తెలంగాణ తెలుగుదేశంలోపార్టీ కోసం పనిచేసే సారధి ఎవరు?
posted on Dec 30, 2023 6:11AM
తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలుగుదేశం ఉన్నా నాయకులు లేరన్నది కళ్ళకు కనిపిస్తున్న సత్యం. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలకు కొదవ లేదు. ఆంధ్రా సెటిలర్లతో పాటు తెలంగాణ ప్రజలలో కూడా తెలుగుదేశంపై అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. చెక్కుచెదరకుండా అలాగే ఉంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సమాజం పక్క పార్టీల వైపు చూడాల్సి వచ్చింది కానీ.. అవసరమైతే ఇప్పుడైనా తెలుగుదేశం జెండా చేత పట్టేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. నేటికీ చెక్కు చెదరకుండా గ్రామ గ్రామాన కనిపిస్తున్న తెలుగుదేశం జెండా దిమ్మలే అందుకు నిదర్శనం. పదేళ్లుగా తెలుగుదేశం ఇక్కడ యాక్టివ్ లేకపోయినా ప్రతి ఏడాది జెండా దిమ్మకి రంగులేసి, జెండా ఎగరేసి పండగ జరిపే అభిమానం మాత్రం కనిపిస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికలలో కూడా తెలుగుదేశం జెండాలు రెపపలాడాయి. తెలంగాణలో పోటీచేసిన అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా చేతబట్టాల్సిన పరిస్థితి కనిపించింది. మరి ఇంతటి అభిమానం ఉన్న పార్టీకి అధ్యక్షుడు ఎవరు? ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సగటు తెలుగుదేశం అభిమానిని వేధిస్తున్న ప్రశ్న.
బలమైన కార్యకర్తలున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చెప్పుకోదగ్గ నేతలు లేరు. కానీ ఉన్న వారిలో నేనంటే నేను అధ్యక్షుడిని కావాలంటూ పరితపించేవారు ఎక్కువయ్యారు. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నదే పదిమంది నేతలు కాగా.. వారిలో రాష్ట్రస్థాయి ఉన్న నేతలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ, ఉన్న వారిలో ఒకరిద్దరు మినహా అందరూ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పట్టుమని పక్కన నలుగురు కార్యకర్తలు, అనుచరులు లేకపోయినా తమను తాము నాయకులుగా చెప్పుకుంటూ అధ్యక్ష పదవి కోసం అర్రులు చాస్లూ పైరవీలు చేస్తున్నారు. ఇంకొందరైతే పక్క రాష్ట్రంలో ఉంటూ కూడా తెలంగాణ రాష్ట్ర టీడీపీకి అధ్యక్ష పదవి కోసం ఆశపడుతున్నారు. మరి అందరూ పల్లకి ఎక్కాలంటే మోసే వారెవరన్నది ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. కనీసం వారి స్థాయి కూడా ఆలోచించకుండా కొందరు అధ్యక్ష హోదా కోసం పరితపిస్తున్నారు. వీరిని చూస్తే రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవి అంటే అంత చులకన అయిపోయిందా అనిపించకమానదు.
రాష్ట్ర స్థాయి పదవి అంటే కాస్త అర్ధబలం, అంగబలం ఉండాలి. ఒక్కోసారి అధిష్టానంతో కూడా పనిలేకుండా సొంత నిధులు ఖర్చు చేసి పార్టీని బలోపేతం చేయాల్సి వస్తుంది. కానీ, ఇప్పుడు పదవికి పోటీ పడేవారిలో చాలామంది నలుగురు కార్యకర్తలను పోషించే స్థోమత కూడా లేని వారు. పోనీ కార్యకర్తలలో మంచి పేరు, పరిచయాలు అయినా ఉన్నాయా అంటే అదీ లేదు. మరి ఏమి చూసుకొని వారు అధ్యక్ష పదవి ఆశిస్తున్నారన్నది సగటు కార్యకర్తను వేధిస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీ అయి రెండు నెలలు కావోస్తున్నది. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నాక తర్వాత ఇప్పటి వరకూ ఆ పదవిని భర్తీ చేయలేదు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండడం, తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అంత హైరానా పడాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ, ఏపీలో సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ సమయంలో పార్టీ పెద్దల ఫోకస్ ఏపీ మీదనే ఉంటుంది కనుక ఈలోగా తెలంగాణ అధ్యక్షుడి నియామకం పూర్తి చేసి పార్టీని అంతో ఇంతో ఇక్కడ యాక్టివ్ చేయాల్సి ఉంది.
దీంతో ఈసారి తెలంగాణ తెలుగుదేశం కోసం బరిలో నిలిచే నాయకులు ఎవరు? పార్టీ కోసం వెన్నంటి నిలిచే నాయకుడు ఎవరు? అన్నది ఆసక్తిగా మారింది. కొన్నాళ్ళుగా ఇక్కడ పార్టీని మోసం చేస్తూ, పక్క పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న నాయకులే దొరికారు. అయితే, ఈసారి ఇలాంటి వారి పట్ల చంద్రబాబు అప్రమత్తంగా ఉంటూ అధ్యక్షుడి నియామకంలో జాప్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈసారి అయినా సమర్థమైన నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే ఇక్కడ మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. ముఖ్యంగా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి, పార్టీలో ఉంటూ ఇతర పార్టీలో సత్సంబంధాలు ఏర్పరచుకున్న వారికి, పట్టుమని పదిమంది కార్యకర్తలను కూడా పోగు చేయలేని వారికి, వివాదాలకు కేరాఫ్ గా నిలిచే వారికి, ఆవేశపరులకు, సోషల్ మీడియా స్టార్లకు, కాకుండా నిజమైన పార్టీ విధేయులకు అధ్యక్ష హోదా ఇవ్వాల్సి ఉంది. మరి కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకునే నాయకులు ఎవరో.. వారిని ఎప్పుడు నియమిస్తారో వేచి చూడాలి.