మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను సందర్శించిన మంత్రుల బృందం
posted on Dec 29, 2023 @ 12:16PM
మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్యారేజీని పరిశీలించారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ లక్షకోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోవటం అతిపెద్ద ఘటనగా పేర్కొన్నారు. జరిగిన నష్టానికి ప్రాజెక్టు నిర్మించిన వారే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మేడిగడ్డ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలతోపాటు ప్రాణహిత ప్రాజెక్టు విషయమై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అక్టోబర్21న ప్రాజెక్టు కుంగితే ప్రభుత్వం మారే వరకుఘటనపై గత ప్రభుత్వం ఒక్కసారైనా స్పందించకపోవటం బాధాకరమనిఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పరిణామాలపై కేసీఆర్ ఒక్క మాటైనా మాట్లాడలేదని చెప్పారు.
పిల్లర్లు కుంగిపోవడంపై డ్యాం సెఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ లో దెబ్బతిన్న పిల్లర్లను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై సమీక్ష చేస్తున్నామని, మూడు బ్యారేజీలపై అనేక అనుమానాలు ఉన్నాయని, అనుమానాలను తేల్చడానికే సమీక్షలు చేస్తున్నామని, ఆ రోజు జరిగిన విషయాలను అధికారులు ప్రజలకు చెప్పాలన్నారు. మేడిగడ్డలో టెక్నికల్‌గా ఏం జరిగిందో చెప్పాలని అధికారులను నిలదీశారు. ఇంజినీర్లు, అధికారులపై తమకు ఎలాంటి ద్వేషం లేదనిచెప్పారు. కరకట్టలతో ముంపు రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.