జానీకి జగన్ అంటే ఇష్టం..మళ్లీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి...
posted on Dec 30, 2023 @ 9:46AM
మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల హవా పూర్తయ్యింది. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికల హవా మొదలయ్యింది. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్స్ ని పరిష్కరించాలంటూ ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే వాళ్ళ పోరాటానికి మద్దత్తు తెలిపారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఢీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఆయన అటు సినిమా రంగంలోనే కాకుండా సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఎప్పుడు నెల్లూరు వచ్చినా సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కాపు సామజికవర్గ నేతలను కలుస్తూ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా నెల్లూరులో జరిగిన అంగన్వాడీల ధర్నాలో జానీ మాస్టర్ పాల్గొని వారి పోరాటానికి మద్దతు తెలిపారు. అలాగే అంగన్వాడి కార్యకర్తల పోరాటంలో అసువులు బాసిన రమణమ్మ అనే కార్యకర్త కుటుంబానికి రూ.70 వేల ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొని మానసిక ఒత్తిడితో అంగన్వాడీ కార్యకర్త చనిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే వెంటనే ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలన్నారు జానీ మాష్టర్. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు ‘తెలీదు సార్. నుదుటి మీద ఎలా రాసుంటే అలా జరుగుతుంది’ అని చెప్పారు. ఇప్పుడు మద్దతు ఏ పార్టీకి ఇస్తున్నారు ? అని మరో రిపోర్టర్ అడగగా.. జనసేన తరఫున వచ్చారని అందరూ అంటున్నారు.. మీరేమంటారు అని మీడియా ప్రశ్నించడంతో ..‘నేను మళ్లీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోంటి. రాంగోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జానీ మాష్టర్‌కి జగన్ గారంటే అంత ఇష్టం మున్ముందు ఏం జరుగుందో నేను తర్వాత చెప్తాను’ అని వెల్లడించారు.