భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్... రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
భారత్ లో ఒకపక్క బ్రిటన్ నుండి వచ్చిన కొత్త కరోనా వైరస్ భయపెడుతుంటే మరోపక్క బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడిన ఈ వైరస్ ఇపుడు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లు మృత్యువాత పడుతున్నాయి. హర్యానాలో గడచిన పది రోజుల్లోనే 4 లక్షలకు పైగా పౌల్ట్రీ కోళ్లు చనిపోపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక్క పంచకుల జిల్లాలోనే ఇన్ని కోళ్లు మరణించాయి. దీంతో కొన్ని కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి జలంధర్ రీజినల్ డిసీస్ డయాగ్నసిస్ ల్యాబ్‌కు పంపించారు. ఐతే ఇప్పటి వరకైతే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా బయటపడలేదు. అయితే ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కేసులు బయటపడ్డాయి. తాజాగా జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోనూ నిన్న కొన్ని కేసులు బయటపడ్డాయి.
మనదేశంలో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ శాఖ సూచనలు జారీచేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోతే వెంటనే ఆ వివరాలను కేంద్రానికి అందజేయాలని సూచించింది. అంతేకాకుండా ఈ వింటర్ సీజన్‌లో విదేశాల నుంచి మన దేశానికి పెద్ద మొత్తంలో వలస పక్షులు వస్తాయని.. వాటిపై కూడా గట్టి నిఘా ఉంచాలని తెలిపింది. ఈ వైరస్ మనుషులకు వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తాజా ఆదేశాలలో స్పష్టంచేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని ప్యాండ్ డ్యామ్ చట్టుపక్కల పెద్ద మొత్తంలో బాతులు ఈ వైరస్ కారణంగానే మరణించాయి. దీంతో అప్రమత్తమైన కంగ్రా జిల్లా యంత్రాంగం.. పాంగ్ డ్యామ్ చుట్టుపక్కల ఉన్న ఫతేపూర్, దెహ్రా, జవాలి, ఇందోరా ప్రాంతాల్లో చికెన్, గుడ్లు, చేపల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు. ఈ ప్రాంతాల్లో కోళ్ల ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. కఠిన ఆంక్షలు విధించింది. రాకపోకలను నిలిపివేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.50వేలు జరిమానా విధించనున్నారు.
అటు మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సౌర్ జిల్లాలోనూ పలు చోట్ల చికెన్,గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు. కేరళలో కూడా 1700 బాతులు ఈ వైరస్ కారణంగా మరణించాయి. అలప్పుజ, కొట్టాయంలో ముందుజాగ్రత్తగా వేలాది బాతులను చంపి పూడ్చిపెట్టారు. ఈ నేపథ్యంలో తమిళనాడు, కేరళ నుంచి జరిగే కోళ్ల సరఫరాను నిలిపివేసింది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పౌల్ట్రీ వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాకులు పెద్ద ఎత్తున మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సంక్రమిస్తుందని.. అందుకే ప్రతిఒక్కరు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.