వైసీపీలో తెరపైకి వారసులు.. రెడ్డి సామాజిక వర్గ వారేనా?
posted on Aug 23, 2023 @ 10:19AM
పాత తరం పోతే కొత్త తరం వస్తుంది. రాజకీయాలలోనే కాదు ఏ రంగంలో అయినా ఈ మార్పు అనివార్యం. అవసరం కూడా. అయితే, రాజకీయాలలో కొందరి వారసులు మాత్రమే కొత్త తరం నేతలుగా ఎదుగుతుంటారు. గతంలో వారసులంటే కేవలం కుమారులే కాగా ఇప్పుడు వారసురాలుగా కుమార్తెలు కూడా రాజకీయాలలో అడుగు పెడుతున్నారు. కాగా ఏపీలో కూడా ఎన్నికల కదలిక మొదలవుతున్నది. ఇప్పటికే తెలంగాణ అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. మిగిలిన పార్టీలు కూడా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక లో ఉన్నాయి. నేడో రేపో జాబితాలు ప్రకటించేస్తాయి. కాగా ఏపీ విషయానికి వస్తే అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే పలు సర్వేల ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. గత ఎన్నికలలో 151 సీట్లతో ఘన విజయం దక్కించుకోగా ఇప్పుడు ఆ 151 మందిలో ఎంతమందికి టికెట్లు దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది. యాభైకి పైగా స్థానాలలో ఈసారి మార్పు తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల వారసులను రంగంలోకి దింపాలని సీనియర్ నేతలు ఆశపడుతున్నారు. తమ ఆశ నెరవేర్చుకునేందుకు తమ వంతు కృషి కూడా చేస్తున్నారు.
ఈసారి ఎన్నికలకు తమ స్థానంలో తమ వారసులకు టికెట్లు కేటాయించాలని కొందరు నేతలు ఆశపడుతుంటే.. మరి కొందరు మాత్రం తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్లు కావాలని అధిష్ఠానం వద్ద పట్టుబడుతున్నారు. ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే తన వారసుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. రామచంద్రాపురం నుంచి పిల్లి సూర్య ప్రకాష్ పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. ఇక్కడ చెల్లుబోయిన గోపాలక్రిష్ణకు మరోసారి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు వెనుకాడబోమని కూడా సుభాష్ పేర్కొన్నారు. అధిష్టానం పిలిచి బుజ్జగించడంతో కాస్త సైలెంట్ గా ఉన్నారు. అయితే టికెట్ కేటాయించకపోతే అనుకున్నది చేసేలా ఉన్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే తన కుమారుడు అభినయ్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ్ రెడ్డి నియోజకవర్గంలో అన్నీ తానై నడిపిస్తున్నారు.
అలాగే ఇదే చిత్తూరు జిల్లా నుండి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మోహిత్ రెడ్డి ఈ మధ్యనే తుడా చైర్మన్ పదవి కూడా అప్పగించారు. మోహిత్ కూడా చంద్రగిరి రాజకీయాలన్నీ తన చేతుల మీదుగానే నడిపిస్తున్నారు. ఇక మరో ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మంత్రి విశ్వరూప్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా చాలామంది తమ వారసులను ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికలలోకి దింపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఇప్పటికే కొంతమంది అధిష్టానం వద్ద విన్నపాలు చేసుకోగా ఒకరిద్దరు అయితే ఏకంగా అల్టిమేటం జారీచేసినట్లుగా చెప్తున్నారు.
అయితే, ఎంతమంది నేతలు తమ వారసుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి మాత్రమే ఈ విషయంలో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రెడ్డి సామజిక వర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిలకు ఇప్పటికే టికెట్లు ఖరారు కాగా.. శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్రారెడ్డి పోటీ చేయడం కూడా దాదాపుగా ఖరారైనట్లేనని చెప్తున్నారు. ఇక బాలినేని, వైవీ సుబ్బారెడ్డిల వారసుల ఎంట్రీపై కూడా కసరత్తులు మొదలు కాగా.. రానున్న ఎన్నికలలో వారికి టికెట్లు దక్కినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. ఈ రెడ్డి సామాజికవర్గ నేతల వారసులు కాకుండా మిగతా నేతల వారసులకు మాత్రం ఈసారి కూడా మొండి చేయే అనే ప్రచారం వైసీపీ వర్గాలలో జోరుగా సాగుతోంది.
ఉదాహరణకు పిల్లి సుభాష్ వారసుడి స్థానంలో చెల్లుబోయినకే దాదాపుగా టికెట్ ఇవ్వనున్నారు. ఇక పేర్ని నానీ, ధర్మాన, తమ్మినేని వారసులకు ఇంకా సమయం ఉందని ఇప్పటికే పరోక్షంగా జగన్ సూచనలు చేసినట్లు తెలుస్తున్నది. దీని బట్టి చూస్తే వైసీపీలో వారసులు వస్తారు.. కానీ ఒక సామజిక వర్గానికి చెందిన యువనాయకులకు మాత్రమే ఆ అవకాశం దక్కుతుందని స్పష్టంగా తెలుస్తోంది.