పరారీలో జయప్రద.. గాలిస్తున్న యూపీ పోలీసులు!

ప్రముఖ నటి, బీజేపీ నేత జయప్రద కోసం పోలీసులు గాలిస్తున్నారు. అవును నిజమే ఆమె పరారీలో ఉన్నారని చెబుతున్న యూపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.  2019లో  ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో  జయప్రద నిందితురాలిగా ఉన్న సంగతి విదితమే. అయితే ఆమెకు ఎన్ని మార్లు విచారణకు హాజరు కావాలని కోర్టు  ఆదేశించినా  హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో జయప్రదపై  నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. జనవరి 10న కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో యూపీ పోలీసులు జయప్రదను గాలించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆమెపై కేసు ఏమిటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, దానిని ఉల్లంఘించి ఓ రోడ్డును ప్రారంభించారు. అలాగే ఓ సభలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణకు ఆమె కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా గైర్హాజరు కావడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మీద జయప్రద పరారీ అంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.  

జగన్ ఉత్తరాంధ్ర ఆశలు ఆవిరి!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం సమయం నుండే రాయలసీమ తర్వాత తనను కాపాడేది ఉత్తరాంధ్ర మాత్రమే అని భావిస్తూ.. భ్రమిస్తూ వచ్చారు. కోస్తా ఆంధ్రాలో తనకు ఎలాగు గ్రిప్ దక్కదని భావనతో జగన్.. రాయలసీమ, ఉత్తరాంధ్రలను తనకు కంచుకోటగా మలచుకోవాలని భావించారు. అందుకోసమే జగన్  తల్లి విజయమ్మను విశాఖ నుండి పోటీకి దింపగా.. అక్కడి ప్రజలు ఘోరంగా ఓడించి వెనక్కు పంపించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మెజార్టీ ఓటమి వైసీపీకి అక్కడ ఛాన్స్ లేదని అప్పుడే తేటతెల్లం చేసింది. కానీ  వైసీపీ ఆశలు మాత్రం చావలేదు. ఏకంగా  రాజధానిని ఉత్తరాంధ్రకు తెస్తానని ఇన్నాళ్లు ప్రకటనతో  అక్కడి ప్రజలలో ఆశలు కల్పించారు. ముందుగా మూడు రాజధానులంటూ చెప్పినా.. చివరికి విశాఖే  రాజధాని అంటూ ప్రకటిస్తూ మురిపెం పెంచారు. కానీ, తీరా ఎన్నికలకు సమయం ఆసన్నమైనా ఇప్పటికీ విశాఖ రాజధాని ఊసేలేదు. కనీసం వైసీపీ నేతలు చెప్పిన విశాఖ నుండి పరిపాలన కూడా అమల్లోకి రాలేదు. అసలే ప్రజలలో అసంతృప్తి.. పైగా రాజధాని మోసం.. ఇప్పుడు అభ్యర్థుల మార్పు కలిసి ఉత్తరాంధ్ర నేతలు వైసీపీకి బైబై చెప్పేస్తున్నారు. జగన్ ఎలాగైనా విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో పట్టు కోసం పోరాడుతుంటే.. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పలువురు నాయకులు మాత్రం పార్టీకి దూరమవుతున్నారు. వైసీపీ హై కమాండ్ కు ఇది మింగుడు పడడం లేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకకాలంలో నాయకులంతా పార్టీని వీడుతుండడం ఇప్పుడు జగన్ ను కలవరపాటుకు గురి చేస్తోంది. మొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీని వీడగా..ఇటీవల ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతంపార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఇప్పుడు సీతంరాజు సుధాకర్ కూడా పార్టీకి రాజీనామా ప్రకటించారు. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సుధాకర్.. జగన్ కు అత్యంత సన్నిహితుడైన వారిలో ఒకరు. కానీ, పార్టీ నిర్ణయాలతో విభేదించి రాజీనామా చేసేశారు.   పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కోసం పనిచేస్తున్న సుధాకర్.. తొలినుండి విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కొంతకాలం కిందట విశాఖ పట్టభద్రుల స్థానం నుంచి సుధాకర్ ను పోటీ చేయించి.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విభేదాలకు చెక్ చెప్పాలని జగన్ భావించారు. కానీ ఆ ఎన్నికల్లో సుధాకర్ ఓడిపోవడంతో ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూపంలో పోటీ ఎదురయ్యింది. మరోవైపు కోలా గురువులు సైతం ఆశావహుడిగా బయటకొచ్చారు. దీంతో సుధాకర్ కు టికెట్ లేదని హై కమాండ్ తేల్చింది. దీంతో ఆయన పార్టీకి బైబై చెప్పేశారు. అయితే విశాఖలో జరుగుతున్న వరుస పరిణామాలు   వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఒక్క సుధాకర్ మాత్రమే కాదు ఉత్తరాంధ్ర నుండి డజనుకుపైగా వికెట్లు పడే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పలుచోట్ల సీనియర్లకు టికెట్లు లేవని అధిష్టానం తేల్చడంతో వీరంతా ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంచార్జిల మార్పుపై పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి సహకరించే పరిస్థితి లేదని బహిరంగంగానే తేల్చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా జగన్ విశాఖ ఆశలు ఆవిరైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నేతలున్నా ఉత్తరాంధ్రను వైసీపీకి అనుకూలంగా మలచడంలో ఫెయిలైనట్లు విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఇన్నాళ్లు ఉత్తరాంధ్ర నేతలు ఇబ్బందులు పడగా.. ఇప్పుడు టికెట్ల కేటాయింపులో గందరగోళం, ఇప్పటికే ఖరారైన పార్టీ ఓటమి ఇక్కడ నేతలను పార్టీకి దూరం చేస్తున్నట్లు భావించాల్సి వస్తుంది.

సిట్టింగుల మార్పు పంచాయతీలన్నీ తాడేపల్లి ప్యాలస్ కే.. వైసీపీలో పతాక స్థాయికి సంక్షోభం!

అధికార వైసీపీలో సంక్షోభం మొదలైంది. రాష్ట్రంలో  ఎన్నికల హీట్  పెరగడంతోనే వైసీపీలో ఆందోళన స్టార్ట్ అయ్యింది.  ఓటమి భయంతో వైసీసీ అధినేత  పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల  నియోజకవర్గాల   మార్పు చేపట్టారు.  అయితే జగన్ నిర్ణయం    పార్టీలో కాక రేపుతోంది. సీనియర్లు జూనియర్లు అని లేకుండా జగన్ మొండి నిర్ణయాలతో పార్టీలో ఇప్పుడు సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 11 మందిని మార్చేశారు.  ఇప్పుడు రెండో విడత మార్పులకు  సంప్రదింపులు, కసరత్తులు పూర్తయ్యాయి. దీంతో స్థానాల మార్పుకు ససేమీరా అంటున్న కొందరు ఎమ్మెల్యేలు, అసలు ఈసారి సీట్లు దక్కని ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం గట్టిగానే  వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా జగన్ రెండో జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. శనివారం (డిసెంబర్ 30) ఈ రెండో  విడత మార్పులును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి శుక్రవారమే (డిసెంబర్ 29) ఇందుకు సంబంధిత అధికారిక ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు.  తాడేపల్లి జగన్ ప్యాలెస్ లో వైసీపీ ఎమ్మెల్యేల హడావుడి కూడా కనిపించింది. కానీ  కారణాలేంటో తెలియదు కానీ  సదరు ప్రకటన విడుదల కాలేదు.  రెండో జాబితాలో మార్పులూ చేర్పులూ ఇవేనంటూ ఓ జాబితా సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. వైసీపీ అభ్యర్థుల మార్పు జాబితాలో 35మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.  వైసీపీ   వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు ఖరారు అయిన ఎమ్మెల్యేల పేర్లు ఇలా ఉన్నాయి. విశాఖ నార్త్ నుండి కేకే రాజు, మాడుగుల నుండి బూడి ముత్యాల నాయుడు, రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ మార్గాని భరత్, నర్సీపట్నం నుండి పెట్ల ఉమాశంకర్ గణేష్, తుని దాడిశెట్టి రాజా, జగ్గంపేట తోట నరసింహం, పెద్దాపురం దావులూరి దొరబాబు, పత్తిపాడు వరుపులు సుబ్బారావు. పిఠాపురం వంగా గీత, ముమ్మిడివరం పొన్నాడ సతీష్, భీమవరం గ్రంధి శ్రీనివాస్, మంగళగిరి గంజి చిరంజీవి, తణుకు కారుమూరి నాగేశ్వరరావు, నూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు,  కైకలూరు దూలం నాగేశ్వరరావు, తంబళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, మచిలీపట్నం పేర్ని కిట్టు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి వెంకటేశ్వర రావు(నాని), తెనాలి అన్న బత్తుని శివకుమార్, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి లేదా జంగా కృష్ణమూర్తి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, కందుకూరు మహీధర్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రం రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వెంకటగిరి నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి, సత్యవేడు నారాయణస్వామి లేదా కోనేటి ఆదిమూలం, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం కె. ఆర్. జె భరత్, జమ్మలమడుగు వైయస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఆర్ శివ ప్రసాద్ రెడ్డి, పులివెందుల వైయస్ జగన్మోహన్ రెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడు, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, పెనుగొండ కె.వి ఉషశ్రీ చరణ్, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.  కాగా నియోజకవర్గ మార్పునకు ఇష్టపడని ఎమ్మెల్యేలు, సీట్లు దక్కని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉండగా.. వీరిని బుజ్జగించే పనిని రీజినల్ కోఆర్డినేటర్లకు అధిష్టానం అప్పగించింది. అయితే, రీజనల్ కోఆర్డినేటర్లు ఈ బుజ్జగింపులు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో అన్ని పంచాయతీలు తాడేపల్లి ప్యాలెస్ కే చేరుతున్నాయి. వీటిని పరిష్కరించలేక   జగన్ తల పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు జగన్ మాటలకు కూడా మెత్తబడని ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారు.  గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే  వెళ్లిపోయేవారు తమ వారు కాదని, గెలవని అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం కలిగించలేమని అంటూ జగన్ అసంతృప్తులను మరింత రెచ్చగొడుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కొత్త ఇంచార్జిల ఓటమి కోసమే పనిచేస్తామని అసంతృప్త ఎమ్మెల్యేలు రివర్స్ అవుతున్నారు. దీంతో వైసీపీలో సంక్షోభం ముదిరి పాకాన పడినట్లైంది. ఇది ఎన్నికల సమయానికి మరింత తీవ్రమై పార్టీ పుట్టి ముంచే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మంగళగిరి వైసీపీ కార్యాలయంలో షర్మిల ఫొటోలు.. ఆర్కే తన రూటెటో చెప్పేశారుగా?!

తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా మారిపోయింది. పార్టీ కార్యాలయంలో కాగడా పెట్టి వెతికినా ఒక్కటంటే ఒక్కటి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఫొటో కనిపించడం లేదు. సిట్టింగులను మార్చాలన్న నిర్ణయంతో విభేదించి పార్టీకీ, ఎమ్మెల్యే సభ్యత్వానికీ రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి వైసీపీ కార్యాలయంలో ఉన్న సీఎం జగన్మోహనరెడ్డి ఫొటోలను పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు ఆ కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె షర్మిల ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాలలో షర్మిల కీలక పాత్ర పోషించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి, ఆ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టనున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. అదే జరిగితే వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో అసమ్మతి, అసంతృప్తి నేతలు హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విశ్లేషణలకు బలం చేకూర్చే విధంగా మంగళగిరి వైసీపీ కార్యాలయంలో జగన్ ఫొటోల తొలగింపు కార్యక్రమం జరిగింది.   2019 ఎన్నికలలో  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ కీల‌క నేత, మంగ‌ళ‌గిరి శాస‌న స‌భ్యుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి అప్పటి ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోలేదు. తొలి కేబినెట్ లోనే కాదు, ఆ తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఆర్కేకు జగన్ మొండి చేయే చూపారు. అయినా ఓర్చుకుని ఆర్కే జగన్ కోసం నిలబడ్డారు.   వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కంటే ఆళ్ల రామకృష్ణారెడ్డే  అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై ఎక్కువగా పోరాడారు. నూతన రాజధానికి అతి దగ్గరలో ఉండే ఆర్కే.. అదే స్థాయిలో  తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఇంకా చెప్పాలంటే జగన్ కోసం సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉన్న ఆర్కే సూటిగా చంద్రబాబుతోనే తలపడ్డారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగి తెలుగుదేశం నేతలు, అమరావతిపై కూడా వ్యక్తిగతంగా కేసులు వేశారు. అలాంటి నేత వైసీపీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారంటే జగన్ ఆయనను ఎంతగా పక్కన పెట్టేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.  అయితే ఆర్కే రాజీనామా వెనక‌ చాలా  కార‌ణాలు ఉన్నాయని అంటున్నారు. వీటిని ఆర్కే పైకి చెప్ప‌క‌ పోయినా వైసీపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నది అందరికీ అర్ధమైపోయింది.  వాస్తవానికి ఆర్కేను పక్కన పెట్టేయడానికే  టీడీపీ నుంచి వ‌చ్చిన గంజి చిరంజీవికి జగన్ ప్రాధాన్యత పెంచుతూ వచ్చారు.  ముందుగా చిరంజీవిని వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా, తరువాత ఆప్కో చైర్మన్ గా నియమించారు. దీంతో  మంగళగిరిలో గంజి చిరంజీవి ఒక  అధికార కేంద్రంగా మారిపోయారు.  ఆ తర్వాత గత ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వేమారెడ్డిని  తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో వేమారెడ్డి మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దానిని చిరంజీవితో ప్రారంభింపచేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో గ్రూపు కట్టారు. అన్నీ తెలిసినా చూస్తూ ఉండడం తప్ప ఆర్కే ఏమీ చేయలేకపోయారు.  చివరికి చిరంజీవినే  మంగళగిరి నియోజకవర్గ ఇన్ చార్జిగా ప్రకటించడంలో ఆర్కే ఇక రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. రాజీనామా చేసేశారు. ఇక ఇప్పుడు ఆయన అడుగులు ఎటు అన్నదానికి మంగళగిరిలో తన ఆధ్వర్యంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫొటోలు తీసేయడమే కాకుండా, వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలతో పాటు.. నేడో, రేపో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నట్లుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ షర్మిల ఫొటోలు కూడా పెట్టడం ద్వారా తేటతెల్లం చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించనున్నారన్న వార్తల నేపథ్యంలో తాను షర్మిల వెంట నడవడానికి నిర్ణయించుకున్నట్లు ఆర్కే తన చర్య ద్వారా స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరగానే ఆర్కే బాటలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా నడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషించిన సంగతి తెలిసిందే.    కాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన  తర్వాత ఇన్నాళ్లకు ఆళ్ల తొలిసారిగా గళం విప్పారు. పార్టీలో తనను పొమ్మన లేకపొగబెట్టారని కుండబద్దలు కొట్టారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తే తానూ ఆమె వెంటే నడుస్తానని మంగళగిరిలో విలేకరుల సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. తాను జగన్ ను నమ్ముకుని వైసీపీ కోసం ఎంతో చేశారననీ, సర్వం పోగొట్టుకున్నాననీ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా షర్మిల ఏపీ రాజకీయాలలోకి వస్తే తాను ఆమె వెంటే ఉంటానని చెప్పారు.  తన రాజీనామా ఆమోదించడం, ఆమోదించకపోవడం అన్నది వాళ్లిష్టం అన్న ఆళ్ల తాను  స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా ఇచ్చానన్నారు.

జానీకి జగన్ అంటే ఇష్టం..మళ్లీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి...

మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల హవా పూర్తయ్యింది. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికల హవా మొదలయ్యింది. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్స్ ని పరిష్కరించాలంటూ ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే వాళ్ళ పోరాటానికి మద్దత్తు తెలిపారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఢీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఆయన అటు సినిమా రంగంలోనే  కాకుండా సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఎప్పుడు  నెల్లూరు  వచ్చినా సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కాపు సామజికవర్గ నేతలను కలుస్తూ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా   నెల్లూరులో జరిగిన అంగన్వాడీల ధర్నాలో జానీ మాస్టర్ పాల్గొని వారి పోరాటానికి మద్దతు తెలిపారు. అలాగే అంగన్వాడి కార్యకర్తల పోరాటంలో అసువులు బాసిన రమణమ్మ అనే కార్యకర్త కుటుంబానికి రూ.70 వేల ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొని మానసిక ఒత్తిడితో అంగన్వాడీ కార్యకర్త చనిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే వెంటనే  ప్రభుత్వం వాళ్ళ  డిమాండ్లను పరిష్కరించాలన్నారు జానీ మాష్టర్. 2024 ఎన్నికల్లో  పోటీ చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు  ‘తెలీదు సార్. నుదుటి మీద ఎలా రాసుంటే అలా జరుగుతుంది’ అని చెప్పారు. ఇప్పుడు మద్దతు ఏ పార్టీకి ఇస్తున్నారు ? అని మరో రిపోర్టర్ అడగగా.. జనసేన తరఫున వచ్చారని అందరూ అంటున్నారు.. మీరేమంటారు అని మీడియా ప్రశ్నించడంతో ..‘నేను మళ్లీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోంటి. రాంగోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జానీ మాష్టర్‌కి జగన్ గారంటే అంత ఇష్టం మున్ముందు ఏం జరుగుందో నేను తర్వాత చెప్తాను’ అని వెల్లడించారు.

తూర్పు వైసీపీలో ముసలం.. జ్యోతుల చంటిబాబుతో వలసలు షురూ!?

సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు వైసీపీలో వలసల పర్వానికి తెరలేపిందా? అంటే జరుగుతున్నపరిణామాలను బట్టి ఔననే చెప్పాల్సి వస్తోంది. ఇప్పటికే పార్టీలో అసమ్మతి బహిర్గతమై.. అసంతృప్తి తారస్థాయికి చేరి.. తిరుగుబాటుకు రంగం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో జగన్ అండ్ కో ఎమ్మెల్యేలను బుజ్జగించి సముదాయించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదనే చెప్పాలి. కొందరైతే తాడేపల్లి ప్యాలస్ పిలుపు అందుకున్నా ఏవో కారణాలు చెప్పి ముఖం చాటేస్తున్నారు. మరి కొందరైతే వచ్చే ఎన్నికలలో తాము పోటీకి దూరంగా ఉంటామని తేల్చి చెప్పేస్తున్నారు. మరి కొందరు అయిష్టంగానే అధిష్ఠానం మాటను ఔదాల్చుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ వాతావరణం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే తన నియోజకవర్గ మార్పుపై బాహాటంగానే అసమ్మతి వ్యక్తం చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ కు టచ్ లోకి వెళ్లారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ తో ఆయన శుక్రవారం (డిసెంబర్ 29) రాత్రి భేటీ అయ్యారు.  పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన కోసం కాకినాడ చేరుకున్న సంగతి తెలసిందే. పవన్ కల్యాణ్ బస వద్దకు జ్యోతుల   చంటిబాబు శుక్రవారం (డిసెంబర్ 28) రాత్రి పదిన్నర గంటల సమయంలో చేరుకున్నారు. ఆయనతో పాటు దాదాపు గంట పాటు చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వారిరువురి మధ్యా అధికార వైసీపీ సిట్టింగులను స్థానాలు మార్చడంపై చర్చ జరిగినట్లు తెలిసింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చిట్టి బాబును కూడా నియోజకవర్గం నుంచి మార్చేయడానికి జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. జగన్ నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చిట్టిబాబు తన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరీ అధిష్ఠానాన్ని ధిక్కరించారు.  జగన్ తీరుపై తీవ్ర నిరసన తెలిపారు. ఇప్పటికే జ్యోతుల చంటిబాబు వర్గీయులు పలువురు వైకాపాకు రాజీనామా చేశారు జ్యోతుల చంటి బాబు సైతం జగన్ తీరును నిరసిస్తూ త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జ్యోతుల చంటిబాబు పవన్ కల్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ తెలుగుదేశంలోపార్టీ కోసం పనిచేసే సారధి ఎవరు?

తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలుగుదేశం ఉన్నా నాయకులు లేరన్నది కళ్ళకు కనిపిస్తున్న సత్యం. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలకు కొదవ లేదు.  ఆంధ్రా సెటిలర్లతో పాటు తెలంగాణ ప్రజలలో కూడా తెలుగుదేశంపై అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. చెక్కుచెదరకుండా అలాగే ఉంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సమాజం పక్క పార్టీల వైపు చూడాల్సి వచ్చింది కానీ.. అవసరమైతే ఇప్పుడైనా తెలుగుదేశం జెండా చేత పట్టేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. నేటికీ చెక్కు చెదరకుండా గ్రామ గ్రామాన కనిపిస్తున్న తెలుగుదేశం జెండా దిమ్మలే అందుకు నిదర్శనం. పదేళ్లుగా తెలుగుదేశం ఇక్కడ యాక్టివ్ లేకపోయినా ప్రతి ఏడాది జెండా దిమ్మకి రంగులేసి, జెండా ఎగరేసి పండగ జరిపే అభిమానం మాత్రం కనిపిస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికలలో కూడా తెలుగుదేశం జెండాలు రెపపలాడాయి. తెలంగాణలో పోటీచేసిన అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా చేతబట్టాల్సిన పరిస్థితి కనిపించింది. మరి ఇంతటి అభిమానం ఉన్న పార్టీకి అధ్యక్షుడు ఎవరు? ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సగటు తెలుగుదేశం అభిమానిని వేధిస్తున్న ప్రశ్న.  బలమైన కార్యకర్తలున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చెప్పుకోదగ్గ నేతలు లేరు. కానీ  ఉన్న వారిలో నేనంటే నేను అధ్యక్షుడిని కావాలంటూ పరితపించేవారు ఎక్కువయ్యారు. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నదే పదిమంది నేతలు కాగా.. వారిలో రాష్ట్రస్థాయి ఉన్న నేతలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ, ఉన్న వారిలో ఒకరిద్దరు మినహా అందరూ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పట్టుమని పక్కన నలుగురు కార్యకర్తలు, అనుచరులు లేకపోయినా తమను తాము నాయకులుగా చెప్పుకుంటూ అధ్యక్ష పదవి కోసం అర్రులు చాస్లూ పైరవీలు చేస్తున్నారు. ఇంకొందరైతే పక్క రాష్ట్రంలో ఉంటూ కూడా తెలంగాణ రాష్ట్ర టీడీపీకి అధ్యక్ష పదవి కోసం ఆశపడుతున్నారు. మరి అందరూ పల్లకి  ఎక్కాలంటే  మోసే వారెవరన్నది ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. కనీసం వారి స్థాయి కూడా ఆలోచించకుండా కొందరు అధ్యక్ష హోదా కోసం పరితపిస్తున్నారు. వీరిని చూస్తే రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవి అంటే అంత చులకన అయిపోయిందా అనిపించకమానదు.   రాష్ట్ర స్థాయి పదవి అంటే కాస్త అర్ధబలం, అంగబలం ఉండాలి. ఒక్కోసారి అధిష్టానంతో కూడా పనిలేకుండా సొంత నిధులు ఖర్చు చేసి పార్టీని బలోపేతం చేయాల్సి వస్తుంది. కానీ, ఇప్పుడు పదవికి పోటీ పడేవారిలో చాలామంది  నలుగురు కార్యకర్తలను పోషించే స్థోమత కూడా లేని వారు. పోనీ కార్యకర్తలలో మంచి పేరు, పరిచయాలు అయినా ఉన్నాయా అంటే అదీ లేదు. మరి ఏమి చూసుకొని వారు అధ్యక్ష పదవి ఆశిస్తున్నారన్నది సగటు కార్యకర్తను వేధిస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీ అయి   రెండు నెలలు కావోస్తున్నది. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నాక తర్వాత ఇప్పటి వరకూ ఆ పదవిని భర్తీ చేయలేదు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండడం, తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అంత హైరానా పడాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ, ఏపీలో సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ సమయంలో పార్టీ పెద్దల ఫోకస్ ఏపీ మీదనే ఉంటుంది కనుక ఈలోగా తెలంగాణ అధ్యక్షుడి నియామకం పూర్తి చేసి పార్టీని అంతో ఇంతో ఇక్కడ యాక్టివ్ చేయాల్సి ఉంది.  దీంతో ఈసారి తెలంగాణ తెలుగుదేశం కోసం బరిలో నిలిచే నాయకులు ఎవరు? పార్టీ కోసం వెన్నంటి నిలిచే నాయకుడు ఎవరు? అన్నది ఆసక్తిగా మారింది. కొన్నాళ్ళుగా ఇక్కడ   పార్టీని మోసం చేస్తూ,   పక్క పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న నాయకులే దొరికారు. అయితే, ఈసారి ఇలాంటి వారి పట్ల చంద్రబాబు అప్రమత్తంగా ఉంటూ అధ్యక్షుడి నియామకంలో జాప్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈసారి అయినా సమర్థమైన నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే ఇక్కడ   మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. ముఖ్యంగా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి, పార్టీలో ఉంటూ ఇతర పార్టీలో సత్సంబంధాలు ఏర్పరచుకున్న వారికి, పట్టుమని పదిమంది కార్యకర్తలను కూడా పోగు చేయలేని వారికి, వివాదాలకు కేరాఫ్ గా నిలిచే వారికి, ఆవేశపరులకు, సోషల్ మీడియా స్టార్లకు, కాకుండా నిజమైన పార్టీ  విధేయులకు అధ్యక్ష హోదా ఇవ్వాల్సి ఉంది. మరి కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకునే నాయకులు ఎవరో.. వారిని ఎప్పుడు నియమిస్తారో వేచి చూడాలి.

సార్వత్రిక ఎన్నికల భయం.. బీజేపీతో దోస్తీకి కేసీఆర్ తహతహ

ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి  అన్న సుమతీ శతకంలోని పద్యంలా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన రాజకీయ లబ్ధి కోసం అవసరానికి మాటలు మార్చేస్తుంటారు. నిన్నటి వరకూ నిప్పులు చెరిగిన నేతలనే  నేడు పొగడ్తల వర్షంలో ముంచెత్తిస్తూ ఉంటారు. నిన్న ఔనన్న మాటని ఏ మొహమాటం లేకుండా నేడు కాదని చెప్పేస్తారు. ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాలు, టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ తొలి ప్రధాని దళితుడే అన్న మాటలను ఆ తరువాత మరెన్నడూ ఆయన కనీసం గుర్తు చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు.  ఇక ప్రస్తుతానికి వస్తే గత రెండున్నర మూడేళ్లుగా ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ మొదలు పెట్టి ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి మోడీ అనర్హుడు, ఆయనను గద్దె దించి ఇంటికి పంపిస్తానని కూడా అన్నారు. బీజేపీనీ బంగాళాఖాతంలో కలిపేస్తానని కూడా అన్నారు. ఈ విమర్శల వెనుక రాజకీయ వ్యూహాలు ఏమైనా కావచ్చు కానీ ప్రధాని హోదాలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీకి  ఆయన మర్యాదపూర్వకంగా స్వాగతం పలకడానికి   కూడా కూడా ఇష్టపడలేదు.    సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత  ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నెలల వ్యవధిలో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికలలో కనీస స్ధానాల కోసం ఆయన బీజేపీ పంచన చేరడానికి అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు పన్నుతున్నారు. వాటిలో భాగంగానే నిన్న మొన్నటి వరకూ బీజేపీపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గొంతు సవరించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎజెండా హిందుత్వను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత సనాతనధర్మానికి, హిందువులకి  వ్యతిరేకం అంటూ కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోస్తుంటే.. ఆమె సోదరుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అయితే అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని ప్రకటించేశారు.   ఇదంతా బీజేపీకి దగ్గరవ్వడానికీ, మోడీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకొనేందుకూ  కేసీఆర్ తెరవెనుక ఉండి పన్నుతున్న వ్యూహంలో భాగంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ సారథ్యంలో బీజేపీ గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందన్న సర్వేల నేపథ్యంలోనే  కేసీఆర్ బీజేపీకి దగ్గరకావడానికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ అంతే రాజకీయ లబ్ధి కోసం అందితే జుట్టు అందకుంటే కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనుకాడరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేవలం ఎన్నికల భయమే కాకుండా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు భయం కూడా తోడవ్వడంతో  మోడీని శరణువేడటం తప్ప మరో గత్యంతరం లేదని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

రెడ్ బుక్ పై నారా లోకేష్ కు సిఐడి నోటీసులు  

రెడ్ బుక్ అంశంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సిఐడి  నోటీసులు ఇచ్చింది. తనకు నోటీసులు అందినట్టు  నారా లోకేష్ ధృవీకరించారు. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారని నారా లోకేష్ అన్నారు. ఈ నోటీసులు వాట్సాప్ ద్వారా జారీ చేశారు. అయితే కోర్టు ద్వారా సమాధానం చెబుతానన్నారు. సిఐడి జారి చేసిన నోటీసుల్లో లోకేష్ హాజరు కావాలని ఎక్కడా లేదు.   ఎవరు ఎవరికైనా రెడ్ బుక్ ఇవ్వొచ్చని చెప్పారు. అక్రమ కేసులు నమోదు చేస్తూ, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాస్తున్నానని లోకేశ్ ఆరోపించారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల సంగతి తేలుస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. నారా లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రెడ్ బుక్ లో మీ పేర్లు రాశానని చెపుతూ పోలీసు విచారణ అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటషన్ లో పేర్కొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? అని సీఐడీ లాయర్ ను కోర్టు ప్రశ్నించింది. వచ్చే నెల తొమ్మిదో తేదీన విచారణ జరుగనుంది.   

ప్రజాపాలన, ప్రత్యర్థులకు మన్నన.. సీఎం రేవంత్ పై ప్రశంసలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి, రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకుని నిండా నెలరోజులు కాలేదు. అయినా అప్పుడే ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కాన్వాయ్ కారణంగా సాధారణ ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడాదన్న ఆదేశాలు ఇవ్వడం ఆయన నిరాడంబరతను తేటతెల్లం చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఇప్పుడు ప్రజాస్వామ్య పోకడలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రాజకీయ విలువలకు రేవంత్ సర్కార్ మళ్లీ వలువలు తొడిగిందన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదులలో వ్యక్తం అవుతోంది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే తమది ప్రజా ప్రభుత్వం అని రుజువు చేసేందుకు కంకణం కట్టుకున్నారా అన్నట్లుగా ఆయన అడుగులు ఉన్నాయి. ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు తొలగించడం నుంచీ, సచివాలయంలోని ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా రేవంత్ ప్రజల మన్ననలు పొందే విధంగా వ్యవహరించారు.  అదే సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యాంరటీల వాగ్దానం అమలు దిశగా వేగంగా కదులుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీమా పదిలక్షలకు పెంపు వంటి హామీలను అధికారపగ్గాలు అందుకున్న వెంటనే అమలు చేయడంతో పాటు మిగిలిన ఆరు హామీల అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పాలనపైనే కాకుండా పార్టీపైన కూడా రేవంత్ పూర్తి స్థాయి పట్టు సాధించినట్లే కనిపిస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కోసం రేవంత్ తో చివరి క్షణం వరకూ పోటీ పడిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే విధంగా తనకు కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ పగ్గాలు అప్పగించిన క్షణం నుంచి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రేవంత్ కు వ్యతిరేకంగా పని చేయడమే ఎజెండాగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కేబినెట్ లోకి తీసుకోవడమే కాకుండా ప్రధానమైన శాఖలను అప్పగించి.. వారిలో తన పట్ల వ్యతిరేకతను తగ్గించుకున్నారు. అదే  విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనను కనీసం అభినందించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంటే రేవంత్ మర్యాదపూర్వకంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.  రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానిని కనీసం కలుసుకోవడానికి కూడా ఇష్టపడని, ప్రొటోకాల్ ను, మర్యాదనూ కూడా పక్కన పెట్టేసిన ముఖ్యమంత్రిని చూసిన తెలంగాణ ప్రజ.. గెలిచిన తరువాత హస్తిన వెళ్లి మరీ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రానికి రావలసిన నిధులు అందించి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన సీఎం రేవంత్ ను అభినందిస్తున్నారు. రాష్ట్రం, కేంద్రం మధ్య సంబంధాలు మెరుగుపడితేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని అంటున్నారు.   అన్నిటికీ మించి అసెంబ్లీ సమావేశాలంటే విపక్షాలను సభ నుంచి బయటకు పంపేసి.. ప్రజాస్వామ్యం కాదు, ఏక పార్టీ స్వామ్యం అన్నట్లుగా ఇన్నాళ్లుగా నడిచిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం అన్నట్లుగా నిర్వహించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాలలో వ్యక్తిగత, రాజకీయ విభేదాలను తావివ్వని సత్సాంప్రదానికి రేవంత్ తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.   తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని, గత ప్రభుత్వంలో జరిగిన పొర పాట్లను సరిచేసుకుంటూనే మెరుగైన పాలనను ప్రజలకు చేరువ చేస్తామని ప్రకటించిన విధంగానే కార్యాచరణ అమలుకు చర్యలు చేపట్టారు.  అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో పాటు, అనేక ఇబ్బందులు, ఇక్కట్లకు కారణమైన గత ప్రభుత్వ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించి లోటుపాట్లను సవరించి అవసరమైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో అవసరమైన మార్పులు చేర్పులూ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.  కొత్త జిల్లాల ఏర్పాటు హేతురహితంగా, మాజీ ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా జరిగిదని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.  ఈ నేపథ్యంలోనే  జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పుల విషయంలో అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమౌతోందని అధికార వర్గాల సమాచారం.   ప్రస్తుతం అమల్లో ఉన్న 33 జిల్లాల విషయంలోమార్పులు, చేర్పులన్నీ ప్రజాభిప్రాయం మేరకే జరపాలని ప్రభుత్వం భావిస్తోందనీ, ఇందు కోసం ప్రతిపాదిత మార్పులు, చేర్పులపై ప్రజాభిప్రాయ సేకరణకు రేవంత్ సర్కార్సమాయత్తమౌతోందని తెలుస్తోంది.  ఈ ప్రజాభిప్రాయ సేకరణ కోసం  ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ అధికారవర్గాలు చెబుతున్నాయి.  ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల సరిహద్దుల మార్పులూ చేర్పులూ చేపట్టాలని రేవంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   

కుప్పంలో చంద్రబాబు రోడ్ షో 

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో  శుక్రవారం టీడీపీ  అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. కుప్పం ప్రజలు  ప్రతీ ఎన్నికల్లో  టిడిపిని గెలిపిస్తున్నారని అన్నారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ దొంగల ముఠాల  లెక్కలు తేల్చుతామన్నారు.  టిడిపి హాయంలో ప్రజల వద్దకు పాలనా, జన్మ భూమి కార్యక్రమాలు  కుప్పం నుంచే శ్రీకారం చుట్టామని చంద్ర బాబు అన్నారు.  వైసీపీ ప్రభుత్వంలో  విచ్చల విడిగా భూ కబ్జాలు జరుగుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వానికి మిగిలింది వంద రోజులేనన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్  అధికారంలోకి వచ్చారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని నా  జీవితంలో  చూడలేదని చంద్రబాబు అన్నారు. టిడిపి అధికారంలో రాగానే నిరుద్యోగులకు మూడు వేల భృతి కల్పిస్తామన్నారు. జగన్ చేతిలో పాలన పిచ్చోడి చేతిలో రాయి అన్నారు. కుప్పం నియోజక వర్గంలో 500 టిడిపి కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదన్నారు. 

మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను సందర్శించిన మంత్రుల బృందం

మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్యారేజీని పరిశీలించారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్​పై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ లక్షకోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోవటం అతిపెద్ద ఘటనగా పేర్కొన్నారు. జరిగిన నష్టానికి ప్రాజెక్టు నిర్మించిన వారే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మేడిగడ్డ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలతోపాటు ప్రాణహిత ప్రాజెక్టు విషయమై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అక్టోబర్‌21న ప్రాజెక్టు కుంగితే ప్రభుత్వం మారే వరకుఘటనపై గత ప్రభుత్వం ఒక్కసారైనా స్పందించకపోవటం బాధాకరమనిఉత్తమ్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పరిణామాలపై కేసీఆర్‌ ఒక్క మాటైనా మాట్లాడలేదని చెప్పారు.  పిల్లర్లు కుంగిపోవడంపై డ్యాం సెఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ లో దెబ్బతిన్న పిల్లర్లను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై సమీక్ష చేస్తున్నామని, మూడు బ్యారేజీలపై అనేక అనుమానాలు ఉన్నాయని, అనుమానాలను తేల్చడానికే సమీక్షలు చేస్తున్నామని, ఆ రోజు జరిగిన విషయాలను అధికారులు ప్రజలకు చెప్పాలన్నారు. మేడిగడ్డలో టెక్నికల్‌గా ఏం జరిగిందో చెప్పాలని అధికారులను నిలదీశారు. ఇంజినీర్లు, అధికారులపై తమకు ఎలాంటి ద్వేషం లేదనిచెప్పారు. కరకట్టలతో ముంపు రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.

జగన్ గెలుపు అసంభవం.. వై నాట్ 175 ఆకాశానికి నిచ్చెనే!

వచ్చే ఎన్నికలలో ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఘోర ఓటమి తప్పదు. ఈ విషయాన్ని  సర్వే సంస్థలే కాదు, పరిశీలకులు, చివరికి వైసీసీ వర్గాలు కూడా తేల్చేశాయి. వైసీపీ ఎన్నికల వ్యూహాలను అందించే ఐ ప్యాక్ కూడా ఇదే విషయాన్ని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నిర్మొహమాటంగా చెప్పేసినట్లు తెలుస్తున్నది. ఇది కాక ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా సీఎంకు అదే నిర్ధారించినట్లు సొంత పార్టీ నేతలే  చెబుతున్నారు. ఇవన్నీ తెలిసే జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు పల్లవి అందుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, జగన్ చేసే తప్పులు, ఒంటెద్దు పోకడలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీట్లు మార్చినా ఈసారి వైసీపీ ఓడిపోవడం తధ్యమని సొంత పార్టీ నేతలే గట్టిగా భావిస్తున్నారు. ఆమాటకొస్తే అసలు ప్రజలలో అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కాదు.. ప్రభుత్వం మీద, సీఎం జగన్ మోహన్ రెడ్డి మీదనే  అంటున్నారు. జగన్ పై ప్రజలలో పీకల వరకు అసంతృప్తి నెలకొందని వైసీపీ వర్గాలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నాయి.  నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే కొంపముంచాయని, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేల స్థానాల మార్పుతో మరో ఘోరమైన తప్పిదం చేస్తున్నారని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.   జగన్ తన వైఫల్యాలను మా మీదకి నెట్టి టికెట్ లేకుండా చేస్తున్నారని టికెట్ దక్కని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా.. అసలు సీఎం తమను పట్టించుకోకపోయినా ఇన్నాళ్లూ తమ తమ నియోజకవర్గాలలో పార్టీని కాపాడుకుంటూ వచ్చామని, ఇప్పుడు అకస్మాత్తుగా తమను మరో నియోజకవర్గానికి  తరిమేస్తే ఎలా నెట్టుకురావాలని  స్థానాలను మార్చిన ఎమ్మెల్యేలు లబోదిబోమంటున్నారు. జగన్ మీద ఎంతో ఆశతో, నమ్మకంతో ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తూ మెజారిటీ సీట్లలో గెలిపిస్తే జగన్ మాత్రం అందరి నమ్మకాన్ని వమ్ము చేశారనీ,  అదే నమ్మకంతో నాలుగేళ్లుగా వైసీపీ కోసం పనిచేసిన ఎమ్మెల్యేలను ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పక్కకి పెట్టేసి తమ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేశారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.  ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రం వాస్తవాన్ని దాచిపెట్టి ఇంకా ప్రజలను, కార్యకర్తలను, నేతలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. రోజా, అమర్నాథ్ లాంటి కొందరు నేతలు ఇప్పటికీ 175కి 175 సీట్లు గ్యారెంటీ అంటూ పలకడం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న చందంగా ఉందని అంటున్నారు. ప్రజలు తమని గొప్పగా చూసుకుంటారని వైసీపీని గెలిపించి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క సాధారణ ప్రజలే కాదు.. సమాజంలో అన్ని వర్గాలు జగన్ మోహన్ రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించారు. అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యుత్ కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరూ జగన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీళ్ళందరికీ జగన్ చాలా చాలా హామీలు ఇచ్చారు. కానీ అవి నెరవేర్చడంలో  మాత్రం ఘోరంగా విఫలం అయ్యారు. ఇప్పటికే   వివిధ వర్గాలు ఆందోళన బాట పట్టాయి. తమ హామీలు, డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె సైరన్ మోగిస్తున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు లాంటి వివిధ వర్గాలు ఓటు అనే ఆయుధంతో జగన్ కు బుద్ది చెప్పాలని తహతహలాడుతూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.   అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచడం పాలన కాదని  జగన్ కు అర్ధమయ్యేలా చెప్పి ఓటమిని గిఫ్ట్ గా ఇవ్వడానికి రెడీ అయిపోయారు.   నిజానికి జగన్   వైఫల్యం ప్రతి విషయంలోనూ తేట తెల్లం అవుతున్నది. రాజధాని లేదు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, అభివృద్ధి లేదు, కనీసం రోడ్లు కూడా సరిగా లేవు. బడుల విలీనం అంటూ విద్యాశాఖను సర్వనాశనం చేశారు. ఆంగ్ల మాధ్యమం పేరిట విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి భవనాలను ఆధునీకరించాల్సి ఉండగా ఇవేమీ లేకుండా మొండిగా విధానాలను తీసుకొచ్చారు. తన ఆర్భాటం, తన ప్రచారం  కోసం, తన రాజకీయ లబ్ధి కోసం   ఒక భాషకి కూడా కులాన్ని అంటగట్టిన మేధావి జగన్. చంద్రబాబు ముద్ర చెరిపేయడం కోసం అమరావతిపై విషప్రచారం చేసిన జగన్.. మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. ఇసుక విధానంతో కార్మికులను రోడ్డున పడేశారు. రివర్స్ టెండరింగ్ తో కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోగా.. ప్రాజెక్టులు ఎక్కడివక్కడే శిధిలమవుతున్నాయి.  ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో వేయడంతో అవి విద్యాసంస్థలకు జమకాక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రామాల నుండి నగరాల వరకూ జగన్ చేసిన మేలు కానీ, ప్రయోజనం కానీ ఒక్కటి కూడా కనిపించడం లేదు.  దీంతో జగన్ గెలుపు అసాధ్యం అసంభవం అని పరిశీలకులు తేల్చేస్తున్నారు. -జ్వాల

కాంగ్రెస్ గూటికి షర్మిల..చీలేది వైసీపీ ఓట్లే!

ఎన్నికలలో ఎప్పుడైనా జయాపజయాలను నిర్ణయించేది తటస్థులే. ఎందుకంటే ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీకే ఓటు వేస్తారు. తటస్థుల ఓట్లు ఎటువైపు పడ్డాయన్నదే విజయాన్ని నిర్ణయిస్తుంది.  ఎన్నికలు హోరోహోరీగా సాగుతే తటస్థుల ఓట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే, ఇండియా   కూటముల మధ్య హోరా హోరీ పోరు తప్పదన్నది పరిశీలకుల విశ్లేషణ. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ కూటమి వైపు తటస్థులు మొగ్గు చూపితే ఆ కూటమి విజయం సాధిస్తుందన్న మాట. అలాగే రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలలో కూడా తటస్థుల మొగ్గే ఏ రాష్ట్రంలోనైనా  అధికారం చేపట్టే పార్టీని నిర్ణయిస్తుంది.  కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో తటస్థులన్న వారే లేకుండా పోయారు. నిన్న మొన్నటి వరకూ తటస్థంగా ఉన్న వారు కూడా జగన్ సర్కార్ అరాచకపాలనతో తమ తటస్థవైఖరి వీడి  తెలుగుదేశం వైపు మారిపోయారు.  ఎన్నికలకు చాలా ముందుగానే  న్యూట్రల్స్ అందరూ జగన్ కు వ్యతిరేకంగా మారిపోవడానికి దోహదం చేసిన కారణం ఏదైనా ఉందంటే అది స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడమే. ఔను ఆ సంఘటనే రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలన్న దానిపై చివరి నిముషం వరకూ తర్జనభర్జనలు పడుతూ పాలనా తీరును నిశితంగా గమనిస్తూ ఉండే న్యూట్రల్స్ తమ  తటస్థ వైఖరి మార్చుకునేలా చేసింది.  14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ, దేశ, రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంగా రాజకీయాలు చేసిన చంద్రబాబును  ఆధారాలు లేకుండా, కేవలం ఆరోపణలతోనే అక్రమంగా అరెస్టు చేయడం పట్ల ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయ్యింది.  ఏపీలో ఆ నిరసనలను అణచివేయడానికి జగన్ సర్కార్ చేసిన యత్నాలపై మరింత ఆగ్రహం పెల్లుబికింది. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఎగసి పడిన ఆగ్రహజ్వాలలను ఎవరూ రగిలించ లేదు, ఆందోళనలను ఎవరూ ఆర్గనైజ్ చేయలేదు. జనం స్వచ్ఛందంగా ఆ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ రోడ్ల పైకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఐదేళ్లు పని చేసిన చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు, అనితర సాధ్యమైన దార్శనికతతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రస్తావిస్తూ అటువంటి నేత అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తటస్థులు సైతం ఆందోళనల్లో అగ్రపీఠిన నిలిచారు.  ఆ సందర్బంగానే వారు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా  ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అందుకే ఏపీలో తటస్థులు అనే వారు లేకుండా పోయారు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే...  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. ఆ వార్తతో జగన్ పార్టీ కాళ్ల కింద నేల కదిలిపోతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు సొంత సోదరి షర్మిల అన్నకు వ్యతిరేకంగా గళమెత్తితే..  ఇప్పటికే మసకబారిన జగన్ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. అంతే కాకుండా జగన్ పార్టీలో ఉన్న అసంఖ్యాక వైఎస్ అభిమానులు షర్మిలకు మద్దతుగా వైసీపీని వీడి కాంగ్రెస్ బాట పట్టే అవకాశాలున్నాయనీ అంటున్నారు. దీంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.  దీంతో జగన్ పార్టీ సామాజిక మాధ్యమ విభాగం తనకు మాత్రమే తెలిసిన రీతిలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే నష్టం విపక్ష  కూటమికే నంటే కొత్త భాష్యం చెబుతోంది. లాజిక్ ను, ఇంగితాన్ని పూర్తిగా వదిలేసి షర్మిల కాంగ్రెస్ చేరిక వల్ల వైసీపీకే లాభం అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ పార్టీ క్యాడర్ ను నమ్మించడానికి నడుంబిగించేసింది. అయితే కనీస హేతుబద్ధత లేని ఆ వాదన పార్టీ కేడర్ ను  ఇసుమంతైనా నమ్మించ లేకపోతోంది సరికదా.. వారిలో మరింత భయాన్ని నింపుతోంది.  ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో షర్మిల కాంగ్రెస్ చేరికపై వస్తున్న వ్యాఖ్యలను ఒక సారి చూద్దాం... షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందనీ, అది వైసీపీకే మేలు చేస్తుందన్నది వైసీపీ మేథావులు వండివారుస్తున్న పైత్యం. అదే ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆ పార్టీ బలోపేతమై..ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలుతుందన్నది ఆ ప్రచార సారాంశం. దీంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల నష్టపోయేది తెలుగుదేశం తప్ప వైసీపీ కాదని గట్టిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయితే ఆ వాదనలోని డొల్లతనం కారణంగా వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం సొంత పార్టీలోనే నవ్వుల పాలౌతోంది.   ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉంటే అంతగా ఓటర్లు అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారు. చివరిగా తటస్థులు ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఏపీలో జగన్ సుందర ముదనష్ట పాలన చూస్తున్న జనం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత న్యూట్రల్ ఓటనేదే లేకుండా పోయింది. ఇక ఇప్పుడు వైసీపీకి మిగిలింది.. ఆ పార్టీకి హార్డ్ కోర్ అని చెప్పుకుని కాలరెగరేస్తున్న కేడర్ మాత్రమే. నియోజకవర్గాల మార్పు ప్రహసనానికి జగన్ తెరలేపిన తరువాత.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే పక్క చూపులు చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలలో అవకాశం లేని వారందరి చూపూ కాంగ్రెస్ వైపే మళ్లుతోంది. ఇప్పుడు ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక విషయానికి వస్తే.. షర్మిల కాంగ్రెస్ లో చేరిక వల్ల చీలేది వైసీపీ ఓట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే.. ఇప్పటికే జగన్ పార్టీకి ప్రత్యామ్నాం ఏమిటన్న విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. వారు ఇప్పుడు షర్మిల చేరారుకనుక కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేదు. అయితే షర్మిల చేరికతో కాంగ్రెస్ కు ఓట్లు పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఆ పెరిగే ఓట్లు వైసీపీ నుంచే ఉంటాయన్నది పరిశీలకుల విశ్లేషణ. గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓటు దాదాపుగా వైసీపీకి మళ్లిపోయింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ చేరికతో ఆ ఓటే తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లుతుంది. అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల భారీగా నష్టపోయేది వైసీపీ మాత్రమే.  ఈ విషయం స్పష్టంగా తెలిసి కూడా డంబాలకు పోతూ వైసీపీ అగ్రనాయకత్వం జనాలను మభ్యపెట్టగలమన్న భ్రమల్లో ఉంది. 

ఆర్జీవీపై  మహిళా కమిషన్ కు బర్రెలక్క ఫిర్యాదు 

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను బర్రెలక్క సీరియస్ గా తీసుకున్నారు. వర్మ వ్యాఖ్యలపై ఆమె తరపు న్యాయవాది రాజేశ్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.  ఈనెల 24న 'వ్యూహం' సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్క గురించి వర్మ చెబుతూ..  'బర్రెలక్క బర్రెలు కాస్తుంది. బర్రెలు ఆమె మాటలు వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు' అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు.  మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే, సినిమాను ఈరోజు విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేయడానికి బర్రెలక్క కొల్హాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతంగా ప్రచారం లభించింది.ఈ ఎన్నికలలో  బర్రెలక్క ఫేమస్ అయినప్పటికీ ఓట్ల రూపంలో బర్రెలక్కకు స్పందన రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి గెలుపొందారు. ఈ ఎన్నికలలో జన సేన పార్టీ కూడా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఎపి ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా వ్యూహం సినిమాకు దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ బర్రెలక్కను కొనియాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జన సేనానికి రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన బర్రెలక్క రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలను ఖండించారు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అని పేర్కొన్నారు. తాజాగా వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ లో రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ పై బర్రెలక్క సీరియస్ అయ్యింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపావర్మ సినిమాలకు దర్శకుడిగా తొలిచిత్రం శివ తర్వాత మరే చిత్రానికి అంత పేరు రాలేదు. ఆయన తన సినిమాల్లో హింస, అశ్లీలం జొప్పించి విమర్శలు మూట గట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో రాజకీయ బయోపిక్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ తన చిత్రాలకు మైలేజ్ వచ్చే కామెంట్స్ చేస్తున్నారు. నైతిక విలువలు లేని రాంగోపాల్ వర్మ తన  ప్రయోజనాల కోసం నిరుద్యోగ సమస్య మీద పోటీ చేసిన బర్రెలక్క ను ప్రశంసించే బదులు ఆమెను చులకన చేసే వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. 

డీకే బాబుతో మాట్లాడితే వైసీపీకి ఉలుకెందుకు?

ఏపీలో అధికార వైసీపీ పరిస్థితి ఇప్పుడు తన నీడను చూసి తానే ఉలిక్కిపడేలా తయారైంది. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా.. చివరికి తమ పార్టీ నేతలను చూసి కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఏమూల చిన్న సంఘటన జరిగినా అది తమ పట్టి ముంచేస్తుందన్న భయంతో వణికిపోతోంది.  ఇక విపక్ష నేత నవ్వితే తనను చూసే నవ్వారని జగన్ భావిస్తున్నారు. ఆయన ఎవరితోనైనా మాట్లాడితే తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నరని ఉలికికులికి పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి కళ్లెదుట సాక్షాత్కరిస్తుండటంతో జగన్ లో కంగారు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. సిట్టింగుల మార్పు విషయంలో నిర్ణయం ఆయన తీసుకుని, అలకలు, అసమ్మతి, అసంతృప్తుల బుజ్జగింపులు, సముదాయింపులను సజ్జల అండ్ కోకు అప్పగించేశారు. అసమ్మతులతో మాట్లాడేపాటి ధైర్యం కూడా జగన్ చేయడం లేదు.  ఈ పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనుండటం ఆయనను మరింత గాభరాపెడుతోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఆయన వందిమాగధులు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని ప్రకటనలు గుప్పిస్తున్నారు. తన సోదరి ఏపీలో రాజకీయంపై జగన్ మాత్రం ఇంత వరకూ స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో బెంగళూరు విమానాశ్రయంలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ముచ్చటించడం జగన్ లో గాభరాను మరింత పెంచింది. డీకే శివకుమార్ కు ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ లో మంచి గుర్తింపు ఉంది. అదీ కాక షర్మిల ఏపీ కాంగ్రెస్ లో క్రీయాశీలంగా వ్యవహరించేందుకు నిర్ణయం తీసుకోవడం వెనుక డీకే ఉన్నారన్న ప్రచారమూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తన అనుంగు మిత్రుడు కేసీఆర్ పార్టీ ఓటమికి దోహదం చేసేలా షర్మిల కాంగ్రెస్ కు మద్దతుగా వైఎస్సార్టీపీని పోటీకి దూరంగా ఉంచడం వెనుకా డీకే ఉన్నారని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అలాగే వ్యూహాత్మకంగా చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని పోటీకి దూరంగా ఉంచడం కూడా కేసీఆర్ ఓటమికి దోహదం చేసిందన్నది వాస్తవం. ఈ అన్నిటింనీ కలిపి చూసుకుని ఇప్పుడు బెంగళూరు విమానాశ్రయంలో డీకే చంద్రబాబును కలిసి మాట్లాడటం తన పుట్టి ముంచడానికే అన్న భయం జగన్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అసలింతకీ ఏం జరిగిందంటే.. గురువారం (డిసెంబర్ 28) చంద్రబాబు బెంగళూరులో  తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రాయినికి చేరుకున్నారు. దాదాపు అదే సమయంలో నాగపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ ఆవిర్భావదినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నాటక  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్ పోర్టులో చంద్రబాబును చూసిన డీకే పరుగుపరుగున ఆయన వద్దకు వచ్చి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సహజంగానే ఇరువురూ రాజకీయ నాయకులు కనుక వారి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే ఉంటుంది. కొన్ని నిముషాల సేపు విమానాశ్రయంలోనే వారిరువురూ  పక్కకు వెళ్లి ముచ్చటించుకున్నారు. అసలు ఇరువురూ బెంగళూరు విమానాశ్రయంలో ఎదురుపడటం కాకతాళీయమే. ఇరువురు రాజకీయ నాయకులు ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం, మాట్లాడు కోవడం అత్యంత సహజం. కానీ  ఇదే వైసీపీ అధినేత గాభరాకు కారణం అవ్వడం మాత్రమే విడ్డూరం.   జగన్ బెంగను, భయాన్నీ సరిగ్గానే అర్ధం చేసుకున్న వైసీపీ సోషల్ మీడియా వింగ్  చంద్రబాబుతో ఢీకే మాట్లాడడంపై వక్రభాష్యాలతో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నది. వాస్తవంగా వారిరువురూ విమానాశ్రయంలో బేటీ కావడం ప్లాన్డ్ గా జరిగింది కాదు. కాకతాళీయంగా ఎదురుపడి మాట్లాడుకున్నారు. నిజంగానే ప్లాన్డ్ గా ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా బహిరంగంగా మాట్లాడుకునే వారు కాదు.  ఈ మాత్రం లాజిక్ ను కూడా పట్టించుకోకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ వక్రభాష్యాల ప్రచారానికి నడుం బిగించేసింది.  

ఇంతింతై.. వటుడింతై.. నారా లోకేష్!

మనకు వ్యతిరేకంగా ఉందనుకొన్న కాలం.. మనకి అన్ని విధాల అనుకూలిస్తోందని చెప్పడానికి ప్రకృతి ఒక్కటే సహకరిస్తే సరిపోదు.. ప్రత్యర్థులు సైతం సహకరించాలి. అలాగే ప్రత్యర్థులతో కలిసి నడిచిన వాళ్లు సైతం మనతో కలిసి వచ్చి అడుగులో అడుగు వేయాలి. అలా అయితేనే కాలం.. మనకు అనుకూలంగా మారబోతోందనే ఓ సందేశం ఇచ్చినట్లు అవుతుంది. ఆ క్రమంలో అందుకోబోయే విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. ఆ విషయం ముందుగానే తెలిసిపోతుంది.  అందుకు ప్రత్యక్షంగా కనిపించే నిలువెత్తు నిదర్శనం లోకేష్ ట్రాన్స్ ఫార్మేషనే. ఆయన తనను తాను మలచుకున్న తీరు, ప్రత్యర్థుల ప్రశంసలు అందుకున్న వైనం లోకేష్ ఎదుగుదలను కళ్లకు కడతాయి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆయన ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారు.     ఏపీ సీఎం  జగన్ సొంత సోదరి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు  షర్మిల.. క్రిస్మస్   సందర్బంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఫ్యామిలీకి పండగ శుభాకాంక్షలు తెలపడమే కాదు.. 2024లో ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలంటూ గిఫ్ట్ ప్యాక్ మీద రాసి మరీ పంపారు. ఆ వెంటనే  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ...  షర్మిలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే  2019 ఎన్నికల  ప్రచారంలో భాగంగా షర్మిల నారా లోకేష్ ను టార్గెట్ చేసుకొని ఎలా మాట్లాడారో.. ఆయనపై ఎలాంటి ఆరోపణలు సంధించారో..  ఎంతటి  విమర్శలు గుప్పించారో అందరికీ తెలిసిందే. కానీ  కాలం ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి షర్మిల లోకేష్ లోని మార్పును, ప్రతిభను గుర్తించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని.. సొంత సోదరుడు  జగన్‌కు శుభాకాంక్షలు తెలపకుండా.. తనకు, తన కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన నారా ఫ్యామిలీకి వైయస్ షర్మిల క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం.. రాజకీయ విశ్లేషకులను సైతం అమితాశ్చర్యానికి గురి చేస్తున్నది. అంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికార పగ్గాలు చేపట్టనుందా? ఆ విషయాన్ని ముందే  షర్మిల పసిగట్టారా? అందుకే.. ఆమె ఆలోచనలు.. నారా చంద్రబాబు నాయకత్వం వైపునకు తిరిగాయా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం అని ప్రత్యర్థి పార్టీలు సైతం చెబుతున్నాయంటే  అందుకు కర్మ.. కర్త.. క్రియ అంతా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేషే. యువగళం పేరిట ఆయన చేపట్టిన పాదయాత్ర.. ప్రజల్లోకి చాలా బలంగా దూసుకుపోయింది. ఈ పాదయాత్ర ఇంతగా విజయవంతమైందంటే.. అందుకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగనే  అరాచక పాలనకు తోడు పాదయాత్రకు అడుగడుగునా కల్పించిన అడ్డంకులేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     2023, జనవరి 27న కుప్పంలో యువగళం పేరిట లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ముందుకు సాగకుండా చేసేందుకు జగన్ ప్రభుత్వం .. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని కుయుక్తులు పన్నిందో.. ఎన్ని అడ్డంకులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాగే నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడును ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు అందరికీ తెలిసినవే. ఆ సమయంలో నారా లోకేశ్ తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించి.. రాజమండ్రి రావడం..  అనంతరం తన తండ్రికి బెయిల్ కోసం ఢిల్లీ వేదికగా న్యాయవాదులతో మంత్రాంగం నెరపడం. అలా 52 రోజుల తర్వాత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం, అనంతరం ఆ కండిషన్ బెయిల్ కాస్తా సాధారణ బెయిల్‌గా మార్చడం,  మరోవైపు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న.. చంద్రబాబుకు నారా లోకేశ్ వెన్నంటే ఉండడం, తండ్రి ఆరోగ్యం కుదుట పడిన తరువాత  పాదయాత్రను పున: ప్రారంభించి.. విశాఖపట్నం జిల్లాలో ముగించడం అందరికీ తెలిసిందే. మొత్తంగా లోకేష్  300 రోజుల పాటు సాగించిన పాదయాత్రలో    ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే... ఇది చేస్తాం.. ఇలా చేస్తామంటూ..  ఎక్కడిక్కడ తనదైన శైలిలో ప్రజలకు సూటిగా,  స్పష్టంగా హామీలు ఇస్తూ ముందుకు సాగడం ద్వారా... ప్రజల మనస్సులను నారా లోకేశ్ ఇట్టే గెలుచుకున్నారు.    ఇంకోవైపు 2014 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. నారా లోకేశ్.. ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో అడుగు పెట్టారు. ఆ క్రమంలో బాబు కేబినెట్‌లో నారా లోకేశ్.. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఐటీ కంపెనీలు ఏర్పాటుకు క్యూ కట్టడమే కాదు.. కియా, హీరో వంటి పరిశ్రమలు సైతం ఏపీలో ఏర్పాటయ్యాయి.  అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి.. ప్రజాక్షేత్రంలో గెలవ లేక.. ఇలా దొడ్డి దారిలో మంత్రి అయ్యారంటూ ఆరోపణలు గుప్పించడమే కాదు.. నారా లోకేశ్  ఆహార్యం, ఆహారంపై కూడా విమర్శలు గుప్పించి, బాడీషేమింగ్ కు సైతం పాల్పడిన వైసీపీ నేతలు ఇప్పుడు లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకుని నాయకుడిగా ఎదిగిన తీరు చూసి నోరేళ్లబెడుతున్నారు.   2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి బరిలోకి దిగిన తనకు ఫలితం ప్రతికూలంగా వచ్చినా లోకేష్ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.... నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు, ప్రతీ మండలంలో ఆరోగ్య సంజీవని పేరిట మొబైల్ ఆరోగ్య కేంద్రాలను  ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీకు.. తోడుగా నేనున్నాంటూ నారా లోకేశ్ ప్రజల మధ్యకు కదలి వస్తున్నారు. మరోవైపు వైసీపీని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆ పార్టీ అధినేత  జగన్‌ వెంట   అడుగులో అడుగు వేసి  నడిచిన.. మంగళగిరి  సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే పదవికే కాదు.. ఆ పార్టీ సభ్యత్వానికి సైతం రాం రాం చెప్పేశారు. ఇక తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్.. పాదయాత్రకు శ్రీకారం చుట్టి తనదైన శైలిలో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు.  ఇప్పటికే లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక జగన్ సొంత సోదరి   షర్మిల సైతం.. నారా ఫ్యామిలీకి క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలే కాదు.. 2024లో మీకు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గ్రీటింగ్స్ సైతం పంపింది.   అంటే...  లోకేష్ నాయకుడిగా ఎదగడం, జగన్ నాయకత్వంలోని వైసీపీలో  కాక రేగి.. కలత చెందడం కాకతాళీయం ఎంత మాత్రం కాదు. లోకేష్ ప్రజాబలం అధికార పార్టీని బెంబేలెత్తిస్తోందనడంలో సందేహం లేదు.   ఇప్పుడు వైసీపీలో విజయం సాధిస్తామన్న నమ్మకం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా అభ్యర్థులను మార్చడం.. పలువురు ఎమ్మెల్యేలను తప్పించి.. కొత్త వారికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామంటూ జగన్ చేస్తున్న హంగామాయే ఆ పార్టీలో ఓటమి భయం ఎంతగా పెరిగిపోయిందో అర్ధమౌతోంది. జగన్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలైతే పోటీయే చేయం బాబోయ్ అని చేతులెత్తేశారు.  ఇంకొంతమంది  పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికీ సైతం రాజీనామా చేసేస్తున్నారు.    ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా నారా లోకేష్ చుట్టూ పరిభ్రమిస్తోంది. అందుకే నారా లోకేశ్ అంటే ఏమటన్నది.. ఆయన పాదయాత్ర చూస్తే తెలుస్తోంది. నారా లోకేశ్ అంటే ఏమటన్నది.. ఆయన వ్యవహారశైలిని చూస్తే అవగతమవుతోంది. నారా లోకేశ్ అంటే ఏమిటంటే... జగనన్న వదిలిన బాణం,  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా  తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల కోసం ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు తెలపడమే కాకుండా.. వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర   చేసిన వైయస్ షర్మిల సైతం లోకేష్ కు క్రిస్మస్‌ విషెస్ చెప్పిన తీరును చూస్తే అర్థమవుతోంది. అంటే నాడు నారా లోకేశ్‌ను చూసి గతంలో నొసలు చిట్లించిన వాళ్లే.. నేడు  లోకేశ్‌కు  కంగ్రాట్స్, గ్రీటింగ్స్ చెబుతున్నారంటే.. పరిస్థితి ఎలా మారిందనేది అర్థమవుతోంది.

జనసేనాని పోటీ కాకినాడ సిటీ నుంచేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. తన వాణిని బలంగా అసెంబ్లీలో వినిపించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. జగన్ సర్కార్ అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాలు, అవినీతిపై బలంగా గొంతు వినిపిస్తున్న పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీ లబ్ధి చేకూరడానికి తాను ఎంత మాత్రం తావివ్వనని ప్రతినపూనారు.  ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. క్షేత్ర స్థాయి నుంచీ జనసైనికులు ఎటువంటి పొరపచ్చాలూ లేకుండా తెలుగుదేశంతో కలిసి నడవాలని పిలుపు నిచ్చారు. ఆయన సైతం చంద్రబాబుతో కలిసి బహింరగ సభలలో పాల్గొంటున్నారు. యువగళం ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు సైతం హాజరయ్యారు. ఇక జనసేన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే స్థానం ఏదన్న విషయంపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. గాజువాక, తిరుపతి, ఉభయగోదావరి జిల్లాలలోని ఏదో ఒక నియోజకవర్గం, తిరుపతి ఇలా చాలా చాలా ఆప్షన్స్ పై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. అయితే జనసేనాని తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  పొత్తులో భాగంగా జనసేన గోదావరి జిల్లాలలోనే ఎక్కువ స్థానాలలో పోటీకి దిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అక్కడ అయితే సామాజిక వర్గ సమీకరణాలతో పాటు, పవన్ కు అభిమానుల సంఖ్య కూడా అధికంగా ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారన్న అంచనాలకు బలం చేకూర్చే విధంగా ఆయన ఇటీవల మూడు రోజుల పాటు కాకినాడలో బసచేసి సమీక్షలు నిర్వహించనున్నారు.  బలం ఉన్న చోటే తాను పపోటీ చేస్తానని, అలాగే పొత్తులో భాగంగా గెలుపు గ్యారంటీ ఉన్న సీట్లనే కోరుతాననీ పవన్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే   పలు సర్వేలు నిర్వహించిన అనంతరం వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేసే స్థానాలపై ఒక స్పష్టతకు వచ్చిన పవన్ కల్యాణ్.. అందుకు అనుగుణంగా క్యాడర్ ను రెడీ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నిటికంటే ముందు తాను పోటీ చేయబోయే స్థానం విషయంలో క్యాడర్ కు ఒక స్పష్టత ఇవ్వాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. కాకినాడ అయితే సామాజికవర్గ మద్దతుతో పాటు.. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి  సవాల్  ను స్వీకరించినట్లూ ఉంటుందని పవన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి సీఎం జగన్  నమ్మినబంటుగా గుర్తింపు ఉంది. అంతే కాక ద్వారంపూడి గతంలో  పవన్ పై   అనుచిత వ్యాఖ్యలతో  ఇంకా చెప్పాలంటే బూతులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో  తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ కూడా చేశారు. అప్పట్లో వ్యూహాత్మక మౌనం పాటించిన పవన్  ఇప్పుడు ద్వారంపూడిపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే పవన్ కల్యాణ్  మూడు రోజుల పాటు ప్రత్యేకంగా కాకినాడలో మకాం వేసి పరిస్థితిని సమీక్షించి, పార్టీని సమాయత్తం చేసి అక్కడ నుంచే పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ద్వారంపూడిని ఓడిస్తే జగన్ ను ఓడించినట్లేనని జనసేన వర్గాలు అంటున్నాయి.  కాకినాడ సిటీ నుంచి పవన్ పోటీలోకి దిగితే జరిగేది అదేనని కూడా చెబుతున్నాయి.