జైలుకెళతారా.. సీఎంగా ఉంటారా! కేసీఆర్ పై క్లారిటీ తప్పిన సంజయ్
posted on Jan 6, 2021 @ 10:47AM
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ సెంటర్ గా మారిపోయారు.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్. ఆవేశపూరిత ప్రసంగాలు, పంచ్ డైలాగులతో ఆయన రాజకీయ కాక పుట్టిస్తున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లోనే అద్భుత ఫలితాలు సాధించారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ సొంత గడ్డ సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీకి సంచలన విజయం సాధించి పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెమటలు పట్టించారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బండి వంద స్పీడులో పరుగులు పెడుతోంది. అయితే బండి పరుగులు పెట్టడంతో పాటు కొంత గందరగోళంలో పయనిస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. సంజయ్ చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనల్లో క్లారిటీ మిస్ అవుతుండటమే ఇందుకు కారణమవుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ గానే దూకుడుగా వెళుతున్నారు బండి సంజయ్. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ.. వ్యక్తిగతంగానూ విమర్శలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని పదేపదే ప్రకటిస్తున్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని కూడా చెబుతున్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం కేంద్రం దగ్గర ఉందన్నారు బండి. సీఎం పదవి లేకున్నా సరేకానీ.. తనను, తన కుటుంబాన్ని జైలుకు పంపవద్దని ఢిల్లీ వచ్చి సీఎం కేసీఆర్ పొర్లు దండాలు పెట్టుకున్నారని ఆరోపించారు.. పొర్లు దండాలు పెట్టినా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదని సంజయ్ స్పష్టం చేశారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలన్నింటి పై కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలను, అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు.
కేసీఆర్ కు జైలుకు వెళతారని చెప్పడమే కాదు.. 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పారు బండి సంజయ్. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు. తాము తల్చుకుంటే కేసీఆర్ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోతుందన్నారు. బండి సంజయ్ పదేపదే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ అధ్యక్షుడు చెబుతుండటంతో ... తెలంగాణలో కీలక మార్పులు ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ జైలుకు వెళితే కేటీఆర్ సీఎం అవుతారని కూడా మాట్లాడుకుంటున్నారు. కేంద్రం కేసులు పెట్టకముందే కేసీఆరే సీఎం కుర్చి నుంచి దిగి.. తనయుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారన్న చర్చ కూడా కొన్ని వర్గాల్లో జరుగుతోంది. కాని కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కొన్ని రోజులుగా బల్లగుద్ది మరీ చెప్పిన బండి సంజయ్ సడెన్ గా మాట మార్చారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం వరంగల్ లో పర్యటించిన బండి సంజయ్.. తెలంగాణకు మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని చెప్పారు. కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు కూడా ఉండకపోవచ్చన్నారు. బండి చేసిన ఈ వ్యాఖ్యల వల్లే ఆయన గమనం గందరగోళంగా ఉందనే చర్చకు కారణమైంది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్న సంజయ్.. ఇప్పుడు కేసీఆరే మరో మూడేళ్లు సీఎంగా ఉంటారని ఎలా చెబుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. సంజయ్ చెప్పినట్లు కేసీఆర్ జైలుకు పోతే.. ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేసీఆరే మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారంటే.. మరో మూడేళ్ల వరకు కేసీఆర్ జైలుకు వెళ్లడని సంజయ్ క్లారిటీ ఇస్తున్నారా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ జైలుకు వెళతారో.. మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారో బండి సంజయ్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ చేస్తూ .. రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్, బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ముసుగు వీడి అసలు నిజాలు జనాలకు చెబితే మంచిదని సూచిస్తున్నారు.