రెడ్ బుక్ పై నారా లోకేష్ కు సిఐడి నోటీసులు
posted on Dec 29, 2023 @ 2:33PM
రెడ్ బుక్ అంశంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది. తనకు నోటీసులు అందినట్టు నారా లోకేష్ ధృవీకరించారు. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారని నారా లోకేష్ అన్నారు. ఈ నోటీసులు వాట్సాప్ ద్వారా జారీ చేశారు. అయితే కోర్టు ద్వారా సమాధానం చెబుతానన్నారు. సిఐడి జారి చేసిన నోటీసుల్లో లోకేష్ హాజరు కావాలని ఎక్కడా లేదు. ఎవరు ఎవరికైనా రెడ్ బుక్ ఇవ్వొచ్చని చెప్పారు. అక్రమ కేసులు నమోదు చేస్తూ, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాస్తున్నానని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల సంగతి తేలుస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు.
నారా లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రెడ్ బుక్ లో మీ పేర్లు రాశానని చెపుతూ పోలీసు విచారణ అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటషన్ లో పేర్కొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? అని సీఐడీ లాయర్ ను కోర్టు ప్రశ్నించింది. వచ్చే నెల తొమ్మిదో తేదీన విచారణ జరుగనుంది.