లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ నజర్

తెలంగాణ ఎన్నికలలో పరాభవంతో  డీలా పడిపోయిన బీఆర్ఎస్ నేతలు, శ్రేణులను వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం సమాయత్తం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఇందు కోసం కసరత్తు ప్రారంభించారు.  ఆ కసరత్తులో భాగంగా కేసీఆర్ కేటీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, ముఖ్యనేతలతో వరుస భేటీలకు రెడీ అయ్యారు. ఈ భేటీలలో లోక్ సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించి నేతలకు, క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు.  ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులకు టికెట్ లు కేటాయించడం వల్లనే భంగపాటుకు గురయ్యామన్న అంచనాల నేపథ్యంలో కేటీఆర్ ప్రధానంగా లోక్ సభ అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులకు టికెట్లు ఇవ్వకుండా ఉంటే మరిన్ని స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధించి అధికారపగ్గాలను అందుకుని ఉండేదన్న భావనలో ఉన్న పార్టీ అధినాయత్వం, అటువంటి పొరపాటు లోక్ సభ ఎన్నికలలో జరగకుండా పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలన్న నిశ్చయయంతో ఉంది.     ఇటీవలి ఎన్నికల్లో గ్రేటర్‌లో బీఆర్ఎస్ కు ప్రజలలో గట్టి పట్టు ఉందని రుజువు కావడంతో ఇక్కడ ఉన్న రెండు పార్లమెంటు స్థానాలలోనూ అభ్యర్థులను రంగంలోకి దింపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి స్థానాల నుంచి పార్టీ ఎవరిని పార్టీ బరిలోకి దింపనున్నదన్న దానిపై పార్టీలో ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించింది.  దీంతో ఈ రెండు లోక్ సభ స్థానాలలోనే పోటీ కోసం తహతహలాడుతున్న బీఆర్ఎస్ ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇతర జిల్లాలకు చెందిన నేతలు సైతం ఈ రెండు స్థానాలలోనూ ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.   మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆసక్తి చూపుతుండగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి  శ్రీనివాస్ గౌడ్‌, నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిలూ కూడా రేసులో ఉన్నామంటున్నారు. మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం తమ కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.    సికింద్రాబాద్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ తనయుడు సాయికిరణ్‌ కూడా రేసులోకి వచ్చారు. అలాగే  దాసోజు శ్రవణ్‌  కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూ పుతున్నారు.  అయితే గ్రేటర్ పరిధిలోనే ఉన్న హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపై మాత్రం బీఆర్ఎస్ పెద్దగా దృష్టి పెట్టడం లేదు.  అది ఎంఐఎం గెలిచే స్థానంగా ఇప్పటికే ఒక అభిప్రాయానికి పార్లమెంటేరియన్ లు ఒక అంచనాకు వచ్చేసినట్లు చెబుతున్నారు. 

వాకర్ సాయంతో మాజీ సీఎం కేసీఆర్ నడక ప్రాక్టీస్!

మాజీ సీఎం కేసీఆర్  ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరజయం పాలైన రోజే ఆయన తన ఫామ్ హౌస్ లో  జారి పడి గాయపడిన సంగతి తెలిసిందే. బాత్ రూంలో జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయం అయ్యింది. యశోదా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స అనంతరం ఆయన నందినగర్ లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పూర్తి అయిన తరువాత  అక్కడే వాకర్ సాయంతో ఆయన చేత అడుగులు వేయించిన వైద్యులు పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది వారాలు పడుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్  ప్రస్తుతం  వాకర్ సాయంతో నడుస్తున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయనను పర్యవేక్షిస్తున్నారు.  ప్రస్తుతం ఆయన  వాకర్ సాయంతో అటూ, ఇటూ నడుస్తున్నారు.  జనవరి చివరి నాటికి స్టిక్ తో నడుస్తారని వైద్యులు చెప్పినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి కేసీఆర్ మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

ఏపీలో బీజేపీ రూటదేనా?

తెలుగుదేశం,జనసేన పార్టీలు ఇప్పటికే తమ పొత్తు ఖరారు చేశాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి.  ఇరు పార్టీలూ సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పని చేయడం కూడా మొదలెట్టేశాయి. అయితే ఏపీ రాజకీయాలలో బీజేపీ విషయంలో మాత్రం ఒక గందరగొళం, అయోమయం నెలకొని ఉంది. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఆ పార్టీ ఏపీలోని అధికార వైసీపీ విషయంలో వ్యవహరిస్తున్నది. బీజేపీ కూడా ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసే ఎన్నికలకు వెళుతుందన్న చర్చ కూడా ఏపీ రాజకీయాలలో చాలా గట్టిగానే జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నంచీ ఇది మరింత జోరందుకుంది. బీజేపీకి ముందు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న  సోము వీర్రాజు.. జాతీయ పార్టీ అయిన బీజేపీని ఏపీలో అధికార వైసీపీకి బీ టీమ్ అన్నట్లుగా మార్చేశారు. అప్పట్లో పార్టీ రాష్ట్ర నాయకులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో పార్టీ హై కమాండ్ రంగంలోకి దిగింది. అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ స్వయంగా గ్రామ గ్రామాన అధికార వైసీపీ తప్పిదాలపై చార్జిషీట్లు విడుదల చేయాలని పార్టీ రాష్ట్ర శాఖను ఆదేశించారు కూడా.  అయితే సోము హయాంలో  మాత్రం వైసీపీతో బీజేపీ రాష్ట్ర శాఖ బాహాటంగానే చెలిమి చేసింది. చివరకు సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఓ ఫోన్ కాల్ తో తప్పించేసి, ఆయన స్థానంలో దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై విమర్శనాస్త్రాలు సంధించడమే కాకుండా, పార్టీ అధిష్ఠానానికీ, కేంద్ర ప్రభుత్వానికి కూడా వరుస నివేదికలు అందజేశారు. దీంతో వైసీపీ నేతలు పురంధేశ్వరి టార్గెట్ గా ఇష్టారీతిగా విమర్శలు చేశారు.  ఈ నేపథ్యంలోనే బీజేపీతో ఇంత కాలం జగన్ సాగించిన రహస్యమైత్రి భగ్నమైందన్న వార్తలు కూడా వినవచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూరచేలా పురంధేశ్వరి ఏపీలో బీజేపీ జనసేనల మైత్రి కొనసాగుతోందనీ, అవసరమైతే తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసి సాగుతుందని ప్రకటించారు.   దీంతో ఇంత కాలం బీజేపీ ఎటు అన్న సందిగ్ధతకు దాదాపు తెరపడినట్లేనని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు.  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా  తెదేపా, జనసేన మధ్య కుదిరిన పొత్తును వైసీపీ వారు ఏమీ చేయలేరని, అలాగే  తెదేపా, జనసేన కూటమితో బిజెపి కలవడాన్ని జగన్ పార్టీ ఆపలేదని వ్యాఖ్యానించారు.  తాను తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య చెలిమి ఉండాలనే కోరుకుంటున్నానన్నారు.

రేపటి నుంచి మరోమారు భువనేశ్వరి  నిజం గెలవాలి యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి  పేరిట  బుధవారం ( జనవరి 3) నుంచి మరో మారు యాత్ర ప్రారంభించనున్నారు. చంద్రబాబాబు అక్రమ అరెస్ట్ తో మనస్తాపం చెంది చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. వారికి ఆర్థిక చేయూత కూడా ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.  గత సంవత్సరం అక్టోబర్ నెలలో కూడా నారా భువనేశ్వరి ఈ యాత్ర నిర్వహించిన సంగతి విదితమే.  నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత  నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.  అక్కడి నుంచి చంద్రగిరికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్‌ పై ఆవేదనతో గత సంవత్సరం అక్టోబర్ నెల 17న చంద్రగిరిలో టీడీపీ కార్యకర్త ప్రవీణ్ రెడ్డి చనిపోయారు. భువనేశ్వరి ప్రవీణ్ కుటుంబ సభ్యులను అప్పట్లో పరామర్శించి ప్రవీణ్ రెడ్డి తల్లి అనురాధకు రూ.3లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగుదేశం పార్టీదే అన్నారు. నిజం గెలవాలి యాత్ర ప్రారంభానికి ముందు ఆమె తిరుమల దర్శించున్నారు. రేపు కూడా ఆమె తిరుమల దర్శించుకుంటారని సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమ అరెస్ట్ తో మనస్థాపం చెందిన  రాష్ట్ర వ్యాప్తంగా  దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. చంద్రబాబు విడుదల తర్వాత నిజం గెలవాలి యాత్రను మరో మారు పున: ప్రారంభించాలని నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు.  చంద్రబాబు  52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో మనస్థాపం చెందిన టిడిపి కార్యకర్తలు , అభిమానులు చనిపోయారు. భువనేశ్వరి విజయనగరం జిల్లాలో నిజం గెలవాలి యాత్ర కొనసాగుతున్న సమయంలోనే చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆమె అర్ధంతరంగా ఈ యాత్ర ఆపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల అయిన తర్వాత  పార్టీ అధినేతకు అనారోగ్యసమస్యలు  ఉండటం వల్ల ఈ యాత్ర ఆగిపోయింది. ప్రస్తుతం చంద్రబాబు పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో   ఈ యాత్ర ఆగిపోయిన విజయనగరం జిల్లా నుంచే పున: ప్రారంభం కానుంది. వారానికి మూడు రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించాలని యోచిస్తున్నారు. గతంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆగిపోయింది. జైలు నుంచి విడుదలైన తర్వాత యువగళం యాత్ర పున: ప్రారంభించిన మాదిరిగానే భువనేశ్వరి అర్ధంతరంగా ఆగిపోయిన నిజంగెలవాలి యాత్రను ప్రారంభించబోతున్నారు.   

బాబాయ్ కోరిక షర్మిల తీరుస్తున్నారా?.. పులివెందుల నుంచే పోటీ.. ప్రకటన ఎప్పుడంటే..?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 4న వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనమయ్యే లాంఛనాన్ని హస్తినలో పూర్తి చేస్తారు. ఈ మేరకు ఢిల్లీ మీడియాలో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయి. అసలు కాంగ్రెస్ నుంచే ఢిల్లీ మీడియాకు లీకులు వెళ్లాయని అంటున్నారు. ఇలా ఉండగా షర్మిల తన కుమారుడి పెళ్లి పనులలో బిజీగా ఉండి కూడా పార్టీ విలీనం, తాను ఏపీ కాంగ్రెస్ లో క్రీయాశీల పాత్ర తదితర విషయాలపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మంగళవారం  (జనవరి2 )  ఉదయం హైదరాబాద్ లోఅందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో  షర్మిల భేటీ అయ్యారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు. ఆ చర్చల అనంతరం ఆమె కుటుంబ సమేతంగా ఇడుపుల పాయకు బయలుదేరి వెళ్లారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇడుపుల పాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ శుభలేఖను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వచ్చే ఎన్నికల్లో షర్మిల కడప నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆమె పులివెందుల పర్యటన, అక్కడ నుంచి చేయబోయే విలీనం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  పులివెందులలో వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల తన రాజకీయ భవిష్యత్ పై చేసే ప్రకటన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఒక వేళ ఆమె తాను పులివెందుల నుంచి  బరిలోకి దిగనున్నట్లు వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచ ప్రకటన చేస్తే రాష్ట్ర రాజకీయాలలో  పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా సొంత బాబాయ్, దివంగత వైఎస్ వివేకా కూడా షర్మిల పులివెందుల నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించారు. ఆ డిమాండ్ తోనే అనినాష్ రెడ్డికి శతృవయ్యారు. గొడ్డలి పోటుకు హతమయ్యారు. ఇప్పుడు షర్మిల పులివెందుల నుంచి రంగంలోకి దిగితే బాబాయ్ కోరిక నెరవేర్చినట్లే అవుతుంది. షర్మిల పులివెందుల నుంచి పోటీ నేపథ్యంలో    చెల్లితో తలపడే ధైర్యం జగన్ చేస్తారా? లేక నియోజకవర్గం వదిలేసి మరో స్థానం వెతుక్కుంటారా? అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర రాజకీయాలలో  క్రీయాశీలంగా వ్యవహరించడమంటూ జరిగితే.. వైసీపీలో కాంగ్రెస్ వాదులంతా షర్మిల పంచన చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న వారంతా షర్మిల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి ధిక్కార స్వరం వినిపించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంటే తాను అని ప్రకటించడమే కాకుండా.. షర్మిల వెంట పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.   షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైనప్పటికీ వైఎస్ సతీమణి, షర్మిల తల్లి విజయమ్మ నిర్ణయం ఏలా ఉంటుందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కుమారుడికి వ్యతిరేకంగా ఆమె కూడా ఏపీలో షర్మిలతో పాటు కాంగ్రెస్ తరఫున గట్టిగా నిలబడతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయమ్మ నోటి వెంట ఇప్పటి వరకూ షర్మిల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని ఏపీలో అన్నకు వ్యతిరేకంగా పని చేస్తారన్న వార్తలపై ఎటువంటి స్పందనా రాలేదు.  గతంలో  ఒక సందర్భంగా విజయమ్మ  తన బిడ్డలు ఎవరికి వారుగా రెండు రాష్ట్రాలలో రాజకీయపార్టీలు స్థాపించి ఎవరి పని వారు చేసుకుంటారనీ, ఒకరిపై ఒకరు తలపడరనీ, పోటీ చేయరనీ చెప్పారు. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని తేటతెల్లమైపోయింది. షర్మిల తెలంగాణను వదిలి ఏపీలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు.   అంతే కాదు జగన్ పార్టీ లక్ష్యంగానే ఆమె ఏపీలో రాజకీయం చేయనున్నరనీ, అవసరమైతే జగన్ కు ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీకి దుగుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో  విజయమ్మ ఎవరికి మద్దతు తెలుపుతారన్నది కీలకంగా మారింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విజయమ్మ తన కుమార్తె షర్మిలతో పాటే ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఆమె బయటకు వచ్చి ప్రచారం చేసే అవకాశాలు లేవని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు విజయమ్మ ఏ నిర్ణయం తీసుకుంటారో. షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయం బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆమె తన కుమారుడు జగన్ నివాసానికి వెళ్లలేదు. ఆమె విజయవాడ వెళ్లినప్పటికీ జగన్ ను నివాసానికి వెళ్లిన దాఖలాలు లేవు.  వీటన్నిటినీ ప్రస్తావిస్తూ పరిశీలకులు ఆమె జగన్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు మృగ్యమేనని విశ్లేషిస్తున్నారు.  .

రాజన్న బిడ్డల వారసత్వ పోటీ .. నెగ్గేదెవరో?!

వారసత్వం సహజం అనేలా మారిపోయింది ప్రస్తుత రాజకీయాలలో. ఇక్కడా అక్కడా అని లేకుండా మన దేశమంతా ఈ వారసత్వపు రాజకీయాలు మనకి కనిపిస్తున్నవే. అయితే ఇది దక్షణాదిలో అందునా మన తెలుగు రాష్ట్రాలలో కొంచెం ఎక్కువగా, ఇంకొంచం  స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ  వారసత్వపు పునాదులపైనే నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు దేశం పార్టీలో ప్రస్తుతానికైతే వారసత్వపు పోరు లేదు. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సారధ్యం వహిస్తుండగా.. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఇదే పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ వారసత్వానికి, చంద్రబాబు వారసత్వానికి కూడా ఇప్పుడు ఎలాంటి పోటీ లేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీతో విభేదించి సోంత కుంపటి గా వైసీపీ  పెట్టుకున్నారు. వైసీపీ వైఎస్ జగన్ కు చెందిన సొంత కంపెనీ. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, వైఎస్ఆర్ వారసత్వానికి మాత్రం పోటీ ఉంది.  జగన్ మోహన్ రెడ్డితో పాటు  వైఎస్ఆర్ తనయ షర్మిల కూడా వైఎస్ బ్రాండుకు వారసులుగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్, షర్మిల ఇద్దరూ వైసీపీలో ఉండడంతో ఈ వారసత్వం కోసం పోటీ కనిపించలేదు. వైసీపీ అనే పొలిటికల్ కంపెనీలో షర్మిల ఒక ఉద్యోగిగా చేరి.. ఆమె బాధ్యత నిర్వహించి బయటకొచ్చేశారు. ఇంకా చెప్పాలంటే అధినేత కష్టకాలంలో ఉండగా షర్మిల వారసురాలిగా బాధ్యత తీసుకున్నారు. కానీ, కష్టం పోయి మంచి రోజులు వచ్చాక అదే వారసురాలిని బయటకి తరిమేశారు. దీంతో షర్మిల వైఎస్ఆర్ వారసురాలిగా అదే బ్రాండ్ తో తెలంగాణలో మరో బ్రాంచి ఓపెన్ చేసుకున్నారు. కానీ, అక్కడా ఆ బ్రాంచ్ వృద్ధిలోకి రాకుండా సొంతవారే అడ్డుతగులుతుండడంతో ఇప్పుడు షర్మిల అసలు సిసలైన వైఎస్ఆర్ వారసురాలిని నేనే అంటూ తిరిగి తన తండ్రి పనిచేసిన కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ వారసత్వానికి పోటీ నెలకొంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ వారసత్వం కోసం ఆయన కుమారుడు, కుమార్తె తలపడుతున్నారు. పోటీ పడుతున్నారు.   వైఎస్ వార‌స‌త్వం అనే వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కీల‌క మ‌లుపు తిప్పేలా కఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో వన్ అండ్ ఓన్లీగా జగన్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సుడిగా చెలామణి అయ్యారు. అయితే ఇప్పుడు ఆయ‌న సోద‌రి ష‌ర్మిలే ఆయనకు పోటీ వస్తున్నారు. తాను కూడా వైఎస్ బిడ్డ‌నేన‌ని, తాను కూడా ఆయన రాజ‌కీయ వార‌సురాలినేని అంటూ ప్ర‌చారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందునా  తండ్రి చివరి శ్వాస వరకూ పనిచేసిన పార్టీ కాంగ్రెస్ నుంచి అన్నతో తలపడడానికి రెడీ కావడం షర్మిలకు మరింత అడ్వాంటేజ్గా మారింది. అప్పుడు వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు, తెచ్చిన పాలసీలు, కట్టిన ప్రాజెక్టులు అన్నీ చెప్పుకొనేందుకు షర్మిలకు అవకాశం దక్కనుంది. తన తండ్రి వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అంటేనే వైఎస్ఆర్ అని గర్వంగా చెప్పుకొనేందుకు షర్మిలకు ఎలాంటి అడ్డంకులు లేవు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే వైఎస్ఆర్ కలలను సాకారం చేస్తుందని.. అసలు సిసలైన రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పుకొనేందుకు షర్మిలకు ఆస్కారం ఉంది. రాజకీయాలలో కుమారుడు, కుమార్తెల వారసత్వంలో ఎలాంటి తేడాలు ఉండవు. వారసుడంటే కేవలం కుమారుడు మాత్రమే కాదు.. కుమార్తెలకు కూడా హక్కు ఉంటుంది. కనుక తన తండ్రికి గుర్తింపునిచ్చిన పార్టీలో ఉన్న వారికే ఈ వారసత్వంపై ఎక్కువ హక్కు ఉంటుంది. ఆ మాటకొస్తే వైసీపీకి వైఎస్ఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆయన ఆశయాల ఆధారంగానే పుట్టిన పార్టీగా మాత్రమే చెప్పుకుంటారు. కానీ  వైఎస్ఆర్ ది కాంగ్రెస్ తో విడదీయరాని బంధం. కనుక ఇప్పుడు షర్మిల అప్పుడు తండ్రి కాంగ్రెస్ లో ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు అదే స్థానంలో కూర్చుంటే ఆమెనే అసలు సిసలైన వారసురాలిగా భావించాల్సి వస్తుంది. అప్పుడు జగన్ మోహన్ రెడ్డికి  ఎదుర్కోవడం కఠిన పరీక్షగానే మారుతుంది. ఇప్పటికే నాలుగున్నరేళ్ల పాలనలొ జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  వైఎస్ బ్రాండ్ ను దాదాపుగా ఆయన పార్టీలో  కనిపించకుండా చేసేశారు. ఇప్పుడు తన తండ్రి పేరు చెప్పుకుని కాంగ్రెస్ తరఫున షర్మిల రంగంలోకి దిగితే  జగన్ ను కఠిన పరీక్షే అవుతుందనడంలో సందేహం లేదు.  ఇప్పుడు వైఎస్   వారసత్వ  పోటీ లో ప్రజలు ఎవరిని గుర్తిస్తారు? ఎవరిని ఆదరిస్తా రన్నది చూడాల్సి ఉంది.

పంతం నెగ్గించుకున్న బాలినేని.. విజయం అంత వీజీ కాదు!

మొత్తానికి ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.   నేనెక్కడి వెళ్ళను ఒంగోలులోనే ఉంటా.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా అంటూ ప్రకటనలు ఇస్తూ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఒక దశలో వచ్చేఎన్నికల్లో బాలినేనికి టికెట్ దక్కదని కూడా గట్టిగా వినిపించింది. వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు అభ్యర్థుల మార్పు పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును తప్పించి ఇక్కడ నుండి బాలినేనిని పోటీ చేయించాలని సీఎం జగన్ భావించారు. కానీ  బాలినేని మాత్రం ఒంగోలు నుండే పోటీ చేస్తా అని తనకు తానే టికెట్ ప్రకటించేసుకున్నారు. దీంతో ఆయన పార్టీని వీడడం లేదా వైసీపీ ఆయనకు సీటు కేటాయించకపోవడం జరుగుతుందని రాజకీయ వర్గాలు భావించాయి. బాలినేని కూడా జనసేన పార్టీతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరిగింది. కానీ  బాలినేని పంతం ముందు జగన్ మోహన్ రెడ్డి మొండితనం ఓడిపోయింది. ఎంతైనా బంధువులు కదా ఏం చర్చించారో.. ఏం నిర్ణయించుకున్నారో కానీ ఫైనల్ గా ఒంగోలు బాలినేనిదేనని తేల్చేసినట్లు తెలుస్తున్నది.    బాలినేని సీటు దక్కించుకునే విషయంలో తన పంతం అయితే నెగ్గించుకోగలిగారు కానీ,  ఈసారి ఇక్కడ గెలవడం మాత్రం అంత ఈజీ  కాదు. దానికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో ఆయనకి ఆయన చేసుకున్నవి కొన్ని కాగా.. పార్టీ చేసినవి మరికొన్ని ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల‌ మంత్రిగా బాలినేని దాదాపు మూడేళ్ల పాటు ఉన్నారు. కానీ ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయనలొ అలక మొదలైంది. బాలినేని గత రెండున్నరేళ్లుగా చీటికి మాటికి పార్టీమీద అలగటం, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించడం, పరోక్షంగా జగన్ పైన కూడా వాగ్బాణాలు సంధించటం తెలిసిందే. సొంత పార్టీ నేతలే అరాచకాలు, అక్రమాలు చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. అయితే బాలినేని అలిగిన ప్రతిసారి జగన్ ఆయనను బుజ్జగించి సముదాయించారు.   కానీ  బాలినేని డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో అటు బాలినేని వర్గం సంతృప్తిగా లేదు.. బాలినేని చేష్టలతో ఆయన వ్యతిరేక వర్గం కూడా సంతృప్తిగా లేదు. రేపు ఈ రెండు వర్గాలు కలిసి పనిచేయడం దాదాపు అసంభవంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాలినేని ఆరోపించినట్లు జగన్ ప్రభుత్వంలో ఒంగోలులో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. ఇసుక దందాతో ఒక వర్గం కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఇతర దేశాలలో ఉంటూ ఇక్కడ ఆస్తులు కలిగి ఉన్నవారి కుటుంబాలను టార్గెట్ చేసి భారీ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్వయంగా బాలినేనినే ఆధారాలతో సహా బయటపెట్టగా.. అప్పట్లో పోలీసులు పదిమందిని అరెస్ట్ చేశారు. అయితే, అసలు దొంగలు మాత్రం దర్జాగానే ఉన్నారు. ఇది పార్టీకి ఇక్కడ అతిపెద్ద మైనస్. అలాగే ఒంగోలు నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. బాలినేని మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరుతో కాలం గడిపేశారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఆ మాటకొస్తే ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి చేసిందేమీ  లేదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ తారస్థాయిలో ఉంది. దీనికి తోడు పార్టీలో వర్గపోరు. బాలినేని అంటేనే ఆయన వ్యతిరేక వర్గం మండిపడుతున్నారు.  అదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంపై  పట్టు బిగించారు. కొండెపి ఎస్సీ రిజర్వ్ కావడంతో ఒంగోలుకు వచ్చిన జనార్దన్ గత ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టించారు. అంతకు ముందు ఇదే బాలినేని ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఒంగోలు అభివృద్ధిని పట్టించుకోలేదు. కానీ జనార్దన్ వచ్చీ రాగానే నగర రూపురేఖలు మార్చేశారు. అప్పుడు ఆయన ఎక్కడ ఆపారో ఒంగోలు నగరం ఇప్పటికీ అక్కడే ఉంది. జనార్దన్ తోనే ఒంగోలు నగర అభివృద్ధి అనే  ముద్ర ప్రజలలో గట్టిగా పడింది.  దీంతో ప్రజలే ఆయనను ఓడించి తప్పు చేసినట్లు భావిస్తున్నారు. జనార్దన్ హయాంలో నియోజకవర్గం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది   తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అటు సొంత పార్టీలో  బాలినేనికి పట్టు తగ్గడం, ప్రజలలో అసంతృప్తి, దామచర్లపై సానుభూతి కలిసి..ఈసారి ఒంగోలులో  బాలినేని గెలుపు అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మంగళగిరిలో గెలుపు పక్కా.. చరిత్ర తిరగరాయనున్న లోకేష్!

మంగళగిరి నియోజకవర్గం పుట్టాక రెండే రెండు సార్లు తెలుగుదేశం పార్టీకి విజయం దక్కింది. 1985 తరువాత ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచిందే లేదు. అలాంటి చోట ఒకసారి ఓడిపోతే,  మళ్ళీ అక్కడ పోటీ చేయాలంటే తలపండిన రాజకీయ నేతలైనా భయపడతారు. మొత్తం పార్టీయే చేతుల్లో ఉండగా అసలు అలాంటి చోటకు వెళ్లేందుకు కూడా ఆలోచించరు. కానీ అందరూ వేరు తాను వేరు అంటున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.  తగ్గేదేలే ఓడిన చోటనే మళ్ళీ గెలిచి తానేంటో నిరూపిస్తా అంటున్నారు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తా అంటున్నారు. అయితే, ఇది లోకేష్ మొండితనమా.. ధీమానా అంటే ఖచ్చితంగా గెలుపు ధీమాయే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మంగళగిరిలో లోకేష్ విజయం సాధించడం గ్యారంటీ అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం ఇక్కడ ప్రతి అంశం వైసీపీకి ఇప్పుడు వ్యతిరేకంగా మారడమే కాకుండా.. వాటిని అనుకూలంగా మార్చుకునేందుకు నారా లోకేష్ కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈసారి మంగళగిరిలో లోకేష్ విజయం గ్యారంటీ అంటున్నారు. లోకేష్ గెలుపు అవకాశాలను చూస్తే.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి 2014, 2019లలో రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. 2014లో జస్ట్ 12 ఓట్ల తేడాతో బయటపడిన ఆర్కే 2019లో నారా లోకేష్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజానికి ఈ మెజారిటీ కూడా అంత గొప్పదేమీ కాదు. 2019 జగన్ వేవ్ లో కూడా జస్ట్ 5 వేల మెజార్టీ అంటే అది అతిపెద్ద గెలుపేమీ కాదు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లు నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ కు తెలిసిన ఆర్కే ఇక్కడ లేరన్న సంగతి తెలిసిందే. ఆర్కే వైసీపీకి బైబై చెప్పేయగా.. ఆయన షర్మిల వస్తే కాంగ్రెస్ వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు వైసీపీపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వైసీపీకి ఇక్కడ గెలుపు కష్టం. వైసీపీ ఇక్కడ లోకేష్ మీద బీసీ నేత గంజి చిరంజీవిని నిలబెడుతోంది. ఈయనే గతంలో 2014లో ఆర్కే చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి చేరిన గంజికి గతసారి టికెట్ దక్కలేదు. ఇప్పుడు మాత్రం జగన్ సీటిచ్చేశారు. గంజి చిరంజీవి బీసీ సామజిక వర్గం నేత కాగా ఆయన కమ్మవారి అల్లుడు అని చెప్పుకుంటారు. అందుకే జగన్ ఈసారి ఈయనకు సీటిచ్చారు. అయితే, పూర్తిస్థాయిలో వైసీపీ క్యాడర్ ఈయన వైపు మళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పైగా అమరావతిని నాశనం చేసిన కోపం ఇక్కడ ప్రజలలో తీవ్రంగా ఉంది. బీసీ నేత అనే ఒకే ఒక్క అంశంపై వైసీపీ ఆధారపడగా.. ప్రభుత్వంపై అసంతృప్తి, రాజధాని అంశం, ఆర్కే వర్గం వంటివి ఎన్నో టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క అంశం ప్రభావం చూపినా, కనీస రెండు శాతం ఓటర్లలో మార్పు వచ్చినా గతసారి వచ్చిన ఐదు వేల మెజార్టీ ఉఫ్ మన్నట్లే. పైగా గతసారి నారా లోకేష్ అంటే ఇక్కడ ప్రజలకు కొత్త. ఆర్కే సిట్టింగ్ ఎమ్మెల్యే కనుక కొంత ప్రభావం కనిపించింది. కానీ, ఇప్పుడు అటు ఆర్కే లేరు.. ఈ నాలుగున్నరేళ్లలో లోకేష్ ఇక్కడ ప్రజలకు చాలా దగ్గరయ్యారు.  అంతేకాదు, కాస్త దృష్టి పెడితే పక్కా విజయం సాధించే సీటు కావడంతో సొంత నియోజకవర్గంపై ఈసారి లోకేష్ మరింత గురి పెట్టారు. టీడీపీ అధిష్టానం కూడా ఈసారి మంగళగిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. గత నాలుగేళ్లుగా ఇక్కడ పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతలను చంద్రబాబు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు అప్పగించారు. ఆమె అధిష్టానం వ్యూహాలను పగడ్బందీగా అమలు చేశారు. పైగా లోకేష్ కూడా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి   నాయకుడిని వ్యక్తిగతంగా కలిసి దగ్గరయ్యారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ కోణంలో చూసినా ఇక్కడ వైసీపీ గల్లంతేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎనిమిది శతాబ్దాల దిగుడు బావి ,శిధిల శిల్పాలను కాపాడుకోవాలి

కాకతీయుల సామంతులుగా పానగల్లును పాలించిన కందూరు చోళుల కళాఖండాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి అన్నారు. స్థానిక ఛాయా సోమేశ్వర ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పానగల్లు పరిసరాల్లోని 800 ఏళ్ల నాటి మెట్ల బావి, ఆలయ విడిభాగాలు ,శిల్ప కళా శకలాలను ఆయన ఆదివారం (డిసెంబర్ 31)  పరిశీలించారు . పానగల్లు పచ్చల సోమేశ్వరాలయ ప్రవేశ ద్వారం కుడివైపున రోడ్డు పక్కన ఉన్న కందూరు చోళుల కాలపు దిగుడు బావి గతంలో అనేకసార్లు పునర్ నిర్మించబడిందని ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందనీ,  చారిత్రక ప్రాధాన్యత కలిగిన వీటిని పదిల పరచాలన్నారు . పానగల్లు వెంకటేశ్వర ఆలయం ముందు, మాణిక్యమ్మ గుడి ముందు ఉన్న కాకతీయుల కాలపు మండప స్తంభం విరిగిన చెన్నకేశవ శిల్పం, తల వరకు మాత్రమే కనబడుతున్న బ్రహ్మదేవుని మూడు తలల భిన్నమైన శిల్పం, పానవట్టం అలనాటి శిల్పుల పనితనానికి అద్ధం పడుతున్నాయని పేర్కొన్నారు.   పురావస్తు ప్రాధాన్యత గల ఎనిమిది శతాబ్దాల ఈ చారిత్రక అనవాళ్ళపై అవగాహన కలిగించిన శివనాగిరెడ్డి వాటిని కాపాడి భావితరాలకు అందించాలని పానగల్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో గంటల అనంతరెడ్డి ఇంకా పానగల్ ప్రజలు పాల్గొన్నారు.

గోదావరి జిల్లాల్లో వైసీపీ జీరోయే!

ఏపీలో రానున్న ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖరారైంది. పరిశీలకుల విశ్లేషణలూ, సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు, చివరాఖరికి ఐప్యాక్ రిపోర్టులూ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. జగన్ కు కూడా విషయం అవగతమైనట్లే కనిపిస్తోంది.  అందుకే  పైకి ఎంత బింకంగా వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోన మాత్రం ఓటమి భయం   వెంటాడుతోంది. ప్రజలలో గూడు కట్టుకున్న అసంతృప్తిని కొంత వరకైనా తగ్గించాలని అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారు. ముందుగా ఇన్ చార్జిలను  మార్చేసి తర్వాత వారినే అభ్యర్థులుగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ ప్రయత్నం మరింత నష్టం తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఇప్పుడు జగన్ పై ఆగ్రహంతో ఉన్నారు. అసలే ప్రజలు తనని ఓడించేది ఖాయమైతే.. ఇప్పుడు ఎక్కడైనా ఏమూలో మిణుక్కుమిణుక్కు మంటూ గెలిచే అవకాశం ఉన్న స్థానాలను కూడా ఇన్ చార్జీల మార్పు పేరుతో జగన్ ఓటమి ఖాతాలో చేజేతులా వేసేసుకుంటున్నారు.  దీంతో ఈసారి వైసీపీకి ఘోర ఓటమి తప్పదని  పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, జగన్ మోహన్ రెడ్డి మొండిగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ కూడా ప్రతిపక్ష నేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.  ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే.. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాలు కీలకం. ఇక్కడ ఎక్కువ స్థానాలు ఏ పార్టీ సొంతం చేసుకుంటే ఆ పార్టీదే అధికారం. గత ఎన్నికలలో అధికారం దక్కించుకున్న వైసీపీ కూడా ఈ జిల్లల్లోఅత్యధిక స్థానాలను దక్కించుకుంది.  పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ గెలిచింది.  రెండు ఎంపీ స్థానాలు కూడా దక్కాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా 19 స్థానాలకు గాను వైసీపీ 14 చోట్ల గెలిచింది. మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలలకే ఇక్కడ అసంతృప్తి మొదలైంది. ఈ రెండు జిల్లాలో కాపు సామజిక వర్గం రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే  జగన్ కాపు రిజర్వేషన్లు కుదిరే అంశం కాదని తేల్చేయడం వైసీపీకి అతిపెద్ద మైనస్ గా మారింది. సాధారణ ప్రజలలో జగన్ పాలనపై అసంతృప్తి తీవ్రంగా కనిపిస్తుండగా..  కాపులలో జగన్ పై ఆగ్రహం పెరిగింది.  అదే సమయంలో మరోపక్క పార్టీలో అంతర్గత పోరు కూడా తీవ్రమైంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌పై తిరుగుబాటు చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య వైరం తీవ్రస్థాయికి చేరి రెండు గ్రూపులుగా విడిపోయి ప్రత్యక్ష యుద్దానికి దిగారు. అమలాపురంలో కూడా మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎంపీ చింతా అనూరాథ మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి పంపుతున్న ఎంపీ భరత్ పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పిఠాపురం నుంచి దొరబాబును కాదని ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్న కాకినాడ ఎంపీ వంగా గీతపై కూడా సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. అలాగే మరో అరడజను స్థానాలలో కూడా వైసీపీది అదే పరిస్థితి. సరిగ్గా ఇప్పుడు ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. వైసీపీకి కనీస స్థానాలు కూడా దక్కకూడదని పవన్ టీడీపీతో కలిసి పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు.  పవన్ ఇప్పటికే రెండు వారాల కిందట మంగళగిరిలో ఉభయగోదావరి జిల్లాల నేతలతో  సమావేశమయ్యారు. తాజాగా కాకినాడ వేదికగా నియోజకవర్గాల రివ్యూ కూడా చేపట్టారు. కాకినాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో విడివిడిగా మాట్లాడారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో కూడా సమావేశమై వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో కూడా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఎట్టి పరిస్థితుల్లో ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజలలో వైసీపీపై అసంతృప్తికి తోడు పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఇప్పటికే  కలవరం ప్రారంభమైంది. తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడం.. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ  కలిసి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం చూస్తుంటే.. ఈసారి వైసీపీకి ఇక్కడ జీరో స్థానాలే ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

షర్మిలతో సంధికి వైసీపీ యత్నాలు?

ఏపీలో కొత్త ఏడాదిలో కొత్త రాజకీయాలు మొదలు కానున్నాయా అంటే అన్ని వర్గాలు అవుననే ముక్తకంఠంతో చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఏపీలోఅసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలూ జరగనున్నాయి. ఈ ఎన్నికలకు జనవరి నుండే సన్నాహాలు మొదలు కానున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా.. జనవరిలో దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించనున్నాయి. అయితే, ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఒకవైపు, ప్రతిపక్షంలో తెలుగుదేశం.జనసేన  మరోవైపు  బరిలో నిలవనుండగా.. కాంగ్రెస్ కూడా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సీఎం జగన్ సోదరి   షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖరారైంది. జనవరి మొదటి వారంలోనే షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైపోయింది. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే వైసీపీ నుండి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని చెబుతున్నారు. షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో ఇన్నాళ్లు ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా జగన్ కు పెద్దగా నష్టం లేకుండా పోయింది. కానీ, ఆమె ఏపీకి వస్తే జగన్ కు భారీ డ్యామేజ్ జరగడం ఖాయం. ఇది వైసీపీకి తీరని నష్టంగా విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాదు, ఒకే రాష్ట్రంలో రెండు వేరువేరు పార్టీలలో ఉంటూ.. అన్నా చెల్లెలు ఎదురు నిలిచి రాజకీయ పోరాటం చేసుకుంటే ఖచ్చితంగా అది జగన్ ప్రతిష్టను మరింత మసకబారుస్తుందని అంటున్నారు. పైగా షర్మిల తన రాజకీయ ప్రయాణంలో జగన్ పై సూటిగా విమర్శలకు దిగితే వైఎస్ కుటుంబంలో వివాదాలు కూడా బహిర్గతం కావడం ఖాయం. ఇవన్నీ రానున్న ఎన్నికలలో వైసీపీకి ఘోర ఓటమికి కారణం కావడమే కాకుండా.. జగన్ ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడం ఖాయం. ఈ నేపథ్యంలో దీనిని దృష్టిలో పెట్టుకొనే షర్మిల కోసం జగన్ అండ్ కో రాయబారాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. వైసీపీలోకి తిరిగి షర్మిలను తీసుకుని వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్త వైరల్ అవుతోంది. వైఎస్ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఒకరు   వైసీపీ తరఫున  షర్మిలతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. షర్మిలకు ఏం కావాలి? ఆమె ఆలోచనలు ఏంటి? ఆమె డిమాండ్లు ఏంటి? అన్నది తెలుసుని మళ్ళీ అన్న జగన్ తో రాజీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆమెను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా సదరు రాయబారే తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, వైసీపీ నుండి కడప ఎంపీగా షర్మిలను పోటీ చేయించేందుకు కూడా వైసీపీ హై కమాండ్ సుముఖంగా ఉందని, ఆమె రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడం, ఆస్తులకు సంబంధించిన విషయాలను కూడా సానుకూలంగా పరిష్కరించడానికి   షర్మిలతో సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   అయితే, ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే జగన్ నైజం తెలిసిన వారెవరూ ఆయన  అంత సులభంగా రాజీకి వచ్చే మనిషి కాదనే అంటారు. అదే విధంగా  షర్మిలకు కూడా అన్న జగన్ తో  రాజీకి వచ్చే అవకాశాలు లేవనీ, తెలంగాణలో   అడుగడుగునా ఇబ్బందులు సృష్టించడమే కాకుండా, షర్మిలకు ఆర్థికంగా ఇసుమంతైనా సహకారం అందకుండా జగన్ చేశారనీ, అందుకే  ఆమె ఏపీకి వచ్చి అన్నతో తలపడేందుకు సిద్ధమయ్యారనీ అంటున్నారు. కనుక షర్మిల అన్నతో రాజీపడే అవకాశాలు మృగ్యమని అంటున్నారు.  అసలు ఈ ప్రచారాన్ని జగన్ అభిమానులే సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమై.. మళ్ళీ అన్నా చెల్లెల్లు ఒక్కటి అవుతారనేందుకు ఉన్న ఏకైక పాజిటివిటీ ఏదైనా ఉందంటే అది తల్లి విజయమ్మ మాత్రమే. ఎంతైనా తల్లి కదా మళ్ళీ అన్నా చెల్లెల్లు కలిస్తారంటే తల్లిగా ఆమె పాత్ర ఆమె నిర్వర్తిస్తారు. ఇద్దరినీ ఉన్నతంగా చూడాలన్నదే ఆమె కోరిక కనుక ఆ అవకాశం వస్తే విజయమ్మ ఇందులో కీలకం కానున్నారు. కానీ, జగన్ అంత సులభంగా కరుగుతారా? ఒకేవేళ చెల్లే కదా అని జగన్ తగ్గినా.. వదిన భారతీ అందుకు ఒప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

సిట్టింగుల మార్పుతో తెలుగుదేశం విజయానికి జగన్ రాచబాట?!

సహజంగా ఎన్నికలనగానే ముందుగా గుర్తొచ్చేది సీట్లు.. టికెట్లు. టికెట్ ఎవరికి ఇస్తారు? ఏ పార్టీ నుండి ఏ అభ్యర్థి పోటీలో ఉన్నారు? ఏయే నియోజకవర్గంలో ఎవరెవరు ప్రత్యర్థులు అనేది కీలకం. అయితే  ఇందులో దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీకే అభ్యర్థుల ఎంపిక నుంచీ.. గెలుపు గుర్రాలను ఎంచుకునే విషయంలో  మంచి అవకాశం ఉంటుంది. అధికారం చేతిలో ఉంటుంది కనుక.. పరిస్థితులను   అనుకూలంగా మలచుకొనే అవకాశం, వెసులుబాటు ఉంటుంది. ప్రతిపక్షాలు ప్ర  అభ్యర్థుల ఎంపిక విషయంలో ముందుగానే నిర్ణయాలు తీసుకుని   ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగుతారు. కానీ అధికార పార్టీ మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ముందుగా ప్రయత్నిస్తుంది.  చివరిలో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల కదనరంగంలోకి దిగుతుంది. కానీ, ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వ విధానంలాగే.. ఎన్నికలకు సమాయత్తమౌతున్న విధానం కూడా రివర్స్ లోనే ఉంది.  తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లుగా  ఇక్కడ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి వాటి విషయంలో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో.. ముందుగా అభ్యర్థుల ఎంపిక పై దృష్టి పెట్టారు.  భారీ స్థాయిలో సిట్టింగుల మార్పునకు శ్రీకారం చుట్టారు. అధికారికంగా ఓ 11 మంది సిట్టింగులను మార్చేశారు. ఇంకా చాలా చాలా మందిని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆ మార్పులను ప్రకటించే ధైర్యం చేయలేకపోతున్నారు. పార్టీలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఉప్పెనలా లేచిన అసంతృప్తితో.. అసమ్మతిని చల్లార్చే ప్రయత్నాలను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించేసి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమైపోయారు. అసమ్మతి వ్యక్తం చేస్తున్న వారిని కనీసం కలవడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు డొక్క వరప్రసాద్ వంటి వారే   బహిరంగంగా జగన్ ను ఓ సారి కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వండి అని వేడుకుంటున్నారంటే వైసీపీ పరిస్థితి, జగన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమౌతుంది. ఒక వేళ జగన్ మొండిగా సిట్టింగుల మార్పుతో ముందుకు వెళ్లినా     కొత్త అభ్యర్థులను కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి పార్టీలో లేదు. అందుకే ముందుగా  ఇన్ చార్జీల మార్పు పేరిట వారిని నియోజకవర్గాలకు పంపి,  రేపు వారినే ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించేందుకు ప్లాన్ వేశారు. ఇలా చేయడం ద్వారా తన లోని ఓటమి భయాన్ని బయటపడకుండా, గెలుపు ధీమా  సంకేతాలు ఇచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.  కానీ సిట్టింగుల మార్పు వ్యూహంతో వైసీపీలో గెలుపు ధీమా  సంగతేమో కానీ.. తెలుగుదేశంకు  ఇది మేలు చేసేలా ఉంది. జగన్ ఇలా ముందే అభ్యర్థులను ప్రకటించడం తెలుగుదేశం, జనసేన కూటమికి కలిసి వచ్చిన అవకాశంగా మారుతోంది.   చంద్రబాబు లాంటి రాజకీయ మేధావికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తమ అభ్యర్థుల ఎంపికకు సమయం ఇవ్వడమే కాకుండా పర్ఫెక్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకొనేందుకు మంచి అవకాశంగా కూడా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎవరో ముందుగానే తెలియడం వల్ల   ఆ నియోజకవర్గంలో సమస్యలు, రాజకీయ-సామాజిక పరిస్థితులు వంటివి అంచనా వేసుకొని తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకునే సావకాశం కలుగుతుందంటున్నారు.  వైసీపీ అభ్యర్థి ఎవరో తేలిపోవడంతో టీడీపీ-జనసేన కూటమికి   అభ్యర్థుల ఎంపిక మరింత సౌలభ్యంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే శత్రువును ఎలా దెబ్బకొట్టాలో కావాల్సినంత సమయం తీసుకొని పక్కా స్కెచ్ వేసి బరిలోకి దిగే వీలు కలుగుతుంది. ప్రత్యర్థి బలం బలహీనత ముందే తెలియడంతో టీడీపీ, జనసేనకు ఎదుర్కోవడం మరింత సునాయాసమైపోతుందని విశ్లేషిస్తున్నారు. దీంతో ఇప్పటికే గెలుపు ఆశలు అడుగంటిపోయిన వైసీపీకి జగన్ నిర్ణయం మరింత నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు.   మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జగన్ మార్పులు, చేర్పుల దిశ‌గా దూకుడుగా అంతకు మించి మొండిగా కూడా ఉన్నారు. ఐ ప్యాక్ టీం చెప్పిందో.. లేక సొంత సర్వే సంస్థలు చెప్పాయో.. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా చేస్తున్నారో కానీ దాదాపు  90 మంది సిట్టింగులను మార్చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.   వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచేవారి స‌త్తా ఎంత? వారి ఆర్థిక ప‌రిస్థితి ఏంటి? కుల‌, మ‌త, సామాజిక పరిస్థితులు వంటి కీల‌క విష‌యాల‌ ఆధారంగా, కాస్త ఆలస్యమైనా టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నారు.  అందుకే టీడీపీ, జనసేనలో అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు కోసం ఎలాంటి తొందరా కనిపించడం లేదు. ఎలాగూ వైసీపీ అభ్యర్థులు ఎవరో రానున్న రోజులలో తేలిపోతుంది కనుక అప్పుడు అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకుని గెలుపు గుర్రాలను నిలబెట్టేందుకు టీడీపీ, జనసేన వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయి.  మొత్తం మీద జగన్ తొందరపాటు, ఓటమి భయంతో పడుతున్న తడబాటు ఏపీలో ఆ పార్టీ పుట్టి ముంచి, తెలుగుదేశం విజయానికి రాచబాట వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వినోద్ కు ఈడీ నోటీసులు.. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రికి నిదర్శనమేనా?

బీజేపీ  బీఆర్ఎస్ బంధం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతోందా? లోక్ సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ లక్ష్యంగా ఆ రెండు పార్టీలూ కలిసే పని చేస్తున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం, రాహుల్ గాంధీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హిందూ వ్యతిరేకి అంటూ విమర్శలు చేయడం చూస్తుంటే.. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు తమ రహస్య మైత్రిని కొనసాగిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇక బీజేపీ అధిష్ఠానం కూడా ఎన్నికలలో అంచనాల మేరకు రాణించలేకపోవడానికి    బీఆర్ఎస్ తో రహస్య బంధం ఉందని ప్రజలు నమ్మడమే కారణమని తెలిసినా.. ఆ బంధాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.  అందుకే ఢిల్లీ మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్న బీఆర్ఎస్ అధినేత తనయ, ఎమ్మెల్సీ కవితను కాకుండా.. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేంద్రంలోని మోడీ సర్కార్ తన ప్రత్యర్థులను, ప్రత్యర్థి పార్టీ నేతలను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇష్టారీతిగా ఉపయోగిస్తున్నదన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు విపక్ష పార్టీలను ఇబ్బందులలోకి నెట్టే లక్ష్యంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ, కవిత విషయంలో మాత్రం ఆ పని చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. సరే అది పక్కన పెడితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లక్ష్యంగా ఈడీ, ఐటీలు దాడులు సోదాలు నిర్వహిస్తుండడానికి బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సి ఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత వినోద్ ను విచారించిన ఈడీ ఆయనక నోటీసులు జారీ చేసింది.    ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో 20 కోట్ల రూపాయల  అవకతవకలపై దర్యాప్తు లో భాగంగా శనివారం (డిసెంబర్ 30)  తెల్లవారు జామున హెచ్ సి ఏ మాజీ అధ్యక్షుడు వినోద్  ను ఈడీ అధికారులు విచారించారు.  మాజీ క్రికెటర్లు అర్షద్, అయూబ్, శివలాల్ యాదవ్ లను కూడా ఈడీ  ప్రశ్నించింది. హెచ్ సి ఏ మాజీ  అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ  ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు   నోటీసులు జారి చేసింది. జనవరి మొదటి వారంలో హాజరు కావాలని  పేర్కొంది.  వాస్తవానికి హెచ్ సీఏ అధ్యక్షుడిగా వినోద్ ఉన్న కాలంలో జరిగిన ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి కేసు నేటిది కాదు. కానీ సరిగ్గా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈడీ కాంగ్రెస్ నేతకు నోటీసులు జారీ చేయడం వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.   ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు  చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా   వివేక్ వెంకటస్వామికి టికెట్ ఖరారైన వెంటనే ఆయన నివాసంపై  ఐటీ దాడులు జరగడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.  ఓటమి భయంతోనే అధికార బీఆర్ఎస్ తో కుమ్మక్కై బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని అప్పట్లోనే కాంగ్రెస్ ఆరోఫణలు చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల సమయంలోనే బీజేపీ వ్యతిరేకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టి పెట్టడం రాజకీయ వేధింపులు వినా మరోటి కాదని అంటున్నారు.

చిరంజీవి సీఎం అవ్వాలనుకుంటే పెద్ద విషయం కాదు.. శివాజీ

శివాజీ.. హీరోగా, సహాయనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో మంచి సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి వివిధ సమస్యలపై పోరాటం చేశారు. ప్రజల పక్షాన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు, ఇటీవల బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో పార్టిసిపేట్‌ చేసి మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు.  తాజాగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పదేళ్ళు ప్రజల సమస్యలపై ఒంటరిగా పోరాటం చేశాను. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశాను. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను.  ఒకప్పుడు బిజెపిలో చేరాను. ప్రజలకు బిజెపి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. అందుకే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాను. నాకూ ఓ కుటుంబం ఉంది. ఎన్నాళ్లని ఈ ఒంటరి పోరాటం చేయలను. ఇప్పుడు రాజకీయాలన్నీ కులం, మతం ప్రాతిపదికగా నడుస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవిగారి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. వారు సీఎం అవ్వాలనుకుంటే పెద్ద కష్టమైన విషయం కాదు. ఎక్కడో చిన్న లోపం ఉంది. దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది’ అన్నారు.

ఏపీ రాజకీయాలను మలుపు తిప్పనున్న షర్మిల కుమారుడి వివాహం?!

జనవరిలో ఏపీ రాకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. మార్చిలో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో జనవరిలో ఏపీ రాజకీయాలు ఊహకందని మలుపులు తిరగనున్నాయి. అధికార వైసీపీ సహా విపక్షాలు  జనవరిలో అభ్యర్థులను ప్రకటించనున్నాయి. దీంతో భారీ స్థాయిలో వలసలు కూడా ఉండనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార  వైసీపీ నుండి పదుల సంఖ్యలో నేతల జంపింగుకు ఆస్కారం ఉంది. అసంతృప్త ఎమ్మెల్యేలు విపక్ష పార్టీల వైపు చూస్తుండగా.. ఇప్పుడు వీరికి కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అప్షన్ గా కనిపిస్తున్నట్లు సూచనలున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలిగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖరారు కాగా.. తెలంగాణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అందుకు కాస్త సమయం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో షర్మిల చేతికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ఖరారైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి మొదటి వారంలోనే షర్మిల అధికారికంగా కాంగ్రెస్ లో చేరనుండగా.. అదే రోజున ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఆ తరువాత జనవరి మూడవ వారంలో జరగనున్న షర్మిల కుమారుడి వివాహం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పనున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. జనవరి 17న షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జోధ్ పూర్ లోని ఉమైద్ ప్యాలెస్ లో జరగనుండగా.. ఆ తర్వాత హైదరాబాద్ లో భారీ స్థాయిలో రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇక పెళ్లి వేడుకే అయినా ఒక రకంగా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే వేడుకగా భావిస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా హాజరుకానుండగా.. ఇదే వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలలోని నేతలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. ఒక రకంగా ఈ వేడుక నేతల సమీకరణకు వేదికగా మారనున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్న నేతలను షర్మిల దగ్గర చేసుకొనేందుకు తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ వేడుకను షర్మిల వేదికగా భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నేతలతో విజయమ్మ సంప్రదింపులకు ఈ రిస్పెప్షన్   బీజం వేయనున్నట్లు కనిపిస్తుంది. అదే విధంగా సోదరుడు సీఎం జగన్ మోహన్ రెడ్డితో షర్మిల విబేధాలు, తల్లి విజయమ్మ షర్మిల పక్షాన అండగా నిలబడం, వైఎస్ వివేకా హత్య అనంతరం దూరమైన మరో సోదరి డాక్టర్ సునీత న్యాయపోరాటం, ఇప్పుడు వైఎస్ కుటుంబంలో అగాధాలు ఈ పెళ్లితో మరోసారి చర్చకు రానుండగా.. అసలు జగన్ కు ఈ వేడుకకు ఆహ్వానం అందుతుందా? అందినా జగన్ ఈ వేడుకకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ పెళ్లి ఏపీలో వైఎస్ అభిమానులకు ఎలాంటి సంకేతం ఇవ్వనుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా షర్మిల కుమారుడి రిసెప్షన్ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తున్నది.  షర్మిల ఏపీ రాజకీయాలకు వస్తారా? కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే దాగుడు మూతలు ఇకలేవు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారైంది. ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా పని చేయనున్నారని తేలిపోయింది. అన్న జగన్ తో షర్మిల ప్రత్యక్ష యుద్దానికి సిద్ధమేనని నిర్దారణ అయిపోయింది. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపించారు. అది కూడా వైఎస్ కుటుంబం తరపున ఈ బహుమతులు పంపుతున్నట్లు షర్మిల శుభాకాంక్షలు తెలిపి.. వైఎస్ రాజకీయ వారసత్వంలో తనకు కూడా వాటా ఉన్నట్లు ఆమె పరోక్షంగా చెప్పేశారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని దక్కించుకునేందుకు అదే కుటుంబ వేడుకను వేదికగా మలచుకోనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి మింగుడుపడని వ్యవహారం అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్ ఏపీ రాజకీయాలలో పెను మార్పులకు వేదిక అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

9 శాతం పడిపోయిన వైసీపీ గ్రాఫ్!.. చాణక్య స్ట్రాటజీస్ సర్వే వెల్లడి

రెండు నెలలలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు   ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన విజయం పక్కా అని పలు సర్వేలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో  సర్వే   కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది.  తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందన్న అంచనాలు ఉండగా,   తెలుగుదేశం, జనసేన కలిస్తే క్లీన్ స్వీప్  గ్యారంటీ అని ఆ సర్వే పేర్కొంది. ఈ మధ్య కాలంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజలకు తెలుగుదేశం పార్టీని మరింత దగ్గర చేసాయని తమ సర్వేలో తేలినట్లు చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే వెల్లడించింది. వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగి పరిస్థితులన్నీ తెలుగుదేశంకు అనుకూలంగా మారుతున్నట్లు ఈ సర్వే నివేదిక పేర్కొంది.  2019 ఎన్నికలలో  వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం సాధించి వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ కేవలం 23 స్థానాలతో  ఓటమి చవిచూసింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయితే ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లను వైసీపీ సొంతం చేసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలి ఆరు నెలలలోనే ప్రజలలో అసంతృప్తి మొదలైంది. అది కాస్త నాలుగేళ్ళ కాలం తిరిగేసరికి ప్రజలలో తీవ్ర వ్యతిరేకతగా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఘోర పరాజయం తప్పదని ఇప్పటికే ఎన్నో సంస్థలు తమ సర్వేల ఫలితాలను వెల్లడించగా.. తాజాగా చాణ‌క్య స్ట్రాట‌జీస్ కూడా ఏపీలో ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమిదే విజయం అని తేల్చి చెప్పింది.   చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే రాష్ట్రంలో ప‌ర్య‌టించి వివ‌రాలు సేక‌రించింది.  దీని ప్ర‌కారం.. అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, జ‌న‌సేన స‌హా ఇత‌ర పార్టీల ప‌రిస్థితిని అంచనా వేసింది. ఈ స‌ర్వే వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించింది. ఈ సర్వే ప్రకారం గ‌డిచిన నాలుగేళ్ళలో తెలుగుదేశం  పుంజుకుంది. అదేస‌మ‌యంలో అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ ప‌డిపోయింది. ఇక‌, జ‌న‌సేన స‌హా ఇత‌ర పార్టీల గ్రాఫ్ కూడా కొంత మేర‌కు పెరిగిన‌ట్టు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌లలో తెలుగుదేశంకు    39 శాతం ఓట్లు రాగా  ప్ర‌స్తుతం ఇది 4 శాతం పెరిగి 43 శాతానికి చేరినట్లు చాణక్య  వెల్లడించింది. అలాగే వైసీపీకి 2019 ఎన్నిక‌లలో 50 శాతం ఓటింగ్ గ్రాఫ్ దక్కించుకోగా.. ప్ర‌స్తుతం అది ఏకంగా 9 శాతం దిగజారిపోయి 41 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. అలాగే 2019 ఎన్నిక‌లలో 6 శాతం ఓటింగ్ తో ఉన్న జనసేన పార్టీ ప్ర‌స్తుతం 4 శాతం పెరిగి 10 శాతానికి చేరిందని, ఇక ఇత‌ర పార్టీలు 2019 ఎన్నిక‌లలో 5 శాతం ఓటింగ్ పొందగా.. ఇప్పుడు ఒక శాతం పెరిగి 6 శాతానికి చేరిందని తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న ఈ గ్రాఫ్‌లు ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌రింత పెర‌గ‌డ‌మో, త‌గ్గ‌డ‌మో జ‌రుగుతుంద‌ని స‌ర్వే   వెల్ల‌డించగా.. టీడీపీ, జనసేన కూటమి  గ్రాఫ్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ సర్వే  ప్రకారం చూస్తే జనసేన లేకుండా టీడీపీ 43 శాతం ఓటింగ్ దక్కించుకోనుండగా.. వైసీపీకి 41 శాతం మాత్రమే దక్కనున్నాయి. జనసేన కలిస్తే ఇది 51 శాతానికి చేరి కనీవినీ ఎరుగని విజయం దక్కించుకోనుంది. సామాజిక వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలను విభజించి వారి  శాంపిల్స్ సేకరించిన ఈ చాణక్య  స్ట్రాటజీస్ సర్వే ప్రకారం.. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. అటు అర్బన్ ఓటర్ల నుండి గ్రామీణ ఓటర్ల వరకూ ఎటు చూసినా వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్నట్లు ఈ సర్వే పేర్కొంది. మొత్తంగా ఈ సర్వేప్రకారం తెలుగుదేశం, జనసేన కూటమి వచ్చే ఎన్నికలలో అద్భుత విజయం సాధించడం ఖాయం.

ఈటల రూటెటు?

ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) లో చేరి కేసీఆర్ తో కలిసి నడిచారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఈటల కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) వరుసగా రెండో సారి గెలిచిన తరువాత ఈటలను కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారు. అయితే  ఆ తరువాత కేబినెట్ లోకి తీసుకుని ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే   పార్టీ అధినేతో విభేదాలు మాత్రం ముదిరిపోయాయి. చివరకు ఆయన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నుంచి బయటకు వచ్చి బీజేపీ గూటికి చేరారు. అయితే ఈటల బీజేపీలో చేరడంపై ఆయన గురించి తెలిసిన వారంతో అప్పట్లో విస్తుపోయారు. ఈటల బీజేపీలో ఇమడటం సాధ్యం కాదన్న అనుమానాలు అప్పట్లో బలంగా వ్యక్తం అయ్యాయి. అయితే ఆయన బీజేపీలో కొనసాగారు. ఇమిడారు. సర్దుకుపోయారు. పోరాడారు. మొత్తంగా బీజేపీలో అత్యంత కీలక నేతగా ఎదిగారు. కానీ ఈటల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చున్న నాటి నుంచీ కూడా వామపక్ష బావజాలం ఉన్న ఆయన బీజేపీలో ఎలా ఇముడుతారన్న సందేహాలే వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే బీజేపీలో ఈటల పలు మార్లు ఉక్కపోతకు గురయ్యారు. రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆయన బీజేపీలో కొనసాగారు. ఆ పార్టీ చేరికల కమిటీకి నేతృత్వం వహించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ గా కూడా వ్యవహరించారు. అన్నిటికీ మించి బీజేపీ హై కమాండ్ ఆయన కోరినట్లుగా గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రత్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అదే సమయంలో ఆయన సొంత నియోజకవర్గం నుంచి కూడా సేఫ్ సైడ్ గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా బీజేపీలో ఒకే వ్యక్తికి రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం చాలా అరుదు. అయితే ఈటల రెండు స్థానాల నుంచీ పరాజయం పాలు కావడంతో పార్టీలో ఆయన హవా తగ్గిందని అంటున్నారు.   ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంపాలైన ఆయన కేసీఆర్ ను ఢీ కొనే  సందర్భంలో  సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టలేకపోయాననీ అందుకే రెండు చోట్లా పరాజయం ఎదురైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలనీ, అది కూడా బీజేపీకి కొంత బలం ఉన్న మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేస్తాననీ, పార్టీ టికెట్ ఇవ్వాలనీ అంటున్నారు. అయితే ఇందుకు బీజేపీ హై కమాండ్ సుముఖంగా స్పందించలేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంగన్ స్థాన నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనీ, అయితే ఈటల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదనీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   తొలి నుంచీ ఈటలకు బీజేపీలోని ఒక బలమైన వర్గం వ్యతిరేకంగా పని చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ పరాజయం పాలైన తరువాత ఈటలకు ఆ వర్గం సెగ మరింత ఎక్కువైంది. ఆ వర్గమే అధిష్ఠానం వద్ద ఈటలకు లోక్ సభ టికెట్ విషయంపై గట్టిగా అభ్యంతరం చెబుతోంది.  ఇక ఈటల విషయానికి వస్తే ఆయన లోక్ సభకు పోటీ చేసి గెలిస్తేనే రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతారు. బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా, ఒక వేళ ఇచ్చినా పోటీ చేసి ఓడిపోయినా ఈటల రాజకీయ భవిష్యత్ కు ఫుల్ స్టాప్ పడినట్టే. అందుకే ఈటల ఈ సారి ఒకింత సేఫ్ స్థానమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని గట్టిగా భావిస్తున్నారు. ఒక వేళ పార్టీ నిరాకరిస్తే బీజేపీ నుంచి బయటకు రావడానికి కూడా ఆయన వెనుకాడే పరిస్థితి లేదు. అందుకే ఈటల బీజేపీ వీడి కాంగ్రెస్ గూటికి చేరు అవకాశాలున్నాయని అంటున్నారు. ఈటల ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికీ ఆ దిశగా ప్రచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. మరి ఈటల విషయంలో బీజేపీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.