ఇంతింతై.. వటుడింతై.. నారా లోకేష్!
posted on Dec 29, 2023 9:14AM
మనకు వ్యతిరేకంగా ఉందనుకొన్న కాలం.. మనకి అన్ని విధాల అనుకూలిస్తోందని చెప్పడానికి ప్రకృతి ఒక్కటే సహకరిస్తే సరిపోదు.. ప్రత్యర్థులు సైతం సహకరించాలి. అలాగే ప్రత్యర్థులతో కలిసి నడిచిన వాళ్లు సైతం మనతో కలిసి వచ్చి అడుగులో అడుగు వేయాలి. అలా అయితేనే కాలం.. మనకు అనుకూలంగా మారబోతోందనే ఓ సందేశం ఇచ్చినట్లు అవుతుంది. ఆ క్రమంలో అందుకోబోయే విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. ఆ విషయం ముందుగానే తెలిసిపోతుంది. అందుకు ప్రత్యక్షంగా కనిపించే నిలువెత్తు నిదర్శనం లోకేష్ ట్రాన్స్ ఫార్మేషనే. ఆయన తనను తాను మలచుకున్న తీరు, ప్రత్యర్థుల ప్రశంసలు అందుకున్న వైనం లోకేష్ ఎదుగుదలను కళ్లకు కడతాయి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆయన ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారు.
ఏపీ సీఎం జగన్ సొంత సోదరి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. క్రిస్మస్ సందర్బంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఫ్యామిలీకి పండగ శుభాకాంక్షలు తెలపడమే కాదు.. 2024లో ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలంటూ గిఫ్ట్ ప్యాక్ మీద రాసి మరీ పంపారు. ఆ వెంటనే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... షర్మిలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల నారా లోకేష్ ను టార్గెట్ చేసుకొని ఎలా మాట్లాడారో.. ఆయనపై ఎలాంటి ఆరోపణలు సంధించారో.. ఎంతటి విమర్శలు గుప్పించారో అందరికీ తెలిసిందే. కానీ కాలం ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి షర్మిల లోకేష్ లోని మార్పును, ప్రతిభను గుర్తించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని.. సొంత సోదరుడు జగన్‌కు శుభాకాంక్షలు తెలపకుండా.. తనకు, తన కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన నారా ఫ్యామిలీకి వైయస్ షర్మిల క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం.. రాజకీయ విశ్లేషకులను సైతం అమితాశ్చర్యానికి గురి చేస్తున్నది.
అంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికార పగ్గాలు చేపట్టనుందా? ఆ విషయాన్ని ముందే షర్మిల పసిగట్టారా? అందుకే.. ఆమె ఆలోచనలు.. నారా చంద్రబాబు నాయకత్వం వైపునకు తిరిగాయా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.
ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం అని ప్రత్యర్థి పార్టీలు సైతం చెబుతున్నాయంటే అందుకు కర్మ.. కర్త.. క్రియ అంతా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేషే. యువగళం పేరిట ఆయన చేపట్టిన పాదయాత్ర.. ప్రజల్లోకి చాలా బలంగా దూసుకుపోయింది. ఈ పాదయాత్ర ఇంతగా విజయవంతమైందంటే.. అందుకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగనే అరాచక పాలనకు తోడు పాదయాత్రకు అడుగడుగునా కల్పించిన అడ్డంకులేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023, జనవరి 27న కుప్పంలో యువగళం పేరిట లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ముందుకు సాగకుండా చేసేందుకు జగన్ ప్రభుత్వం .. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని కుయుక్తులు పన్నిందో.. ఎన్ని అడ్డంకులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాగే నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడును ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు అందరికీ తెలిసినవే. ఆ సమయంలో నారా లోకేశ్ తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించి.. రాజమండ్రి రావడం.. అనంతరం తన తండ్రికి బెయిల్ కోసం ఢిల్లీ వేదికగా న్యాయవాదులతో మంత్రాంగం నెరపడం. అలా 52 రోజుల తర్వాత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం, అనంతరం ఆ కండిషన్ బెయిల్ కాస్తా సాధారణ బెయిల్‌గా మార్చడం, మరోవైపు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న.. చంద్రబాబుకు నారా లోకేశ్ వెన్నంటే ఉండడం, తండ్రి ఆరోగ్యం కుదుట పడిన తరువాత పాదయాత్రను పున: ప్రారంభించి.. విశాఖపట్నం జిల్లాలో ముగించడం అందరికీ తెలిసిందే. మొత్తంగా లోకేష్ 300 రోజుల పాటు సాగించిన పాదయాత్రలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే... ఇది చేస్తాం.. ఇలా చేస్తామంటూ.. ఎక్కడిక్కడ తనదైన శైలిలో ప్రజలకు సూటిగా, స్పష్టంగా హామీలు ఇస్తూ ముందుకు సాగడం ద్వారా... ప్రజల మనస్సులను నారా లోకేశ్ ఇట్టే గెలుచుకున్నారు.
ఇంకోవైపు 2014 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. నారా లోకేశ్.. ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో అడుగు పెట్టారు. ఆ క్రమంలో బాబు కేబినెట్‌లో నారా లోకేశ్.. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఐటీ కంపెనీలు ఏర్పాటుకు క్యూ కట్టడమే కాదు.. కియా, హీరో వంటి పరిశ్రమలు సైతం ఏపీలో ఏర్పాటయ్యాయి.
అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి.. ప్రజాక్షేత్రంలో గెలవ లేక.. ఇలా దొడ్డి దారిలో మంత్రి అయ్యారంటూ ఆరోపణలు గుప్పించడమే కాదు.. నారా లోకేశ్ ఆహార్యం, ఆహారంపై కూడా విమర్శలు గుప్పించి, బాడీషేమింగ్ కు సైతం పాల్పడిన వైసీపీ నేతలు ఇప్పుడు లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకుని నాయకుడిగా ఎదిగిన తీరు చూసి నోరేళ్లబెడుతున్నారు. 2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి బరిలోకి దిగిన తనకు ఫలితం ప్రతికూలంగా వచ్చినా లోకేష్ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.... నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు, ప్రతీ మండలంలో ఆరోగ్య సంజీవని పేరిట మొబైల్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీకు.. తోడుగా నేనున్నాంటూ నారా లోకేశ్ ప్రజల మధ్యకు కదలి వస్తున్నారు. మరోవైపు వైసీపీని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆ పార్టీ అధినేత జగన్ వెంట అడుగులో అడుగు వేసి నడిచిన.. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే పదవికే కాదు.. ఆ పార్టీ సభ్యత్వానికి సైతం రాం రాం చెప్పేశారు. ఇక తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్.. పాదయాత్రకు శ్రీకారం చుట్టి తనదైన శైలిలో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు.
ఇప్పటికే లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక జగన్ సొంత సోదరి షర్మిల సైతం.. నారా ఫ్యామిలీకి క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలే కాదు.. 2024లో మీకు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గ్రీటింగ్స్ సైతం పంపింది.
అంటే... లోకేష్ నాయకుడిగా ఎదగడం, జగన్ నాయకత్వంలోని వైసీపీలో కాక రేగి.. కలత చెందడం కాకతాళీయం ఎంత మాత్రం కాదు. లోకేష్ ప్రజాబలం అధికార పార్టీని బెంబేలెత్తిస్తోందనడంలో సందేహం లేదు. ఇప్పుడు వైసీపీలో విజయం సాధిస్తామన్న నమ్మకం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా అభ్యర్థులను మార్చడం.. పలువురు ఎమ్మెల్యేలను తప్పించి.. కొత్త వారికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామంటూ జగన్ చేస్తున్న హంగామాయే ఆ పార్టీలో ఓటమి భయం ఎంతగా పెరిగిపోయిందో అర్ధమౌతోంది. జగన్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలైతే పోటీయే చేయం బాబోయ్ అని చేతులెత్తేశారు. ఇంకొంతమంది పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికీ సైతం రాజీనామా చేసేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా నారా లోకేష్ చుట్టూ పరిభ్రమిస్తోంది. అందుకే నారా లోకేశ్ అంటే ఏమటన్నది.. ఆయన పాదయాత్ర చూస్తే తెలుస్తోంది. నారా లోకేశ్ అంటే ఏమటన్నది.. ఆయన వ్యవహారశైలిని చూస్తే అవగతమవుతోంది. నారా లోకేశ్ అంటే ఏమిటంటే... జగనన్న వదిలిన బాణం, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల కోసం ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు తెలపడమే కాకుండా.. వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైయస్ షర్మిల సైతం లోకేష్ కు క్రిస్మస్ విషెస్ చెప్పిన తీరును చూస్తే అర్థమవుతోంది. అంటే నాడు నారా లోకేశ్‌ను చూసి గతంలో నొసలు చిట్లించిన వాళ్లే.. నేడు లోకేశ్‌కు కంగ్రాట్స్, గ్రీటింగ్స్ చెబుతున్నారంటే.. పరిస్థితి ఎలా మారిందనేది అర్థమవుతోంది.