జగన్ గెలుపు అసంభవం.. వై నాట్ 175 ఆకాశానికి నిచ్చెనే!
posted on Dec 29, 2023 @ 11:57AM
వచ్చే ఎన్నికలలో ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఘోర ఓటమి తప్పదు. ఈ విషయాన్ని సర్వే సంస్థలే కాదు, పరిశీలకులు, చివరికి వైసీసీ వర్గాలు కూడా తేల్చేశాయి. వైసీపీ ఎన్నికల వ్యూహాలను అందించే ఐ ప్యాక్ కూడా ఇదే విషయాన్ని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నిర్మొహమాటంగా చెప్పేసినట్లు తెలుస్తున్నది. ఇది కాక ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా సీఎంకు అదే నిర్ధారించినట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇవన్నీ తెలిసే జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు పల్లవి అందుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, జగన్ చేసే తప్పులు, ఒంటెద్దు పోకడలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీట్లు మార్చినా ఈసారి వైసీపీ ఓడిపోవడం తధ్యమని సొంత పార్టీ నేతలే గట్టిగా భావిస్తున్నారు. ఆమాటకొస్తే అసలు ప్రజలలో అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కాదు.. ప్రభుత్వం మీద, సీఎం జగన్ మోహన్ రెడ్డి మీదనే అంటున్నారు. జగన్ పై ప్రజలలో పీకల వరకు అసంతృప్తి నెలకొందని వైసీపీ వర్గాలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నాయి. నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే కొంపముంచాయని, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేల స్థానాల మార్పుతో మరో ఘోరమైన తప్పిదం చేస్తున్నారని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
జగన్ తన వైఫల్యాలను మా మీదకి నెట్టి టికెట్ లేకుండా చేస్తున్నారని టికెట్ దక్కని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా.. అసలు సీఎం తమను పట్టించుకోకపోయినా ఇన్నాళ్లూ తమ తమ నియోజకవర్గాలలో పార్టీని కాపాడుకుంటూ వచ్చామని, ఇప్పుడు అకస్మాత్తుగా తమను మరో నియోజకవర్గానికి తరిమేస్తే ఎలా నెట్టుకురావాలని స్థానాలను మార్చిన ఎమ్మెల్యేలు లబోదిబోమంటున్నారు. జగన్ మీద ఎంతో ఆశతో, నమ్మకంతో ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తూ మెజారిటీ సీట్లలో గెలిపిస్తే జగన్ మాత్రం అందరి నమ్మకాన్ని వమ్ము చేశారనీ, అదే నమ్మకంతో నాలుగేళ్లుగా వైసీపీ కోసం పనిచేసిన ఎమ్మెల్యేలను ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పక్కకి పెట్టేసి తమ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేశారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రం వాస్తవాన్ని దాచిపెట్టి ఇంకా ప్రజలను, కార్యకర్తలను, నేతలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. రోజా, అమర్నాథ్ లాంటి కొందరు నేతలు ఇప్పటికీ 175కి 175 సీట్లు గ్యారెంటీ అంటూ పలకడం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న చందంగా ఉందని అంటున్నారు.
ప్రజలు తమని గొప్పగా చూసుకుంటారని వైసీపీని గెలిపించి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క సాధారణ ప్రజలే కాదు.. సమాజంలో అన్ని వర్గాలు జగన్ మోహన్ రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించారు. అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యుత్ కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరూ జగన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీళ్ళందరికీ జగన్ చాలా చాలా హామీలు ఇచ్చారు. కానీ అవి నెరవేర్చడంలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యారు. ఇప్పటికే వివిధ వర్గాలు ఆందోళన బాట పట్టాయి. తమ హామీలు, డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె సైరన్ మోగిస్తున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు లాంటి వివిధ వర్గాలు ఓటు అనే ఆయుధంతో జగన్ కు బుద్ది చెప్పాలని తహతహలాడుతూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచడం పాలన కాదని జగన్ కు అర్ధమయ్యేలా చెప్పి ఓటమిని గిఫ్ట్ గా ఇవ్వడానికి రెడీ అయిపోయారు.
నిజానికి జగన్ వైఫల్యం ప్రతి విషయంలోనూ తేట తెల్లం అవుతున్నది. రాజధాని లేదు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, అభివృద్ధి లేదు, కనీసం రోడ్లు కూడా సరిగా లేవు. బడుల విలీనం అంటూ విద్యాశాఖను సర్వనాశనం చేశారు. ఆంగ్ల మాధ్యమం పేరిట విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి భవనాలను ఆధునీకరించాల్సి ఉండగా ఇవేమీ లేకుండా మొండిగా విధానాలను తీసుకొచ్చారు. తన ఆర్భాటం, తన ప్రచారం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం ఒక భాషకి కూడా కులాన్ని అంటగట్టిన మేధావి జగన్. చంద్రబాబు ముద్ర చెరిపేయడం కోసం అమరావతిపై విషప్రచారం చేసిన జగన్.. మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. ఇసుక విధానంతో కార్మికులను రోడ్డున పడేశారు. రివర్స్ టెండరింగ్ తో కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోగా.. ప్రాజెక్టులు ఎక్కడివక్కడే శిధిలమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో వేయడంతో అవి విద్యాసంస్థలకు జమకాక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రామాల నుండి నగరాల వరకూ జగన్ చేసిన మేలు కానీ, ప్రయోజనం కానీ ఒక్కటి కూడా కనిపించడం లేదు. దీంతో జగన్ గెలుపు అసాధ్యం అసంభవం అని పరిశీలకులు తేల్చేస్తున్నారు.
-జ్వాల