జగన్ పై తిరుగుబాటు? వైసీపీలో సంక్షోభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీలోనూ ఏకాకిగా మారుతున్నారా? ఇప్పటికే తన అహంకారం, అహంభావంతో సొంత చెల్లి, తల్లిని దూరం చేసుకున్న ఆయన, ఇప్పుడు పార్టీ నేతలనూ దూరం చేసుకుంటున్నారు. తాను కలవాలనుకుంటే తప్ప.. పార్టీలోని సీనియర్ నేతలూ, మంత్రులకు కూడా జగన్ అప్పాయింట్ మెంట్ దొరకదని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. తాను పిలిపించుకుని మాట్లాడాల్సిన సందర్భాలలో కూడా ఆయన తీరు ఎదుటి వారిని కించపరిచేలాగే ఉంటుందని, తాను చెప్పదలచుకున్నది చెప్పేయడం తప్ప ఎదుటి వారు చెప్పేది వినడం ఆయనకు అలవాటులేని పని అని అంటుంటారు.
ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత అంటూ పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చాలని, పలువురికి టికెట్లు నిరాకరించాలన్న జగన్ నిర్ణయంతో పార్టీలో ఆయన నాయకత్వంపై తిరుగుబాటు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం జరగాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అసలు తొలుత 11 మందిని మార్చుతూ నిర్ణయం తీసుకున్న తరువాతనే పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఒక ఎంపీ నేతృత్వంలో బెంగళూరులోని ఆయన నివాసంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని, ఆ సమావేశంలో జగన్ మార్పులపై తీసుకునే నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాలని తీర్మానించుకున్నట్లు చెబుతున్నారు. జగన్ తన అహంకార పూరిత వైఖరితో అందర్నీ దూరం చేసుకుంటున్నారనీ, ప్రజలు ఇప్పటికే దూరమైపోయారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనానికి ముఖం చాటేస్తూ, పర్యటనలకు వెళుతున్నప్పుడు పరదాలు ఏర్పాటు చేసుకోవడం, ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వంటి చర్యలతో జగన్ జనానికి ఎప్పుడో దూరమైపోయాననీ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయ అవసరాల కోసం ఆయనకు అడుగులకు మడుగులొత్తే వారు ఆయన అహంకారాన్ని సహిస్తారేమో కానీ, జనం మాత్రం అహంకారాన్ని ఇసుమంతైనా సహించరనడానికి తెలంగాణ ఎన్నికల ఫలితమే నిదర్శనమనీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని మించి అహంభావంతో వ్యవహరించే జగన్ కు ఏపీ జనం వచ్చే ఎన్నికలలో షాక్ ఇవ్వడానికి ఇప్పటికే డిసైడైపోయారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎమ్మెల్యేలకు జగన్ పూచిక పుల్ల విలువ సైతం ఇవ్వరని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకున్న జగన్ వారిలో కేవలం ముగ్గురితోనే ముఖాముఖి మాట్లాడారనీ, అది కూడా కేవలం నిముషం మాత్రమేననీ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతోటి దానికి వారిని పిలిపించుకోవడం ఎందుకు అని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక పరిశీలకులు కూడా జగన్ సిట్టింగులను మార్చాలన్న నిర్ణయం బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. సిట్టింగులపై నిజంగా అసంతృప్తి ఉంటే, ఉందని నివేదికలలో తేలితే జగన్ చేయాల్సింది వారికి టికెట్ నిరాకరించడం కానీ, ఈ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను మరో నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుందని అంటున్నారు.
మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రసాద్ రాజు తమ్మినేని సీతారాం , జోగి రమేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా చాలా పెద్దదే ఉంటుంది. మొత్తం 90 మంది సిట్టింగుల విషయంలో జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ అసంతృప్తికి కారణం ఆయా నియోజకవర్గాలలో పార్టీ గెలిచే పరిస్థితి లేకపోవడమేనని అంటున్నాయి. అయితే నాలుగున్నరేళ్ల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊర్కుని సరిగ్గా ఎన్నికల ముందు.. ఎమ్మెల్యేలపైనా తప్ప ప్రజా వ్యతిరేకత తన మీద కాదని, తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకునే ప్రయత్నమే సిట్టింగుల మార్పు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపైన కాదనీ, మొత్తంగా జగన్ పాలన మీద అని వారు సోదాహరణంగా వివరిస్తున్నారు. సిట్టింగుల నియోజకవర్గాలను జగన్ మారుస్తున్నట్లే సీఎంగా జగన్ ను జనం దించేస్తారనీ విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.