చంద్రబాబుతో భేటీలో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారో తెలుసా?
వైసీపీ ఓటమి ఖరారైపోయింది. ఈ విషయం అందరికంటే బాగా వైసీపీ నేతలకు, కేడర్ కు తెలిసిపోయింది. గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన ప్రతి అంశం, ప్రతి వ్యక్తి ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారిపోయాయి. మారిపోయారు. గత ఎన్నికలలో జగన్ విజయం కోసం కాళ్లరిగేలా పాదయాత్ర చేసిన, గోంతు చించుకుని జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారం చేసిన సొంత సోదరి షర్మిల, జగన్ అరెస్టు సమయంలో రోడ్డుపై బైఠాయించి, కన్నీళ్లు పెట్టుకుని సెంటిమెంట్ రగిల్చిన తల్లి విజయమ్మ ఇప్పుడు జగన్ తో లేదు. అలాగే సొంత బాబాయ్ హత్య, కోడికత్తి దాడి రెండూ నాటి ఎన్నికలలో జగన్ పట్ల జనంలో సానుభూతి కలిగించాయి. ఇప్పుడు ఆ రెండు సంఘటనల వెనుక పాత్రధారి, సూత్రధారులు ఎవరన్నది తేటతెల్లమై ప్రతికూలంగా మారాయి. ఇక గత ఎన్నికలలో తన విజయానికి కర్త, కర్మ, క్రియా అంటూ జగన్ స్వయంగా చెప్పిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన ప్రత్యర్థి శిబిరంలో ఉన్నారు. ఇలా ఎన్నో కలిసి వచ్చి గత ఎన్నికలలో జగన్ కు జనం ఒక్క చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చామా అని తలలు బాదుకుంటున్నారు. మరో చాన్స్ ఇచ్చేదే లేదని ముఖం మీదే చెప్పేస్తున్నారు.
ఇవన్నీ అందరికీ తెలిసినవే.. అయితే జగన్ నాలుగున్నరేళ్లలోనే అందరినీ దూరం చేసుకుని, అందరికీ కానివాడిగా ఎలా మారిపోయారో.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కళ్లకు కట్టినట్లు వివరించారు. అది కూడా అక్కడా ఇక్కడా కాదు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన జగన్ వైఫల్యాలను ఎండగట్టారు. ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ జగన్ తీరు, వైఖరి, అహంకారం, ప్రత్యర్థుల పట్ల శతృపూరిత వైఖరి, ప్రజల పట్ల చులకన భావం ఇత్యాది విషయాలన్నీ ఏకరవు పెట్టారు. జగన్ ప్రస్తుత పరిస్థితికి ఆయన స్వయంకృతాపరాధమే కారణమని కుండబద్దలు కొట్టారు.
తప్పు తన వద్ద పెట్టుకుని ఎమ్మెల్యేలను బలిపశువులు చేయడానికి వెనుకాడని జగన్ తత్వమే ఆయనతో ఎవరూ కలిసి నడవడానికి అవకాశం లేకుండా చేసిందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
జగన్ సిట్టింగులను మార్చడం వల్ల ఏం ఉపయోగం ఉండదనీ, ఒక చోట చెల్లని కాణి ఎక్కడా చెల్లదన్న విషయం జగన్ కు తెలియక కాదనీ, కానీ మ్మెల్యేల అసమర్థతే ఓటమి కారణం అని చెప్పుకోవడానికి మాత్రమే జగన్ ఈ కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్.
ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్ల కాలంలో అన్ని వర్గాల మద్దతునూ కోల్పోయి.. ఇప్పుడు మరో చాన్స్ కోసం నేల విడిచి చేస్తున్న సాము ఆయనను నవ్వుల పాలు చేస్తున్నదే తప్ప ఎటువంటి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపించడం లే దని ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీకి 40 స్థానాలలో కూడా విజయం సాధించే అవకాశాలు లేవనీ, ముందు ముందు పరిస్థితి మరింత దిగజారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనీ చెప్పారు.
బాబుతో భేటీలో ప్రశాంత్ కిషోర్ జగన్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్నదని కూడా వివరించారు. ప్రజా వ్యతిరేకత అంటూ తన పేరు చెప్పి ఎమ్మెల్యేలను మారుస్తున్నారనీ, నిజంగా తానే చెప్పాల్సి వస్తే ప్రజా వ్యతిరేకత అంతా జగన్ మీదనేనని స్పష్టంగా చెప్పి ఉండేవాడిననీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో చెప్పారు. వాస్తవానికి జగన్ తన సమన్వయకర్తల సూచనలూ, సలహాల మేరకే అభ్యర్థులను మారుస్తున్నారు. వైసీపీ వర్గాల సమాచారం మేరకు జగన్ పూర్తిగా సమన్వయకర్తల మీదా, సలహాదారుల మీదా అధారపడ్డారు. తెలుగుదేశం వర్గాల సమాచారం మేరకు బాబుతో జరిగిన భేటీలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలు ఇవే.
జగన్ అహంకారం, మొండితనం, కక్ష సాధింపు చర్యలూ ఇవన్నీ కూడా వైసీపీ పరిస్థితి ఇంతలా దిగజారిపోవడానికి కారణంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు వివరించారు. పర్యటనల్లో పరదాలు, ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు వంటివి ప్రజా వ్యతిరేకత ప్రోది కావడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడవని తాను చెప్పినా జగన్ వినలేదని, ఆ కారణంగానే జగన్ గ్రాఫ్ వేగంగా దిగజారిందని పీకే వివరించారు. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుతో జగన్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందని పీకే చెప్పారు. చంద్రబాబుపై ప్రజాభిమానం ప్రస్ఫుటంగా వెలుగులోకి రావడానికి ఆయనను జగన్ అక్రమంగా అరెస్టు చేయడం దోహదం చేసిందని పీకే వివరించినట్లు సమాచారం.
ఇక లోకేష్ పాదయాత్ర జగన్ పాలనా వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక చర్యలను క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసేలా చేయడంతో పాటు తెలుగుదేశం క్యాడర్ లో చైతన్యానికి కారణమైందని, అలాగే తెలుగుదేశం, జనసేన పొత్తు కూడా క్షేత్రస్థాయి వరకూ చేరిందనీ పీకే బాబుకు వివరించారని తెలుస్తోంది. ఏపీలో చాలా మంది బాబూస్(ఐఏఎస్, ఐపీఎస్) అయిష్టంగానే పని చేస్తున్నారనీ, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని జనంతో పాటు అధికారులు, వారితో పాటు వైసీపీలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలూ, నాయకులూ కూడా ఎదురు చూస్తున్నారని పీకే బాబుకు వివరించినట్లు సమాచారం. ఆ సందర్భంగా చంద్రబాబు కూడా తాను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు తనను రహస్యంగా కలిసి ఇదే విషయాన్ని చెప్పారని అన్నట్లు చెబుతున్నారు.
ఇక వైసీపీ ఎమ్మెల్యేలూ, నేతలూ కూడా ఈ నాలుగున్నరేళ్లుగా నిత్య నరకం అనుభవించారనీ, వారి ఫోన్లపై కూడా నిఘా ఉండటంతో వారు తమ అటెండర్లు, భార్యల ఫోన్ల నుంచి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారనీ పీకే చెప్పారు.
ప్రజలు తనను చూసి, తన పథకాలను చూసి ఓట్లేస్తారన్న భావనలో జగన్ ఉన్నారని, అభద్రతాభావం-భయం ఉన్నందుకే జగన్ ఎవరితో తన అభిప్రాయాలు-వ్యూహాలు పంచుకోరని పీకే పేర్కొన్నారు.
ఏం చేయాలో నాకు తెలుసు. నాకు అన్ని రిపోర్టులూ వస్తాయి. నేను చెప్పింది మీరు చేయండి అని సలహాదారులు, మంత్రులకు జగన్ స్పష్టం చేస్తుంటారనీ, అందుకే ఆయనకు ఎవరూ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయరని పీకే వివరించారు.
ఇక తెలుగుదేశం, జనసేన పొత్తు క్షేత్రస్థాయికి వెళ్లిందని, అభ్యర్ధుల ఎంపిక, ప్రచార వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తే విజయం ఖాయమని పీకే చంద్రబాబుతో చెప్పారు. ఎన్నికలకు నెలముందే జగన్ నియోజకవర్గాలకు నిధులు పంపిణీ చేసే అవకాశం ఉందని, దానిపై దృష్టి సారించాలని పీకే చంద్రబాబుకు సూచించారని చెబుతున్నారు.
ఇక జిల్లాల వారీగా పీకే తెలుగుదేశం విజయావకాశాలపై కూడా చంద్రబాబుకు వివరించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. విజయనగరం జిల్లాలోనే వైసీపీ కొద్దిగా బలంగా కనిపిస్తోందనీ, ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళంలో జిల్లాలు కలిపి వైసీపీకి ఐదుకి మించి స్థానాలు వచ్చే వచ్చే పరిస్థితి లేదనీ, గుంటూరు-కృష్ణా-ప్రకాశం జిల్లాలు మూడూ కలిపినా వైసీపీకి పదికి మించి వచ్చే వాతావరణం లేదని పీకే స్పస్టం చేశారని చెబుతున్నారు. రాయలసీమలోని కడపలో ఐదు సీట్లు వైసీపీ ఖాతా నుంచి టీడీపీలోకి పోవడం ఖాయమని కూడా చెప్పారు. నెల్లూరు-కర్నూలు-చిత్తూరు జిల్లాల్లో టీడీపీ ఆధిక్యత సాధిస్తుందనీ, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఇదారు స్థానాలకు మించి దక్కే అవకాశాలు లేవనీ, అనంతపురంలో అయితే ఒక్క స్థానంలో వైసీపీ గెలిచినా గొప్పేనని పీకే వివరించినట్లు సమాచారం.