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఒడి పోయడం అంటే అంతో ఇంతో ప్రజలలో చిరంజీవికి పట్టు ఉన్నట్లునని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. కనుక చిరంజీవినే నారా లోకేష్ పై పోటీకి దింపడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే జరిగితే లోకేష్ కు గెలుపు అవకాశాలు ఎక్కువ.  ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు అమరావతి నాశనం ప్రభావం ఈసారి ఎన్నికలలో స్పష్టంగా కనిపించే ఛాన్స్ ఉంది. దీనికి తోడు మంగళగిరిలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కక్ష పూరిత పాలన కూడా ఇక్కడ ప్రజలకు విరక్తి పుట్టించింది. ఆర్కే పుణ్యమా అని సీఎం సొంత సామాజిక వర్గం కూడా ఇక్కడ గుర్రుగా ఉందని తెలిసింది. సర్వేల్లోనూ వైసీపీకి ఇక్కడ ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు గంజి చిరంజీవిని తీసుకొచ్చినా పార్టీ ఆయన్ని అభ్యర్థిగా ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తుందన్నది అనుమానమే. ఆర్కేను   పక్కకి పెడితే ఆయన వర్గం చిరంజీవికి మద్దతు ఇవ్వడం కూడా అనుమానమే.  మరో వైపు ఇక్కడ లోకేష్ గతాన్ని మించి బలోపేతం అయ్యారు. ఆయన నడత నుండి రాజకీయం వరకూ అన్నీ మారాయి. సొంత నియోజకవర్గంపై ఈసారి లోకేష్ మరింత గురి పెట్టనున్నారు. టీడీపీ అధిష్టానం కూడా ఈసారి మంగళగిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పటికే ఇక్కడ పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతలను చంద్రబాబు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు అప్పగించారు. త్వరలోనే గ్రామా స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి ఒక్క నాయకుడితో లోకేష్ వ్యక్తిగతంగా కలిసే ప్రణాళిక రచించనున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

కాంగ్రెస్ గూటికి తుమ్మల.. ఖరారేనా?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ రిక్త హస్తం చూపింది. జిల్లాలో బలమైన నేత అయినప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని కనీసం పరిశీలించకపోవడంతో ఆయనిక పార్టీలో కొనసాగడం జరిగే పని కాదని అందరికీ అర్ధమైపోయింది.  ఖమ్మం జిల్లాలో కీలక నేత అయిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో  ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.   ఈసారి పాలేరు నుంచి మాజీమంత్రి తుమ్మలకు అవకాశం కచ్చితంగా ఉంటుందని, సర్వేల్లోనూ ఆయనకే మొగ్గు ఉందన్న ప్రచారం జరిగింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్ పై  గెలిచి బీఆర్‌ఎస్‌‌లో చేరిన కందాల ఉపేందర్‌రెడ్డికే  బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించడంతో   తుమ్మల భవితవ్యం ఏంటా అన్న చర్చ పెద్ద ఎత్తున ప్రారంభమైంది.  ఇక బలమైన నేత అయిన తుమ్మలకు పాలేరు టికెట్ ఆఫర్ చేస్తూ కాంగ్రెస్ తమ పార్టీలోకి ఆహ్వానించింది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచీ తుమ్మలకు ఆహ్వానం ఉందంటున్నారు. మరో వైపు బీఆర్ ఎస్ అసంతృప్తులపై కన్నేసిన బీజేపీ కూడా తుమ్మలకు తమ పార్టీ తలుపులు బార్లా తెరిచిందని చెబుతున్నారు. ఇలా మూడు పార్టీల నుంచీ తుమ్మలకు ఆహ్వానం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల తీసుకునే నిర్ణయం ఏమిటన్నది తెలియాల్సి ఉందని ఇంత కాలం అంతా భావించారు. అయితే ఆయన హస్తం గూటికి చేరుతారన్న విషయం దాదాపు ఖరారైపోయిందని తాజా పరిణామాన్ని బట్టి చూస్తే అవగతమౌతున్నది. ఇప్పటికే  కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆహ్వానించి పాలేరు టికెట్ ఆఫర్ చేసిందని అంటున్నారు. చివరి క్షణం వరకూ తుమ్మల బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ కోసం వేచి చూశారు.   ఈ నేపథ్యంలోనే ఆయన తన పోటీ పాలేరు నుంచేనని పదే పదే స్పష్టం చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ ఆఫర్ ను అంగీకరించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలక బలం చేకూరే విధంగా   మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం (ఆగస్టు 25) ఈ సందర్భంగా  తుమ్మల వర్గీయులు  కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కాంగ్రెస్  జెండాతో ఆయనకు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నుండి టికెట్ లభించకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ తుమ్మల వర్గీయులు కోరుతున్నారు.  

వైసీపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ? భారీ మార్పులు తప్పవా?

తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఒకేసారి తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల చేసి హీట్ పెంచేసిన సంగతి తెలిసిందే. కాగా ఏపీలో కూడా ఇప్పుడు ఎన్నికల మూడ్ మొదలయ్యేలా కనిపిస్తుంది. ప్రతిపక్షాలలో పొత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. సాధ్యమైనంత త్వరగా ఈ పొత్తుల వ్యవహారాన్ని తేల్చాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయా పార్టీల ద్వారా తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో పాటు అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గెలుపు గుర్రాలెవరు అనే అంశంపై ఒకటికి ఐదారు సర్వేలు చేయించుకొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. మరోవైపు గెలుపు అవకాశాలపై కూడా ఇప్పటికే కొన్ని సర్వేల ఫలితాలు వెలువడగా వీటిలో చాలా వరకు అధికార పార్టీకి ప్రతికూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. రెండు మూడు సర్వేల ఫలితాలైతే జగన్ మోహన్ రెడ్డి విజయానికి చాలా చాలా దూరం వెళ్లిపోయారని కూడా ఖరారు చేశారు. ఒకవైపు అభ్యర్థుల పనితీరుపై వచ్చిన సర్వేల ఫలితాలు, మరోవైపు విజయావకాశాలపై వచ్చిన సర్వేల ఫలితాల ఆధారంగా వైసీపీ ఒక జాబితాను సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఈ జాబితాను సాధ్యమైనంత త్వరగా ప్రకటించే అవకాశాలున్నట్లు  వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపించాలని జగన్ భావిస్తున్నారంటున్నారు.  జిల్లాల వారీగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసి వైసీపీ అభ్యర్ధులుగా ప్రకటించాలని చూస్తుండగా ఇప్పటికే ఒక జాబితా తుది దశకు చేరుకుందని అంటున్నారు. ఈ జాబితా ప్రకారం చూస్తే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండి చేయి తప్పదని తెలుస్తోంది.  సీనియర్ నేతలని కూడా నిర్ధాక్షణ్యంగా జగన్ పక్కన పెట్టేశారని, ప్రజలలో అసంతృప్తి స్థాయి ఎక్కువగా ఉన్నవారిని, సర్వేల ఫలితంగా గెలుపు కష్టమేనన్న పీకే టీం అభిప్రాయం మేరకే ఈ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలుస్తున్నది. కాగా  జిల్లాల వారీగా వైసీపీ సిద్ధం చేసిన ఫస్ట్ లిస్టులో ఉత్తరాంధ్ర నుండి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను తీసుకుంటే.. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, పలాస నుంచి సీదరి అప్పలరాజు, ఇచ్చాపురం నుంచి పిరియా విజయ, పాలకొండ నుంచి విశ్వసరాయి కళావతి, రాజాం నుంచి కంబాల జోగులును ఎంపిక చేయగా.. మిగిలినవి పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. విజయనగరం తీసుకుంటే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, కురుపాం నుంచి పుష్ప శ్రీవాణి, పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు, నెల్లిమర్ల నుంచి కడుబండి శ్రీనివాసరావు, గజపతినగరం నుంచి బొత్స అప్పలనరసయ్య ఫైనల్ కాగా మిగిలినవి పెండింగ్ ఉన్నాయి. ఇక విశాఖ జిల్లా తీసుకుంటే.. విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేష్, నార్త్ నుంచి కేకే రాజు, తూర్పు నుంచి ఎంవీవీ సత్యనారాయణ, వెస్ట్ నుంచి ఆడారి ఆనంద్ కుమార్, భీమిలీ నుంచి అవంతి శ్రీనివాస్, గాజువాక నుంచి తిప్పల దేవాన్ రెడ్డి, పెందుర్తి నుంచి అదీప్ రాజ్, అనకాపల్లి నుంచి గుడివాడ అమరనాధ్, ఎలమంచిలి నుంచి కన్నబాబురాజు, మాడుగుల నుంచి బూడి ముత్యాలనాయుడు, నర్శీపట్నం నుంచి పెట్ల ఉమా శంకర్, చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ, అరకు నుంచి శెట్టి ఫల్గుణ పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి చూస్తే గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్, వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, నందిగామ నుంచి మేకతోటి జగన్మోహన్ రావు, మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు క్రిష్ణమూర్తి పేర్లు ఖరారు కాగా మిగిలినవి ఇంకా ఖరారు చేయలేదు. గుంటూరు జిల్లా తీసుకుంటే సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, పల్నాడు నుంచి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, గురజాల నుంచి కాసు మహేష్ పేర్లు ఖరారు అయ్యాయి. ఇక తాడేపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్థానంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ , ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత స్థానంలో ఆమె భర్త పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ ఒకరిద్దరి పేర్లు మాత్రమే ఖరారు కాగా మారుతున్న రాజకీయ సమీకరణాల ఆధారంగా ఇక్కడ భారీ మార్పులు ఉండనున్నట్లు చెప్తున్నారు. అలాగే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కూడా వైసీపీకి భారీ ట్రబుల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు జిల్లాలలో చాలా మంది నేతలు రెబల్స్ గా మారగా.. మరికొందరు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా నాలుగైదు స్థానాలను మాత్రమే ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అసలు రెండు మూడు స్థానాలలో అయితే గట్టి అభ్యర్థులే లేక తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక రాయలసీమలో అయితే భారీగా సిట్టింగులకే మరో అవకాశం ఇచ్చేందుకు సిద్దమైన జగన్ ఒకటీ రెండు స్థానాలలో మాత్రమే మార్పులు చేపట్టనున్నారని తెలుస్తుంది. మరి వైసీపీ మొత్తం ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది? అసంతృప్తులను ఎలా బుజ్జగించనుందన్నది చూడాల్సి ఉంది.

జగన్ పార్టీ పనైపోయింది.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడి!?

గత వారం ఐ ప్యాక్ చేసిన ఓ సర్వే లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అది లీక్ కాబట్టి వైసీపీ నేతలు అది ఫేక్ అంటూ పెద్ద గొంతు పెట్టుకుని అరిచి చెప్పారు. కానీ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే చానల్ ప్రకటించిన సర్వే తాజాగా వెలువడింది. ఆ సర్వే కూడా వైసీపీ డిక్లైన్ ను విస్పష్టంగా తేల్చేసింది. ఇండియా టుడే చానల్  ప్రతి ఆరు నెలలకోసారి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో  సర్వేలు వెలువరిస్తుంది. తాజా సర్వేలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కనీసం పదిహేను లోక్ సభ సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని విస్పష్టంగా పేర్కొంది. ఈ సర్వే కేవలం లోక్ సభ సీట్ల గురించే చెప్పింది.  వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలుగుదేశం ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉంటుందని, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో  బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీగా ఉండబోయేది తెలుగుదేశం మాత్రమేనని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కుండబద్దలు కొట్టేసింది.   ఈ సర్వేపై తమకు విశ్వాసం లేదని వైసీపీ చెప్పుకునే అవకాశం ఇసుమంతైనా లేదు. ఎందుకంటే ఇదే  ఇండియా టుడే.. ఏడాది కిందట నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి  కేవలం ఏడు లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. అప్పుడు వైసీపీ శ్రేణులు, నాయకత్వం ఆ సర్వేను ఓన్ చేసుకుని ఎన్నికల నాటికి తెలుగుదేశం సీట్లు మరిన్ని తగ్గిపోతాయనీ, పాతికకు పాతిక లోక్ సభ స్థానాలూ తమ ఖాతాలోనే పడతాయని ప్రకటనలు గుప్పించాయి. దాని ప్రాతిపదికగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైనాట్ 175 అంటూ లోక్ సభ స్థానాలలాగే అసెంబ్లీ స్థానాలనూ వంద శాతం గెలుచుకుంటామని చెప్పారు. ఆ తరువాత ఇప్పటి వరకూ ఆ వైనాట్ 175 మంత్రాన్నే వల్లె వేస్తూ వస్తున్నారు.   ఆరు నెలల కిందట ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి పది లోక్ సభ స్థానాలను ఇచ్చింది. ఇప్పుడు తాజా సర్వేలో ఆ సంఖ్య 15కు పెరిగింది.  అయితే ఈ సర్వేకు సంబంధించి ఒక్క విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే పొత్తుల ప్రశక్తి లేకుండా నిర్వహించిన సర్వే. అంటే పొత్తులు లేకుండానే తెలుగుదేశం పార్టీ పాతిక లోక్ సభ స్థానాలలో 15 గెలుచుకుంటుంది.  ఐ ప్యాక్ సర్వేలో కూడా  అదే చెప్పింది. ఇటీవల టైమ్స్ నౌ చానల్ తో.. ప్రతీ నెలా ఓ సర్వే వస్తోంది. అందులో ఇరవై ఐదు సీట్లూ వైసీపీకే వస్తాయని వేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లోనూ వైసీపీ పట్టు జారిపోయిదని స్పష్టమయింది. తమ సిట్టింగ్ పంచాయతీలు, కంచుకోటల్లోనే ఓడిపోయింది. పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో జగన్ రెడ్డి గ్రాఫ్ దారుణంమగా కరిగిపోతోంది. ఎన్నికలకు ఇంకా  ఎనిమిది నెలల సమయం ఉంది.  రాష్ట్రంలో దిగజారుతున్న జగన్ గ్రాఫ్ ను బట్టి చూస్తే ఎన్నికల నాటికి వైసీపీ కనీసం ఒక్కటంటే ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారినా ఆశ్చర్యం లేదని పరిశీలకలు అంటున్నారు.