పరారీలో జయప్రద.. గాలిస్తున్న యూపీ పోలీసులు!
posted on Dec 30, 2023 @ 2:15PM
ప్రముఖ నటి, బీజేపీ నేత జయప్రద కోసం పోలీసులు గాలిస్తున్నారు. అవును నిజమే ఆమె పరారీలో ఉన్నారని చెబుతున్న యూపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో జయప్రద నిందితురాలిగా ఉన్న సంగతి విదితమే.
అయితే ఆమెకు ఎన్ని మార్లు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. జనవరి 10న కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో యూపీ పోలీసులు జయప్రదను గాలించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఇంతకీ ఆమెపై కేసు ఏమిటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, దానిని ఉల్లంఘించి ఓ రోడ్డును ప్రారంభించారు. అలాగే ఓ సభలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణకు ఆమె కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా గైర్హాజరు కావడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మీద జయప్రద పరారీ అంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.