ప్రభుత్వ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి(జనవరి 2) వాయిదా వేసింది. ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారంటూ రాజధాని ప్రాంత రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించేంత వరకు చర్యలు తీసుకోబోమని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా అమరావతి నుంచి విశాఖ పట్నం తరలే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. రుషికొండపై 4 బ్లాకుల్లో 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్ నివాసంతో పాటు కార్యాలయం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కళింగ బ్లాక్‌ను అందంగా తీర్చిదిద్దారు.  కళింగ బ్లాక్ 5,753 చదరపు మీటర్లలో నిర్మించాలని నిర్ణయించినప్పటికీ,   తర్వాత దాన్ని 7,266 చదరపు మీటర్లకు పెంచారు. ముఖ్యమంత్రి జగన్, కుటుంబంతో కలిసి ఉండటానికి విజయనగర బ్లాక్‌ను సిద్ధం చేశారు.  ఈ భవనం నుంచి సముద్రం అందాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. మొదట ఈ బ్లాక్‌ను 5,828 చదరపు మీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు. తర్వాత 3,764 చదరపు మీటర్లకు తగ్గించారు. ఇందులోనే ప్రెసిడెన్షియల్‌ సూట్‌ రూమ్స్ ను సిద్ధం చేశారు. 1,821 చ.మీ.లతో వేంగి బ్లాక్, 690 చ.మీ.లలో గజపతి బ్లాక్‌ లను రెడీ చేశారు. రుషికొండ చుట్టూ 3 చెక్‌పోస్టులు పెట్టారు. 24 గంటలు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో హెలీ టూరిజం కోసం హెలిప్యాడ్‌ ను నిర్మించారు. విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్‌ వినియోగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. భవనాల వినియోగంపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు  గత నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు కూడా  జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంమంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను రిషికొండ మిలీనియం టవర్స్‌లో గుర్తించింది.  మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు.  ముఖ్యమంత్రి జగన్, మంత్రులు విశాఖలో సమీక్షలు నిర్వహించే సమయంలో, వారంతా మిలినియం టవర్స్ లోని ఏ, బీ భవనాలను వినియోగించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందని స్యయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాను కూడా అక్కడికి మారుతున్నట్లుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ సన్నాహక సదస్సులో వెల్లడించారు. పెట్టుబడిదారులు విశాఖపట్నానికి రావాలని ఆహ్వానించారు. 

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల?.. విజయమ్మ సపోర్టే కీలకం!?

ఏపీ కాగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిలను నియమించబోతున్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్ఠానం కీలక భేటీ నిర్వహించింది. ఆ భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అంతే కాకుండా  ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగించడంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగిందని విశ్వసనీయ సమాచారం.  అంతేకాదు, షర్మిలను హస్తిన రావాల్సిందిగా కూడా పిలిచినట్లు చెబుతున్నారు. నేడో రేపో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందనీ,  అన్నీ అనుకున్నట్లు జరిగితే సరిగ్గా నూతన సంవత్సరం మొదటి రోజునే అంటే  జనవరి 1నే షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశాలున్నాయనీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు షర్మిల కూడా అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు మళ్ళీ వైఎస్ ఫ్యామిలీ చేతికి వెళ్లనున్నాయి. దీంతో షర్మిల నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అన్న జగన్ ను ఎదుర్కొనేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్నను షర్మిల విమర్శించేందుకు ఏయే అంశాలను ఎంచుకుంటారు? కేవలం జగన్ పాలనపైనే అస్త్రాలు సాధిస్తారా? లేక కుటుంబ వ్యవహారాలపై కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ వర్గాలలో షర్మిల జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తే పార్టీ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.  షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతుగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చి బరి నుంచి తప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్‌తో జరిపిన చర్చల సమయంలోనే పార్టీని విలీనం చేసి.. ఏఐసీసీలో కీలక పదవి చేపట్టేందుకు షర్మిల ఒకే చెప్పినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే నాడు జరిగింది ఒట్టి ప్రచారం కాదని అర్ధమౌతోంది. నాటి చర్చలలో కుదిరిన ఒప్పందం మేరకే  ఇప్పుడు షర్మిలను ఏపీకి పంపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన దశాబ్దం తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ఏపీపై దృష్టి పెట్టింది.   ఈ నేపథ్యంలో నే ఏపీ అత్యంత ప్రజాకర్షణ శక్తి ఉన్న వైఎస్ కుటుంబానికి చెందిన షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుత సీఎం కూడా వైఎస్ కుటుంబీకుడే అయినప్పటికీ, వైఎస్ అభిమానులు సైతం ప్రస్తుతం జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ సైతం జగన్ ను దూరంగానే  ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుందని చెబుతారు.  ఏపీలో  కాంగ్రెస్ పుంజుకోవాలంటే వైసీపీ బలహీనం కావాలి. అది జరగాలంటే రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ను వీడి వైసీపీ పంచన చేరిన కాంగ్రెస్ వాదులంతా వెనక్కు రావాలి. షర్మిలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఆ పని చాలా వరకూ పూర్తవుతుందన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనగా చెబుతున్నారు.  ఇప్పటికే జగన్ పాలనలో  పూర్తిగా విఫలమై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఆయన వ్యక్తిగత నైజం కూడా ఆయన పార్టీలోని పలువురికి అక్కడ ఇమడలేని పరిస్థితిని తీసుకు వచ్చింది.  అలా అటూ ఇటూ చూస్తున్న వారందరినీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఆకర్షించవచ్చన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే కాంగ్రెస్ లో షర్మిల భవితవ్యం విషయంలో తల్లి విజయమ్మ పాత్ర కూడా కీలకమే. విజయమ్మ బహిరంగంగానే షర్మిలకు మద్దతు తెలపాలి. అవసరమైతే ఆమె కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది.  తల్లిగా విజయమ్మ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా?   కుమార్తె కోసం కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.  నిజానికి విజయమ్మ షర్మిల రాజకీయ భవిష్యత్ కోసం  తపన పడుతున్నారన్నది ఆ కుటుంబానికి దగ్గరగా ఉండేవారు చెప్పే మాట. షర్మిల కోసమే తల్లి విజయమ్మ జగన్ కు దూరంగా వచ్చేశారనీ, చివరికి వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి తెగతెంపులు చేసుకున్నారని చెబుతారు.  షర్మిలను రాజ్యసభకు పంపించాలని జగన్ తో విజయమ్మ పోరాటం చేశారు. కానీ అందుకు జగన్ ససేమిరా అనడంతోనే తల్లి, కుమార్తెలు రాష్ట్రాన్ని వీడి తెలంగాణ వెళ్లారంటారు. కానీ అక్కడా షర్మిలకు జగన్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అయితే, ఇప్పుడు ఆమెకి ఏపీ కాంగ్రెస్ రూపంలో మంచి అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షర్మిల డిసైడ్ అయిపోయారు. తల్లి సహకారం కూడా తనకే ఉంటుందని ధీమాగా ఉన్నారు.  వైఎస్ హయంలో పనిచేసిన సీనియర్ నేతలకు విజయమ్మపై గౌరవాభిమానాలు ఉన్నాయి. అవే ఇప్పుడు  షర్మిలకు అండగా మారాలంటే  విజయమ్మ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.  అలాగే అప్పుడు జగన్ కోసం, జగన్ ను సీఎంగా చూడాలని కలలుకన్న విజయమ్మ.. ఇప్పుడు షర్మిలను రాజకీయంగా ఉన్నతంగా చూడాలని ఆశపడుతున్నారు. కనుక ఆమె కూడా షర్మిల కోసం ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, వివేకా హత్య కేసులో నిందితులను జగన్ కాపాడడం వంటి అంశాలపై షర్మిల స్పందన ఎలా ఉండబోతున్నది? ఈ అంశంపై షర్మిల అన్నపై బహిరంగ విమర్శలు చేస్తారా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. షర్మిల ఇప్పటికే పలుమార్లు ఈ హత్యపై వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా మాట్లాడారు. అ లాగే సొంత వాళ్ళే తన చిన్నాన్నను హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ లో షర్మిల మార్క్ రాజకీయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.  

నాడు తండ్రి బోధన్ షకీల్   నేడు కొడుకు సాహిల్ 

గత నెల 30 వ తేదీన తెలంగాణ ఓటర్లు స్పష్టమైన తీర్పు చెప్పారు. పదేళ్లు అధికారంలో అధికారంలో ఉన్న కెసీఆర్ ప్రభుత్వానికి సన్నాయి నొక్కులు నొక్కిన అధికార యంత్రాంగం అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా  బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేష్టలు చేయడం తెలంగాణలో చర్చనీయాంశమైంది.   మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్‌కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తొలుత ముంబైకి, ఆ తర్వాత అక్కడి నుంచి దుబాయ్ కి పరారైనట్టు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. నిన్న లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. మరోవైపు, సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు రూ. 20 నుంచి రూ. 25 లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరగ్గా, ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో మంతనాలు జరిపినట్టు అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. కాగా, కేసు నుంచి నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నం చేసిన పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. 2007లో షకీల్  నకిలీ పాస్ పోర్ట్ కేసులో మోస్ట్ వాంటెడ్ పర్సన్. మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్ పోర్ట్ కేసులో షకీల్ కీలక పాత్ర పోషించాడు. అమెరికాతో సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో గుజరాతీయులు ఆయా దేశాలకు వెళ్లడానికి ప్రజా ప్రతినిధులను కల్సి నకిలీ పాస్ పోర్ట్ లు తయారు చేయించుకునే వారు. ఢిల్లీ ఎంపీ బాబు భాయ్ కొటారా ఈ స్కాంలో చిక్కుకోవడంతో వెలుగులోకి వచ్చింది. ప్రజా ప్రతినిధుల కుటుంబసభ్యులుగా గుజరాతీయులు పాస్ పోర్ట్ చేసుకుని ఆయా దేశాలకు చెక్కేసేవారు. షకీల్ కూడా గుజరాతీయులు తన కుటుంబసభ్యులు అని నకిలీ పాస్ పోర్ట్ లు తయారు చేయించాడు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు తీవ్రంగా గాలించిన తర్వాత షకీల్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల రికార్డుల్లో కూడా బోధన్ షకీల్ అని ఉంటుంది.  ప్రజా భవన్ వద్ద జరిగిన ప్రమాదంతో  నిరుడు జూబ్లిహిల్స్ యాక్సిడెంట్  మళ్లీ తెరపైకి వచ్చింది.  2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు  కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లిహిల్స్ వైపు వచ్చిన  థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో  మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్ , సుశ్మ భోస్లే తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కాజల్ చౌహాన్ రెండునెలల కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు.   థార్ కారుపై బోధన్ ఎంఎల్ఏ స్టిక్కర్  ఉండటంతో వివాదానికి దారితీసింది. షకీల్ కుమారుడు సాహిల్ రాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగిందని ప్రచారం జరిగింది.  ఈ నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ పై అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియో సోషల్ మీడియాకు షేర్ చేశాడు. ఈ కారును తాను అప్పుడప్పుడు మాత్రమే వాడతానని, తన కజిన్  ఎక్కువగా వినియోగిస్తాడని కట్టు కథ అల్లాడు. తన కొడుకుకు ఈ యాక్సిడెంట్ తో ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. గాయ పడిన వారికి, మృత చెందిన అబ్బాయికి నష్ట పరిహారం ఇవ్వాలని కజిన్ కు చెప్పినట్లు షకీల్ ఆ వీడియో సందేశంలో కోరాడు. ఈ యాక్సిడెంట్ బాధాకరమని షకీల్ మొసలి కన్నీరు కార్చాడు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.  ప్రజా భవన్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో  కూడా తన వద్ద పని చేసే వాళ్ల పని అని బుకాయించాడు.  పంజాగుట్ట ఇన్ స్పెక్టర్  కూడా సాహిల్ కు ఎటువంటి సంబంధం లేనివిధంగా ఎఫ్ ఐ ఆర్  నమోదు చేశాడు. షకీల్ ఒత్తిడి మేరకు ఇన్ స్పెక్టర్ యాక్సిడెంట్ కేసు సాక్షులను తారు మారు చేసే ప్రయత్నం చేసినట్లు రుజువు కావడంతో  ఉన్నతాధికారులు సస్పెండ్  చేశారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడంతో  జూబ్లిహిల్స్ కారు  ప్రమాద కేసును పోలీసులు తిరగ తోడుతున్నారు. సా హిల్ కు ఈ ప్రమాదంతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పశ్చి మండల డిసిపి మీడియాకు వెల్లడించారు. 

నాగబాబు దృష్టిలో ఆర్జీవీ..?!

రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ నెట్టింట ట్రోల్ అవుతూ వార్తల్లో ఉంటారు. ఆయన సినిమాలు, ఆయన మాటలూ, ఆయన చేతలూ అన్ని విలక్షణమే. వివాదాలు, విలక్షణతనే చవకగా, సులువుగా ఎక్కవ ప్రచారం పొందేందుకు రామ్ గోపాల్ వర్మ ఎన్నుకున్నారు. అయితే నటుడు, మెగా బ్రదర్, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు దృష్టిలో మాత్రం రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ఓ కమేడియన్ అంతే.. జస్ట్ కమేడియన్.  ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని గట్టిగా చెబుతున్నారు నాగబాబు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదంటున్నారు నటుడు, జనసేన నేత నాగబాబు.  ఆర్జీవీ అంటే ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా సినిమా తెరకెక్కించే దర్శకుడు. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులకే కాదు ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఎలాంటి డౌటానుమానాలూ లేవు. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ఈ కోవలో ఎన్నో సినిమాలు తీశాడు. బయోపిక్ సినిమాల పేరిట చరిత్రను తనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకొని ఆర్జీవీ తీసిన సినిమాలు థియేటర్లకు ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో కూడా ఎవరికీ తెలియదు. పట్టదు. నిత్యం  ఏదో ఒక కాంట్రవర్సీని నమ్ముకుని తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి  ఆర్జీవీ ఎంత ప్రయత్నించినా ప్రేక్షకులు మాత్రం ఆయనను, ఆయన సినిమాలను చూసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు.  కానీ ఎవరి అవసరం వారిది కనుక ఇప్పుడు వైసీపీ మరోసారి అదే ఆర్జీవీని నమ్ముకుంది. వర్మ అయితేనే తాను ఇచ్చిన సొమ్ములు పుచ్చుకుని వాస్తవాలను వక్రీకరించైనా సరే తనను ప్రమోట్ చేస్తారని జగన్ నమ్మారు. వర్మ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ..  జగన్ మోహన్ రెడ్డిని హీరోగా చూపిస్తూ వ్యూహం పేరుతో సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కాగా  ఈ సినిమాపై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ.. తన సినిమాలతో ఆర్జీవీ సమాజానికి కంటకంగా మారాడని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆర్జీవీ లాంటి చీడపురుగు సమాజంలో ఉండకూడదని, కనుక ఆయన తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి కూడా ఇస్తానని ప్రకటించారు. దీంతో వర్మ ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని.. అతన్ని రెచ్చగొట్టేలా మాట్లాడించిన  టీవీ యాంకర్, ఆ సంస్థ యాజమాన్యం కూడా బాధ్యులేనని ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని స్వయంగా వర్మే ఎక్స్ వేదికగా తెలియజేశారు. దీనికి నటుడు, జనసేన నేత నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు.  ఆర్జీవీ గారూ మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన  వెధవా మీకెటువంటి హానీ తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్‌ గాడ్ని ఎవడూ చంపడు కదా!  మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. అయతే దీనికి వర్మ కూడా కౌంటర్ ఇచ్చారు. నాగబాబు సార్ నా కంటే పెద్ద కమెడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి సార్… అని కౌంటర్ ట్వీట్ చేశారు. వర్మ, నాగబాబు మధ్య ట్విట్టర్ వార్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్.  ఒకరిని టార్గెట్ చేసి వారిని హింసించేలా.. వారి జీవితాలను ప్రభావితం చేసేలా సినిమాలు తీసి బతకడం నైజంగా మార్చుకున్నారు. అయితే, ఇలాంటి తప్పుడు కట్టు కథలను ఇంకా నమ్మే పరిస్థితిలో తెలుగు ప్రేక్షకులు లేరు. ముఖ్యంగా ఏపీ ప్రజలు వర్మనే కాదు ఆ దేవుడు దిగి వచ్చి జగన్ మోహన్ రెడ్డిని గెలిపించమని ఆదేశించినా వినే పరిస్థితిలో లేరు. నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో విసిగిపోయిన జనం ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఓటు బటన్ నొక్కి జగన్ బటన్ పాలనకు చరమగీతం పాడదామా అని ఎదురు చూస్తున్నారు.  జగన్ పై జనాగ్రహం తిరుగుబాటు స్థాయికి చేరుతోంది. సాక్షాత్తు సీఎం సొంత ఇలాకాలోనే ఓ దివ్యంగుడు జగన్ కాన్వాయ్ పై రాళ్లు విసిరిన ఘటనే ఇందుకు నిదర్శనం. కనుక వర్మ లాంటి దర్శకుడు చెప్పే నీతి వాక్యాలను నమ్మే పరిస్థితి ఉండదు. వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి దాడి, జగన్ తల్లి, చెల్లిని తరిమేయడం వంటి కీలకమైన అంశాలు లేకుండా కేవలం జగన్ ఓ అద్భుతమైన మేధస్సు గల నేత అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. వర్మ అంటే ఎలాంటి విలువలు లేని మనిషి. తనకి ఎలాంటి బంధాలు బాంధవ్యాలు లేవని చెప్పుకుని విర్రవీగే విడ్డూరపు జీవి. అసలు తాను మనిషిని అని మీకు నేనెప్పుడు చెప్పానని ప్రశ్నించే  వర్మను జనం మనిషిగా చూడటం ఎప్పుడో మానేశారు. అలాంటి వర్మ..  ఇప్పుడు సినిమా తీసి జగన్ మోహన్ రెడ్డికి కూడా అవేవీ ఉండవని.. అందుకే తన సినిమాలో హీరో అయ్యాడని చెప్పుకొనేలా ఉంది  వ్యూహం పరిస్థితి.   

మంత్రి ఉషశ్రీచరణ్ నియోజకవర్గం మారిపోయింది.. కల్యాణదుర్గం కాదు పెనుగొండ

ఏపీ సీఎం జగన్ సిట్టింగులను నియోజకవర్గాల నుంచి మార్చే ప్రక్రియను వేగవంతం చేశారు. అసంతృప్తులు, తిరుగుబాట్లు, అలకలు ఇలా వేటినీ పట్టించుకోకుండా.. బుజ్జగించో, బెదరించే తన నిర్ణయానికి సిట్టింగులు ఒప్పుకునేలా చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధిష్ఠానం అంటే అధినేత నిర్ణయం నచ్చని వారు పార్టీ వదిలి వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుకు రెడీ అయ్యే వారు రెడీ అవుతుండగా, కొందరేమో రాజకీయాల నుంచే విరమించుకుంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరి కొందరేమో ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే కల్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీచరణ్ అధిష్టానం ఆదేశాల మేరకు తాను వచ్చే ఎన్నికలలో కల్యాణ దుర్గం నుంచి కాకుండా పెనుగొండ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడే ఆమె తన చాకచక్యాన్ని ఉపయోగించారు. కల్యాణ దుర్గంలో తన పట్ల వ్యతిరేకత ఇసుమంతైనా లేదనీ, సామాజిక వర్గ సమీకరణాలలో భాగంగానే జగన్ తన స్థానాన్ని పెనుగొండకు మార్చారనీ చెప్పుకున్నారు. కల్యాణ దుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బోయలను నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే తన నియోజకవర్గాన్ని మారుస్తున్నారని వివరించారు. ఇంత కాలం తనను ఆదరించిన కల్యాణదుర్గం ప్రజలకు రుణపడి ఉంటాననీ, ఎక్కడ నుంచి పోటీ చేసినా తన నినాదం జగన్ నినాదమేనని ఉషశ్రీచరణ్ చెప్పుకున్నారు.  మొత్తం మీద తన నియోజకవర్గాన్ని జగన్ మార్చడానికి కారణాలుగా ఉషశ్రీచరణ్ ఏం చెప్పుకున్నా.. కల్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆమెను అక్కడ నుంచి పోటీలోకి దించే ధైర్యం జగన్ చేయలేదని పరిశీలకులు అంటున్నారు.  

రాష్ట్రంలో గంజాయి తోటలకు కాపలా కాస్తున్న జగన్ సర్కార్.. లోకేష్

దేశంలో ఏమూల గంజాయి పట్టుబడినా ఆ లింకులు ఏపీలోనే ఉంటయి. దేశంలోనే గంజాయి సాగులో, సరఫరాలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత గంజాయి అంటే కేరాఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ విషయాన్ని ఎవరో వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు.. స్వయంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో  గణాంకాలతో సహా అధికారికంగా వెల్లడించింది.  ఏపీలో జగన్ సర్కార్ గంజాయి వనాలకు కాపలాదారుగా మారిపోయిందని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆయన ఆరోపణలను అక్షర సత్యాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి నిర్మూలన కోసం ప్రభుత్వం ఏటా విడుదల చేసే నిధుల విడుదల ఆగిపోవడమే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు.  ఇక ఏపీలో విచ్చలవిడిగా గంజాయి వాడకం పెచ్చరిల్లింది. దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడినా అది ఏపీ నుంచి సరఫరా అయినదేనని తేలుతోందనీ, గంజాయి సరఫరాను, వినియోగాన్ని అడ్డుకోవలసిన ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోందా అన్నట్లుగా పరిస్థితి ఉందనీ చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏటా గంజాయి తోటల ధ్వంసానికి నిధులు విడుదల చేస్తుందనీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇది కొనసాగుతోందనీ, అయితే జగన్ సీఎం అయిన తరువాత ఈ నాలుగున్నరేళ్లలో గంజాయి తోటల ధ్వంసానికి నిధులు కేటాయించలేదనీ నారా లోకేష్ పేర్కొన్నారు.  పోలీస్,ఎక్సైజ్, రెవిన్యూ, మైనింగ్ ఇలా  అన్ని శాఖల‌ స‌మ‌న్వ‌యంతో,  ఒడిశా ప్ర‌భుత్వ స‌హ‌కారంతో  కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టి మ‌రీ ప్ర‌తి ఏటా  డిసెంబర్ లో గంజాయి తోట‌ల‌ను  ధ్వంసం చేస్తారని తెలిపారు. దీని కోసం అవ‌స‌ర‌మ‌య్యే నిధులను  కేటాయించి  గంజాయి తోట‌ల ధ్వంసం  చేప‌డ‌తార‌ని అయన వివ‌రించారు. తెలుగు దేశం   హ‌యాంలో ఐదేళ్ల‌పాటు ఇలాగే గంజాయి తోట‌ల‌ను పెద్ద ఎత్తున ధ్వంసం చేసిన సంగతిని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొలువదీరాకా ఈ నాలుగున్నరేళ్లలో  ఏ ఏడాదీ కూడా   గంజాయి తోట‌ల ధ్వంసం ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌లేద‌ని, ఇందుకోసం నిధులు కూడా కేటాయించలేదని లోకేష్ పేర్కొన్నారు.  గంజాయిని అరికట్టే విషయంలో కనీసం ఒక్కటంటే ఒక్క స‌మీక్ష కూడా చేయ‌లేద‌ని లోకేష్ వెల్ల‌డించారు. ఏపీ డ్ర‌గ్స్ హ‌బ్‌గా మారిపోయినా, గంజాయి గుప్పుమంటున్నా..జ‌గ‌న్ స‌ర్కారు గంజాయి తోట‌ల ధ్వంసాన్ని ఆపేయ‌డంతో జగన్ ప్రభుత్వం ఏమైనా గంజాయి తోటలకు కాపలా కాస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.  ఏపి ని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేశారని, ఇతర రాష్ట్రాలకి గంజాయి తరలింపు లో ప్రధాన పాత్ర వైకాపా నాయకులదేనని ఆరోపించారు.  వైకాపా గంజాయి మాఫియా ఒత్తిడితోనే డిసెంబ‌రు నెల‌లో జ‌ర‌గాల్సిన గంజాయి తోట‌ల ధ్వంసం ప్ర‌క్రియ నిలిపేశారని ఆరోపించారు.  

డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూత

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం (డిసెంబర్ 28) ఉదయం  కన్నుమూశారు.  ఇటీవల విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలై, కాస్త కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో   కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు కోవిడ్ కూడా సోకినట్లు నిర్దారణ అయింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ  మరణించారు. తమిళనాట అగ్ర నటుల్లో విజయకాంత్ ఒకరు. 1979 లో 'ఇనిక్కుం ఇలామై' సినిమాతో  ఆయన నట ప్రస్థానం మొదలైంది. వరుస సినిమాలతో అలరిస్తూ కెప్టెన్ గా ఎదిగారు. ముఖ్యంగా పలు చిత్రాల్లో పోలీస్ పాత్రలు పోషించి మెప్పించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. డీఎండీకే పార్టీని స్థాపించి తమిళ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 2005లో విజయకాంత్  తొలి సారి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే పి ఏ ఆత్మహత్య 

శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పిఏ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఎమ్మెల్యే  ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు.  ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా వుండగా నిరుడు ఇదే నెలలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బావమరిది సామాను శ్రీధర్ రెడ్డి పోలీసులు ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా అధికారిక విషయాల్లో బావమరిది జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలు రావడంతో ఆయనను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దూరం పెడుతూ వచ్చారు. ఈ దూరం రాను రాను మరింతగా పెరిగింది. అది కాస్త సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వరకు వెళ్లింది. దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన పోలీసులు ముందే సామాను శ్రీధర్ రెడ్డి కత్తితో రెండు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.బావమరిది స్థానంలో రవి ఎమ్మెల్యే పిఏగా చేరాడు.  ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే వైసీపీ ఎమ్మెల్యే పిఏ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. 

బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని తరిమేసిన సింగరేణి కార్మికులు

తెలంగాణ ఎన్నికల ఓటమి తరువాత సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. సింగరేణిలో బీఆర్ఎస్ కాంగ్రెస్, లెఫ్ట్ అనుబంధ కార్మిక సంఘాలను అణచివేసే లక్ష్యంతో తెలంగాణ బొగ్గుగని సంఘం ఏర్పాటు చేసింది. తెలంగణ సాధన ఉద్యమం నేపథ్యంలో సింగరేణి కార్మికులు తమ తమ అనుబంధ పార్టీలతో పాటే జై తెలంగాణ అన్నారు. ఆ నినాదాన్ని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్, లెఫ్ట్ అనుబంధ కార్మిక సంఘాలను కాదని సొంతంగా  ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది. రెండు సార్లు ఆ సంఘం సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా విజయం సాధించింది కూడా. అయితే తాజాగా జరిగిన సంగరేణి ఎన్నికలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఆ సంఘానికి కనీస ఓట్లు కూడా రాలేదు. దీంతో ప్రశ్నార్థకంగా మారింది.  సింగరేణి గుర్తింపు సంఘంగా లెఫ్ట్ అనుబంధ సంఘం… ప్రాతినిధ్య సంఘంగా కాంగ్రెస్ అనుబంధ సంఘం గెలిచాయి. బీఆర్ఎస్ అనుబంధ సంఘం   రేసులో నే లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పాలని బీఆర్ఎస్ భావించింది. ఈ సంఘానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె  కవిత గౌరవాధ్యక్షురాలు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి అనంతరం జరిగిన ఈ ఎన్నికలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయాన్ని కవిత   ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలలో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అనుకున్నది ఒకటి, అయినది మరొకటి అన్నట్లుగా  ఘోరంగా ఓడిపోయి బీఆర్ఎస్ గాలి తీసేసినట్లైంది. వాస్తవానికి ఈ ఎన్నికలలో పోటీ వద్దని కేసీఆర్ పర్టీ శ్రేణులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత  బీఆర్ఎస్ ప్రజా మద్దతు కోల్పేలేదని చాటేందుకు ఈ ఎన్నికలలో పోటీ చేసి తీరాల్సిందేనన్న  కవిత పట్టుదల కారణంగానే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీలో నిలిచింది. అయితే పోటీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే  ఆ సంఘానికి చెందిన కీలక నేతలు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీల్లో చేరారు. అది పక్కన పెడితే సింగరేణి ఎన్నికల ప్రచారంలో గనుల వద్ద ఎక్కడా  గులాబీ జెండా కనిపించలేదు. అసలు ప్రచార సందడే లేదు. దీంతో కేసీఆర్ అధికారమే కాదు, పార్టీపైనా, పార్టీ అనుబంధ సంఘాలపైనా పూర్తిగా పట్టు కోల్పోయారని తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు

పులివెందులలో జగన్ కారుపై రాయి.. దివ్యాంగుడి ధర్మాగ్రహం

జగన్ సర్కార్ పై ప్రజాగ్రహం తిరుగుబాటు స్థాయికి చేరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ జగన్ పట్ల అదే వ్యతిరేకత కనిపిస్తున్నది. జగన్ సొంత జిల్లా కడపలోనూ, ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలోనూ కూడా జనం జగన్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆయన నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారూ ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలే ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా పోయింది. ఉపాధి, ఉద్యోగావకాశాల ఊసే లేదు. అయితే తన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసిందనీ, విపక్షాలు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేననీ నమ్మించడానికి ప్రయత్నించడమే కాదు, తన  విధానాలను వ్యతిరేకించే వారిపై దాడులు, కేసులు, వేధింపులకు పాల్పడటం జగన్ నైజంగా మారింది. విపక్ష నేత రాష్ట్రంలో పర్యటనలు చేస్తుంటే వైసీపీ మూకలు దాడులకు ప్రయత్నించాయి. యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి అధికార దుర్వినియోగానికి సైతం వెనుకాడలేదు. ఏకంగా జీవో 1 తీసుకువచ్చారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు వెడితే ఆయన బస్సుపై రాళ్ల దాడి జరిగింది. ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడేనని అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పైగా ఆ దాడి చేసిన వారు కూడా బయట నుంచి వచ్చారని తేలింది. ఈ దాడిని అప్పటి డీజీపీ సవాంగ్   ప్రజాస్వామ్య భావ్యక్తీకరణగా సూత్రీకరించారు.  తెలుగుదేశం కార్యాలయంపై మారణాయుధాలతో జరిగిన దాడికి నేతృత్వం వహించిన జోగు రమేష్ పై కేసుల సంగతి పక్కన పెట్టి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ప్రజాగ్రహం దాడులకు దారితీయడం సహజమేననీ, ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత చాటేందుకు అది ఒక మార్గమనీ ఘనత వహించిన వైసీపీ నేతలు సూత్రీకరించారు. ఆ సూత్రీకరణలకు సీఎం జగన్ షిక్కటి చిరునవ్వుతో ఆమోదం తెలిపారు. మరి ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా ఆయన సొంత ఇలాకా పులివెందులలోనే చిన్నపాటి దాడి జరిగింది. ఈ దాడి వెనుక ఎలాంటి రాజకీయ కారణాలూ లేవు. దాడి చేసింది ఓ దివ్యాంగుడు. ఇచ్చిన హామీలను విస్మరించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ తీరుపై ధర్మాగ్రహంతో ఆయన కాన్వాయ్ పై ఓ రాయి విసిరారు. ఆ రాయి ఇంటెలిజెన్స్ పోలీసుల కారును తాకింది. జగన్ క్రిస్మస్ వేడుకల కోసం తన సోంత ఊరు పులివెందుల వెళ్లారు.  ఆ సందర్భంగా సింహాద్రిపురం మండలంలో ఆయన పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.   అయితే ఈ సంఘటనను రాష్ట్ర పోలీసులు భావవ్యక్తీకరణగా తీసుకోలేదు. రాయి విసిరిన దివ్యాంగుడిని అదుపులోనికి తీసుకుని రెండు రోజుల పాటు దారుణంగా హింసించారు. చిత్ర హింసలకు గురి చేశారు. రాయి విసిరిన ఆ దివ్యాంగుడు రాజకీయ వైరంతో ఈ పని చేయలేదు. అర్హుడైన తనకు కనీసం పెన్షన్ కూడా ఇవ్వని జగన్ సర్కార్ పై ధర్మాగ్రహాన్ని అలా వ్యక్తం చేశాడు. నాలుగున్నరేళ్లుగా  పెన్షన్ కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో కడుపుమండి ఓ రాయి విసిరాడు.  అయితే విపక్ష నేత బస్సుపై రాళ్లు విసిరిన రౌడీ మూకలది ప్రజాస్వామ్య భావవ్యక్తీకరణగా చెప్పిన పోలీసులు దివ్యాంగుడి ధర్మాగ్రహాన్ని మాత్రం ఘోర నేరంగా భావించి చిత్రహింసలు పెట్టారు.   ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ కాన్వాయ్ పై రాయి విసిరిన దివ్యాంగుడు వైసీపీ అభిమాని, అంతకు మించి జగన్ కు వీరాభిమాని. అయినా జగన్ పాలనలో అర్హులకు అందాల్సినవేవీ అందడం లేదన్న కోపంతో ఓ రాయి విసిరాడు.   అమరావతిలో చంద్రబాబు బస్సుపై  రాళ్లు వేసిన వ్యక్తులను కనీసం అదుపులోనికి కూడా తీసుకోకుండా భావ వ్యక్తీకరణకు అదో మార్గం అని చెప్పిన పోలీసులు పులివెందులలో జగన్ కారుపై రాయి వేసిన దివ్యాంగుడిని మాత్రం రెండు రోజుల పాటు తమ అధీనంలో ఉంచుకుని చిత్రహింసలకు గురి చేశారు. చివరికి అతడు వైసీపీ వ్యక్తే అని తేలడంతో వదిలి పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జగన్ పట్ల జనాగ్రహం ఏ రేంజ్ లో ఉందో తేటతెల్లం చేస్తోంది. 

అష్టదిగ్బంధనంలో జగన్.. కాపాడడం ఎవరితరం?!

వచ్చే ఎన్నికలలో అధికార  వైసీపీ ఓటమి ఖాయమన్న విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. తన ఓటమి తప్పదన్న విషయం జగన్ కు కూడా ఇప్పటికే అర్ధమైపోయింది. జగన్ కు ఎన్నికల వ్యూహాలను అందిస్తున్న ఐప్యాక్ సంస్థ కూడా చేతులెత్తేసింది.  అయితే అగ్రిమెంట్ లో భాగంగా ఎన్నికలు అయ్యే వరకూ వైసీపీ కోసం పనిచేయాల్సిందే. నాలుగున్నరేళ్లగా ఐప్యాక్ ప్రతినిధుల మాటను కూడా జగన్ పట్టించుకోకపోవడం, ఐప్యాక్ ఉద్యోగులలో కూడా చీలిక తెచ్చి సొంతంగా శిబిరం ఏర్పాటు చేసుకోవడంపై ఆ సంస్థ ప్రతినిథులు కూడా   జగన్ పై గుర్రుగా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో  చర్చ జరుగుతోంది. ఉన్నంతలో పనిచేయాలి కనుక అభ్యర్థులను మార్చాలని ఓ సలహా పారేసి ఐప్యాక్ చేతులు దులిపేసుకుందని అంటున్నారు.  ఇక వైసీపీ సిట్టింగులు కూడా ఓటమి  ఖాయమన్న భావనతో   ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఏంటి అంటూ ఎమ్మెల్యేలు ఉసూరుమంటున్నారు. వైసీపీలోనే ఉండి ఓటమి మూటగట్టుకోవడం ఇష్టంలేని వాళ్లంతా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. మొత్తంగా అభ్యర్థుల మార్పు ఇప్పుడు జగన్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. వైనాట్ 175 అన్న జగన్ ఇప్పుడు 175 స్థానాలలొ పోటీకి అభ్యర్థులను వెతుక్కోవలసిన పనిలో పడ్డారు.    తనకి తెలిసో తెలియకో.. నన్నేం చేస్తార్లే అనే అహంకారంతో  .. నేనేం చేస్తే అదే రైట్ అనే భ్రమల్లో జగన్ ఈ నాలుగున్నరేళ్లలో తనని తానే అష్టదిగ్భంధనం చేసుకున్నారు.  ఇప్పుడు ఎన్నికల వేళ ఆ దిగ్బంధనం నుంచి బయటపడే మార్గం లేక గిలగిలలాడుతున్నారు.  నాలుగున్నరేళ్ల పాలనలో జగన్  బటన్ నొక్కుడుకు తప్ప సమాజంలో ఏ వర్గానికి ఏమీ చేసింది లేదు.  ప్రజలు తమ అసంతృప్తిని ఎన్నికల సమయంలో ఓటు ద్వారా చూపుతారు కానీ,  కానీ, ఉద్యోగులు అలా కాదు. ఎన్నికలకు   ముందే పాలకుల భరతం పడతారు. సరిగ్గా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులు, ప్రభుత్వ వర్గాల  నుంచి అసంతృప్తి సెగలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.  నిన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా వున్న ఉద్యోగ వర్గాలు ఇప్పుడు నిరసనలతో, ఆందోళనలతో ఉగ్రరూపం దాల్చాయి. తమకిచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీస్తున్నాయి. ఇన్నాళ్లు ఒకరిద్దరు ఉద్యోగ నేతలను గుప్పిట్లో పెట్టుకుని జగన్ ఉద్యోగుల అసంతృప్తిని అణిచేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఉద్ద్యోగుల ఆగ్రహాగ్ని తమనే దహించేసేలా ఉండటంతో.. ఆ ఒకరిద్దరు ఉద్యోగ నేతలూ కూడా జగన్కు ముఖం చాటేశారు. అంతే కాదు ముఖం చెల్లకు ఉద్యోగులకు కూడా కనిపించలేని పరిస్థితిలో వారు పడ్డారు.   నిన్నటిదాకా జై జగన్, ఆహా జగన్, ఓహో జగన్.. జగనంటే మనిషి రూపంలో దేవుడంటూ కీర్తిస్తూ భజన చేసిన ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పుడు జగన్ అంటే రాక్షసుడు.. ఇన్నాళ్లు భయపడే భజన చేయాల్సి వచ్చిందని బాహాటంగానే చెబుతున్నారు. నాలుగేళ్లుగా మా మాటని పెడచెవిన పెట్టిన జగన్కు తగిన శాస్తి చెప్పాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహాటంగానే జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.  ఇక జగన్ తనకు కొండంత అండగా భావిస్తున్న ఢిల్లీ అండ కూడా మాయమైంది. మనకి ఢిల్లీ పెద్దలు అండగా ఉన్నారంటూ ఇన్నాళ్లూ నాయకులు, కార్యకర్తల్లో భరోసా నింపారు. కానీ ఇటీవలి కాలంలో   జగన్ పై, జగన్ పాలనపై  బీజేపీ  విమర్శల జడివానను చూస్తున్న పార్టీ శ్రేణులు జగన్ మాట నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఈసారి కేంద్రం నుండి అండ లేదన్నది వారికి స్పష్టమైపోయింది. ప్రతిపక్షాలు ఏకం కాకుడదని జగన్ చేసిన  ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.  తెలుగుదేశం, జనసేన పొత్తు రోజు రోజుకూ బలోపైతమై రెండు పార్టీలూ ఏకతాటిపై నడుస్తున్నాయి. కానీ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి  జగన్ అండ్ కో చేసిన ప్రయత్నాలు, ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు  జగన్ ను ఆయన పార్టీని ప్రజలు చీదరించుకునే పరిస్థితికి తీసుకు వచ్చాయి.  మరోవైపు సరిగ్గా సమయం చూసి తాను సంధించిన బాణం రివర్స్ అయ్యింది.  గత ఎన్నికలలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారం చేసిన సొంత చెల్లెలు షర్మిల ఇప్పుడు జగన్ వ్యతిరేక శిబిరంలో ఉన్నారు.  తనను అవసరానికి వాడుకొని పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వకుండా  పక్క రాష్ట్రానికి తరిమేసిన అన్నను  దెబ్బతీసి రాయలసీమ బిడ్డ పౌరుషం చూపేందుకు కంకణం కట్టుకుని రెడీ అయిపోయారు.   ఇన్నాళ్లు ఏపీ అనే సామ్రాజ్యానికి తానే రారాజుగా భావిస్తూ తాడేపల్లి ప్యాలస్ లో కలలు కన్న జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నమైయ్యేసరికి తత్వం బోధపడింది.  పరిస్థితి చేయి జారిపోవడంతో ఇప్పుడు తనను, తన అధికారాన్ని ఎలా కాపాడుకోవాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఇక ఇప్పుడు జగన్ ఏం చేసినా, ఎంత మంది సిట్టింగు ఎమ్మెల్యేలను మార్చినా ఒరిగేదేం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన 

రేపటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని, ఆ దరఖాస్తుల వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పని చేయాలని మంత్రి సూచించారు. రెవెన్యూ.. పోలీసు అధికారులను కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అధికారులు... ప్రజలకు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండాలని హితవు పలికారు.  రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలను సమర్పించారని... గవర్నర్ నిర్ణయం అనంతరం కొత్త బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యులను నియమిస్తామన్నారు. ఆ తర్వాత నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతుబంధుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పరిమితిని విధించలేదని తెలిపారు. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఆరు గ్యారంటీల అమలకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు రేషన్ కార్డు ప్రామాణికం కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమయం తక్కువగా ఉన్నందున కొత్త రేషన్ కార్డుల జారీ పక్రియ కదరదు. అందువల్ల పాత రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారుల నుంచి తొలుత దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయకపోవటంతో దాదాపు లక్ష కుటుంబాలు తెల్లరేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పటంతో ఇప్పటికే సంబధిత పత్రాల కోసం మీసేవా, ఆధార్ కేంద్రాలకు క్యూ కడుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి మరికొంత సమయం పట్టేలా ఉంది.

రాంగోపాల్ వర్మపై అమరావతి ఉద్యమనేత కొలికపూడి ఫత్వా

సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ లైవ్ లో ఆయన పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ ఎపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ట్విట్టర్ కంప్లైంట్ ను తన నుంచి వచ్చిన అధికారిక ఫిర్యాదుగా భావించాలని, తనను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఆర్జీవీ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బయోపిక్  ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమాపై టీడీపీ వర్గాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా.. సినిమా విడుదలను కోర్టు తాత్కాలికంగా ఆపేసింది. ఓటీటీ సహా ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ప్రదర్శించవద్దంటూ సూచించింది. సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా  ఈ నెల 29న వ్యూహం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించి పుండు మీద కారం చల్లారు. ఆర్జీవి తన కొత్త సినిమా వ్యూహంలో చంద్రబాబు, లోకేశ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా చూపించారని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆరోపిస్తున్నారు. తమ అభిమాన నాయకులను కించపరచడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాసరావు టీవీ చానెల్ కు ఇచ్చిన చర్చా కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవి తలకు కోటి ఇస్తానని అన్నారు. యాంకర్ వారిస్తున్నా పదే పదే అవే వ్యాఖ్యలు చేశారు. సమాజం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని అన్నారు. ఈ వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆర్జీవీ ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు. ‘ఏపీ పోలీసులకు విన్నపం. నన్ను చంపేందుకు కోటి ఆఫర్ ప్రకటించిన కొలికపూడి శ్రీనివాసరావుపై, ఆయనను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆ  టీవీ యాంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇదే నా అఫీషియల్ కంప్లైంట్ గా భావించండి’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

వైసీపీలో ఉంటే మటాష్.. సంక్రాంతి తర్వాత జంపింగులే!

2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడం గ్యారంటీ. ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే  సిట్టింగులపై ప్రజా వ్యతిరేకత అంటూ మార్పులకు శ్రీకారం చుట్టారు.  ఇది ఆయనకు రివర్స్ గిఫ్ట్ ఇచ్చేలా కనిపిస్తోంది.  ప్రజలలో  వైసీపీ సీట్టింగుల మీద కంటే జగన్ పైనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తికి, వ్యతిరేకతకు  ఎమ్మెల్యేలు నేతల ఆగ్రహం కూడా తోడైంది. అంతే కాదు.. చాలా మంది సిట్టింగులు వైసీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ మటాషే అని భావిస్తున్నారు. ఈసారి వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలు, సీట్లు ఇచ్చినా స్థానాల మార్పు జాబితాలో ఉన్న సిట్టింగులు, పార్టీ టికెట్ ఇచ్చినా వైసీపీలో ఉంటే ప్రజలు ఓడించడం గ్యారంటీ అని భావిస్తున్న వారు ఇలా అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. జగన్ తో అంటకాగి,  వైసీపీలో కొనసాగితే  పొలిటికల్ కెరీర్ మటాష్ అయిపోతుందని భావిస్తున్నారు.  ఈ సారి  తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం అన్న నిర్ణయానికి వచ్చేశారు. తెలుగుదేశం ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి , పోలవరం పూర్తి చేసి తీరాలన్న కంకణం కట్టుకుంది. అధికారంలోకి రాగానే ఆ దిశగా చర్యలకు ఉపక్రమించి పూర్తి చేయడం ఖాయం. చంద్రబాబు ట్రాక్ రికార్డు అలాంటిది. ఆయన పట్టుబట్టారంటే చేసి తీరుతారు. సైబరాబాద్ నిర్మాణమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం అని భావిస్తున్న వైసీపీ అసంతృప్త నేతలు..  వైసీపీలో ఉండడం అంటే చేజేతులా రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసుకోవడమే అని భావిస్తున్నారు. జగన్ కు దూరంగా ఉంటేనే మేలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనలలో ఏదో పార్టీ పంచన చేరడానికి తహతహలాడుతున్నారు. ఆయా పార్టీలలో టికెట్ దక్కకపోయినా ఫరవాలేదు, చేర్చుకుంటే చాలని అనుకుంటున్నారు.   ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం, జనసేన పార్టీలతో టచ్ లో ఉండగా.. మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గతంలో  తెలుగుదేశంతో అనుబంధం ఉన్న నేతలు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతుంటే.. పాత కాంగ్రెస్ నేతలు మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ పెద్దలు ఈ అసంతృప్త ఎమ్మెల్యేలతో బుజ్జగింపులు జరుపుతుండగానే.. వారిలో కొందరు బహిరంగంగానే వైసీపీకి రాంరాం చెప్పేస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌లు ఇప్పటికే తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించేశారు,  పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన గూటికి చేరనున్నారు. మరో ఎమ్మెల్యే కూడా తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు  ప్రకటించేశాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుకు ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వలేమని చెప్పేశారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిని గిద్దలూరు పంపించాలని వైసీపీ ప్రయత్నిస్తున్నది. కానీ అందుకు బాలినేని ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఆయన ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించేసుకున్నారు. జగన్ అందుకు అవకాశం ఇవ్వకుంటే  ఆయన  వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు జిల్లా రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తున్నది. ఇక గిద్దలూరు నుండి టికెట్ లేదని జగన్ ఖరారు చేసేయడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న రాంబాబు తన దారి తాను చూసుకుంటున్నట్లు ప్రకటించారు.  ఇప్పటికే తన కార్యకర్తలు, ఆంతరంగీకులతో సమావేశం నిర్వహించిన రాంబాబు. జగన్ పెత్తందారీ పోకడలతో వేగలేనని ఆ సమావేశంలో చెప్పేశారటి.  రాష్ట్రంలోనే అత్యధిక  మెజారిటీ(80000)తో గెలిచిన తనను జగన్ ఆయన సామాజిక వర్గం కాదన్న ఏకైక కారణంతో ఇంత కాలం అణగతొక్కేశారని, నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఏమీ చేయలేపోయానని, ఇకపై వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని కార్యకర్తల, ఆంతరంగికుల సమావేశంలో విస్పష్టంగా చెప్పేశారనీ, అంతే కాకుండా తన రాజకీయ జీవితం  తెలుగుదేశంతోనే మొదలైందనీ, పార్టీ మారి తప్పు చేశానని ఇప్పుడు భావిస్తున్నానని చెప్పారు.  తాను వైసీపీని వీడటం ఖాయమని, జిల్లా నుంచి వైసీపీకి రాజీనామా చేసే తొలి సిట్టింగ్ ఎమ్మెల్యే తాను ఔతానని ఆయన ఆ సమావేశంలో చెప్పారు.  సంక్రాంతి తరువాత తెలుగుదేశంలో చేరుతానని ప్రకటించేశారు. తెలుగుదేశంలో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వకపోయినా.. ముందుముందు రాజకీయ భవిష్యత్ ఉంటుందనీ,  అదే వైసీపీలో ఉంటే రాజకీయంగా మటాష్ అయిపోవడమేనని ఆయన చెప్పారని ఆయన ఆంతరంగికులు, కార్యకర్తలు తెలిపారు.  ఒక్క రాంబాబు మాత్రమే కాదు.. వైసీపీ నుండి 40 మంది ఎమ్మెల్యేలది ఇప్పుడు అదే పరిస్థితి. వైసీపీలో ఉంటే భవిష్యత్ అనేది లేదు. టీడీపీ-జనసేనలో టికెట్ ఇవ్వకపోయినా పరవాలేదు.. ముందైతే వైసీపీని వీడి వెళ్లిపోవాలన్నదే ఇప్పుడు ఎమ్మెల్యేల ఆలోచన. అందుకోసం ఇప్పటికే చాలామంది ప్రయత్నాలు కూడా మొదలు పెట్టగా.. సంక్రాంతి తర్వాత ఈ వలసలు భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. నిజానికి గిద్దలూరులో వైసీపీతో పాటు అన్న రాంబాంబుపై కూడా ప్రజలలో భారీ స్థాయిలో అసంతృప్తి ఉంది. అలాంటి ఎమ్మెల్యే కూడా వైసీపీలో ఉండలేమని ఫిక్సయిపోయారు. కాస్తో కూస్తో పనిచేసిన వారు.. కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన వారిని కూడా జగన్ నియోజకవర్గాలను మార్చేయడంతో ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. మొత్తంగా ఇప్పుడు వైసీపీకి భారీ సంక్షోభం తప్పేలా కనిపించడం లేదు. జనవరిలో ఏ రోజు ఈ సంక్షోభం బాంబ్ బ్లాస్ట్ అవుతుందోనని రాజకీయ వర్గాలలో ఉత్కంఠ రేగుతుంది.

రేపు బెంగుళూరుకు చంద్రబాబు 

టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో బాటు పొరుగున ఉన్న కర్ణాటక ప్రజలు చంద్ర బాబు అరెస్ట్ ను ఖండించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిన సమయంలో మద్దతుగా నిలిచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం(డిసెంబర్ 28)బెంగళూరు వెళ్తున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు టీడీపీఫోరంసభ్యులతోపాటు రాష్ట్రంలోని తెలుగుదేశం అభిమానులతో ఆయన సమావేశం అవుతారు.చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు బెంగళూరు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరు సంతమారనళ్లిలోని వైట్‌ఫీల్డ్-హొసకొటె రోడ్డులో ఉన్న కేఎంఎం రాయల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పార్టీ ఆహ్వానించింది

షర్మిలకు కాంగ్రెస్ హై కమాండ్ పిలుపు.. జగన్ ఇక సర్దేసుకోవడమేనా?

ఆంధ్రప్రదేశ్  రాజకీయాలలో షర్మిల ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఆ విషయంపై అటు షర్మిల నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు కట్టబెడతారని రాజకీయవర్గాలలో గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ ఎంట్రీకి సంబంధించిన చర్చలు నెలల కిందటే మొదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఆ దిశగా చర్చలు సాగాయి. కొంత మేర పురోగతి కూడా సాధించాయి. ఆ కారణంగానే షర్మిల తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతుగా తన వైఎస్సార్టీపీని పోటీ కి దూరంగా ఉంచారు. ఆ సమయంలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. షర్మిల కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి కార్యరూపం దాల్చబోతున్నాయి.  షర్మిలకు కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. అది కూడా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై హస్తినలో కీలక చర్చలు జరుగుతున్న వేళ షర్మిలకు  హైకమాండ్  నుంచి పిలుపు అందింది.  వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్తలకు ఈ పిలుపు బలం చేకూర్చింది.   కాంగ్రెస్ లోకి షర్మిల చేరిక, ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో ఆమె పాత్ర తదితర అంశాలపై కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలతో చర్చించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో ఆమెకు స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వడమే కాకుండా, పార్టీ పగ్గాలు కూడా అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.   ఏపీ కాంగ్రెస్ నేతలు బుధవారం (డిసెంబర్ 27)న హస్తినలో కాంగ్రెస్ హై కమాండ్ తో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తు తదితర అంశాలపై  చర్చించారు.  సరిగ్గా ఈ సమయంలోనే హై కమాండ్ నుంచి షర్మిలకు పిలుపు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ కాంగ్రెస్ లో షర్మిల కీలకంగా, క్రియాశీలంగా వ్యవహరించడమంటూ జరిగితే.. వైసీపీ పని అయిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆయేషా హత్య కేసు.. దర్యాప్తు వివరాలు అందజేయండి.. సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణపై ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆయేషా హత్య కేసులో  జరిగిన దర్యాఫ్తు వివరాలను కోర్టుకు అందజేయాలని సీబీఐ అధికారులను హైకోర్టు ఆదేశించింది.  ఆయేషా హత్య జరిగి ఐదేళ్లు దాటినా కేసు దర్యాఫ్తులో పురోగతి లేదంటూ ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టు తలుపు తట్టారు. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది.  2007 డిసెంబర్ 27 న ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ కుమార్తె హత్య కేసును మళ్లీ విచారించాలని 2018 లో ఉమ్మడి హైకోర్టు తీర్పిచ్చిన విషయాన్ని ఆయేషా తల్లిదండ్రులు శంషాద్‌ బేగం, సయ్యద్‌ ఇక్బాల్‌ బాషా తమ పిటిషన్ లో ప్రస్తావించారు. విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేసింది ఎవరో తేల్చాలని అప్పట్లో కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. దర్యాఫ్తును సీబీఐ సాగదీస్తోందని ఆరోపిస్తూ.. దర్యాఫ్తును పూర్తిచేసేందుకు గడువు నిర్ణయించాలని కోరారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ అధికారులకు, కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ధరణి అక్రమాలు కోకొల్లలు.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య భూమీ మాయం!

సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ లా సకల భూ సమస్యలకూ ధరణి  పరిష్కారం అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు అధికారంలో ఉన్నంత కాలం తెగ ఊదరగొట్టేశారు. ధరణి అత్యంత పారదర్శకమైందని గొప్పగా చెప్పుకున్నారు. ధరణిని తీసేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలోకి విసిరేయాలని ఆయన ఎన్నికలకు ముందు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రచారంలోనూ అదే చెప్పారు.  అయితే జనం మాత్రం కేసీఆర్ మాటలను నమ్మలేదు. ధరణి మొత్తం అవకతవకల మయం అని, ఆ బాధలు మేం పడ్డామని తేల్చేశారు. ధరణిని తీసేస్తాం అన్న కాంగ్రెస్ కే ఓటేశారు. మరీ ముఖ్యంగా ధరణి వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డది, నష్టపోయింది గ్రామీణులే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా జనం ఓటెత్త్తారు. బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించారు.   ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సైతం  ధరణి బాధితుడేనని తాజాగా వెల్లడైంది. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత కాంగ్రెస్‌   అధికారంలోకి వచ్చాక ఆయన స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించారు.   ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గుమ్మడి నర్సయ్య జీవనశైలి అత్యంత సామాన్యంగా ఉంటుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా  బస్సులోనే ప్రయాణించేవారు. తన దుస్తులు తానే ఉతుక్కునేవాడు. అలాంటి నాయకుడిని కూడా ధరణి ముప్పు తిప్పలు పెట్టింది. గుమ్మడి నర్సయ్యకు ఆయనకు రెండెకరాల భూమి ఉంది. ధరణి పుణ్యమా అని అది కాస్తా మాయమైంది. ధరణిలో తన రెండెకరాల భూమి కనిపించకపోవడంపై రెండేళ్లుగా తాను అధికారుల చుట్టూ తిరుతున్నానని, ఎక్కడికి వెళ్లినా పరిష్కారం దొరకలేదని ఆయన ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.  కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తన భూమి సమస్యను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి చెప్పుకోవడానికి ఆయన సచివాలయానికి వచ్చారు. గుమ్మడి నర్సయ్యకు సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అది వేరే సంగతి. కానీ అధికారంలో ఉన్నంత కాలం  ధరణి అక్రమాలపై, తప్పులపై ఎవరు మాట్లాడినా  బీఆర్‌ఎస్‌ నాయకులు ఎదురు దాడి చేస్తూ వచ్చారు. ధరణి అత్యంత   పారదర్శకమైందని, దానిపై విమర్శలు గుప్పిస్తే సహించేది లేదనీ హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఒఖ మాజీ ఎమ్యెల్యే భూమికే గతి లేదంటే ఇక సామాన్యుల విషయం ఏమిటని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అప్పట్లో గుమ్మడి నర్సయ్య ధరణికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆయనపై ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆయన అధికారుల చుట్టూ తిరిగి సమస్య పరిష్కరించుకుందామని భావించారని పరిశీలకులు అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమికే దిక్కు లేకపోతే.. ఇక ధరణి కారణంగా  ఎందరి భూములు గాయబ్ అయి ఉంటాయో అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఇటీవల ధరణిపై ముఖ్యమంత్రి   రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దరణి తప్పుల తడక అని, గత ప్రభుత్వ హయాంలో భూముల గోల్‌మాల్‌ జరిగిందని ఆయన అంటూ  ధరణి స్థానంలో భూమాత   తీసుకుని వస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణిలో కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా ధరణి కారణంగా తమ భూములకు ఎసరు వచ్చిందన్నఫిర్యాదులే అధికంగా ఉన్నాయి. కేసీఆర్‌ చెప్పినట్లు ధరణి వల్ల ఎవరి భూములు వారికి ఉంటాయని, వారి భూములు సురక్షితంగా ఉంటాయని అవకతవకలు జరగడానికి వీలు లేకుంటే గుమ్మడి నర్సయ్య భూమి ఎలా మాయమైంది?  ప్రజా వాణిలో అత్యధిక సమస్యలు ధరణి కారణంగానే అంటూ ఫిర్యాదులు వచ్చాయో ఇప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.   ప్రభుత్వ భూములు సైతం  కబ్జా అయి ప్రైవేట్‌ వ్యక్తుల పేర్ల మీద ధరణిలో చేరాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇటీవల చెప్పారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్దలు క్రమబద్దీకరించుకున్న విషయం కూడా రేవంత్‌ రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పుటికప్పుడు ధరణిలోని అవకతవకలను సరిచేస్తామని, ఆ తర్వాత భూమాత పోర్టల్‌ను తీసుకుని వస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. మొత్తం మీద రేవంత్ సర్కార్ ధరణి అవకతవకలు, అక్రమాలను సరిచేసి బాధితులకు న్యాయ చేస్తుందని ఆశిద్దాం. 

భ్రమల్లో జగన్.. బైబై అంటున్న జనం!

ఏపీ సీఎం జగన్ ది ఒక విలక్షణ వ్యక్తితం. ప్రపంచం మొత్తం తన కనుసన్నలలోనే నడుస్తోందని గట్టిగా నమ్ముతారు. అలా నడవాలని కోరుకుంటారు. తాను చెప్పిందే వేదం అని భావిస్తారు. అందుకు భిన్నంగా ఏం జరిగినా తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ అయిన వారూ, ప్రత్యర్థులూ అన్న తేడా లేకుండా అందరినీ అనుమానిస్తారు. ఎవరినీ నమ్మరు, ఎవరిపైనా నమ్మకం లేదు. ఇప్పుడు ఏపీలో ఆయన చేస్తున్న పాలన అదే.  నాలుగున్నరేళ్లుగా ఏపీలో జగన్ పాలన అధ్వానంగా ఉంది. ఈ మాట వాళ్లూ వీళ్లూ అనడం కాదు. వైసీపీ నేతలూ, ఎమ్మెల్యేలే అంటున్నారు. పరిశీలకులూ అదే చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తే అధికారంలో ఉన్న ఎవరైనా దానిని ఒక అవకాశంగా తీసుకుంటారు. సమీక్షలు నిర్వహించి.. విధానాల మార్పుపై సమాలోచనలు చేస్తారు. కోల్పోయిన ప్రజా మద్దతును ఎలా కూడగట్టుకోవాలన్న దానిపై దృష్టి పెడతారు. వర్తమానాన్ని సమీక్షించుకుని, భవిష్యత్ ప్రణాళికను రచించుకుంటారు.  అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చుసుకున్నా,వెక్కెక్కి ఏడ్చినా ప్రయోజనం ఉండదు. కానీ జగన్ సరిగ్గా అదే చేస్తున్నారు. ఎందుకంటే జగన్ రూటే సెపరేటు కదా?  ఆయన అసలు తన విధానాల సమీక్ష అన్నదే సహించరు. తానే చేసిందే రైటు అని తాను అనుకోవడమే కాదు. అందరూ అలాగే అనాలని భావిస్తారు. అలా అననివారిని శత్రువులుగా భావిస్తారు. ఎందుకంటే ఆయనది విలక్షణ వ్యక్తిత్వం కదా? అందుకే  తన విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. కక్ష సాధింపు చర్యలకు  తెగబడుతున్నారు.   ఈ విషయంలో ఆయనకు తనా పరా బేధం కూడా లేదు.  సహజంగా, అధికారంలో ఉన్న పార్టీలకు, మరీ ముఖ్యంగా  నేనే రాజు నేనే మంత్రి తరహాలో అధినాయకత్వం చెప్పు చేతల్లో నడిచే ప్రాంతీయ, పార్టీలలో అధినేత తప్పులను ఎత్తి చూపే సాహసం  ఎవరూ చేయరు. అందుకే ప్రాంతీయ పార్టీలలో అధినేత నిర్ణయాలను ప్రస్తుతించడానికి, ప్రశంసించడానికీ పార్టీ నేతలు పోటీలు పడుతుంటారు. ఎంత ఎక్కువగా పొగిడితే అంతగా అధినేత అభిమానానికి పాత్రులౌతామన్న భావన వారిలో ఉంటుంది. జగన్ పార్టీలోనూ అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఇంత కాలం అదే జరిగింది. అయితే అధినేతను పొగడటంతోనే సరిపెట్టకుండా, ప్రత్యర్థులను ఎంత ఎక్కువగా విమర్శిస్తే అంతగా వీరతాడులు పడతాయన్న భావన కూడా వైసీపీలో ఉంది. అందుకే భాషా సంస్కారం కూడా లేకుండా, అది అసెంబ్లీ అయినా, బహిరంగ సభ అయినా, మీడియా సమావేశమైనా అనుచిత వ్యాఖ్యలతో వైసీపీలోని కొందరు నేతలూ, మంత్రులూ చెలరేగిపోతూ ఉంటారు.   ఇప్పటి వరకూ వైసీపీలో జరిగింది అదే. కొందరు ఇంకా చేస్తున్నదీ అదే. కానీ ఇక పుట్టి మునగడం ఖాయం అన్న నిర్ణయానికి వచ్చిన తరువాత వైసీపీ నేతలలో ముఖ్యంగా ఎమ్మెల్యేలలో భయం పోయింది. మొహమాటం వదిలిపోయింది. తిరుగుబాటుకు సైతం సై అనే పరిస్థితి వచ్చింది. రాజీనామాల బాట పడుతున్న వారి సంఖ్య పెరిగింది. అలా రాజీనామా చేసిన వారిలో అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వారూ ఉన్నారు.   గడచిన నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ సర్కార్   ఏం చేసింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే, మెరుపులు కనిపించవు. కేవలం మరకలే  కనిపిస్తాయి. కానీ  దురదృష్టం ఏమంటే  ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పాలన అంతా మెరుపులే.. మరకలు లేవు అంటారు. తన పార్టీ వారినీ అదే అనమంటారు. పైపెచ్చు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తారు. తాను గొప్పగా పాలన సాగిస్తుంటే.. ఓర్వలేక విమర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా దూషణల పర్వానికి దిగుతారు. ఒక ముఖ్యమంత్రిగా ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తారు. అదే సమయంలో  మైమరచిపోయి ఆత్మస్థుతి చేసుకుంటారు.  రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలు గురించి కానీ, రాష్ట్ర ప్రజలు మనసా వాచా కోరుకునే, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, తాను హామీ ఇచ్చిన మద్య నిషేధం వంటి వాటి ఊసెత్తరు. నాలుగున్నరేళ్ల తన  పాలనలో  రాష్ట్ర ప్రజల నెత్తిన పెరిగిన అప్పుల భారం గురించి నోరెత్తరు.  అసలు సమస్యల ప్రస్తావనే ఉండదు. పరనింద తప్ప.  అయితే  రాజదాని మొదలు. మద్యం  పాలసీ వరకు ఇచ్చిన మాట తప్పి, మడమ తిప్పి నాలుగున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన జగన్ పాలనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పుచేశామని తలలు పట్టు కుంటున్న జనం , జగన్ రెడ్డి తమ తప్పులు తెలుసుకోకుండా, దిద్దుబాటు చర్యలు లేకుండా  ఇంకొక ఛాన్స్ .. అంటే ..ఇక చాలు జగన్ అంటున్నారు.    బై .. బై .. జగన్ అంటు న్నారు. అయితే జగన్ కు వాస్తవాలు తెలుసుకోవడం కంటే భ్రమల్లో ఊరేగడమే ఇష్టం. ఎన్నికల ముంగిట ఆయన అదే పని చేస్తున్నారు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తరువాత కూడా ఆయన జనాన్నే నిందిస్తారు. ఐదేళ్ల పాటు బటన్లు నొక్కి సొమ్ములు పందేరం చేసినా నన్ను కాదంటారా అంటూ శాపనార్ధాలు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.