సోము భజన.. సంజయ్ గర్జన! ఏపీ బీజేపీ పరువు గోవిందా!
posted on Jan 4, 2021 @ 4:07PM
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల పరువు తీస్తూ నాయకుడంటే ఎలా ఉండాలో చూపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికార పార్టీకి తొత్తులుగా కాదు.. సర్కార్ వైఫల్యాలు, అరాచకాలపై ఉద్యమించాలనే సంకేతమిచ్చారు. ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా.. పోరాటం చేయలేని ఏపీ బీజేపీ నేతల దుస్థితిని పరోక్షంగా ఎండగడుతూ.. ఎలా ముందుకు వెళ్లాలో చూపించారు బండి సంజయ్. జగన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు సంజయ్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడినైన తాను... ఏపీలో జరుగుతున్న దారుణాలపై బాధతోనే మాట్లాడుతున్నానంటూ.. ఏపీ బీజేపీ నేతల చేతగాని తనాన్ని చెప్పకనే చెప్పారు బండి సంజయ్.
హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు సంజయ్. రెండు కొండలవాడా గోవిందా గోవిందా అనే వైసీపీకి ఓటు వేస్తారా? లేక ఏడు కొండలవాడా గోవిందా గోవిందా అనే బీజేపీకి ఓటువేస్తారా? అనే విషయాన్ని ఏపీలోని హిందువులందరూ ఆలోచించాలని అన్నారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. ఏడు కొండలను రెండు కొండలు చేయాలనుకున్న పార్టీ ఇప్పుడు ఏపీలో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారని... అధికార పార్టీకి బుద్ధి చెపుతారని అన్నారు. ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దన్నారు బండి సంజయ్. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ బీజేపీ కార్యకర్తలు బలవంతులని, దమ్మున్నవారని చెబుతూ.. జగన్ సర్కార్ ఉద్యమించడానికి ఓ రకంగా వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు బండి సంజయ్.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలన వచ్చాకా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే 150కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయమయ్యాయి. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం రామతీర్థం కోదండరామాలయంలోని రాముడి విగ్రహాన్ని రెండు ముక్కలు చేశారు దుండగులు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించ లేదు. ఎక్కడో పాకిస్థాన్ లోని హిందూ దేవాలయంపై దాడి జరిగితే ఆవేశంగా స్పందించే ఏపీ బీజేపీ నేతలు.. సొంత రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతున్నా తమ జగన్ భక్తినే చాటుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండే ఉండేందుకన్నట్లు.. ఆలయాలపై దాడులను ఖండిస్తున్నట్లు పేపర్ స్టేట్ మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
రామతీర్థంలో రాములోరి తల నరికినా.. నిత్యం జై శ్రీరామ్ నినాదాలు చేసే ఏపీ కమలనాధులు ఏపీ సర్కార్ ను గట్టిగా నిలదీయలేదు. టీడీపీ చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనతో మేల్కొని కొంత హడావుడి చేశారు. అక్కడ కూడా తమ రాజకీయ కుట్రను బయటపెట్టుకున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి జగన్ సర్కార్ పై ఆరోపణలు చేయకుండా అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పటిలానే చంద్రబాబుపై పడ్డారు. రామతీర్థం ఘటనపై మాట్లాడకుండా.. టీడీపీలో హయాంలో కూల్చేసిన గుడుల గురించి ప్రస్తావించి తన జగన్ భక్తి చాటుకున్నారు. కేంద్రం నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న గుడులను తొలగించారని తెలిసినా.. అవే పసలేని ఆరోపణలు చేశారు విష్ణువర్దన్ రెడ్డి. జగన్ సర్కార్ కు ఇబ్బంది కాకుండా, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ కేడర్ నుంచే వస్తున్నాయంటే ఏపీ బీజేపీ నేతల తీరు ఎలా ఉందో ఊహించవచ్చు.
ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మన నేతలు చేయలేని పనిని తెలంగాణ అధ్యక్షుడు చేశారని కమలం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే సంజయ్ లాగా దూకుడుగా ఉండాలి .. కాని అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తే సాధ్యం కాదని చెబుతున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతల వల్లే ఏపీలో బీజేపీ నాశనం అవుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి భజన వీడి వైసీపీ కోసం కాకుండా పార్టీ కోసం బండి సంజయ్ లాగా పని చేస్తేనే ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి జగన్ రెడ్డి సర్కార్ పై బండి సంజయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ గా మారాయి. ఏపీ బీజేపీ కార్యకర్తలంతా బండికి ఫిదా అయిపోయారని తెలుస్తోంది. అదే సమయంలో సంజయ్ వ్యాఖ్యలతో తమ చేతకానితనం బయటపడిందని సోము వీర్రాజు టీమ్ వర్రీ అవుతోందని తెలుస్తోంది.