హంటర్ బైక్.. ఈ క్రేజ్ ఏంట్రా నాయనా!
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అటు పాతతరం.. ఇటు కొత్త తరాన్ని ఒకేలా ఆకర్షించే బైక్ ఏదైనా ఉందంటే అది రాయల్ ఎన్ ఫీల్డ్ అనే చెప్పుకోవచ్చు. మన భారతీయులు ముద్దుగా బుల్లెట్ బండి అని పిలుచుకునే ఈ బైకుపై మనసు పారేసుకుని రైడర్ ఉండరేమో. బైక్ కొనాలంటే ఎన్ ఫీల్డ్ మాత్రమే కొనాలని కలలు కనే కుర్రాళ్లే ఎక్కువ మంది ఉంటుంటారు. తన భర్తతో బుల్లెట్ బండెక్కి షికార్లు కొట్టాలనుకోని మహిళ ఉండదంటే అతి శయోక్తి కాదు. బుల్లెట్ బండెక్కి వచ్చేతప్పా.. పాట అని లక్షల వ్యూస్ సాధించడానికి బుల్లెట్ బైక్ పై యువతలో ఉన్న క్రేజ్ కూడా ఒక కారణం. ఎన్ ఫీల్డ్ స్టైలిష్ లుక్ తో పాటు 350 సీసీ, 500 సీసీలతో ఈ బైక్ సామర్ధ్యం కూడా బైక్ లవర్స్ ను ఆకర్షిస్తుంటుంది. అయితే, కొనాలనే మనసు ఉన్నా చాలామంది దీని ధర విషయంలో వెనకడుగు వేస్తుంటారు. ఎందుకంటే ఎన్ ఫీల్డ్ నుండి 350 సీసీ బైక్ సొంతం చేసుకోవాలంటే కనీసం రెండు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ధరను చెల్లించగలిగిన వారు సొంతం చేసుకుంటుంటే మధ్య తరగతి కుటుంబాలలో చాలా మంది ప్రత్యామ్నాయ బైకులపైకి వెళ్లే వారు. దీన్ని దృషిలో పెట్టుకొనే ఎన్ ఫీల్డ్ మిడ్ సైజ్ సెగ్మెంట్ లో ఒక బైకు తీసుకొచ్చింది. అదే ఎన్ ఫీల్డ్ హంటర్ 350.
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చవకైన బైక్ గా హంటర్ 350ని 2023 సంవత్సరం ఆగస్టులో తీసుకొచ్చింది. ఇది రూ.1.5 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేయగా.. ఈ రేంజ్ ధర కలిగిన మిగతా అన్ని కంపెనీలను తలదన్నేలా ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 దూసుకెళ్తుంది. కేవలం ఏడాది కాలంలోనే ఎన్ ఫీల్డ్ హంటర్ రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకెళ్లింది. హంటర్ 350 ఈ ఏడాది ఫిబ్రవరికే మన దేశంలో లక్ష యూనిట్లు అమ్ముడు కాగా ఈ ఐదు నెలల్లో మరో లక్ష యూనిట్ల సేల్స్ తో దుమ్మురేపింది. ప్రస్తుతం భారత్‌తోపాటు ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఈ బైక్స్ సేల్స్ జరుగుతుండగా.. త్వరలోనే బ్రెజిల్ లో కూడా ఆవిష్కరిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కాంపాక్ట్ బైకులలో హంటర్-350 అత్యంత చౌకగా అందుబాటులోకి రావడం యువత దీని వైపు మళ్లేలా చేసింది. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, బైక్ హ్యాండిల్స్, డైరెక్షన్ మార్పులు డిఫరెంట్ గా ఉండడం యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నది. హంటర్-350తోపాటు మార్కెట్లోకి వచ్చిన క్లాసిక్-350, మీటర్-350 బైక్స్‌లోనూ 349సీసీ ఇంజిన్ ఉంది. కానీ హంటర్-350 బైక్ పట్ల చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఈ స్థాయి సేల్స్ సాధ్యమవుతున్నది. హంటర్-350 రెండు వేరియంట్లలోనూ 349సీసీ సింగిల్ సిలిండర్, ఎస్ఓహెచ్సీ, ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ విత్ 5-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. 6100 ఆర్పీఎంపై 20.2 బీహెచ్పీ, 4000 ఆర్పీఎంపై 27 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్‌లు, డ్యుయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ టెయిల్ లైట్, డ్యుయల్ టోన్ పెయింట్ థీమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. రెట్రో వేరియంట్ లో డ్రమ్ బ్రేక్, సింగిల్ చానెల్ ఏబీఎస్, వైర్ స్పోక్ వీల్స్, సింగిల్ టోన్ కలర్ స్కీమ్స్ ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 పరిమాణం పరంగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,055 మిమీ, వెడల్పు 800 మిమీ, ఎత్తు 1,055 మిమీ కలిగి ఉంటుంది. వీల్‌బేస్ 1,370 మిమీ వరకు ఉంటుంది. ఇక సీట్ ఎత్తు భూమి నుండి 800 మిమీ వరకు ఉంటుంది. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. మరోవైపు రౌండ్ టర్న్ ఇండికేటర్స్, రౌండ్ టెయిల్ లైట్ కూడా ఇందులో ఉంది. దీని లుక్ రెట్రో తరహాలో ఉండటం మరో ప్లస్ పాయింట్. తక్కువ ధరలో రెట్రో లుక్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ దక్కించుకోవడం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రంగుల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్, రెబెల్ బ్లాక్, డాపర్ యాష్, డాపర్ వైట్, డాపర్ గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.