సీఎం రేవంత్ కు కరోనా పరీక్షలు

కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలకు కరోనా వ్యాప్తి కట్టడికి సూచనలు చేసింది. కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జలుబు, దగ్గు జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే వైద్యులు ఆయన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినట్లు సమాచారం. కరోనా కొత్త వేరియంట్ జెఎన్1 వేగంగా వ్యాప్తి చేందుతున్న తరుణంలో రేవంత్ అస్వస్థతకు గురి కావడం, ఆయనకు వైద్యులు కరోనా టెస్టులు చేయడతో కాంగ్రెస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. రేవంత్ కు కరోనా పాజిటివ్ వస్తే ఇటీవలి కాలంలో ఆయనతో సమీక్షల్లో పాల్గొన్న అధికారులు, మంత్రులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.   కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జేఎన్.1 వేరియంట్‌తో పలువురు  ప్రాణాలు కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది. తెలంగాణలో కొత్తగా 12 (డిసెంబర్ 24) కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్‌లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ప్రస్తుతం తెలంగాణలో 38 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం 1322 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున చిన్న పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఉంటే తక్షణమే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. ఇలా ఉండగా రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారనే వార్తల్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది.   సీఎం రేవంత్‌ అస్వస్థతకు లోనయ్యారని,   జ్వరం వచ్చిందని, గొంతు నొప్పితో బాధపడుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.   వాస్తవానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అస్వస్థత కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. 

వైసీపీకి భారీ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా?

ఎన్నికల ముంగిట ఏపీలో అధికార పార్టీ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీకి ఈసారి అధికారం దక్కడం గగనమేనని ఇప్పటికే ఎన్నో సర్వేలు తేల్చేశాయి. వైసీపీ సొంత సర్వేలలో కూడా ఓటమి తప్పదని తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు ఏపీ ప్రజలు సిద్ధమైపోయారు. అయితే  జగన్ మాత్రం ఎలాగైనా కనీసం పరువు నిలుపుకునే స్థానాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆయన వేస్తున్న ఎత్తులు మొదటికే మోసం తెస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.   ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు ద్వారా ప్రజా వ్యతిరేకతను ఏదో ఒక మేరకు తగ్గించుకోవచ్చన్న వ్యూహంతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగు ఎమ్మెల్యేల మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొలి విడతగా 11 మందిని నియోజకవర్గాలు మార్చేసిన జగన్.. ఇప్పుడు రెండో విడతలో 40 మందిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లగా తెరుచుకోని తాడేపల్లి ప్యాలెస్ గేట్లు ఇప్పుడు అభ్యర్థులతో చర్చల కోసం తెరుచుకున్నాయి. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు, జిల్లాల వారీగా ఈ సీట్ల మార్పుపై వైసీపీ పెద్దలు కసరత్తులు చేస్తున్నారు.  కొందరు అభ్యర్థులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా.. మిగతా వారిని వైసీపీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి వారు ఓదార్చి బుజ్జగిస్తున్నారు. జగన్ నిర్ణయాలను కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు తిరుగుబాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  కొందరు సీనియర్లు, మంత్రులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.  ఇంకొందరు అసలు  పోటీకే దూరమని చేతులెత్తేస్తున్నారు. జగన్ కు అంత్యంత సన్నిహితులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇప్పటికే శాసన సభ్యత్వానికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేయగా,   అదే బాటలో ఇప్పుడు మరికొందరు కూడా నడుస్తున్నారు.  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ రాజీనామాకు రెడీ అయిపోయారు.  వీరిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌లు తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు, ఇక  పిఠాపురం ఎమ్మెల్యే పెండం  దొరబాబు జనసేనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ ముగ్గురికీ వైసీపీలో ఈసారి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని జగన్ తేల్చి చెప్పడంతో వీరు ముగ్గురూ పార్టీకే గుడ్ బై చెప్పేయడానికి రెడీ అయిపోయారు.  తమకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు, పార్టీలో చేర్చుకుంటే చాలని వీరు తెలుగుదేశం, జనసేనలకు రాయబారం పంపినట్లు  తెలుస్తున్నది. జగన్ ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని కూడా వారు చెబుతున్నట్లు తెలుస్తోంది.  జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పటికే కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. జనవరి 5న ఆయన సైకిలెక్కేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలో   పర్వత ప్రసాద్ తెలుగుదేశం గూటికి,  పెండం  దొరబాబు జనసేనలోనూ చేరబోతున్నట్లు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది.  గడప గడపకి వైసీపీ, మా నమ్మకం నువ్వే జగన్, సాధికారిక బస్సు యాత్రల పేరిట వైసీపీ గత ఆరు నెలలుగా ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలలో తిప్పారు. ప్రజల నుండి వ్యతిరేకతలు వచ్చినా సర్ది చెప్పుకున్నారు. కొన్ని చోట్ల చీదరింపులు ఎదురైనా  ఓర్చుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేతను ప్రజలు ఎమ్మెల్యేలపై  చూపి చీవాట్లు పెట్టినా ఎలాగోలా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో విజయవంతం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ  చివరికి అధిష్టానం టికెట్లు లేవని చేతులెత్తేయడమో,  లేదంటే ఇక్కడ కాదు మరోచోటకి వెళ్లాలని ఆదేశించడమో చేస్తుండటాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు  జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సొంత నియోజకవర్గంలోనే తమకి పట్టు ఉందని.. స్థానం మారితే తమకి భవిష్యత్ ఉండదని ఎమ్మెల్యేలు ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోకపోవడంతో   ఇక వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని నిర్ణయించుకొని బైబై చెప్పేస్తున్నారు.తెగతెంపులు చేసేసుకుంటున్నారు.  అవతలి పార్టీలలో టికెట్లు దక్కవని తెలిసినా.  ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయినా కనీసం ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని సర్దుకుపోతున్నారు. ఈ ముగ్గురే కాదు కనీసం   ముప్పై మందికి తక్కువ కాకుండా వైసీపీ సిట్టింగు ఎమ్మెల్యేలు  రాజీనామాల బాటలో ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వైసీపీతోనే యుద్ధం.. జగన్ ఓటమే షర్మిల లక్ష్యం!?

జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందా? జగన్ వదిలిన బాణం ఇప్పుడు తిరిగి ఆయనే లక్ష్యంగా దూసుకొస్తోందా?  అప్పుడు అన్న గెలుపు కోసం చెమటోడ్చిన చెల్లెమ్మ ఇప్పుడు ఆ అన్న ఓటమి కోసమే కంకణం కట్టుకున్నారా? అంటే రాజకీయవర్గాల నుంచీ, విశ్లేషకుల నుంచే కాదు.. సామాన్య జనం నుంచి కూడా అవుననే సమాధానం వస్తోంది. అయితే ఎవరిలోనూ పాపం జగన్ అన్న సానుభూతి కనిపించడం లేకపోగా, హమ్మయ్య ఇప్పటికైనా  వాస్తవం గ్రహించి సరైన దిశలో అడుగులు వేస్తున్నారంటూ షర్మిలకు మద్దతు కనిపిస్తోంది.  ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల.. జగన్ జైల్లో ఉండగా ఆ  పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపించారు. అయితే ఇప్పుడు ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి అదే షర్మిల గాఢంగా అదే జగన్ ఓటమిని కోరుకుంటున్నారు. తన అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న షర్మిల.. అదే అన్న ముఖ్యమంత్రిగా ఉండగానే పరాయి రాష్ట్రంలో రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సి వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు చంచల్‌గూడ జైల్లో ఉంటే.. సోదరుడి కోసం రాష్ట్రవ్యాప్తంగా షర్మిల కాళ్లరిగేలా పాదయాత్ర చేశారు. గొంతు చించుకుని పార్టీ కోసం ప్రచారం చేశారు. తీరా జగన్ అధికారంలోకి వచ్చాక మొత్తం సీన్ మారిపోయింది.  షర్మిలను రాష్ట్రం నుంచి తెలంగాణకు తరిమేశారు. పోనీ అక్కడ సొంత కుంపటి పెట్టుకుని తన మానాన తాను వెడుతుంటే.. అక్కడా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.    షర్మిల విషయంలో జగన్ ఏరు దాటేదాకా అన్న సమెతలా వ్యవహరించారని జనం నమ్మారు.   ఇప్పుడు వైఎస్ జగన్ వేరు.. వైఎస్ షర్మిల వేరు.  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ తన భర్త రాష్ట్రమైన తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రవేశం చేసినా, అక్కడ రాజకీయంగా గుర్తింపు కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ, ఆమెకు ఆశించిన రీతిలో ఆదరణ దక్కలేదు. దీంతో తన తండ్రికి గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ గూటికే వెళ్లాలని నిర్ణయించుకోగా.. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, కాంగ్రెస్ పెద్దలను పలుమార్లు కలవడం అన్నీ జరిగిపోయాయి. కానీ, చివరి నిమిషంలో అది జరగలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. అలా ఉండటం ద్వారా జగన్ అనుంగు మిత్రుడైన కేసీఆర్ ఓటమికి పరోక్షంగా సహకరించారు. అప్పుడే షర్మిల నిర్ణయం ఏపీలో వైసీపీకి ఏ మాత్రం నచ్చలేదు. తెలంగాణలో షర్మిల తీసుకున్న నిర్ణయానికి ఏపీలో వైసీపీ నేతలు ఉలిక్కిపడి  ఆమెపై అవాకులు చవాకులు  పేలారు. ఆ ఎన్నికలు అయిపోయాయి. అక్కడ షర్మిల మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆమె సొంత రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. దీంతో సహజంగానే ఆమె అడుగులు ఎటువైపు అనే ఆసక్తి మొదలైంది. నిజానికి ఇప్పుడు షర్మిల రాజకీయ అడుగులు ఏపీలో తీవ్ర ఉత్కంఠగా మారాయి. ఎందుకంటే ఆమె భవిష్యత్ నిర్ణయాలు ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గత కొన్నాళ్ళుగా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నట్లు ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటే.. అన్న వైసీపీకి తీరని నష్టం తప్పదు. కనీసం నాలుగు ఐదు శాతం ఓటింగ్ షేర్ కాంగ్రెస్ దక్కించుకున్నా వైసీపీకి ఘోర ఓటమే ఎదురవుతుంది. దీంతో వైసీపీలో షర్మిల అంటే వణుకు  మొదలైంది. షర్మిల ఇప్పటికే ఏపీలో రాజకీయ పునఃప్రవేశం కోసం ఏర్పాట్లు  చేసుకున్నారని.. సంక్రాంతి తర్వాత షర్మిల  ఏపీలో ప్రత్యక్ష రాజకీయాలలో చురుకుగా వ్యవహరించనున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలు అలా ఉండగానే.. షర్మిల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ఏపీ రాజకీయాలలో పెను సంచలనం కలిగించింది. వైసీపీలో అయితే ఇక తమ పని అయిపోయిందన్న భయాన్ని కలిగించింది. ఈ గిఫ్ట్ ద్వారా షర్మిల తన అన్న జగన్ కు డేంజర్ బెల్స్ మోగించారని, ఆమె ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం కాకుండా నేరుగా జగన్ కు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం గూటికే చేరనున్నారని ఈ గిఫ్ట్ ద్వారా స్పష్టమైన సంకేతాలను పంపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తద్వారా జగన్ కు పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి షర్మిల రెడీ అయిపోయారనీ అంటున్నారు.  షర్మిల తెలుగుదేశం గూటికి చేరడమే కాదు, ఆ పార్టీ అభ్యర్థిగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు ముద్దాయి, తన మరో సోదరుడు వైఎస్ అవినాష్ కు ప్రత్యర్ధిగా పోటీలోకి దిగనున్నారని  ప్రచారం జరుగుతోంది. అందుకు   షర్మిల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపడమే తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో షర్మిల కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పనిచేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాక బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చెబుతూ  కేసీఆర్‌కు ఓ సూట్ కేసు గిఫ్ట్ గా పంపిచారు. అలాగే ఏపీలో ఎన్నికలు జరగబోతున్న వేళ జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నారు.  ఇందుకోసమే ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేశ్‌కు షర్మిల క్రిస్మస్ కానుకలు పంపించారు. తద్వారా తాను తన అన్న జగన్ తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీ అన్న సంకేతాన్ని పంపారు. షర్మిల లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడంపై ఇప్పటికే వైసీపీ నేతల తమకు మాత్రమే చేతనైన భాషలో విమర్శలు ఆరంభించేశారు. షర్మిల తన చర్య ద్వారా వైసీపీ ఓటమిని ఇప్పటికే ఖరారు చేసేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం చెల్లి మద్దతు కూడా పొందలేని జగన్ కు జనం మాత్రం ఎలా మద్దతుగా నిలుస్తారని అంటున్నారు.

కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభకు షర్మిల.. లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ సంకేతం ఇదేనా?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల క్రిస్టమస్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కానుక పంపారు. లోకేష్ కుటుంబానికి క్రిస్మస్ పండుగ‌ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ నోట్ ను కూడా పంపారు. షర్మిల పంపిన క్రిస్మస్ కానుకను స్వీకరించిన నారా లోకేష్ ఈ విషయాన్ని  స్వయంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు ప్రియమైన షర్మిల గారు మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు, మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు.. నూతన సంవత్సరం కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం కోరుకుంటున్నదని ట్వీట్ చేశారు. అలాగే.. షర్మిలకు కూడా లోకేష్‌ గిఫ్ట్‌ పంపారు. ఇప్పుడు ఈ వార్త పెను సంచలనంగా మారింది.  కాంగ్రెస్ లో విలీనం, ఏపీ సారథ్య బాధ్యతలు వంటి విషయాలు వెనక్కు వెళ్లి షర్మిల ఏకంగా తెలుగుదేశం అభ్యర్థిగా కడప నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.    జనం దీనిని ఏపీ రాజకీయాలలో చోటు చేసుకోబోతున్న పెను మార్పులకు, సంచలనాలకు సంకేతంగా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ ను భావిస్తున్నారు.  ఈ విష‌యం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  త‌న అన్న   జగన్ మోహ‌న్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయిన నారా లోకేశ్‌కు ష‌ర్మిల క్రిస్మ‌స్ గిఫ్ట్‌లు పంప‌డం వెన‌క సంకేతం ఏంట‌నే చ‌ర్చ‌లు సహజంగానే తెరమీదకు వచ్చాయి.  గతంలో అన్న‌తో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దిగేందుకు సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టారు. కానీ  చివ‌రి నిమిషంలో ఆమె ట్విస్ట్ ఇచ్చి కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. దీనిపై కూడా అప్పట్లో పరిశీలకులు పలు రకాల విశ్లేషణలు చేశారు. అంతకు ముందు అసలు షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు కూడా కథనాలొచ్చాయి. అందుకు తగ్గట్లు అప్పట్లో చర్చలు, ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ, అనూహ్యంగా విలీనం ప్రస్తావన ఆగిపోవడం, తెలంగాణ ఎన్నికలలో కూడా షర్మిల దూరంగా ఉండటం జరిగిపోయాయి. కాగా, ఇప్పుడు షర్మిలకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే షర్మిల ఏపీ రాజకీయాలలో పునః ప్రవేశం చేయనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు.  ఆ వార్తలు ఒక వైపు కొనసాగుతుండగానే.. ఇప్పుడు  నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ బహుమతులు పంపించడం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు, లేదా విలీనం ప్రతిపాదన సమయంలో షర్మిల రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నాలలో భాగంగానే అప్పట్లో షర్మిల ఈ తరహా ట్వీట్ చేసినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరిగింది.   ఇప్పుడు షర్మిల   లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపారన్న దానిపై పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.  షర్మిల తెలుగుదేశం అండతో లేదా, ఆ పార్టీ అభ్యర్థిగా కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ. దీనిపై   వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. షర్మిలపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పిస్తున్నాయి. వైఎస్ బిడ్డ తెలుగుదేశంలో చేరడమా అంటూ నిలదీస్తున్నాయి. ఇక జగన్ అభిమానినని చెప్పుకునే శ్రీరెడ్డి అయితే షర్మిలపై దూషణల పర్వానికి దిగారు. అయితే సామాజిక మాధ్యమంలో వైసీపీ శ్రేణుల విమర్శలకు, దూషణలకు నెటిజన్లు దీటుగా జవాబిస్తున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, కేంద్ర మంత్రి కాగలిగినపుడు..  కాంగ్రెస్ పార్టీలో సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, సీఎం జగన్ సోదరి షర్మిల తెలుగుదేశం నుంచి పోటీ చేయడం తప్పు ఎందుకు అవుతుందని నిలదీస్తున్నారు. అయితే   పోటీ, తెలుగుదేశం ప్రవేశం వంటి విషయాలపై షర్మిల నుంచి ఇప్పటి వరకూ సమర్ధన కానీ, ఖండన కానీ రాలేదు.   కానీ  ఈ నెల   21  సీఎం జగన్ పుట్టినరోజు వేడుకను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించారు.   వైసీపీ శ్రేణులు భారీగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైసీపీ నేతలతో పాటు ఆయన రాజకీయ ప్రత్యర్ధులు సైతం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.  అయితే జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు లేవు. .   కనీసం సోషల్ మీడియాలో కూడా షర్మిల తన అన్నకు  శుభాకాంక్షలు తెలియజేయలేదు. కానీ  క్రిస్మస్ పండగకు ఏకంగా లోకేష్ కు షర్మిల బహుమతులు పంపించారు. నిజానికి షర్మిల గతంలో వైసీపీ పాదయాత్ర సమయంలో లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలతో పాటు, వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అలాంటి షర్మిల ఇప్పుడు ఇలా బహుమతులు పంపడం ఒక విధంగా జగన్ కు తనకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ రిటర్న్ గిఫ్ట్ పంపడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా షర్మిల లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపించడం జగన్కు షాక్ అనడంలో సందేహం లేదు. మహాభారత యుద్ధంలో ఓటమి ముంగిట ఉన్న దుర్యోధనుడు ఒక్కొక్కరుగా హితులు, సన్నిహితులు బంధువులు దూరం కావడాన్ని తలచుకుని వగచిన సందర్భం గుర్తుకు వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు జగన్ కు కూడా కుటుంబంలో, పార్టీలో అందరూ కాకపోయినా అత్యధికులు ప్రతికూలంగా మారుతున్నారు. గత ఎన్నికలలోతన విజయానికి కర్త, కర్మ, క్రియగా స్వయంగా జగనే చెప్పిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ప్రత్యర్థి శిబిరంతో చేతులు కలిపారు. ఇప్పుడు సొంత చెల్లి షర్మిల కూడా జగన్ కు తాను వ్యతిరేకమని లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ద్వారా తేటతెల్లం చేశారు.

నిర్లక్ష్యపు నీడలో రాయలవారి శాసనం!

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలి శాసనం పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలో మరుగునపడి ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. మాచర్లకు చెందిన వారసత్వ కార్యకర్త సతీష్ పావులూరి,  శివశంకర్, మణిమేల ఇచ్చిన సమాచారం మేరకు  పల్నాడు జిల్లా, మాచర్ల మండలం, కొప్పునూరు వద్ద అటవీ ప్రాంతంలో ఉన్న గుండాల శిథిలాలయం వద్ద భూమిలో కూరుకు పోయిన క్రీ.శ.1516 నాటి నాపరాతిపై చెక్కిన తెలుగు శాసనాన్ని ఆయన ఆదివారం (డిసెంబర్ 24) పరిశీలించారు. ఆ శాసనంలో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు, నాగార్జున కొండలను జయించి పాలిస్తుండగా, ఆయన మహా మంత్రి తిమ్మరుసు చేత, నాగార్జున కొండ సీమను నాయంకరంగా పొందిన స్థానిక పాలకుడు బస్వానాయకుడు, నాగుల వరానికి దక్షిణంగా ఉన్న మల్లెగుండాల గ్రామాన్ని (ప్రస్తుతం ఆ గ్రామం లేదు) స్థానిక తిరువెంగళనాథునికి ఆలయ నిర్వహణకు దానం చేసిన వివరాలున్నాయని శివనాగిరెడ్డి తెలిపారు. ఆ శాసనం చారిత్రక ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించిన ఆయన, నిర్లక్ష్యంగా పడి ఉన్న ఈ శాసనాన్ని కొప్పునూరుకు తరలించి, పీఠంపై నిలబెట్టి చారిత్రక వివరాల బోర్డును ఏర్పాటు చేసి, భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొప్పునూరుకు 5కిలోమీటర్ల దూరంలో నడచి వెళ్లటానికే కష్టమైన ప్రాంతంలో ఉన్న ఈ శాసనం వద్దకు వెళ్లటానికి సహకరించిన దుర్గంపూడి యుగ్నాథరెడ్డి, రమేష్ ఉప్పుతోళ్ల, డి.ఆర్. శ్యాంసుందరరావులకు శివనాగిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

కక్ష సాధింపు సాధనంగా ఎల్ఓసీ? ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు!

దేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర వార్త ఛానల్. జర్నలిజంలో అత్యున్నత విశిష్ట పురస్కారాలు అనేకం అందుకున్న సంస్థ అయిన యన్ డి టివి వ్యవస్థాపకుడు,  సీనియర్ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్ ఆయన భార్య రాధిక రాయ్ 2019 లో ముంబాయి విమానాశ్రయం నుండి విదేశాలకు వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద  యల్‌ఓసి జారి అయ్యిందంటూ సీబీఐ అడ్డుకుంది. నిరాధారమైన అక్రమ కేసులు బనాయించి తనను బెదిరించడానికి పాలకుల పన్నాగంలో భాగమే ఇదని అప్పట్లో ప్రణబ్ రాయ్ ఆరోపించారు.  ఆ తరువాత కొద్ది రోజులకే యన్ డి టివి కొత్త యజమానిగా గౌతమ్ ఆదాని తెరమీదకు వచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జారీ చేసే ఎల్ఓసి ( లుక్ అవుట్  సర్కులర్ ) ఇప్పుడు ప్రత్యర్థులను  అణచివేయడానికి ఉపయోగించడం పెను విషాదం . వ్యవస్థలను , చట్టాలను భ్రష్టు పట్టించి వ్యక్తిగత కక్షలకు ఎల్ఓసి దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. ఎల్ వో సి అనేది ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కు విదేశీ ప్రయాణాన్ని నిరోధించడానికి జారీ చేసే నోటీసు . ఆర్థిక నేరస్తులు, తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు దేశం విడిచి వెళ్ళకుండా నిరోధించడం, నిర్బంధించడం యల్ ఓసీ లక్ష్యం. మనదేశంలో మొట్టమొదటి ఎల్ఓసి 1976లో జారీ అయ్యింది. ఇతర దేశాల్లో ఎల్ఓసిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అమెరికాలో  నో   ఫ్లై లిస్ట్  అని పిలుస్తారు . ఆస్ట్రేలియాలో  డిపార్చర్ ప్రొహిబిషన్ ఆర్డర్  అంటారు.  2019లో సినీ నటుడు శివాజీ అమెరికా ప్రయాణాన్ని దుబాయ్ లో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వీసాను రద్దు చేసి వెనక్కు పంపేసారు . కారణం టివి9 యాజమాన్యంలో తలెత్తిన గొడవలు . రవిప్రకాష్, శివాజి మధ్య వ్యక్తిగత ఆర్థిక లావాదేవిల కారణంగా  అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి  పోలీసు శాఖ నుండి అధికారిక ఈ మెయిల్ కారణం అని శివాజీ మీడియాకు తెలియజేసారు. శివాజీ సంఘ విద్రోహా శక్తి అన్నది ఆ ఇమెయిల్ సారాంశం. కనుచూపుమేరలో శివాజీ అమెరికా వెళ్ళలేరు .  ఎంత అమానవీయం వ్యక్తిగత కక్షలకు వ్యవస్థలను దిగజార్చి వ్యక్తి సేచ్చను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. పాలకుల ఇష్టాయిష్టాలకు లోబడి వ్యవస్థల పని తీరు ఉండటం అన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంత మాత్రం దోహదం చేయదు.    ఇటీవల కాలంలో ఎల్ఓసి జారీలో పారదర్శకతకు పాతర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. 1967 పాస్ పోర్ట్  చట్టాన్ని అనుసరించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఎల్ఓసి జారీ చేసే అధికారం ఉంటుంది . ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరం అయితే పాస్ పోర్ట్ రద్దు చేయడానికి కూడా అధికారం ఉంటుంది.  సిబిఐ , ఈడి ,ఎస్ఎఫ్ఐఓ ( సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్), ప్రభుత్వ బ్యాంకులతోసహా మరో పదిహేను ప్రభుత్వ ఏజెన్సీలకు యల్ఓసి జారీ అధికారం ఉంది. ఒకసారి ఎల్ఓసి జారీ అయితే,   జారీ చేసిన ఏజెన్సీ దాన్ని రద్దు చేసే వరకూ లేదా కోర్టు తీర్పు ద్వారా రద్దు అయ్యే వరకూ ఆ  ఎల్ఓసి   అమలులో ఉంటుంది. ఎల్ఓసి జారీ ప్రక్రియ వ్యక్తిగతంగా   చిక్కులు తెచ్చిపెడుతుంది. అందువల్ల అసాధారణ పరిస్థితిలో మాత్రమే ఎల్ఓసి జారీచేయాలి. అయితే ఇటీవలి కాలంలో  విచక్షణా రహితంగా, రాజకీయ, వ్యక్తిగత కారణాలతో   నేరాలకు పాల్పడని వారిపై  కూడా ఎల్ఓసి జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది . తప్పుడు కేసులు బనాయించడం, లేదా ఉన్న కేసుల్లో సాక్షులు నిందితులుగా మారే అవకాశం ఉందని,  కేసు విచారణలో ఉందని  ఎల్ఓసి జారీ చేస్తున్నారు.  ఇటీవల మార్గదర్శి యం డి  సిహెచ్ శైలజా కిరణ్ తన కుమార్తె డిగ్రీ స్నాతకోత్సవం కోసం అమెరికా వెళ్లారు. ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చే సమయంలో ఏపి సిఐడి  లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది.  శైలజా కిరణ్ వ్యక్తిగత ప్రతిష్ట, మార్గదర్శి విశ్వసనీయత దెబ్బతీయడమే లక్షంగా యల్ఓసి జారీ చేసారని ఆమె తెలంగాణ కోర్టును ఆశ్రయించారు.  కోర్టు రక్షణతో ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుండి  ఇంటికి చేరుకోగలిగారు .   ఎల్ వో సి జారీ చేయబడిన వ్యక్తులకు కనీస సమాచారం ఇవ్వకుండా విమానాశ్రయంలో అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవటం వ్యక్తి స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే.  రాజకీయ కక్షపూరితంగా వ్యక్తుల స్వేచ్చను అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుంది.  చట్టం ఉద్దేశాలకు తూట్లు పొడుస్తూ,  పౌరుల స్వేచ్ఛను హరించడానికి  ఎల్ఓసి కారణం కాకూడదు. తాజాగా  గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బొద్దులూరి యశస్వి అమెరికా నుండి శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే ఏపీ సీఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూడటానికి నాలుగేళ్ల తరువాత స్వదేశానికి వచ్చిన యశస్విని ఏపీ సీఐడీ  అదుపులోనికి తీసుకుంది.  అమానుషంగా అమ్మను ఒక్కసారి చూసి మీ వెంట వస్తాను అని యశశ్వి కోరినా సీఐడి ఎల్ఓసీ అంటూ అదుపులోనికి తీసుకుంది. యశస్విపై ఎల్ఓసీ జారీకి ఒకే ఒక్క కారణం ఆయన జగన్ సర్కార్ విధానాలను  సామాజిక మాధ్యమం వేదికగా ప్రశ్నించడమే.   ప్రశ్నిస్తే లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయడం ఏపీ సీఐడి బరితిగింపునకు, జగన్ సర్కార్ తెంపరితనానికీ  నిదర్శమని పలువురు విశ్రాంత పోలీస్ అధికారులు వ్యాఖ్యానించారు.  చట్టంలో అస్పష్టమైన నియమ నిబంధనల  కారణంగా పదునైన చట్టాన్ని  దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం సరికాదు. యల్ ఓ సి అనేది దేశానికి ఉపయోగపడే సాధనం. తీవ్రమైన ఆర్థిక నేరస్తులు  ఇప్పటికే చాలామంది దేశం దాటి వెళ్లిపోయారు. విదేశాల్లో దాక్కున్న ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి  తీసుకొచ్చే చిత్తశుద్ధి  పాలకుల్లో లేదు.  దేశంలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళకు  సత్వర శిక్షలు పడే అవకాశం కను చూపు మేర కనిపించడం లేదు. పాలకులే నేరగాళ్ళతో కుమ్మక్కుఅవ్వడం లేదా నేరగాళ్లే పాలకులవడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి  పెను ముప్పుగా పరిణమించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి.. జనసేన నమ్ముతుందా?

వైసీపీలో విశ్వాసంగా పని చేసిన వారిని పార్టీకి దూరం చేయడం జగన్ నైజంగా కనిపిస్తోంది. థర్టీ యియర్స్ యిండస్ట్రీ నటుడు పృధ్వీరాజ్ నుంచి తాజాగా మాజీ మంత్రి బాలినేనికి పార్టీలో ఎదురౌతున్న పరిస్థితి వరకూ ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.  ఇక ఇప్పుడు విషయానికి వస్తే జగన్ ను నమ్ముకుని రాజకీయ ప్రవేశం చేసిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోయినట్లే కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన నటుడు పృధ్వీరాజ్ అప్పట్లో పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం కోసం తన స్థాయికి మించి, స్థాయిని మరిచి కూడా కష్టపడ్డారు.   జగన్ ను పొడగటం, ఆయన ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడంలో పరిధులు మరచిపోయారు. ఆ ఎన్నికల సందర్భంగా ఊరూరా తిరిగి అదే పని చేశారు.   పార్టీ ప్రచారంలో  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఇష్టారీతిగా  విమర్శలు గుప్పించారు. అదే ప్రచారమనుకున్నారు. జగన్ ను మొప్పించాలంటే ఆయన ప్రత్యర్థులను తిట్టడం ఒక్కటే మార్గం అని భావించారు.  సరే  రాష్ట్ర ప్రజల దురదృష్టమో ఏమో కానీ  ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్  రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.   సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృధ్విని జగన్   ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి యిచ్చి గుర్తించారు.  ఆ మాత్రం గుర్తింపు చాలనుకున్నారో ఏమో, లేదా ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రత్యర్థులను తిట్టినందుకే ఈ పదవి వచ్చింది. ఇదే కొనసాగిస్తే   జగన్ మెచ్చి మరింత పదవి ఇస్తారని తలంచాడో ఏమో (అలా భావించి యిప్పటికీ ప్రత్యర్థులపై తిట్లపురాణంతో చెలరేగిపోతున్నవారు ఇప్పటికీ వైసీపీలో ఉన్నారు. అలా చెలరేగిపోయి యిప్పుడు పార్టీలో ఎవరికీ పట్టనట్టుగా మిగిలిపోయిన వారూ ఉన్నారు.)    కానీ, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డాడు ఫృధ్వి. చివరకు  అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై థర్టీ  యియర్స్ పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి.అయినా అయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే, పృధ్వీ ఎస్వీబీసీ వైభోగం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయింది.  ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు.   ఎస్వీబీసీ నుంచి  గెంటేసిన తర్వాత  వైసీపీలో పృధ్వీరాజ్ ను పట్టించుకున్న వారు లేరు. ఆయన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గుర్తింపు మొత్తం ఆయన తీరు వల్ల గుండు సున్నా అయిపోయింది. ఎందుకంటే  నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందూ చూసుకోకుండా నోరు పారేసుకున్న  పాపానికి సినీ పరిశ్రమ కూడా ఆయన్ని దూరం పెట్టేసింది. పృధ్వీ రాజకీయ ప్రవేశం చేసే నాటికి  సినీ ఇండస్ట్రీలో ఆయన్ని ఇండస్ట్రీలో ఆయన పీక్ ఫామ్ లో ఉన్నారు. కమేడియన్ గా బ్రహ్మానందంకు ప్రత్యామ్నాయం ఫృధ్వే అంటే అప్పట్లో పరిశ్రమ కూడా భావించింది. అయితే  జగన్ పార్టీలో చేరిన తరువాత ఆయన తీరు, మాటలు, విమర్శల కారణంగా ఇండస్ట్రీ పృధ్విని పట్టించుకోవడం మానేసింది. ఇక నమ్ముకున్న జగన్ పార్టీ కూరలో కరివేపాకులా తీసి పారేసింది. ఆయన వాయిస్ రికార్డ్ బయటకు రావడం వల్లే పార్టీ విసిరి పారేసిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే   దాదాపుగా ఫృధ్వి ఎదుర్కొన్న లాంటి విమర్శలే ఎదుర్కొన్న అంబటి రాంబాబుకు మంత్రిగా పదోన్నతి లభించింది. దీంతో  థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడి బొమ్మ కనిపించింది. అప్పట్లోనే తనపై సొంత పార్టీ వాళ్లే కుట్రపన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు,    పక్క చూపులు  చూశారు. జనసేన పార్టీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలూ చేశారు. జనసేనానిని కలిశాననీ, ఆయన హామీ ఇచ్చారనీ చెప్పుకున్నారు.   ఇక అప్పటి నుంచీ ఆయన మీడియా టాక్ షోలలో, యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పవన్ కల్యాణ్ ను పొగడడమే పనిగా పెట్టుకున్నారు. 2024 ఎన్నికలలో జనసేన 40 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం కూడా చెప్పాడు. అయితే ఇవేమీ ఆయనను జనసేనకు దగ్గర చేసిన దాఖలాలు కనిపించలేదు.  ఎందుకంటే  గతంలో ఇదే థర్టీ యిండస్ట్రీస్ పృద్వీ అందరి కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పైనే వ్యక్తిగత విమర్శలు గుప్పించాడు గుర్తు చేస్తూ జనసైనికులు పృధ్విని దూరంగా ఉంటుతున్నారు.  రాజకీయాలలో విమర్శలూ, ఆ తరువాత పొగడ్తలూ చేయడం నాయకులకు సాధారణమేననీ, గతంలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా చేసిందీ అదే కదా అంటున్న వారు లేకపోలేదు. అయితే, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ స్థాయిని మరచి, మించి చేసిన అతి వలనే జనసేన ఆయనను దూరం పెడుతోందనీ, పెడుతుందనీ పరిశీలకులు చెబుతున్నారు. , అందుకే పృధ్వి అటు ఇండస్ట్రీ, ఇటు జనసేన కూడా దూరం పెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.  తాజాగా జనసేనాని ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ పృధ్వి చేసిన ప్రకటన.. పాపం పృధ్వి అనేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ పృధ్వి జనసేన సభ్యుడు కాదు. పార్టీలో ఆయనకు ఎంట్రీ ఇవ్వలేదు. ఏదో తనమానాన తాను పవన్ కల్యాణ్ పార్టీలో ఉన్నానని చెప్పుటుంటూ తిరుగుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా తాను పోటీకి సిద్ధం అంటూ చేసిన ప్రకటన కమేడియన్ పృధ్విని నవ్వుల పాలు చేసిందనడంలో సందేహం లేదు. అయితే ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా.. తగ్గేదే లే అంటూ  తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమి 135 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో  అద్భుత  విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. యువగళం ముగింసు సందర్భంగా విజయనగరంలో జరిగిన సభ విజయోత్సవ సభలా ఉందన్నారు. మంత్రి రోజా వంటి వారి  నో ర్లు ఫినాయిల్‌తో కడిగిన మారవని, మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించాడు. అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ కు  పనికొస్తారని సెటైర్లు వేశాడు. నిజంగా 175కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసమంటూ నిలదీశారు.  అధికార పార్టీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా కవ్వింపులకు దిగినా ఆవేశాలకు లోను కావద్దంటూ జనసైనికులు సూచించారు.  ఇంతకీ జనసేన తరఫున పోటీకి ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్శికి పార్టీ తరఫున పోటీకి అవకాశం ఇస్తుందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు. 

చంద్రబాబుతో పీకే నాలుగున్నర గంటల భేటీ..విషయమేమిటంటే?

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కంటే వేగంగా మారుతున్నాయి. రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ సిట్టింగులను మార్చేస్తోంది.   ఈ క్రమంలోనే ఈ పార్టీలో ముసలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం వివిధ కార్య‌క్ర‌మాల‌తో దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో హ‌ఠాత్తుగా ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ తెరపైకి వచ్చారు. ఏపీకి వచ్చిన పీకే నేరుగా చంద్ర‌బాబును కలిసి నాలుగున్నర గంట‌లకు పైగా ఆయనతో చ‌ర్చ‌లు  జ‌రిపారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో అలజడి మొదలైంది. ఒకవైపు పీకే మాతృ సంస్థ ఐ ప్యాక్ వైసీపీ కోసం పనిచేస్తుండగానే.. పీకే చంద్రబాబుతో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపింది. ప్రస్తుతం ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉన్న పీకే.. ఇప్పుడు టీడీపీ కోసం పనిచేస్తారా? లేదా?. పని చేసే ఉద్దేశం లేకపోతే ఇంత బహిరంగంగా ఏపీకి వచ్చి ఇన్నేసి గంటల పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చర్చలు జరుపుతారా అన్న అనుమానాలు, సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా పీకే అయితే జరగబోయే ఎన్నికల కోసం టీడీపీతో కలిసి పని చేయడం నిర్ధారణ అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే, మరి పీకేకి ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్న ఐ ప్యాక్ కి సంబంధాలు లేవా? ఉంటే తన సంస్థ ఒక పార్టీకి పనిచేస్తుంటే.. తాను మరో పార్టీ కోసం ఎందుకు పనిచేసేందుకు నిర్ధారించుకున్నారన్నది ఆసక్తిగా మారింది. నిజానికి పీకే 2019 ఎన్నికల తర్వాత ఐప్యాక్ సంస్థను కొంతమంది మిత్రులు, ఇతరుల చేతిలో పెట్టేసి   నుండి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే, ఆ సమయంలో ఐ ప్యాక్ 22 శాతం వాటాను మాత్రం బదిలీ చేయకుండా తన వద్దే ఉంచుకున్నారు. కాగా రాజకీయాలు వేరు, సంస్థ వేరు అని ఆనాడే తన సిబ్బందికి, తన సంస్థ భాగస్వామ్యులకు ప్రశాంత్ కిషోర్ విస్పష్టంగా చెప్పారు.  ఆతరువాత ఆయన  బీహార్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కాగా ఏడాది కిందట తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పీకేను కలిశారు. ఆ సందర్భంగా ఇరువురి మధ్యా జరిగిన చర్చలు  సఫలీకృతమై ఇప్పుడు బాబుతో భేటీ వరకూ వచ్చింది. అయితే  సీఎం జగన్  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఒక సంస్థను స్థాపించి ఐపాక్ సంస్థలో ఉద్యోగులను తన వైపుకు మలచుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఒకింత అసంతృప్తితో ఉన్న పీకే ఇప్పుడు ఇలా తెలుగుదేశం కోసం పనిచేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.  మరి నాలుగున్నర గంటల భేటీలో పీకే చంద్రబాబుతో ఏం చెప్పారు? పీకే చంద్రబాబుకు ఇచ్చిన సలహాలూ, సూచనలేంటి? ఎన్నికల కోసం ఎలాంటి ప్రణాళికలు రచించేందుకు మాట్లాడుకున్నారు? ఇలాంటివి సహజంగానే రాజకీయ వర్గాలకు ఆసక్తిగా మారాయి. అయిత , ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం షో టైం కన్సల్టెన్సీ పేరుతో రాబిన్ శర్మ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో పీకే కూడా టీడీపీ కోసం పనిచేస్తారా అనే చర్చలు జరిగాయి. పీకే కూడా రానున్న ఎన్నికలలోతెలుగుదేశం కోసం పనిచేస్తారు. కానీ  ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా. రాబిన్ శర్మ స్ట్రాటజీలను పీకే వ్యక్తిగతంగా సూపర్ వైజ్  చేస్తూ.. తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. రాబిన్ శర్మ యధావిధిగా పనిచేయనుండగా.. పీకే మరో లెవల్ లో సూపర్ వైజ్  చేయనున్నట్లు తెలుస్తోంది.  ఇక  ఈ భేటీలో పీకే టీడీపీ అధినేతకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ మ‌హిళా ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు సక్సెస్ అవుతున్నాయని.. అలాగే యువత మీద ఫోకస్ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్ పై యువ‌త చాలా ఆవేశంతో ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధిలేక‌ ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. యువ‌త నాడిని ప‌ట్టుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. వారి ఓటు బ్యాంకుపై ఫోకస్ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా నిత్యావ‌ర‌స‌ర ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు, దళితులు, బీసీలపై దాడులు పెరిగిపోయాయని.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోవాల‌ని సూచించారని చెప్తున్నారు.  వచ్చే నెల మొదటి వారంలో పీకే మరోసారి చంద్రబాబును కలవనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఆ భేటీ తరువాత తెలుగుదేశంతో పీకే అనుబంధంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

క్రిస్మస్ పండక్కి సొంతూరికి జగన్.. ప్రజలకి కష్టాలు!

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన సొంత జిల్లా కడప పర్యటనలో ఉన్నారు. శనివారం(డిసెంబర్ 23) కడప జిల్లాకు వెళ్లిన సీఎం మూడు రోజులు అక్కడ పర్యటించనున్నారు. శని, ఆది, సోమవారాల్లో ఈ పర్యటన కొనసాగనుండగా.. సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అలాగే సొంత జిల్లాలో క్రిస్మస్ పండగను జరుపుకోనున్న సీఎం.. ఈ మేరకు వేడుకల్లో కూడా పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో బస చేసిన జగన్.. వైఎస్ఆర్ ఘాట్ లో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించి.. ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయలోని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమై.. గంటన్నర పాటు వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత   ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లోనే బస చేసి సోమవారం(డిసెంబర్ 25) క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మళ్ళీ పులివెందుల చేరుకుంటారు.  ఇక అధికారిక కార్యక్రమాల విషయానికి వస్తే.. జగన్ శనివారం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిమ్స్ ఆవరణంలో క్యాన్సర్, మెంటల్ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని నూతన నిర్మాణ భవనాలను ప్రారంభించారు. అలాగే ఆదివారం(డిసెంబర్ 24) మధ్యాహ్నం 12:30 గంటలకు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.   ఎమ్మార్వో ఆఫీస్, పోలీస్ స్టేషన్, రోడ్డు వైడెనింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. మామూలుగా అయితే, ఇటు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం. మరోవైపు క్రిస్మస్ పండగను కూడా సీఎం సొంత ప్రాంతంలో జరుపుకోనుండడం సొంత జిల్లా ప్రజలు ఆనందించాల్సిన విషయం. కానీ, జిల్లాకు సీఎం జగన్ రాక ఇప్పుడు   ప్రజలకు శాపంగా మారింది. పండగ పూట ఈ జిల్లా ప్రజలకు సీఎం కష్టాలు తెచ్చినట్లుగా భావిస్తున్నారు.  జగన్ సొంత జిల్లా పర్యటన కారణంగా కడప నగరంలోని అన్ని దారులను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ప్రజల రాకపోకలపై తీవ్ర  ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు   నరకయాతన అనుభవిస్తూన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వచ్చే పరిసరాలు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకొని రాకపోకలపై ఆంక్షలు విధించి.. స్థానికంగా ఉన్న వలంటీర్లను, వారు తీసుకొచ్చిన జనాలను దారి పొడవునా నిలబెట్టి జగన్ కు స్వాగతం పలికించారు. ఇందు కోసం తీసుకొచ్చిన జనాలను కొన్ని గంటల పాటు నిలబెట్టారు. స్థానికులను ఆ పరిసరాల్లోకి కూడా రానీయకుండా ఆంక్షలు విధించారు. దీంతో  స్థానికులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. నగరంలోని వివిధ రోడ్లపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర  ఇబ్బందులు పడి గంటల తరబడి రోడ్లపైనే నీరిక్షించాల్సి వచ్చింది. ఎంత  సీఎం వస్తే మాత్రం ఇలా నగరం మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.  జిల్లాకు సీఎం రాక, పోలీసుల ఆంక్షలు, ప్రజల కష్టాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి. ఈశ్వరయ్య తీవ్రంగా మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఈశ్వరయ్య.. జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే రాచరికం గుర్తొస్తుందని విమర్శించారు. రాజు వస్తుంటే దారికి ఇరువైపులా ప్రజలు వంగి వంగి దండాలు పెట్టే విధంగా ఈయన వలంటీర్ల ద్వారా ప్రజలను అలాగే బానిసల్లా నిలబెట్టారని, ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల వద్ద ఉండాలి తప్ప ఇలా పోలీసు బలగాలతో నగరాన్ని వారి అధీనంలోకి తీసుకొని, ప్రజలను నిర్బంధించి వేధించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అలాగే, గతంలో చేసిన అభివృద్ధి పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేయడం, శంకుస్థాపనలు చేసిన వాటికి మళ్ళీ శంఖుస్థాపనలు చేయడం కోసం ఇంత హడావుడి చేయడం ఎందుకని మండిపడ్డారు. కాగా  సీఎం సొంత జిల్లాలో పర్యటించేందుకు కూడా ఈ స్థాయిలో భయపడుతూ ప్రజలపై ఆంక్షలు విధించడంపై ఇటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు  సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా జగన్ ను ఏకిపారేస్తున్నారు. జగన్ సొంత ఊరిలో పర్యటించేందుకు కూడా ఇంతలా భయపడడం పరికిపంద చర్యగా పేర్కొంటున్నారు.

పీకే, చంద్రబాబు భేటీ.. విషయమేంటంటే?

దేశ రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్ ది ఓ ప్రత్యేక పంథా. ఆయన ఏ పార్టీ తరఫున వ్యూహకర్తగా పని చేస్తే ఆ పార్టీ ఆ ఎన్నికలలో విజయం సాధిస్తుంది. 2014 ఎన్నికలలో బీజేపీ, 2019 ఎన్నికలలో వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్. అయితే ఇటీవలి కాలంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త బాధ్యతల నుంచి కాదు కాదు కొలువు నుంచి వైదొలగి బీహార్ లో సొంత కుంపటి పెట్టుకుని తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. అయితే అడపాదడపా మాత్రం ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక తన ఐప్యాక్ ను శిష్యులకు అప్పగించేశారు. అలా ఇప్పటికీ ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ అధికార వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తూనే ఉంది. సర్వేలూ, రహస్య నివేదికలూ ఇస్తూనే ఉంది. అలాగే ఐప్యాక్ నుంచి విడిపోయి షోటైమ్ కన్సల్టెన్సీ అంటూ సొంత కుంపటి పెట్టుకున్న రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నారు. సరే అదలా ఉంచితే..  ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం ఊహకందని మలుపులు తిరుగుతున్నది. సరిగ్గా రెండు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీలో ప్రత్యేక్షమయ్యారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ తో కలిసి  గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రశాంత్ కిషోర్  లోకేష్ వాహనంలోనే  చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు. ఈ అంశమే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.   తెలుగుదేశం పార్టీకి అంతకు ముందు   సునీల్ కనుగోలు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. అంటే అప్పట్లో రాబిన్ శర్మతో పాటు సునీల్  కనుగోలు కూడా  తెలుగుదేశం కోసం పనిచేశారు. ఏకకాలంలో ఇద్దరు వ్యూహకర్తలు టీడీపీ కోసం పనిచేయడం అప్పట్లో  ఓ విశేషంగా రాజకీయవర్గాలలో చర్చ కూడా జరిగింది. అయితే  కొద్ది కాలానికే సునీల్ కనుగోలు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అదలా ఉంచితే సునీల్ కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పని చేసిన వ్యక్తే. ఆ తర్వాత సునీల్ కనుగోలు కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేశారు.  కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో సునీల్ కిషోర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే  ప్రస్తుతం తెలుగుదేశం ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ పని చేస్తున్నారు.  లోకేష్ యువగళం పాదయాత్ర నుండి చంద్రబాబు బస్సు యాత్ర వరకూ.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి నుండి భవిష్యత్తుకు గ్యారంటీ వంటి కార్యక్రమాల వెనుక రాబిన్ శర్మ ఉన్నారని చెబుతారు.  అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ప్రశాంత్ కిషోర్  ఉరుములేని పిడుగులా ఏపీకి వచ్చి చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది.  దీంతో రానున్న ఎన్నికలలో ఆయన  తెలుగుదేశం, జనసేన కూటమి కోసం పని చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.  వాస్తవానికి  ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయబోనని స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచీ ఆయన  ఐ ప్యాక్ ను రుషి రాజ్ సింగ్ నడిపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం  బీహార్ లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర నుంచి విరామం తీసుకున్నారు అది వేరే విషయం. కొద్ది రోజులు క్రితం నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో ఢిల్లీలో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది.  ఆ భేటీలో లోకేష్ పీకేను తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాదారుగా పని చేయాలని ప్రతిపాదించారనీ, అలాగే ఓ సారి చంద్రబాబుతో భేటీ అవ్వాలని కోరారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో అది కేవలం ప్రచారం మాత్రమేనని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు పీకే  చంద్రబాబుతో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ భేటీ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పీకే పని చేయడం, జగన్ బలాలు, బలహీనతలు, వ్యూహాలు, ఎత్తుగడలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో ఆయన తెలుగుదేశంతో చేతులు కలిపితే తమ పుట్టి మునగడం ఖాయమన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది.  అందుకూ ఇంకా చంద్రబాబు, పీకే భేటీ ఎందుకు? వారి మధ్య జరిగిన చర్చలేమిటి? తెలుగుదేశం తరఫున పీకే పని చేస్తారా? చేయరా? అసలు పీకే, బాబు భేటీకి కారణమేమిటి?  అన్న విషయాలేవీ బయటకు రాకుండానే మంత్రి అంబటి రాంబాబు మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రీ ఏం చేయగలడు? అంటూ ట్వీట్ చేసేసి తన అక్కసు వెళ్లగక్కుకున్నారు.  దీనిని బట్టి చూస్తే ఈ భేటీతో   పీకే టీడీపీ కోసం చేస్తారన్న ఆందోళన వైసీపీలో కలిగిందని అవగతమౌతోంది.     ఏపీ రాజకీయాలలో  పీకే, బాబు భేటీ ఒక  న్యూ ట్విస్ట్ అనడంలో సందేహం లేదు. మరి వీరి భేటీ   ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది.

స్వేద పత్రం రేపటికి వాయిదా 

కాంగ్రెస్ విడుదల చేసే  శ్వేత పత్రాలన్నీ బోగస్  అని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందుకే వాటికి కౌంటర్ గా స్వేద పత్రాన్ని రెడీ చేశారు.కాంగ్రెస్ 'శ్వేత పత్రా'నికి ప్రతిగా బీఆర్ఎస్ 'స్వేదపత్రం' విడుదల ఆదివారంకి(డిసెంబర్ 24) వాయిదా పడింది. వాస్తవానికి శనివారం  ఉదయం(డిసెంబర్ 23) 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించారు. కానీ ఈరోజు అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడింది. రేపు(ఆదివారం) ఈ కార్యక్రమం ఉంటుందని, ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో 'స్వేదపత్రం' విడుదల చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వచ్చీ రాగానే గత ప్రభుత్వంపై నిందలు వేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస నివేదికలు సిద్ధం చేసింది. శ్వేత పత్రాల రూపంలో వాటిని అసెంబ్లీలో విడుదల చేసింది. అయితే తమకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో గణాంకాలు ప్రవేశ పెట్టే ఛాన్స్ ఇవ్వాలని. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కోరారు. అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రగతి నివేదికను విడుదల చేయడానికి ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. దీనికి 'స్వేదపత్రం' అనే పేరు పెట్టారు. తెలంగాణ భవన్ లో స్వేద పత్రం విడుదల అని ప్రకటించారు. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించబోమని అంటున్నారు మాజీమంంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపిస్తే సహించేది లేదని చెప్పారు. అందుకే.. జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇస్తామని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ఈరోజు విడుదల కావాల్సిన స్వేదపత్రం రేపటికి వాయిదా పడింది. ఆరు గ్యారెంటీల అమలుని ఆలస్యం చేసేందుకే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రాల ఎత్తుగడ వేస్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. శ్వేత పత్రాలన్నీ బోగస్ అంటున్నారు. అందుకే వాటికి కౌంటర్ గా స్వేద పత్రాన్ని రెడీ చేశారు

కంగారెత్తిస్తున్న కరోనా.. నాలుగో వేవ్?

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పది రోజుల కిందట రోజుకు పదీ ఇరవై లోపు నమోదైన కేసులు తాజాగా వేలల్లోకి చేరాయి. వారం కిందట మొత్తం బాధితుల సంఖ్య వందల్లో ఉండగా నేడు అది వేలల్లోకి చేరింది.గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య శనివారానికి 752 కు చేరింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420 కాగా ఇందులో ఎక్కువ శాతం కేరళలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేసినట్లు తెలిపింది. వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని, వైరస్ బాధితులలో 2,872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు. గోవాలోనూ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు. కొత్త  వేరియంట్‌లు వల్ల శ్వాసకోశ వైరస్ లక్షణాలు అలాగే ఉంటాయని నిపుణులు అంటున్నారు. స్థానికంగా కేసుల సంఖ్య విస్తరిస్తున్న పక్షంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో మాస్క్ వేసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి తగ్గుతుంది. అలాగే తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కొత్త కోవిడ్ వేరియంట్‌తో సంబంధం ఉన్న లక్షణాలు సాధారణమైనవి. జెఎన్ వన్   ఇప్పటికే చెలామణిలో ఉన్న వైవిధ్యాల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి  తలనొప్పి వంటి లక్షణాలు ఉండవచ్చు. చాలా మంది రోగులు తేలికపాటి  శ్వాసకోశ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వేరియంట్ నుండి  నాలుగు నుండి ఐదు రోజులలో బయటపడవచ్చు.

సీట్ల కొట్లాట.. గోదావరి జిల్లాల్లో వైసీపీ దారి గోదారే?

రానున్న ఎన్నికలలో వైసీపీకి ఘోర ఓటమి తప్పదని నిర్ధారణయిపోయింది. వైసీపీ సొంత సర్వేలలోనే ఈ అంశం తేలిపోవడంతో ఆ పార్టీ అధ్యక్షడు జగన్ ఇప్పుడు ప్రక్షాళన చేపట్టారు. ప్రజలలో అసంతృప్తితో ఈసారి అధికారం దక్కడం గగనమేనని తేలిపోగా.. కనీసం పరువు నిలిపే స్థానాలైనా దక్కించుకోవాలని జగన్ ఇప్పుడు ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇందుకు అభ్యర్థుల మార్పు ఒక్కటే వైసీపీకి ఆధారంగా కనిపించినట్లుంది. అందుకే జగన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పు చేస్తున్నారు. మంత్రులు, సీనియర్లు, సన్నిహితులు అనేది కూడా లేకుండా ఎక్కడిక్కడ అభ్యర్థులను మార్చేసి ఇంచార్జిలుగా ప్రకటిస్తున్నారు. మరికొందరికైతే అసలు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో కొందరు రాజీనామాల బాట పడితే.. మరికొందరు తిరుగుబాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అసలే నాలుగేళ్లుగా గ్రూపు రాజకీయాలతో సతమతవుతున్న వైసీపీకి ఇప్పుడు ఈ సీట్ల కొట్లాట తోడై పార్టీలో ఇప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే.. గత ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ గెలిచింది. రెండు ఎంపీ స్థానాలు కూడా దక్కాయి. తూర్పుగోదావరి జిల్లాలోనూ 19 స్థానాలకు గాను వైసీపీ 14 చోట్ల గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరు నెలలకే ఇక్కడ వైసీపీలో ముసలం పుట్టింది. ముందుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌పై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ వైసీపీలో కుమ్ములాటలు పెరిగిపోగా ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య వైరం తీవ్రస్థాయికి చేరి బహిరంగంగానే సవాళ్లు విసురుకున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి ప్రత్యక్ష యుద్దానికి దిగారు. ఈసారి తనకే సీటు దక్కుతుందని ప్రకటించిన ఎంపీ పిల్లి.. వైసీపీ అధిష్టానానికి కూడా అల్టిమేటం జారీచేశారు. మొత్తంగా ఇప్పుడు రామచంద్రాపురం సీటుని మంత్రి చెల్లుబోయినను కాదని పిల్లి ఫ్యామిలీకే కేటాయిస్తున్నారు. మంత్రి వేణును ఇప్పుడు రాజమండ్రికి పంపిస్తున్నారు. కానీ, ఇక్కడ మంత్రి వేణు వర్గం పిల్లితో కలిసే పరిస్థితి లేకపోగా.. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు పిల్లిని ఓడించేందుకు కంకణం కట్టుకోగా మరికొందరు రాజీనామాలకు సిద్దపడుతున్నారు. ఇక రాజమండ్రి అర్బన్ నుంచి ఎంపీ భరత్ ను పోటీ చేయిస్తున్నారు. భరత్ ఎంపీగా పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ వర్గాలతో పాటు అధికారులు, సామాన్య ప్రజలలో భరత్ పై తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడ నుండి పోటీ చేసినా సొంత పార్టీ కార్యకర్తలే సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అమలాపురంలో కూడా మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎంపీ చింతా అనూరాథ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎవరిని ఎక్కడకి పంపినా  ఒకరినొకరు ఓడించుకోవడమే వారి ప్రాధాన్యత అన్నట్లుగా  ఉంది పరిస్థితి. పైగా అసలు స్థానాలు మారిస్తే వీరిరువురూ కూడా  పోటీకి దూరంగా ఉండడం.. లేదంటే రాజీనామాలకు సిద్ధమని చెబుతున్నారు.  పిఠాపురం నుంచి దొరబాబును కాదని కాకినాడ ఎంపీ వంగా గీతను పోటీకి దింపనున్నట్లు తెలుస్తుంది. ఈసారి దొరబాబుకు టికెట్ కష్టమే అంటున్నారు. ఈ నేపథ్యంలో దొరబాబు వర్గం అసంతృప్తితో ఉండగా.. ఈయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది  ఆసక్తిగా మారింది. మంత్రి చెల్లుబోయిన వేణు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబులు తాడేపల్లిలో జగన్ తో సమావేశం కాగా బుజ్జగింపులు చేశారు. కానీ అవేమీ ఫలించలేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబుని కాకినాడ ఎంపీగా, జనసేన నుండి గెలిచి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ని అమలాపురం ఎంపీగా పంపాలని చూస్తున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట, ఉండి, నరసాపురం, భీమవరం, ఏలూరు, చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, గోపాలపురం తదితర నియోజకవర్గాలలో మార్పులు చేస్తున్నారు. క్రిస్టమస్ తర్వాత ఈ మార్పులపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తున్నది.. ఆ తర్వాత గోదావరి జిల్లాలలో వైసీపీ లో ఏం జరుగుతుంది? పరిస్థితి ఎలా మారుతుంది అన్నది ఆసక్తిగా మారింది.  ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తంగా ఐదుగురు నేతలు తిరుగుబాటు జెండా ఎగవేస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ దారి గోదారే అవుతుందని అంటున్నారు.

సీఎంగా జగన్ ఫెయిల్.. రుజువులివే!

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే ఎన్నో సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. వైసీపీకి ఎన్నికల వ్యూహాలను అందించే ఐ ప్యాక్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున అభ్యర్థులను మార్చేసే పనిలో ఉన్నారు జగన్. అయితే  అసలు ఈ స్థాయిలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరగడానికి కారణమేంటి?  సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకింత దారుణంగా ఫెయిలయ్యారు? అనే విశ్లేషణలు సాగుతున్నాయి. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో  పోల్చి చూపుతూ ఏపీలో పాలనా వైఫల్యంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో జగన్ వైఫల్యాలకు ప్రధానంగా నాలుగు అంశాలు ప్రస్ఫుటంగా ప్రస్తావనకు వస్తున్నాయి.  ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యం, పనితీరు  అంచనా వేయాలంటే ముఖ్యంగా నాలుగు అంశాలు చూడాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది ఆ రాష్ట్ర ఆదాయం (జీడీపీ) పెరుగుదల. తలసరి ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయం చూడాలి. అలాగే మానవాభివృద్ధి మరో ప్రధానమైన అంశం.  విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి మానవాభివృద్ధి కిందకి వస్తాయి. తరువాత  పారిశ్రామిక,  సర్వీస్ సేవా రంగాల్లో అభివృద్ధి. అంటే ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి.  అలాగే ప్రజాస్వామ్య స్పూర్తి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలనా  తీరు ఎలా ఉందన్న విషయంలో కీలకం.  అంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాజ్యాంగ సంస్థల బలోపేతం లాంటివి. ఈ పై నాలుగు అంశాలలో తెలంగాణలో కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన, ఏపీలో జగన్ పాలనతో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది.    జీడీపీ పెరుగుదల   విషయంలో  తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.  హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ ఆదాయం ప్రధానంగా దోహదం చేయటం వల్ల ఇది సాధ్య మైంది.  మానవాభివృద్ధిలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. మానవాభివృద్ధి చేసే విషయంలో తెలంగాణ  వెనుకబడింది.  పారిశ్రామిక , సేవా రంగాల్లో కేసీఆర్ పనితీరు మెరుగ్గానే ఉంది.   ప్రజాస్వామ్య స్పూర్తిలో విషయంలో తెలంగాణలో కేసీఆర్  ప్రభుత్వ  వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా కేసీఆర్ పాలనలో జీడీపీ పెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి మెరుగ్గానే ఉన్నాయి.  అదే ఏపీ విషయానికి వస్తే ప్రభుత్వ పనితీరుకు అద్దంపట్టే నాలుగు విషయాల్లోనూ కూడా జగన్ సర్కార్ కనీసం పాస్ మార్కులు కూడా సాధించలేదు.  ఏపీలో జగన్ హయంలో జీడీపీ ఘోరంగా దిగజారిపోయింది. తలసరి ఆదాయం ఏటేటా తగ్గుతూ వచ్చి పాతాళానికి దిగజారిపోయింది. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయడంతో  వారిలో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇక మానవాభివృద్ధిలో తమ సర్కార్ గొప్పగా పని చేస్తోందని జగన్  ఘనంగా చెప్పుకున్నా వాస్తవం మాత్రం అందుకు రివర్స్ లో ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి మానవాభివృద్ధిలో భాగం.  అయితే జగన్ మాత్రం కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచి అదే మానవాభివృద్ధిగా చెప్పుకుంటున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి అంశాల్లో జగన్ సర్కార్ ది ప్రకటనల ఆర్భాటం తప్ప ఇంకేం లేదు.   ఇక, పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు, రవాణా అంశాలలో జగన్ సర్కార్ ది ఘోర వైఫల్యం. ఇక  ప్రజాస్వామ్య స్పూర్తి అన్నది జగన్ పాలనలో కాగడా పెట్టి వెతికినా కనిపించదు.  ప్రభుత్వానికి  ప్రజలతో అసలు సంబంధాలే  లేకుండా తెగిపోయాయి. భావప్రకటనా స్వేచ్ఛ,  అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఇలా ఏ విషయంలోనూ  జగన్ సర్కార్ కు జీరోకు మించి మార్కులు రాని పరిస్థితి ఉంది. అసలు ఏపీలో అసలు రాజ్యాంగం అమలు కావడం లేదంటూ కోర్టులే పలు సందర్భాలలో వ్యాఖ్యానించాయంటే పరిస్థితి ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఇక ముఖ్యమంత్రి జగన్  ప్రజలకి మొహం చూపించకుండా పరదాలు కప్పుకు తిరుగుతూ పాలన సాగిస్తున్నారంటే జగన్ సర్కార్ ప్రజలకు ఎంత దూరమైందో ఇట్టే అర్ధమైపోతుంది.   ఇవి మాత్రమే కాదు జగన్ ఫెయిల్యూర్ అనేందుకు ఇంకా ఎన్నో, ఎన్నో కారణాలు ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి పూజ్యం. పెట్టుబడులు శూన్యం, అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన , విద్య, వైద్యం ఆరోగ్యం, ప్రజా సంక్షేమం  ఏవీ కూడా రాష్ట్రంలో కనిపించని అంశాలు.  ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, దాడులు. ప్రతిపక్ష నేతలు నుండి మొదలుకొని సామాన్య ప్రజలు అన్న తేడా లేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తితే  ఇక అంతే సంగతులు. జైళ్లు నోళ్లు తెరుస్తాయి. లాఠీలు విరుగుతాయి. ఇక సంక్షేమ పథకాల పేరిట బటన్ నొక్కి డబ్బులు పందేరం చేస్తున్నట్లు జగన్ చెప్పుకుంటున్నా.. అదేం గొప్ప విషయం కాదు. జగన్ ప్రతిభా ఏం లేదు. ఒక చేత్తో సొమ్ములు ఇచ్చినట్లే ఇచ్చి.. పన్నుల రూపేణా అంతకు అంతా తిరిగి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అలా వసూలు చేసిన సొమ్మునే  తిరిగి ప్రజలకు పందేరం చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం  మేము డబ్బులు పంచి పెడుతున్నాం కనుక మేం తిట్టినా పడాలి.. కొట్టినా పడాలి.. ఎదురు తిరిగితే సహించేది లేదన్నట్లు పాలన సాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఈ ప్రభుత్వం..  అప్పుల దిబ్బగా, దివాళా రాష్ట్రంగా మార్చేసింది.  ఎస్సీ.. ఎస్టీలపై దాడుల్లో, స్త్రీల అక్రమ రవాణాలో కూడా దేశంలో అగ్రగామిగా ఏపీని నిలబెట్టిన జగన్.. దళితులపై అకృత్యాలు, అరాచకాల విషయంలో కూడా రాష్ట్రాన్ని దేశంలోనే టాప్ లో నిలబెట్టారు. దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సొంత పార్టీ ఎమ్మెల్సీని పక్కన కూర్చోపెట్టుకుని ఫొటోలు దిగారు. ఎంతో కొంత అభివృద్ధి జరిగిన తెలంగాణలో  ప్రజలు కేసీఆర్ ను సాగనంపారు.. అలాంటిది  అభివృద్ధి లేమిని అదనంగా అరాచకం, అవినీతి, అక్రమాలలో రాష్ట్రాన్ని దేశంలోనే టాప్ గా నిలిపిన జగన్ పాలనకు  ప్రజా తీర్పు అనుకూలంగా ఎలా ఉంటుంది? అందుకే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే జగన్ ఓటమి ఖరారైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -జ్వాల

ఉత్తర ద్వార దర్శనం కోసం  కిక్కిరిసిపోయిన ఆలయాలు 

నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశిగా పిలిచే ఈ రోజున ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబున్నాయి.  ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఈ తెల్లవారుజామున 1.45 గంటలకే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్ఎల్ భట్టి, జస్టిస్ శ్యాంసుందర్, జస్టిస్ తారాలా రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ ‌చంద్ గెహ్లాట్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, ఉష, శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లుబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామకృష్ణరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వంటి ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. తెలంగాణలోని  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విష్ణుమూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక్కడ జరుగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే, భద్రాద్రి రామయ్య, వేములవాడ రాజన్న ఆలయాల్లోనూ భక్తులకు స్వామివార్లు ఉత్తర ద్వారం దర్శనమిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల నోటా జనం మాటే.. జగనే ఎందుకు?

నిన్న మొన్నటి వరకూ జనం మాత్రమే జగనే ఎందుకు? అని నిలదీశారు. గడప గడపకు నుంచి మా నమ్మకం నువ్వే జగన్ వరకూ అంటూ వైసీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ జనం నుంచి ఇదే ప్రశ్న వచ్చింది.. ఎమ్మెల్యేలు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఆఖరికి జగన్ సర్కార్ ప్రభుత్వాధికారులను పంపినా జనం అందరినీ ఇదే ప్రశ్న వేసి నిలదీశారు. మా నమ్మకం జగన్ కోల్పోయారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సామాజిక సాధికార యాత్ర అంటూ మంత్రులు బస్సులు వేసుకుని వస్తే.. వారి ముఖం చూడటానికి కూడా జనం ఇష్టపడలేదు. దీంతో వారు ఖాళీ కుర్చీలకే వై  ఏపీ నీడ్స్ జగన్ అంటూ ప్రసంగాలు ఇచ్చేసి మమ అనిపించారు. ఇక ఇప్పుడు ఎన్నికలు మూడు నెలలలో జరగనున్న నేపథ్యంలో ప్రజలకు వైసీపీ నేతలకు కూడా తోడయ్యారు. రాష్ట్రానికి జగనే ఎందుకు, వైసీపీయే ఎందుకు అంటూ ప్రశ్నించడం మొదలెట్టారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం, జగన్ కోసం జనం ఛీత్కారాలను సైతం ఎదుర్కొంటూ నిలబడిన తమకు జగన్ మొండి చెయ్యి చూపడానికి రెడీ అయిపోయే సరికి వారు కూడా జనంతో  కలిసిపోయారు. భయాలనూ, మొహమాటాలనూ వదిలేసి.. జగన్ తీసుకునే అడ్డగోలు నిర్ణయాలకు ఓకే చెప్పడం మా వల్ల కాదని తిరగబడుతున్నారు. నియోజకవర్గాల మార్పు పేరుతో జగన్ ఇష్టారీతిగా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పునకు నడుం బిగిస్తుంటే.. మొజారిటీ ఎమ్మెల్యేలు మేం మారం.. కావాలంటే పోటీ నుంచి తప్పుకుంటాం.. లేదంటే పార్టీ విడిచి స్వతంత్రులుగానో, మరో పార్టీ తరఫునో పోటీలోకి దిగి ప్రజా మద్దతు కోరతాం అంటూ తెగేసి చెప్పేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పార్టీనీ, పార్టీ అధినేతను ధిక్కరించి మరీ తమ గొంతు వినిపించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.  పార్టీపై జగన్ పట్టు జారిపోయిందనడానికి ఇంత కంటే నిదర్శనమేం కావాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నిజమే ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చు, కానీ, నడుస్తున్న చరిత్రను, పడుతున్న కష్టాలను, కళ్ళ ముందు  కదులుతున్న అరాచక పాలన ప్రజలు మరిచి పోతారని, ఎవరైనా అనుకుంటే, అది పొరపాటే అవుతుంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రజల జ్ణాపకశక్తిని తక్కువ అంచనా వేశారు. అలాగే పార్టీ నేతలు తన పట్ల ఇంత కాలం చూపిన విధేయతను చులకనగా చూశారు. దాంతో జనం, పార్టీ నేతలూ కూడా మీ అవసరం మాకు లేదని తెగేసి చెప్పే పరిస్థితి స్వయంగా తెచ్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజానికి జగన్ నాలుగున్నరేళ్ల  పాలనలో రాష్ట్రం అన్ని విధాలా దిగజారిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. అభివృద్ధి అనవాలే లేని రాష్ట్రంగా మిగిలింది. వాస్తవానికి రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది అరాచకత్వం, అవినీతి మాత్రమే. ఆ కారణంగానే   పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోయారు. ఇంకా వెళ్లిపోతున్నారు.  కొత్త పరిశ్రమల ఊసే లేదు. ఉద్యోగాలు, ఉపాధి అన్నవి కానరావడం లేదు.   వీటికి తోడు సీఎం జగన్ కక్షసాధింపులు, వేధింపులు. తన పాలనను ప్రశ్నించినా, వ్యతిరేకించినా కుట్రపూరితంగా అక్రమ కేసులు, అడ్డగోలు అరెస్టులు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేయడం. వీటన్నిటినీ గమనించిన ఏపీ జనం ఇంకెంత మాత్రం జగన్ పాలనను భరించలేం అన్న నిర్ణయానికి వచ్చేశారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, జగన్ రెడ్డిని ఓడించి పంపించడం వినా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. సర్వేలలో, పరిశీలకుల విశ్లేషణల్లో తేలుతున్నది ఇదే.    అయితే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని తాను గొప్పగా పాలన చేస్తున్నాననీ, జనం మళ్లీ మళ్లీ తానే సీఎం కావాలని కోరుకుంటున్నారనీ భ్రమలలో ఉన్న జగన్ మాత్రం వైనాట్ 175 అనే అంటున్నారు. తన వందిమాగధుల చేత అదే చెప్పిస్తున్నారు.   ఇంచు మించుగా ఏడాదిన్నరగా సాగుతున్న గడప గడపకు వైస్పీ ప్రభుత్వం, నువ్వే మా నమ్మకం వంటి కార్యక్రమాల ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలకు వాస్తవం అర్ధమైపోయింది. భవిష్యత్ భూతద్దంలో కనిపించింది. అందుకే  వారు పార్టీ కార్యక్రమాలను మమ అనిపించేసి చేతులు దులుపుకుంటున్నారు.   జగన్ రెడ్డి  తన చేతికి మట్టి అంటకుండా గడప గడప వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఖాతాలో చేర్చి వారిని బలిపశువులను చేయడానికి నివేదికలను ఉపయోగించుకుంటున్నారు.  అందుకే ఆ నివేదికల ఆధారంగా తమ నియోజకవర్గాలను మార్చేస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. తమ అసమ్మతిని, వ్యతిరేకతను ముఖం మీదే చెప్పేస్తున్నారు. పరిశీలకులు కూడా ప్రజా వ్యతిరేకతే కొలమానంగా మార్పులు అన్నది వాస్తవమే అయితే ముందుగా మార్చాల్సింది జగన్ నే అని విశ్లేషిస్తున్నారు. 

ఎన్నారై యశస్విని అరెస్టు చేసిన సీఐడీ.. 41ఏ నోటీసులిచ్చి విడుదల

అహంకారం, అడ్డగోలు నిర్బంధాలు, అవధులు లేని వేధింపులు, అదేమంటే అరెస్టులు.. నాలుగున్నరేళ్ల జగన్ పాలన గురించి  ఇంత కంటే చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఈ మాట ఎవరో వైసీపీ వ్యతిరేకులు అంటున్నది కాదు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని తటస్థులు సైతం చెబుతున్న మాట. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ విధ్వంస పాలన ఈ నాలుగున్నరేళ్లుగా విధ్వంసం, విద్వేషం, వేధింపులు, అరెస్టులు, దుర్భాషలతోనే సాగుతోంది. న్యాయస్థానాల తీర్పుల ఖాతరీ లేదు. ప్రజాస్వామ్య విలువల అర్థమే తెలియదు. తెలిసిందల్లా జగన్ సర్కార్ నిర్ణయాలన్నిటికీ జీహుజూర్ అంటూ మద్దతు తెలిపిన వారే రాష్ట్రంలో ఉండేందుకు అర్హులు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినా, ప్రశ్నించినా వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అన్నట్లుగా సాగింది, సాగుతోంది జగన్ పాలన.  జగన్ హయాంలో పోలీసులకు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం వినా మరో పనే లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థ జగన్ మనసులో ఏముందో గ్రహించి అందుకు అనుగుణంగా ఆయన ప్రత్యర్థులను (జగన్ దృష్టిలో ఆయన ప్రత్యర్థులు శతృవులే) వెతికి పట్టుకుని కేసులు బనాయించి జైలుకు పంపడం, వేధించి, హింసించి దారికి తేవడంగానే మారిపోయింది.   కరోనా సమయంలో మాస్కులు కావాలని అడిగిన దళిత వైద్యుడి నుంచి మొదలు పెడితే.. ఇప్పుడు ఎన్నారై యశస్వి బొద్దులూరిని అరెస్టు చేయడం దాకా జగన్ పాలన అంతా నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నట్లుగానే సాగింది.  కోర్టులు ఎప్పుడో సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన కారణంగా ఎవరినీ అరెస్టు చేయవద్దని విస్పష్టంగా తీర్పు ఇచ్చినా జగన్ ప్రభుత్వానికి ఖాతరీ లేదు. అందుకే   ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపిన ఎన్నారై యశస్వి బొద్దులూరిని విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. అందుకు కారణం యశశ్వి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రభుత్వ విధానాలు, తప్పిదాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించడమే. ఆయన అనారోగ్యంతో ఉన్న  తన తల్లిని పరామర్శించడానికి ఇండియాకు వచ్చీ రాగానే విమానాశ్నయంలోనే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఏపీ పోలీసులు  యశశ్వి బొద్దులూరి ఇండియా వస్తున్నారని తెలియడంతోనే శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఆయన ఇలా దిగగానే అలా అరెస్టు చేశారు. ఇంతకీ ఆయన అరెస్టునకు కారణమేమిటంటే..  ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపడమే. లండన్ లో ఉండే  యశస్వి ఏపీలో అరాచకపాలనను. అడ్డగోలు విధానాలు..   ప్రభుత్వ పెద్దల తప్పిదాలను సామాజిక మాధ్యమం వేదికగా ప్రశ్నిస్తారు, ఎత్తి చూపుతారు. నిలదీస్తారు. జగన్ సర్కార్ ఆయనపై కక్షగట్టడానికి, కత్తిగట్టడానికి అది ఒక్కటే కారణం. ఆ కారణంగానే ఆయనపై ఆయనకే తెలియకుండా ఏపీలో కేసులు నమోదు చేశారు. లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విమానాశ్రయంలో దిగగానే ఏపీ పోలీసులకు సమాచారం అందింది అరెస్టు చేసేశారు. అంతే. పోలీసులు తమ బాస్ జగన్ ఆదేశం మేరకు కేసులు బనాయించగలరు? అరెస్టు చేయగలరు? వారు అంతే చేస్తున్నారు. తరువాత కోర్టుల్లో చీవాట్లు తిని తలలు వంచుకుంటున్నారు.  యశస్విని కూడా అలాగే అరెస్టు చేసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంగళగిరి తరలించారు. యశస్వి అరెస్టుతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యశస్వి అరెస్టును ఖండించారు. వైసీపీ పాలనకు చివరి రోజులు ఆరంభమయ్యాయని మండిపడ్డారు.  కాగా యశస్విని అరెస్టు చేసి మంగళగిరికి తరలించిన సీఐడీ పోలీసులు అక్కడ ఆయనకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇంత మాత్రానికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద నానా హంగామా చేసి అదుపులోనికి తీసుకుని మంగళగిరి తరలించడం ఎందుకో ఘనత వహించిన సీఐడీ పోలీసులకే తెలియాలి. మొత్తం మీద యశస్వి అరెస్టు విషయంలో పోలీసుల తీరు పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

ఓటమి భయం.. వైసీపీలో వలసలు ఖాయం!

ఆంధ్ర ప్రదేశ్ లో  ఎన్నికలు సమీపిస్తున్న వేళ  అధికార వైకాపా నాయకుల్లో ఆందోళన, ఓటమి భయం విస్పష్టంగా గోచరిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత, ఇంత కాలం జగన్ ఏం చెప్పినా, ఏం చేసినా ఆహా, ఓహో అంటూ సమర్ధించిన తమకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు వారిలో తమ రాజకీయ భవిష్యత్ పట్ల భయన్ని, ఆందోళననూ కలిగిస్తున్నాయి. అన్నిటికీ మించి జగన్ తనపై ప్రజా వ్యతిరేకతను తమకు అంటగట్టి పక్కన పెట్టేయడానికి రెడీ అయిన విధానం వారిలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. దీంతో జగన్ పార్టీలోని పలువురు సిట్టింగులు సహా  సీనియర్ నాయకులు తమ దారి తాము చూసుకోవడానికి రెడీ అయిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే వారు జగన్ ను ధిక్కరించడానికే కాదు, ఆయనపై తిరుగుబాటుకు కూడా రెడీగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు.   సాధారణంగా ఎన్నికల ముందు అధికార పార్టీలోకి చేరికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి.  ఏపీలో మాత్రం అధికారంలో ఉన్న జగన్  పార్టీ విషయంలో మాత్రం అందుకు రివర్స్ గా వైసీపీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. పెరగడమంటే అలా ఇలా కాదు.. బారులు బారులుగా పార్టీ వీడి సైకిలెక్కడానికి, గ్లాసందుకోవడానికీ, ఆ రెండూ కాకపోతే హస్తం గూటికి చేరేందుకు వైసీపీ నేతలు తహత హలాడుతున్నారు. సీట్లు, పదవులు, ప్రాధాన్యత వంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోకుండానే.. ముందు జగన్ కు ఆయన పార్టీకీ దూరమైతే చాలు అన్నట్లుగా వైసీపీలో నేతల వలసల తీరు ఉంది.     ఇక తెలుగుదేశం విషయానికి వస్తే నాలుగున్నరేళ్లకు పైగా అధికార పార్టీ వేధింపులను, కేసులను, కక్ష పూరిత దాడులను భరించి, తట్టుకుని పార్టీ కోసం నిలబడిన వారి ఇష్టానికి వ్యతిరేకంగా.. కొత్త వారిని, మరీ ముఖ్యంగా వైసీపీని వదిలి వచ్చి చేరుతామంటున్న వారిని పార్టీలోకి తీసుకునే విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  కష్ట కాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల ప్రయోజనాలకు  ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఆయన బాహాటంగా చెబుతున్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు.   పార్టీని నమ్ముకుని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన  స్థానిక నాయకుల అనుమతి లేకుండా కొత్త వారిని చేర్చుకునే ప్రశక్తి లేదని రాష్ట్ర,  జిల్లా  స్థాయి నాయకులకు చంద్రబాబు ఇప్పటికే స్పష్టంగా తేల్చిచెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పలు జిల్లాల్లో వైసీపీ నేతలు (వారిలో పలువురు సీనియర్లు, ఎమ్మెల్యేలు కూడా  ఉన్నారు.) తెలుగుదేశం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని చెబుతున్నాయి.  అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకుని, పార్టీ నేతలు, శ్రేణుల అభీష్ఠాన్ని తెలుసుకున్న తరువాతే చేరికల విషయంలో  నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు విస్పష్టంగా తనతో టచ్ లోకి వచ్చిన వైసీపీ నేతలతో చెబుతున్నారని అంటున్నారు. అదే విధంగా వైసీసీ ప్రభుత్వ విధానాలు, జగన్ వైఖరితో విభేదించి వచ్చే వారెవరైనా సరే  బేషరతుగా చేరాల్సి ఉంటుందనీ, మొదటి నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద రానున్న రోజులలో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు తప్పవన్నది పరిశీలకుల అంచనాగా ఉంది. పదవులు, టికెట్లు, ప్రాధాన్యత వంటి విషయాలు తరువాత ముందు ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవాలంటే జగన్ పార్టీకి దూరం కావడం ఒక్కటే మార్గంగా పలువురు వైసీపీ నాయకులు భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తిరుపతి నుంచి పవన్ పోటీ.. చంద్రబాబు వ్యూహం ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు మూడు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. అంత కన్నా  ముందే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు నిర్దిష్ట సమయం కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్వయంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ స్వయంగా చెప్పారు.  ఎన్నికల కోసం   పార్టీని సమాయత్తం చేస్తున్న జగన్ సిట్టింగుల మార్చే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం  కూడా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,  జనసేన   అధినేత పవన్‌ కల్యాణ్‌  వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై కూడా చంద్రబాబు, పవన్ ల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చేసినట్లేననిచెబుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా సంక్రాంతి తరువాత నుంచి ఏపీపై ప్రత్యేక దృష్టిసారించాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఆ పార్టీకి ఏపీలో ఉన్న బలం ఏమిటి? ఎంత? అన్న విషయాలను పక్కన పెడితే.. అధికార పార్టీ వైసీపీలోని అసంతృప్తి, అసమ్మతి తమకు బలం చేకూరుస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం ఆశిస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలోలా జీరో సీట్స్ కాకుండా ఏవో కొన్ని స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోగలుగుతామని కాంగ్రెస్ నమ్మకంతో ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఏపీ విషయంలో ఆ పార్టీ విధానమేమిటో, వ్యూహమేమిటో కనీసం కమలం హైకమాండ్ కైనా తెలుసా అంటే అనుమానమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.  ఇక విషయానికి వస్తే.. తెలుగుదేశం, జనసేన పొత్తు ఏపీలో ఆ కూటమి అధికారానికి రావడం లాంఛనమే అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది. కేవలం అధికారంలోకి రావడమే కాకుండా జగన్ పార్టీని కనీస స్థాయికి పరిమితం చేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ను  తిరుపతి నుంచి పోటీ చేయాల్సిందిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరుతున్నారని జనసేన, తెలుగుదేశం వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. చంద్రబాబు వ్యూహాత్మకంగానే జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి రంగంలోకి దిగాలన్న ప్రతిపాదన చేశారని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రాంతం, వర్గం అన్న తేడా లేకుండా జగన్ పాలన పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయినా ఎంత కాదన్నా జగన్ పార్టీకి రాయలసీమలో ఏదో మేరకు పట్టు ఇంకా ఉంది. ఆ విషయాన్ని గమనించే చంద్రబాబు జగన్ టార్గెట్ గా పవన్ కల్యాణ్ సీమ నుంచి పోటీ చేస్తే వైసీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని భావిస్తున్నారు.   పొత్తులో భాగంగా జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రాంతం నుంచి బరిలోకి దిగితే  వైసీపీకి ఏదో మేర బలం ఉన్న సీమలో కూడా బలహీనం అయ్యే చాన్స్ ఉందన్నది చంద్రబాబు అంచనాగా పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి బరిలోకి దిగితే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని చెబుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి తిరుపతి నుంచి విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ప్రజారాజ్యం అధినేతగా ఉన్న చిరంజీవి సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు  నుంచీ పోటీలోకి దిగినా ఓటమి పాలైన సంగతిని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాలలోని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని పోటీ చేయడం కంటే చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడం వల్ల ఆయన విజయం సునాయాసం కావడమే కాకుండా.. మొత్తంగా ఆ ప్రభావం రాలయసీమపై కూడా పడుతుందన్నదే చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.  గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాయలసీమలోని 52 స్థానాలలో కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఆ మూడు స్థానాలలో ఒకటి కుప్పం కాగా, రెండోది హిందూపురం. ఇక మూడో స్థానం ఉరవకొండ. గత ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి  నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.   గత ఎన్నికలలో రాయలసీమలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన  వైసీపీకి ఈ సారి ఆ ప్రాంతంలో ఆ ఆధిపత్యంపై దెబ్బకొట్టాలనీ, అందుకు ఆ ప్రాంతం నుంచి జనసేనాని పోటీలో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. అలాగే అదే ఉద్దేశంతో జనసేనాని కూడా తిరుపతి నంచి బరిలోకి దిగే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారనీ జనసేన వర్గాలు కూడా చెబుతున్నాయి.