కేసీఆర్ కు భాష తో పాటు దెబ్బలు అప్పగిస్తాం! బండి సంజయ్ సంచలన వార్నింగ్ 

జనగామలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా  ఫ్లెక్సీలు కట్టిన బిజెపి కార్యకర్తలపై దాడి చేయడం అమానుషమన్నారు సంజయ్. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీస్ అధికారులు బీజేపీ కార్యకర్తల రక్తం కళ్ల చూస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్. జనగామలో బీజేపీ కార్యకర్తల పై జరిగిన లాఠీచార్జి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. 24 గంటల్లో పోలీసులపై చర్యలు తీసుకోకుంటే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని సంజయ్ హెచ్చరించారు.   ఫామ్ హౌజ్ లో  పడుకునేందుకు  అధికారం ఇవ్వలేదని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సంజయ్.  నీ కొడుకును కొడితే ఊరుకుంటావా అని సీఎంను  ప్రశ్నించారు. నీ కొడుకు వీపు చితపండు చేస్తే దెబ్బలు పడ్డ కొడుకుల బాధ నీకు తెలుస్తుందంటూ మండిపడ్డారు. ఖబర్దార్ ముఖ్యమంత్రి..  తీరు మార్చుకోకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని బండి వార్నింగ్  ఇచ్చారు. తన భాషకు గురువు కేసీఆర్ అన్న బండి సంజయ్..   కేసీఆర్ కు భాష తోపాటు దెబ్బలు కూడ అప్పగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మంత్రులు దద్దమ్మలుగా మారారని.. cs, dgp లకే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని విమర్శించారు.   జనగామలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బీజేపీ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగాయి. అధికారపార్టీకి వంతపాడుతున్న కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.దీంతో స్థానిక సీఐ, పోలీసులు బీజేపీ నగర అధ్యక్షుడు పవన్ శర్మ, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. పోలీసుల లాఠీచార్జ్ కు నిరసనగా బీజేపీ ఆందోళన చేస్తోంది. బుధవారం చలో జనగామకు పిలుపిచ్చారు బండి సంజయ్. దీంతో జనగామలో అదనపు  బలగాలను మోహరిస్తున్నారు.   

మధ్యప్రదేశ్ లో గాడ్సే లైబ్రరి ! గాంధీకి అవమానమంటున్న కాంగ్రెస్ 

జాతిపిత  మహాత్మగాంధీని హత్య చేసిన  నాథూరామ్ గాడ్సే విషయంలో చాలా రోజులుగా దేశంలో వివాదం జరుగుతోంది. నాథూరామ్ గాడ్సేకు మద్దతుగా కొన్ని హిందూ సంస్థలు బహిరంగ ప్రకటనలు చేస్తుండటం దుమారం రేపుతోంది. తాజాగా బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో  నాథూరామ్ గాడ్సే పేరుతో ఒక లైబ్రరీ ఏర్పాటైంది. అఖిల భారతీయ హిందూ మహాసభ ఈ లైబ్రరిని ఏర్పాటు చేసింది. ఇదే ఇప్పుడు రాజకీయ మంటలు రేపుతోంది. మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సే పేరుతో  లైబ్రరీ ఏర్పాటు చేయడాన్ని  కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.   మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి రవీ సక్సేనా ఈ ఘటనలో బీజేపీని తప్పుపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సాధ్వి ప్రగ్యకు టిక్కెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 'బీజేపీకి ఇదేమీ కొత్త కాదు. పార్లమెంటులో గాంధీని అవమానించి, గాడ్సేను పొడిగిన 'గాడ్సే భక్తురాలు'కు భోపాల్‌ నుంచి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది' అని అన్నారు. గాంధీని చంపిన వ్యక్తిని ఆరాధిస్తున్నారంటే వారు హింసను ప్రోత్సహిస్తున్నట్టేనని, అలాంటి వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  అయితే ఈ విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని, రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ చెబుతోంది.  గ్వాలియర్‌లో  నాథూరామ్ గాడ్సే  లైబ్రరీ ఏర్పాటు చేయడంపై హిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ స్పందించారు. దేశ విభజన కాలం నాటి విషయాలను, జాతీయ నేతల గురించి యువతరం తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. అప్పటి ఘటనల్లో వాస్తవాలు, దేశం పట్ల తమకున్న బాధ్యతలను యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే   లైబ్రరీని ప్రారంభించినట్టు తెలుస్తుందన్నారు.  దేశ విభజనకు నాథూరామ్ గాడ్సే ఎందుకు విభేదించాడు, దీనికి వ్యతిరేకంగా ఎందుకు గళం విప్పాడనే సమాచారం దేశ యువతకు తెలిపేందుకుకే  ఈ ప్రయత్నమని అఖిల భారతీయ హిందూ మహాసభ  క్లారిటీ ఇచ్చింది.    

ఏపీ ఎస్ఈసీ సెకండ్ వికెట్ ! సెక్రటరీ వాణిమోహన్ అవుట్  

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఏపీ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంలో మరో కీలక పరిణామాం చోటు చేసుకుంది. తన అధికారాలకు మరింత పదును పెడుతున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్..దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై వరుసగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల సంఘం సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను తొలగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్‌కు ఆయన లేఖ రాశారు. వాణిమోహన్‌ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని లేఖలో తెలిపారు. వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ , రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై సోమవారం క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ . 30 రోజులపాటు సెలవుపై వెళ్లారు సాయిప్రసాద్‌. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఎన్నికల కమిషన్.. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయంటూ సాయి ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించింది. ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.  ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయాలతో సర్కార్ మద్దతుగా ఉంటున్న ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తోందని చెబుతున్నారు.  

జగన్ క్రిస్టియన్‌.. హిందువు అనడానికి ఏముంది! ఉండవల్లి సంచలన కామెంట్స్ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆలయాలపై దాడులు తాజా పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో కొత్త రకం రాజకీయం మొదలైందని.. దానికి మతం రంగు పులిమారన్నారు. రామతీర్థం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని.. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామతీర్థం ఘటనకు సంబంధించిన కేసు పోలీసులకు అప్పగిస్తే 24 గంటల్లో నిందితులను పట్టుకుంటారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రామతీర్థం వెళితే.. అదే రోజు అధికారపార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారని, పోటీగా వెళ్లారా? మరి ఎందుకు వెళ్లారో అర్థం కావడంలేదన్నారు.  జగన్ క్రిస్టియన్‌.. హిందువు అనడానికి ఏముందని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. జగన్ రుషికేస్ వెళ్లడంలో విచిత్రం ఏముందని ప్రశ్నించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి సత్యనారాయణ వ్రతంలో కూర్చొన్నారని.. ఆయన కాంగ్రెస్ కాబట్టి ఎలాంటి వివాదం లేదన్నారు. జగన్ మాత్రం ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు ఉండవల్లి. ఎవరి మతాన్ని వారే ఆచరించాలని.. అల్లా, యేసు ప్రభువు, ముక్కోటి దేవతలు అందరూ ఎవరి నమ్మకం వారిదన్నారు. ప్రపంచంలోని మిలటరీ మొత్తాన్ని తీసుకొచ్చినా మన దేశంలో ఆలయాలకు సెక్యూరిటీని పెట్టలేమని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్.  మహమ్మద్ జిన్నా గురించి సంచలన విషయాలు తెలిపారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. భారత్‌, పాకిస్థాన్‌ విడిపోవడానికి జిన్నాయే కారణమని అన్నారు. జిన్నా తాత రాజ్‌పుత్ వంశానికి చెందిన వారని, పూర్తి వెజిటేరియన్ అని, మాంసాహారం తినరని అన్నారు. అయితే ఆయన చేపల వ్యాపారం చేసేవారని, దీంతో ఆయనను మత పెద్దలు కుంలం నుంచి బహిష్కరించారన్నారు. ఆయనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కుల సంఘాన్ని ప్రాధేయపడ్డారని, తాను చేపల వ్యాపారం చేశానే తప్ప.. ఎప్పుడూ తినలేదని, తనను మళ్లీ మతంలోకి చేర్చుకోవాలని కోరినా.. వారు కులంలో చేర్చుకోలేదు. దీంతో  జిన్నా తాత ఆ బాధతోనే చనిపోయారని ఉండవల్లి తెలిపారు. ఈ విషయం జిన్నా తండ్రి మనసులో బాగా నాటుకుపోయిందని, దీంతో ఆయన ఇస్లాంలోకి వెళ్లిపోయారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అసలు జిన్నా హిందువేనని, రాముడి వంశమని చెప్పుకుంటారన్నారు. రాముడి వంశమని చెప్పుకునేవారే భారత్‌, పాకిస్థాన్‌ విడిపోవడానికి కారకుడయ్యారని.. భిన్నత్వంలో ఏకత్వమంటే ఇదేనేమోనని తాను ఆశ్చర్యపోయానని అరుణ్ కుమార్ అన్నారు.    

 కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే!  మోడీ సర్కార్ కు సుప్రీం షాక్ 

నరేంద్ర మోడీ సర్కార్ కు గట్టి షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది.  చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జితేందర్ సింగ్ మాన్ (బీకేయూ అధ్యక్షుడు), డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి (ఇంటర్నేషనల్ పాలసీ హెడ్), అశోక్ గులాటి (అగ్నికల్చరల్ ఎకనామిస్ట్), అనిల్ ధన్వంత్ (శివ్‌కేరి సంఘటన, మహారాష్ట్ర) కమిటీ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం  విచారణ జరిపింది. తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు  ధర్మాసనం తెలిపింది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సీజేఐ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల చట్టబద్ధత, నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని.. తమకున్న అధికారాల పరిధిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.  'మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఒక స్పష్టత వస్తుంది' అని చెప్పారు. రైతులు కమిటీ వద్దకు వెళ్లరన్న దానిపై వాదనలు తాము వినదలచుకోలేదని, రైతులు నిరవధిక ఆందోళనలు చేయదలచుకుంటే చేసుకోవచ్చని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా రైతు నిరసనలకు నిషేధిత సంస్థ ఒకటి సహకరిస్తోందంటూ ఒక దరఖాస్తు తమ ముందు ఉందని ఆయన పేర్కొంటూ, అటార్నీ జనరల్ దీనిని అంగీకరిస్తారా, కాదంటారా అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ, నిరసనల్లోకి ఖలిస్థానీలు చొరబడ్డారని మాత్రమే తాము చెప్పామని కోర్టుకు తెలిపారు.   రైతుల తరఫున వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ పిటిషన్లు వేసిన అడ్వకేట్ ఎంఎల్ శర్మ తన వాదనలు వినించారు.  కోర్టు ఏర్పాటు చేసే ఏ కమిటీ ముందు తాము హాజరు కావాలనుకోవడం లేదని రైతులు చెబుతున్నట్టు కోర్టుకు విన్నవించారు. చర్చలకు చాలా మందే వస్తున్నప్పటికీ ప్రధాన వ్యక్తి అయిన ప్రధానమంత్రి రావడం లేదని రైతులు అంటున్నట్టు కూడా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సీజేఐ స్పందిస్తూ... 'ప్రధానిని చర్చలకు వెళ్లమని మేము చెప్పలేం. ఈ కేసులో ఆయన పార్టీ కాదు' అన్నారు. తమకున్న అధికారులతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయగలమని, జ్యుడిషియల్ ప్రక్రియలో భాగమే కమిటీ అని, చిత్తశుద్ధితో పరిష్కారం కోరుకునే రైతులు కమిటీ ముందుకు వెళ్లవచ్చని సీజేఐ పేర్కొన్నారు.  

ఏపీలో రాజకీయ ఉగ్రవాదం! 

వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును అంధకారం చేసిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా, ఉపాధి కల్పనా కేంద్రంగా అభివృద్ధి చేస్తే .. జగన్ రెడ్డి సర్కార్ మాత్రం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని ఆయన మండిపడ్డారు.  గతంలో తాము తెచ్చిన  పెట్టుబడులు, పరిశ్రమలన్నింటినీ తరిమేసి అభివృద్ధి నిలిపివేశారని ఆయన విమర్శించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరం తీసుకుని, విధ్వంసాలు, కక్ష సాధింపులు లేని సమాజాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేసి జగన్ రెడ్డి సర్కార్.. స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టిందని  చంద్రబాబు ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు.   రాజకీయ ఉగ్రవాదంతో అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది యువతపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారని, సామాజిక మాధ్యమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని  మండిపడ్డారు.  ‘‘67 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఆలయాలపై దాడులు, విధ్వంసాలు లేవు. ఇంతటి కక్షసాధింపు పాలన, హింసాత్మక చర్యలు గతంలో  చూడలేదు. బీసీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై ఇంతటి దమనకాండ ఏ రాష్ట్రంలోనూ లేదు. చట్టసభలు, పాలనాయంత్రాంగం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, మీడియాపై దాడి చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా సమాజాన్ని చైతన్య పరిచే బాధ్యత భుజాన వేసుకోవాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి, భావితరాల ప్రగతికి దోహదపడాలని చంద్రబాబు సూచించారు.  

గ‌వ‌ర్న‌ర్ తో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ కీల‌క‌ భేటీ.. ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు!

ఏపీలో స్థానిక ఎన్నికల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి మ‌ధ్య వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వగా.. ఈ నిర్ణయంపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఏకకాలంలో ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ కష్టమన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ను కొట్టివేసింది. ఈ నేప‌థ్యంలో ఈరోజు రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ కలిశారు. పంచాయతీ ఎన్నికలు, తాజా పరిణామాలపై చర్చించారు. ఏ ఉద్దేశ్యంతో తాను నోటిఫికేషన్ ఇచ్చాననే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు, తీర్పుపై అప్పీల్ చేసిన విషయాలపై గవర్నర్‌ కు వివరించినట్టుగా తెలుస్తోంది. ఎస్ఈసీ జేడీపై వేటు వేయడానికి గల కారణాలపై కూడా నిమ్మగడ్డ వివరణ ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఎస్‌ఈసీలోని ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆయ‌న ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఎస్ఈసీలోని ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని, ఉద్యోగులను ఎస్ఈసీకి సహకరించకుండా ప్రభుత్వం ప్రోత్సహిస్తూదంటూ పిర్యాదు చేశారని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన కామెంట్లను గవర్నర్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు స‌హ‌రించేలా ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయ‌న కోరిన‌ట్లు సమాచారం.

పిజ్జా, బర్గర్లు లాగిస్తూ.. డబ్బుల కోసం రైతుల ఆందోళన: బీజేపీ ఎంపీ సంచలనం 

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 50 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో రోడ్ల మీదే ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం పై నిన్న సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టిన సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉండగా రైతుల ఆందోళనలపై రాజకీయ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ఎస్ మునిస్వామి రైతులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులు ఆందోళనలు చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నారని అయన ఆరోపించారు. కర్నాటకలోని కోలార్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ మునిస్వామి మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు అసలు రైతులు కాదని.. వారంతా నకిలీ రైతులని, దళారులని, వారు పిజ్జా, బర్గర్‌లను తింటున్నారని, అక్కడ జిమ్ ను కూడా తయారు చేశారని అయన ఆరోపించారు. వారంతా చేస్తున్న ఈ డ్రామాను ఇంతటితో ముగించాలని అయన అన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలోని వివిధ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మరో బీజేపీ ఎంపీ మదన్ దిలావర్ ఆందోళన చేస్తున్న రైతులపై కామెంట్స్ చేస్తూ.. రైతులు చికెన్ బిరియానీ తింటూ దేశంలో బర్డ్‌ఫ్లూను వ్యాపింపజేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ తో కమలానికి గండమా? కేసీఆరే సంజయ్ అస్త్రమా? 

తెలంగాణలో దూకుడుగా  వెళుతోంది బీజేపీ. వరుస విజయాలు ఇచ్చిన జోష్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ గానే రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు  చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని పదేపదే ప్రకటిస్తున్నారు బండి సంజయ్.  టీఆర్ఎస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని కూడా చెబుతున్నారు. పొర్లు దండాలు పెట్టినా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదంటున్నారు. కేసీఆర్ పై ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్న సంజయ్.. ఇటీవల మాత్రం మాట మారుస్తున్నారు. కేసీఆర్ కు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పడం మానేసి.. మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారని పదేపదే చెబుతున్నారు బండి సంజయ్. దీని వెనక బలమైన వ్యూహమే ఉందని తెలుస్తోంది.  తెలంగాణ  పాలనలో మార్పులు జరుగుతాయని, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారని కొంత కాలంగా రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మార్చి లోపే కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. దీంతో తనకు సంబంధం లేని అంశమైనా సీఎం మార్పుపై  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు  బండి సంజయ్. కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆలోచన కేసీఆర్ కు లేదని చెబుతున్నారు. తమకు మంత్రి పదవి రాకపోతే  కొత్త పార్టీ పెడతామని ఇప్పటికే ఆ పార్టీలోని  ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు అంటున్నారని... ఈ మాటలను వారితో అనిపిస్తోంది సాక్షాత్తు కేసీఆరే అని సంచలన కామెంట్లు చేశారు సంజయ్. కొత్త పార్టీ పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని... అందువల్ల సీఎం కావాలనే ఆలోచనను కొన్ని రోజులు పక్కన పెట్టాలని కేటీఆర్ కు కేసీఆర్ చెపుతారని... తద్వారా కొడుకును సీఎంని చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ వాయిదా వేస్తారని చెప్పారు. గతంలో సంతోష్ తో ఇలాంటి వ్యాఖ్యలు చేయించిన కేసీఆర్... ఇప్పుడు ఎమ్మెల్యేలతో ఆ మాట చెప్పిస్తున్నారని అన్నారు. ఇప్పట్లో కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేయబోరని  స్పష్టం చేస్తున్నారు సంజయ్.  తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో బండి సంజయ్ చేస్తున్న తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పిన సంజయ్.. ఇప్పుడు మరో మూడేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారని చెబుతుండటం వెనక బీజేపీ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. కేసీఆర్ సీఎంగా  పాలనపై పూర్తిగా ఫోకస్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయన సచివాలయమే వెళ్లరు. ఎక్కువ సమయం ఫౌంహౌజ్ లోనే ఉంటారు. కొన్నిసార్లు వారాల తరబడి ఆయన బయటికే రాలేదు. కేసీఆర్ తీరే ఇప్పుడు విపక్షాలకు ఆయుధంగా మారింది. కేసీఆర్ ఫౌంహౌజ్ ముఖ్యమంత్రి అని, ప్రజలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ విపక్షాలు జనంలోకి వెళుతున్నాయి. బీజేపీ కూడా ఇదే నినాదం వినిపిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారంలో కేసీఆర్ వైఖరినే ప్రధాన అస్త్రంగా మార్చుకుని మంచి ఫలితాలు సాధించింది. అందుకే రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటేనే బెటరని కమలం నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  కేటీఆర్ యంగ్ లీడర్. ఆయనకు ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పాలనలో స్పీడ్ పెరిగుతుంది. ఇప్పటివరకు సాగిన పాలనకు భిన్నంగా కేటీఆర్ వ్యవరించే అవకాశం ఉంటుంది. కేటీఆర్ జనాల్లో ఎక్కువగా తిరిగే అవకాశం ఉంటుంది. దీంతో కేసీఆర్ పై చేసినట్లుగా కేటీఆర్ పై ఆరోపణలు, విమర్శలు చేసే అవకాశం బీజేపీ నేతలకు ఉండకపోవచ్చు. కేంద్ర పెద్దలు కూడా కేటీఆర్ పై సానుకూలంగా ఉంటారనే ప్రచారం ఉంది. ఇలా ఏ లెక్కన చూసినా.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని తెలంగాణ బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారని చెబుతున్నారు. అందుకే కేటీఆర్ కంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే.. 2023లో అధికారం సాధించాలన్న తమ టార్గెట్ రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుందని తెలంగాణ కమలం నేతల ఆలోచనగా ఉందంటున్నారు.    తమ రాజకీయ వ్యూహంలో భాగంగానే కేసీఆరే మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నా... ఆయన యూటర్న్ మాటల వల్ల ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయంటున్నారు. జైలుకు పంపిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడంతో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేననే సంకేతం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని కొందరు కమలం నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గందరగోళ ప్రకటనలతో కేడర్ లోనే అయోమయం నెలకొనే  పరిస్థితి వస్తుందంటున్నారు.  

సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. థాయ్‌లాండ్ ఓపెన్‌ 2021లో పాల్గొనడానికి బ్యాంకాక్‌ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. మంగళవారం నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు కరోనా పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో సైనా నెహ్వాల్ కు కరోనా పాజిట్ గా తేలింది. ఆమెతో పాటు మరో క్రీడాకారుడు హెచ్ఎస్ ప్రణయ్‌ కూడా కరోనా బారిన పడ్డారు. మరి కాసేపట్లో టోర్నీ ప్రారంభం కానుండగా భారత షట్లర్లకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. కాగా, ఈ నెల ఆరంభంలో సైనా నెహ్వాల్, శ్రీకాంత్, పీవీ సింధు మరియు సాయి ప్రణీత్ లతో పాటుగా టాప్ ఇండియా షట్లర్లు ఈ టోర్నీ కోసం థాయ్‌లాండ్‌ కు వెళ్లారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి తీవ్ర గాయాలు.. భార్య, పీఏ మృతి

కర్నాటకలోని అంకోలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆయన భార్య విజయతో పాటు ఆయన పీఏ దీపక్‌ మృతి చెందారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిద్దరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వీరిద్దరూ చనిపోయారు. ఎల్లాపూర్‌ నుండి గోవా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి శ్రీపాద నాయక్‌‌కు తీవ్ర గాయాలు కావడంతో.. ఆయన్ను హుటాహుటిన గోవా మెడికల్‌ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెళ్లి మంత్రి ఆరోగ్య పరిస్థితి తోపాటు ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరోపక్క కారులో ఉన్న డ్రైవర్‌, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. నాయక్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌కు సూచించారు.   ఈ ప్రమాదం పట్ల కర్ణాటక సీఎం యడియూరప్ప తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీపాద నాయక్ భార్య విజయ మృతిపట్ల ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ సంతాపం తెలిపారు. 68 ఏళ్ల శ్రీపాద నాయక్‌ ఉత్తర గోవా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఆయుష్‌ మంత్రిగా, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కర్నాటక సీఎం యడ్యూరప్ప, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో ఫోన్లో మాట్లాడారు. కేంద్రమంత్రి శ్రీపాదకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాలకు చేరిన కోవిడ్ టీకాలు! 

కోవిడ్ వ్యాక్సిన్లు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఏపీకి కేటాయించిన వ్యాక్సిన్లు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. తెలంగాణ వ్యాక్సిన్లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి. తొలి దశలో ఏపీకి ఐదు లక్షల డోసులు, తెలంగాణకు నాలుగన్నర లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చినట్లు అధికారుల సమాచారం. హెడ్ క్వార్టర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ డోస్‌లు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటాయి. పోలీసు భద్రత నడుమ గ్రామస్థాయి వరకు వ్యాక్సిన్ వెళ్లినట్లుగానే వీటి నిల్వ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే చేపట్టేలా ఫ్రీజర్లు, ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్లను వైద్యారోగ్య శాఖ సమకూర్చింది.  ఈ నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రంలో డాక్టరుతో పాటు వ్యాక్సిన్ వేయడానికి శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలర్జీ, రియాక్షన్ లాంటివాటిని పరిశీలించడానికి అబ్జర్వేషన్ రూమ్‌లు, హెల్త్ కేర్ సిబ్బంది వేచి ఉండడానికి వెయిటింగ్ హాళ్ళు ఏర్పాటయ్యాయి.వ్యాక్సిన్‌ వేయించుకునే ప్రతిఒక్కరూ ఆధార్‌ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. వ్యాక్సినేషన్‌ అయిపోయిన అనంతరం వీరి వివరాలు కో–విన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేస్తారు. ఏపీకి కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌  టీకాలు వచ్చాయని సమాచారం. ఏపీకి తొలివిడత కింద సుమారు 5 లక్షల డోసులు రాగా.. ఇందులో సుమారు 4 లక్షల డోసులు పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకా ఉన్నట్లు సమాచారం.  ఏపీలో తొలివిడత కింద 3,82,899 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేస్తారు. వీరి వివరాలను కొవిన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. మొత్తం 1,940 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అర్హులందరికీ టీకా వేయాలంటే 40,410 కేంద్రాలు అవసరం అవుతాయని అంచనా. 17,775 మందికి వ్యాక్సినేటర్లను సిద్ధం చేశారు.  వ్యాక్సిన్ పంపిణి కోసం  తెలంగాణలో  తొలి రోజు 139 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో 40 ప్రైవేటు ఆసుపత్రులలో ఉంటే మిగిలిన 99 ప్రభుత్వాసుపత్రులలోనే ఏర్పాటయ్యాయి. ప్రతీ కేంద్రంలో రోజుకు వంద మంది చొప్పున వ్యాక్సిన్ ఇచ్చేలా రంగం సిద్ధమైంది. ‘ఇప్పటికే సుమారు 2.90 లక్షల మంది పేర్లు ‘కొవిన్’లో నమోదయ్యాయి. తొలి రోజున 13,900 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉంటుంది. 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాలలో మొత్తం 1400 సెషన్లలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. కొన్ని చోట్ల అనుబంధ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటవుతున్నందున రోజుకు 1.40 లక్షల మందికి ఇవ్వాలని ప్లాన్ రెడీ అయింది.    మంగళవారం తెల్లవారుజాము నుంచి  కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ను రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ తొలి విడత టీకా సరఫరా ప్రారంభించింది. పుణెలోని తయారీ కేంద్రం నుంచి టీకా డోసుల్ని మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా తరలించారు.  కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిని పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేశారు. రవాణా కోసం జీపీఎస్‌ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించారు. తొలి విడత డోసులు పుణె నుంచి దిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు చేరాయి. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలను వినియోగించారు. తొలి కార్గో విమానం హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్‌కు .. మరొకటి కోల్‌కతా, గువాహటికి వెళ్లింది. ముంబయికి రోడ్డుమార్గం ద్వారా టీకా డోసులను సరఫరా చేస్తున్నారు. ఎయిరిండియా, గోఎయిర్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌కు చెందిన విమానాలను ఈ రవాణా కార్యక్రమంలో ఉపయోగిస్తున్నారు.

పాక్ పైన జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో 300 మంది ఉగ్రవాదులు చనిపోలేదా..? 

2019 ఫిబ్రవరిలో కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది మన సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ లో 300 మంది చనిపోయినట్టు పాక్ మాజీ రాయబారి అప్పట్లో చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదా..? అసలు ఆయన అలాంటి వ్యాఖ్యలే చేయలేదా? అంటే అవుననే అంటోంది ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ "ఆల్ట్ న్యూస్". ఆ వెబ్‌సైట్ తాజా కథనం ప్రకారం పాకిస్తాన్ మాజీ రాయబారి అఘా హిలాలీ చేసినట్టుగా చెబుతున్న ఆ వీడియోను మానిప్యులేట్ చేశారని పేర్కొంది.   మనదేశంలోని పలు దినపత్రికలతోపాటు, నేషనల్ న్యూస్ చానెళ్లు కూడా ఈ వార్తను ప్రచురించాయి. 26 ఫిబ్రవరి 2019లో భారత వాయుసేన మెరుపుదాడిలో 300 మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఎట్టకేలకు పాకిస్తాన్ అంగీకరించిందంటూ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి మరీ రాసుకొచ్చాయి. అయితే టీవీ చర్చల్లో పాల్గొనే హిలాలీ ఎప్పుడూ పాక్ ఆర్మీ వైపు వకాల్తా పుచ్చుకుని మాట్లాడతారని, బాలాకోట్‌లో భారత్ జరిపిన మెరుపుదాడిలో అసలు ఒక్కరు కూడా చనిపోలేదని ఆయన చెప్పినట్టు ఆల్ట్ న్యూస్ తాజాగా స్పష్టం చేసింది.   "అంతర్జాతీయ సరిహద్దు దాటి యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు. వారు 300 మందిని చంపాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. మా లక్ష్యం వారి లక్ష్యానికి భిన్నమైనది. మేం వారి హై కమాండ్‌ని టార్గెట్ చేశాం. అది మా న్యాయమైన టార్గెట్. ఎందుకంటే వారు సైనికులు. సర్జికల్ స్ట్రైక్స్‌లో ఎవరూ మరణించలేదని అంతర్లీనంగా చెప్పాం. ఇప్పుడూ వాళ్లకి ఏం చెప్తున్నామంటే, వాళ్లు ఏం చేసినా, వాళ్ళు ఎంత చేస్తే, మేం కూడా అంతే చేస్తామని, అంతకన్నా ఉద్ధృతం చేయబోమని చెప్తున్నాం ’’ అని అఘా హిలాలీని చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.   "అజెండా పాకిస్థాన్" అనే కార్యక్రమంలో హిలాలీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. అయితే, ఆ వెంటనే ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత ఆపరేషన్ విఫలమైంది. వారు ఓ ఫుట్‌బాల్ మైదానంలో బాంబు వేశారు. పాకిస్తాన్ వైపు నుంచి ఒక్కరు కూడా చనిపోలేదు’’ అని హిలాలీ వివరించారు. అంతేకాకుండా భారత దాడుల్లో 300 మంది చనిపోయారని తాను చెప్పినట్టు వస్తున్న వార్తలపై జఫార్ హిలాలీ స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను ఎడిట్ చేశారని అయన పేర్కొన్నారు. తన మాట్లాడిన వీడియోలో 0.7-0.9 సెకన్ల మధ్య కట్ చేశారని తెలిపారు. మర్నా (చంపాలని) అని తాను చెపితే మరా (చనిపోయారు) అని ఎడిట్ చేసారని అయన పేర్కొన్నారు.

హైకోర్టులో జగన్ సర్కార్ కి ఊరట.. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్టే!

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కి ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కు గట్టి షాక్ తగిలినట్లయింది. కాగా, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ను కొట్టివేసింది. ఏకకాలంలో ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ కష్టమని ప్రభుత్వం వాదించింది. వ్యాక్సినేషన్‌ కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం, వ్యాక్సిన్‌ పంపిణీని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పట్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనని స్పష్టమైంది. ఇదిలా ఉండగా.. హైకోర్టు తాజా తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక మలుపు! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని తెలిపింది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసులను విచారించాలని జగన్‌ తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే జగన్‌ తరపు లాయర్‌ వాదనను సీబీఐ, ఈడీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని ఈడీ కోర్టు స్పష్టం చేసింది. ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదుకు విచారణను కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు..  జడ్చర్ల సెజ్‌లో అరబిందో, హెటిరోకు భూకేటాయింపుల చార్జిషీట్‌లో సోమవారం విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని  ఆదేశించింది. సీఎం జగన్‌తోపాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, అరబిందో ప్రతినిధులు పీవీ రాంప్రసాద్‌ రెడ్డి, నిత్యానందరెడ్డి సహా మరికొందరికీ నోటీసు జారీ చేసింది. సీఎం జగన్‌ ఆస్తుల కేసులు దర్యాప్తు చేస్తున్న ఈడీ... అరబిందో, హెటిరో భూముల కేటాయింపు అంశంపై నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో గతంలో అభియోగపత్రం దాఖలు చేసింది. ఆతర్వాత ఐదు చార్జిషీట్లను సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. నాంపల్లి కోర్టులోని కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలన్న జగన్‌ అభ్యర్థన నేపథ్యంలో ఆ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు... కేసుల్ని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. 

గండం నుంచి గట్టెక్కేందుకా.. కేటీఆర్ కోసమా? ఫిబ్రవరిలో కేసీఆర్ మరో యాగం?

తెలంగాణ ప్రభుత్వంలో ప్రక్షాళన జరగబోతుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పగ్గాలను కేటీఆర్ కు అప్పగించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారని కొందరు... సీఎం మార్పు ఉండదు కాని ప్రస్తుత మంత్రివర్గంలో కొందరిని తొలగించి కొత్తవారిని తీసుకుంటారని మరికొందరు చెబుతున్నారు. ఇటీవల పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారాయి. దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడానికి ఇవే కారణమనే చర్చ కూడా టీఆర్ఎస్ లో జరుగుతోంది. మార్చిలోపు కేటీఆర్ సీఎం ఖావడం ఖాయమని డిసెంబర్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగినా.. మళ్లీ అంతా సైలెంట్ అయ్యారు. సీఎం మార్పుపై కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ మరో యాగం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనే సమాచారం వస్తోంది. దీంతో యాగం తర్వాత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే చర్చ మళ్లీ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.  కేసీఆర్ ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. భక్త విశ్వాసాలను పాటిస్తూ యాగాలు, హోమాలు ఎక్కువగా చేస్తారు. అందుకే యాదాద్రి పునర్ నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు.  కేసీఆర్ కలలుగన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఆలయ ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేయనున్నారు. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలతో పాటు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సుదర్శన యాగంతో పాటు చండీయాగం, రాజశ్యామలయాగం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ క్రతువు ముగిసిన తర్వాత తన కుమారుడు కేటీఆర్ కి సీఎంగా పట్టాభిషేకం చేసి, ఆ బాధ్యతల నుంచి కేసీఆర్ వైదొలగుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. జనవరి మొదటి వారంలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. యాదాద్రి అలయాన్ని ప్రారంభించడంతో పాటు యాగం చేసిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేయడం మంచిదని భావించినట్టు చెబుతున్నారు.  కేసీఆర్ మరో యాగం చేయాలని నిర్ణయంచడంపై ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది.  మొదటి నుంచి కేసీఆర్‌ ఏ పని తలపెట్టినా పండితుల సలహాలు తీసుకుంటారు. ఆలయాల సందర్శన తర్వాతనే ముందడుగు వేస్తారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే  2015లో ఎర్రవల్లిలోని తన సొంత ఫామ్ హౌజ్‌లో ఆయుత చండీయాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేముందు అధికారంలోకి మళ్లీ రావాలంటూ రాజశ్యామల యాగాన్ని జరిపించారు. గెలిచిన తర్వాత 2019 జనవరిలోనూ అదే తరహా యాగాన్ని నిర్వహించారు. అయితే  ఆ యాగ సమయంలో చేసిన తప్పిదం వల్లే కేసీఆర్ కు గతంలో ఎప్పుడు లేనంతగా సమస్యలు వచ్చాయని పండితులు పక్కాగా చెబుతున్నారు. మళ్ళీ యాగం చేసి పరిహారం సమర్పించుకుంటే తప్ప కేసీఆర్ కు మంచి రోజులు రావని చెప్పారట. అందుకే కేసీఆర్ మరో యాగం చేయడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.   2019 జనవరి 21 నుంచి కేసీఆర్ మూడో సారి  యాగాన్ని నిర్వహించారు. అయితే జనవరి 22వ తేదీన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ పెళ్ళి రిసెప్షన్ కార్యక్రమానికి ఢిల్లీకి వెళ్ళారు. ఆ సమయానికి చండీయాగం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీక్ష తీసుకున్న తర్వాత పూర్తిచేయకుండా మధ్యలో ఢిల్లీ వెళ్ళిడం వల్లే ఆయనకు చెడు జరుగుతుందని కొందరు పండితుల మాట. యాగం మొదలుపెట్టిన తర్వాత అది పూర్తిగా ముగిసేంత వరకు ఆ పరిధి దాటి బైటకు వెళ్ళరాదన్నది నియమం. కానీ కేసీఆర్ ఢిల్లీ వరకు విమానంలో వెళ్ళి  వచ్చారు. ఇది యాగ సంప్రదాయానికి విరుద్ధమంటున్నారు. అప్పటి నుంచే కేసీఆర్ కు  కలిసి రావడం లేదని,  2019 జనవరి 21వ తేదీన తలపెట్టిన చండీయాగం నుంచే ఆయనకు  వరుస దెబ్బలు తగులుతున్నాయని చెబుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఎల్ఆర్ఎస్, ధరణి పోర్టల్ అమలులో బ్యాక్ స్టెప్ వంటి ఘటనలకు వారు ఇందుకు ఉదహరిస్తున్నారు. పండితుల సూచనల మేరకే ఈ గండం నుంచి గట్టెక్కేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి మరో యాగం చేయబోతున్నారని చెబుతున్నారు.

కిడ్నాప్ సూత్రధారి అఖిలప్రియే!  అన్ని అధారాలు ఉన్నాయన్న సీపీ 

హైదరాబాద్ లో కలకలం రేపిన  బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు కీలకు మలుపు తిరిగింది. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియే కిడ్నాప్ సూత్రధారి అని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసును ఛేదించి ఆధారాలను సీపీ మీడియాకు వివరించారు. కిడ్నాప్  కేసులో  మరో  ముగ్గురిని అరెస్ట్‌ చేశామని.. నిందితులు వాడిన సెల్‌ఫోన్లు, నకిలీ నెంబర్‌ప్లేట్లను సీజ్‌ చేసినట్లు సీపీ తెలిపారు. ఆరు సిమ్‌కార్డులను మియాపూర్‌లోని మొబైల్‌ షాప్‌లో కొనుగోలు చేసినట్టు మల్లికార్జున్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పారని సీపీ చెప్పారు. కిడ్నాప్‌ కోసం అఖిలప్రియ 70956 37583 ఫోన్ నెంబర్లను వాడారని సీపీ వెల్లడించారు. కూకట్‌పల్లిలోని నిందితులు ఓ హోటల్‌లో రూమ్‌ తీసుకున్నారని, కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌రామ్‌ పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు. ఈ కేసులో అఖిలప్రియ అనుచరుడు సంపత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. ప్రవీణ్‌రావు ఇంటి దగ్గర నిందితులు రెక్కీ నిర్వహించారని అంజనీకుమార్‌ తెలిపారు. ‘‘విజయవాడ నుంచి హైదరాబాద్‌ వరకు టవర్‌ లోకేషన్ల ట్రేసింగ్‌ చేశాం. భార్గవ్‌రామ్‌, గుంటూరు శ్రీనుకు నిందితులు టచ్‌లో ఉన్నారు. కూకట్‌పల్లి లోదా నుంచి యూసఫ్‌గూడ ఎంజీఎం స్కూల్‌కి భార్గవ్‌రామ్‌ వచ్చారు. అఖిలప్రియ నెంబర్‌ నుంచి గుంటూరు శ్రీనుకు 49 ఫోన్ కాల్స్  వెళ్లాయి. గుంటూరు శ్రీను నుంచి మరో నిందితుడికి మధ్య 28 కాల్స్‌ నడిచాయి. గుంటూరు శ్రీను నుంచి ఇంకో నిందితుడికి మధ్య 16 కాల్స్‌ ఉన్నాయి. కిడ్నాప్‌ జరుగుతున్నంత సేపు కిడ్నాపర్లతో శ్రీను మాట్లాడాడు. కిడ్నాప్‌ కేసులో మొత్తం 143 కాల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేశారు. కిడ్నాప్‌ కోసం టెంపరరీ సిమ్స్‌ గ్యాంగ్‌ ఉపయోగించింది’’ అని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. అఖిలప్రియ  అరెస్ట్ సమయంలో మహిళా ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారని, వైద్య పరీక్షలు నిర్వహించడంలో కూడా నిర్లక్ష్యం లేదని చెప్పారు అంజనీ కుమార్. పోలీసులపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు.   

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్!

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే స్కూళ్ల నిర్వహణపై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి ఒకటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్‌ లో మంత్రులు, కలెక్టర్లతో సమావేశమైన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల జనవరి 18 నుంచి ఇంటర్, డిగ్రీ కాలేజీలు తెరిచేందుకు విద్యా శాఖ ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. దీంతో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం తగు ప్రణాళికలను రూపొందిస్తుంది.

ఏపీ ఎన్నికల సంఘం జేడీపై ఎస్ఈసీ వేటు 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో మరింత దూకుడు పెంచిన ఏపీ ఎన్నికల సంఘం. శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ.. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో విధుల్లో  నిర్లక్ష్యంగా ఉంటున్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది. ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్‌పై ఎస్ఈసీ వేటు వేసింది. జేడీ జీవీ సాయిప్రసాద్‌ను ‌విధుల నుంచి తొలగించింది. ఆర్టికల్ ‌243 రెడ్‌విత్‌, ఆర్టికల్‌ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్‌ని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని ఎస్ఈసీ తేల్చి చెప్పింది.   నాలుగు దశల్లో  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్‌ ప్రకటించిన సమయంలో.. ఈ నెల 9వ తేదీ నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలోని సీనియర్‌ ఉద్యోగులు ఎవరూ సెలవులు తీసుకోరాదని, అందరూ అందుబాటులో ఉండాలని ఎస్‌ఈసీ సూచించింది. అయితే అందుకు భిన్నంగా కార్యాలయంలో సంయుక్త సంచాలకులు సాయిప్రసాద్‌ 30 రోజుల  సెలవులపై వెళ్లారు. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని జీవీ సాయి ప్రసాద్‌పై అభియోగాలు ఉన్నాయి. దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా ఎన్నికల కమిషన్ పరిగణించింది. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయని పేర్కొంటూ వేటు వేసింది.   ఏపీ ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణకు దూరంగా ఉండే ఉద్యోగులకు హెచ్చరిక  జారీ చేసినట్లుగా చెబుతున్నారు. రాజ్యాంగ బద్ద సంస్థ అయిన ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలను ఉద్యోగులు తప్పక పాటించాల్సిందే. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషనర్ కు ఉంటుంది.