రిపీటైన శుభలగ్నం సీన్.. భర్తను 15 కోట్లకు అమ్మిన భార్య
posted on Jan 5, 2021 @ 10:10AM
దాదాపు 25 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో జగపతిబాబు, ఆమని, రోజా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ "శుభలగ్నం" మీకు గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో హీరోయిన్ ఆమని డబ్బు ఆశతో తన భర్తను కోటి రూపాయలకు మరో యువతికి అమ్మేస్తుంది. అప్పట్లో ఈ సినిమాపై మహిళలలో విపరీతమైన చర్చ జరిగింది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళ తన భర్తను రూ.15 కోట్లకు ఆయనను ప్రేమించిన ప్రియురాలికి అమ్మేసింది. ఈ రియల్ లైఫ్ శుభలగ్నం స్టోరీ, తాజాగా మధ్యప్రదేశ్ లో వైరల్ అయింది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్ ఫ్యామిలీ కోర్టుకు ఈమధ్య ఒక కేసు వచ్చింది. ఒక బాలిక తన తండ్రి అతని ఆఫీసులో పనిచేసే ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తన అమ్మతో తరచూ గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఇంట్లో ప్రశాంతత కరువైందని.. ఈ కారణంగా తాను, తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామని ఆ ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించగా.. ఆ బాలిక ఫిర్యాదు నిజమేనని వెల్లడైంది. అంతేకాకుండా అతను ఆ ప్రియురాలితోనే ఉండాలనుకుంటున్నట్లుగా స్పష్టం చేశాడు. అయితే దీనికి అతని భార్య ఒప్పుకోలేదు.
అయితే ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులు ఆ దంపతులకు పలు మార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో చివరకు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. అతని భార్య ఒక షరతుపై తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. తాను భర్తను ఆమెకు అప్పగించాలంటే తనకు ఒక ఖరీదైన ఫ్లాట్‌తో పాటు పెద్ద మొత్తంలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడే తన భర్తను ఆమెకు అప్పగిస్తారని స్పష్టం చేసింది. ఈ షరతుకు భర్త ప్రియురాలు ఒప్పుకోవడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ సందర్భంగా అతని భార్య మాట్లాడుతూ పెళ్లయి ఇన్నేళ్లు గడచిన తరువాత తన భర్త ఇలా ప్రవర్తించడం తనకు ఏమాత్రం నచ్చలేదని.. అయితే తన పిల్లల భవిష్యత్ దృష్ట్యా డబ్బులు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.