డీకే బాబుతో మాట్లాడితే వైసీపీకి ఉలుకెందుకు?
posted on Dec 29, 2023 @ 10:13AM
ఏపీలో అధికార వైసీపీ పరిస్థితి ఇప్పుడు తన నీడను చూసి తానే ఉలిక్కిపడేలా తయారైంది. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా.. చివరికి తమ పార్టీ నేతలను చూసి కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఏమూల చిన్న సంఘటన జరిగినా అది తమ పట్టి ముంచేస్తుందన్న భయంతో వణికిపోతోంది.
ఇక విపక్ష నేత నవ్వితే తనను చూసే నవ్వారని జగన్ భావిస్తున్నారు. ఆయన ఎవరితోనైనా మాట్లాడితే తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నరని ఉలికికులికి పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి కళ్లెదుట సాక్షాత్కరిస్తుండటంతో జగన్ లో కంగారు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. సిట్టింగుల మార్పు విషయంలో నిర్ణయం ఆయన తీసుకుని, అలకలు, అసమ్మతి, అసంతృప్తుల బుజ్జగింపులు, సముదాయింపులను సజ్జల అండ్ కోకు అప్పగించేశారు. అసమ్మతులతో మాట్లాడేపాటి ధైర్యం కూడా జగన్ చేయడం లేదు.
ఈ పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనుండటం ఆయనను మరింత గాభరాపెడుతోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఆయన వందిమాగధులు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని ప్రకటనలు గుప్పిస్తున్నారు. తన సోదరి ఏపీలో రాజకీయంపై జగన్ మాత్రం ఇంత వరకూ స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో బెంగళూరు విమానాశ్రయంలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ముచ్చటించడం జగన్ లో గాభరాను మరింత పెంచింది. డీకే శివకుమార్ కు ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ లో మంచి గుర్తింపు ఉంది. అదీ కాక షర్మిల ఏపీ కాంగ్రెస్ లో క్రీయాశీలంగా వ్యవహరించేందుకు నిర్ణయం తీసుకోవడం వెనుక డీకే ఉన్నారన్న ప్రచారమూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తన అనుంగు మిత్రుడు కేసీఆర్ పార్టీ ఓటమికి దోహదం చేసేలా షర్మిల కాంగ్రెస్ కు మద్దతుగా వైఎస్సార్టీపీని పోటీకి దూరంగా ఉంచడం వెనుకా డీకే ఉన్నారని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అలాగే వ్యూహాత్మకంగా చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని పోటీకి దూరంగా ఉంచడం కూడా కేసీఆర్ ఓటమికి దోహదం చేసిందన్నది వాస్తవం. ఈ అన్నిటింనీ కలిపి చూసుకుని ఇప్పుడు బెంగళూరు విమానాశ్రయంలో డీకే చంద్రబాబును కలిసి మాట్లాడటం తన పుట్టి ముంచడానికే అన్న భయం జగన్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
అసలింతకీ ఏం జరిగిందంటే.. గురువారం (డిసెంబర్ 28) చంద్రబాబు బెంగళూరులో తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రాయినికి చేరుకున్నారు. దాదాపు అదే సమయంలో నాగపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ ఆవిర్భావదినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్ పోర్టులో చంద్రబాబును చూసిన డీకే పరుగుపరుగున ఆయన వద్దకు వచ్చి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సహజంగానే ఇరువురూ రాజకీయ నాయకులు కనుక వారి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే ఉంటుంది. కొన్ని నిముషాల సేపు విమానాశ్రయంలోనే వారిరువురూ పక్కకు వెళ్లి ముచ్చటించుకున్నారు. అసలు ఇరువురూ బెంగళూరు విమానాశ్రయంలో ఎదురుపడటం కాకతాళీయమే. ఇరువురు రాజకీయ నాయకులు ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం, మాట్లాడు కోవడం అత్యంత సహజం. కానీ ఇదే వైసీపీ అధినేత గాభరాకు కారణం అవ్వడం మాత్రమే విడ్డూరం.
జగన్ బెంగను, భయాన్నీ సరిగ్గానే అర్ధం చేసుకున్న వైసీపీ సోషల్ మీడియా వింగ్ చంద్రబాబుతో ఢీకే మాట్లాడడంపై వక్రభాష్యాలతో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నది. వాస్తవంగా వారిరువురూ విమానాశ్రయంలో బేటీ కావడం ప్లాన్డ్ గా జరిగింది కాదు. కాకతాళీయంగా ఎదురుపడి మాట్లాడుకున్నారు. నిజంగానే ప్లాన్డ్ గా ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా బహిరంగంగా మాట్లాడుకునే వారు కాదు. ఈ మాత్రం లాజిక్ ను కూడా పట్టించుకోకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ వక్రభాష్యాల ప్రచారానికి నడుం బిగించేసింది.