జగన్ ఉత్తరాంధ్ర ఆశలు ఆవిరి!
posted on Dec 30, 2023 @ 1:55PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం సమయం నుండే రాయలసీమ తర్వాత తనను కాపాడేది ఉత్తరాంధ్ర మాత్రమే అని భావిస్తూ.. భ్రమిస్తూ వచ్చారు. కోస్తా ఆంధ్రాలో తనకు ఎలాగు గ్రిప్ దక్కదని భావనతో జగన్.. రాయలసీమ, ఉత్తరాంధ్రలను తనకు కంచుకోటగా మలచుకోవాలని భావించారు. అందుకోసమే జగన్ తల్లి విజయమ్మను విశాఖ నుండి పోటీకి దింపగా.. అక్కడి ప్రజలు ఘోరంగా ఓడించి వెనక్కు పంపించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మెజార్టీ ఓటమి వైసీపీకి అక్కడ ఛాన్స్ లేదని అప్పుడే తేటతెల్లం చేసింది. కానీ వైసీపీ ఆశలు మాత్రం చావలేదు. ఏకంగా రాజధానిని ఉత్తరాంధ్రకు తెస్తానని ఇన్నాళ్లు ప్రకటనతో అక్కడి ప్రజలలో ఆశలు కల్పించారు. ముందుగా మూడు రాజధానులంటూ చెప్పినా.. చివరికి విశాఖే రాజధాని అంటూ ప్రకటిస్తూ మురిపెం పెంచారు. కానీ, తీరా ఎన్నికలకు సమయం ఆసన్నమైనా ఇప్పటికీ విశాఖ రాజధాని ఊసేలేదు. కనీసం వైసీపీ నేతలు చెప్పిన విశాఖ నుండి పరిపాలన కూడా అమల్లోకి రాలేదు.
అసలే ప్రజలలో అసంతృప్తి.. పైగా రాజధాని మోసం.. ఇప్పుడు అభ్యర్థుల మార్పు కలిసి ఉత్తరాంధ్ర నేతలు వైసీపీకి బైబై చెప్పేస్తున్నారు. జగన్ ఎలాగైనా విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో పట్టు కోసం పోరాడుతుంటే.. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పలువురు నాయకులు మాత్రం పార్టీకి దూరమవుతున్నారు. వైసీపీ హై కమాండ్ కు ఇది మింగుడు పడడం లేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకకాలంలో నాయకులంతా పార్టీని వీడుతుండడం ఇప్పుడు జగన్ ను కలవరపాటుకు గురి చేస్తోంది. మొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీని వీడగా..ఇటీవల ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతంపార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఇప్పుడు సీతంరాజు సుధాకర్ కూడా పార్టీకి రాజీనామా ప్రకటించారు. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సుధాకర్.. జగన్ కు అత్యంత సన్నిహితుడైన వారిలో ఒకరు. కానీ, పార్టీ నిర్ణయాలతో విభేదించి రాజీనామా చేసేశారు.
పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కోసం పనిచేస్తున్న సుధాకర్.. తొలినుండి విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కొంతకాలం కిందట విశాఖ పట్టభద్రుల స్థానం నుంచి సుధాకర్ ను పోటీ చేయించి.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విభేదాలకు చెక్ చెప్పాలని జగన్ భావించారు. కానీ ఆ ఎన్నికల్లో సుధాకర్ ఓడిపోవడంతో ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూపంలో పోటీ ఎదురయ్యింది. మరోవైపు కోలా గురువులు సైతం ఆశావహుడిగా బయటకొచ్చారు. దీంతో సుధాకర్ కు టికెట్ లేదని హై కమాండ్ తేల్చింది. దీంతో ఆయన పార్టీకి బైబై చెప్పేశారు. అయితే విశాఖలో జరుగుతున్న వరుస పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి.
ఒక్క సుధాకర్ మాత్రమే కాదు ఉత్తరాంధ్ర నుండి డజనుకుపైగా వికెట్లు పడే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పలుచోట్ల సీనియర్లకు టికెట్లు లేవని అధిష్టానం తేల్చడంతో వీరంతా ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంచార్జిల మార్పుపై పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి సహకరించే పరిస్థితి లేదని బహిరంగంగానే తేల్చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా జగన్ విశాఖ ఆశలు ఆవిరైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నేతలున్నా ఉత్తరాంధ్రను వైసీపీకి అనుకూలంగా మలచడంలో ఫెయిలైనట్లు విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఇన్నాళ్లు ఉత్తరాంధ్ర నేతలు ఇబ్బందులు పడగా.. ఇప్పుడు టికెట్ల కేటాయింపులో గందరగోళం, ఇప్పటికే ఖరారైన పార్టీ ఓటమి ఇక్కడ నేతలను పార్టీకి దూరం చేస్తున్నట్లు భావించాల్సి వస్తుంది.