ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..  10 మంది శిశువులు మృతి

 మహారాష్ట్రలోని బండారా జిల్లా... జనరల్ ఆస్పత్రిలో... అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో ఉన్న సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU) లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులు మంటల్లో చిక్కుకున్నారు. అయితే ప్రమాదంతో అలర్టైన ఆస్పత్రి సిబ్బంది మంటలు వ్యాపిస్తుండగానే ఏడుగురు పిల్లల్ని కాపాడగలిగారు. మరో 10 మంది మంటల్లో సజీవ దహనం అయ్యారు. వీరంతా నెల రోజుల నుంచి మూడు నెలల లోపున్న చిన్నారులే కావడం గమనార్హం. నవజాత శిశువుల యూనిట్‌లో పొగ రావడాన్ని తొలుత ఓ నర్సు గుర్తించినట్టు సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండాటే చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారని అయన తెలిపారు. మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.

అఖిలప్రియను  ఉగ్రవాది కన్నా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు! 

హఫీజ్ పేట భూ వివాదం, భూమా అఖిలప్రియ అరెస్టుపై సంచలన విషయాలు చెప్పారు భూమా మౌనికారెడ్డి. కేసుకు సంబంధించి ఆమె పలు  తీవ్ర ఆరోపణలు చేశారు. అఖిలప్రియను జైల్లో ఉగ్రవాది కన్నా దారుణంగా చూస్తున్నారని, అఖిలప్రియకు వైద్యం అందించడం లేదని మౌనికారెడ్డి ఆరోపించారు. ఫిట్స్ వచ్చినా  ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తన సోదరికి ప్రాణహాని ఉందని  చెప్పారు.  తమ ఎక్కడా రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానం అదేనా? అని మౌనిక ప్రశ్నించారు. ఆమె రహస్యంగా ఎందుకు తీసుకెళ్లారని నిలదీశారు. అఖిలప్రియ సరిగా భోజనం చేయడం లేదని, ఆమె ఆరోగ్యం బాగా లేదని మౌనికి తెలిపారు. అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నా వేధిస్తున్నారని తప్పుబట్టారు. రాజకీయ  ఒత్తిళ్ల వల్లే అఖిలప్రియను అలా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించారు.    భూవివాదం తమ  నాన్న బతికి ఉన్నప్పటి నుంచి ఉందని చెప్పారు మౌనిక.  తమ  అమ్మానాన్న ఆళ్లగడ్డకో.. కర్నూలుకో పరిమితమైన నేతలు కాదన్నారు.  శోభా నాగిరెడ్డి ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పోలీసులే కేసును నిర్ధారిస్తే కోర్టులు ఎందుకని ప్రశ్నించారు భూమా మౌనిక. ఏ ఆధారాలతో అఖిలప్రియను అరెస్ట్‌ చేశారని పోలీసులను నిలదీశారు. భూవివాదంపై చర్చించడానికి తాము సిద్ధమని భూమా మౌనిక స్పష్టం చేశారు. ఆస్తుల కోసమే తమను టార్గెట్ చేస్తున్నారని  మౌనిక ఆరోపించారు.  ఆళ్లగడ్డ నుంచి వచ్చామని ఫ్యాక్షనిస్టుగా ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో పెరిగిన తాము సెటిలర్లం కాదన్నారు. సెటిలర్ల ఓట్లతోనే కేసీఆర్ గెలిచారని మౌనిక చెప్పారు. హఫీజ్ పేటలో ఉన్న 25 ఎకరాల భూమి తమదేనని తమ ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా వేధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో కేసులు నమోదైతే ఆళ్లగడ్డలో ఉన్న తమ అనుచరులను వేధిస్తున్నారని వెల్లడించారు. తన సోదరిపై తప్పుడు సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆరోపించారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఇంతలా భయపెట్టి ఏంసాధించాలనుకుంటున్నారు? అని జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రవీణ్, సునీల్ అనే వ్యక్తుల తండ్రి తమ తండ్రి భూమా నాగిరెడ్డికి లాయర్ గా ఉండేవారని, తమ తండ్రి  చనిపోయిన తర్వాత వారు ఏవీ సుబ్బారెడ్డితో కుమ్మక్కయ్యారని, తమ ఆస్తులను కాజేసేందుకు పన్నాగం వేశారని జగత్ విఖ్యాత్ రెడ్డి వివరించారు. తన సోదరి అఖిలప్రియ అరెస్ట్ వెనుక ఓ ఎంపీ, మరో బడా బిజినెస్ మేన్ ఉన్నారని తెలిపారు. ఈ కేసులో చంద్రహాస్ అనే వ్యక్తి పేరు మీడియాలో వస్తోందని, కానీ అతనికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధంలేదని జగత్ విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు. వారం కిందటే పెళ్లయిన అతడిని పార్టీ మారేలా బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

కేసీఆర్ సర్కార్ ఎపుడైనా కూలిపోవచ్చు..  బీజేపీ నేతల సంచలనం 

తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ స‌ర్కార్ ఎప్పుడైనా కూలిపోవ‌చ్చ‌ని, ఈ ప్రభుత్వం ఇంకా రెండు సంవ‌త్స‌రాలు ఉండ‌టం క‌ష్ట‌మేనంటూ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దుబ్బాక‌, గ్రేట‌ర్ లో ప్ర‌యోగించిన బీజేపీ వ్యాక్సిన్ బాగా పనిచేసింద‌ని, ఇక ఖ‌మ్మంపైనే త‌మ నెక్ట్స్ ప్ర‌యోగం అని అయన స్ప‌ష్టం చేశారు. తాజాగా పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి త‌రుణ్ చుగ్ తో క‌లిసి ఖ‌మ్మంలో సంజయ్ ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ఖ‌మ్మంలో మంత్రి పువ్వాడ‌పై నిప్పులు చెరిగారు. నాలుగు సంవ‌త్స‌రాల్లో నాలుగు పార్టీలు మారిన మంత్రి అజయ్‌… మాకు నీతులు చెప్తున్నార‌ని, కేవలం అక్ర‌మ భూముల‌ను రెగ్యూల‌ర్ చేయించుకోవటానికే టీఆర్ఎస్ లో చేరారని మండిప‌డ్డారు. త్వరలో బీజేపీ అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని, అపుడు ఆయన అక్ర‌మాల చ‌రిత్ర బ‌య‌ట‌పెడుతాం అంటూ హెచ్చ‌రించారు. మరోపక్క హాఫీజ్ పేట భూదందా కేసు విషయంలో బీజేపీ నేత ‌ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హైద‌రాబాద్ లో తాజాగా వెలుగులోకి వ‌చ్చిన హాఫీజ్ పేట భూవివాదంతో పాటు న‌గ‌రంలో జ‌రుగుతున్న వివాదాల వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉంద‌ని అయన ఆరోపించారు. మియాపూర్, హాఫీజ్ పేట భూ క‌బ్జాల వెనుక టీఆర్ఎస్, ఎంఐఎం బ‌డా నేత‌ల హ‌స్త‌ముందని అయన పేర్కొన్నారు. అంతేకాకుండా ల్యాండ్, ఇసుక‌, డ్ర‌గ్ మాఫీయాకు సీఎం పేషి కేంద్ర బిందువుగా మారిందని… తమ అధికారాన్ని అడ్డంపెట్టుకొని న‌కిలీ భూ ప‌త్రాల‌తో దందా న‌డుపుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వల్లనే ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయ‌ని, హాఫీజ్ పేట భూముల వ్యవహారంలో అఖిలప్రియ‌తో పాటు ప్ర‌వీణ్ రావు, టీఆర్ఎస్ నేత‌ల ప్ర‌మేయంపై నిగ్గు తేల్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇంటిని తిరిగిచ్చేసింది!              

ప్రభుత్వ పథకం అంటే అందరికి ఆశే. సర్కార్ ఇచ్చేది కదా అని అనర్హులు కూడా వాటి కోసం ఎగబడుతుంటారు. పేదలకు అందాల్సిన సాయాన్ని కూడా కక్కుర్తితో కొందరు పెద్దలు కొట్టేస్తుంటారు. తమకు అన్ని ఉన్నా.. ఏమి లేవని తప్పుడు లెక్కలు చూపిస్తూ కొందరు సంక్షేమ పథకాలను తీసుకుంటూ ఉంటారు. కాని ఈ మహిళ మాత్రం ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇంటిని తిరిగిచ్చేసింది. తనకు ఉండటానికి  నివాసం ఉందని.. మరో పేద మహిళకు ఇస్తే ఆ కుటుంబం బాగుంటుందనే మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకుని అందరికి ఆదర్శంగా నిలిచింది.      సిద్ధిపేట జిల్లాకు చెందిన లక్ష్మీ అనే మహిళకు  తెలంగాణ ప్రభుత్వం  డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేసింది. భర్త లేని ఆమె కూతురుతో కలిసి జీవనం సాగిస్తుండటంతో సర్కార్ ఇల్లు వచ్చింది. అయితే ఆ మహిళ తనకు సర్కార్ ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని తిరిగి ఇచ్చేసింది. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ నిర్ణయం ప్రకటించింది.  తాను, తన కుమార్తె మాత్రమే ఉంటామని, తన సోదరుని ఇంట్లో ఉంటున్నామని చెప్పింది. తన కూతురుకు వివాహం జరిగితే తాను ఒంటరిగానే ఉంటానని, ఒంటరిగా ఉండలేను కాబట్టి.. తన సోదరుని వద్దే ఉంటానంది. తనకిచ్చిన ఇల్లు మరో పేద మహిళకు ఇస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇంటిని తిరిగి ఇచ్చేస్తున్నానని లక్ష్మీ తెలిపింది.   మంచి మనసుతో లక్ష్మి తీసుకున్న  నిర్ణయాన్ని మంత్రి హరీష్ రావు అభినందించారు. అందరూ లక్ష్మిలా ఆదర్శవంతగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెను జిల్లా కలెక్టర్, ఛైర్మన్ శాలువా కప్పి సన్మానించారు. పది రూపాయలు అప్పనంగా వస్తున్నాయని తెలిసినా.. గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడే ఈ రోజుల్లో.. ప్రభుత్వం ఉచితంగా అందించిన డబుల్ బెడ్ రూమ్ ను మరో మహిళకు ఇవ్వాలంటూ తిరిగి ఇచ్చేయడం నిజంగా అభినందనీయమే.. అందరూ లక్ష్మికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..     

భారత్‌ బయోటెక్ నుంచి మరో కోవిడ్ టీకా!

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ తయారు చేసిన భారతీయ దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్.. కోవిడ్ కట్టడికి మరో టీకా తీసుకురాబోతోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ  నుంచి ఇప్పటికే కొవాగ్జిన్ కరోనా టీకాకు అనుమతులు పొందింది భారత్ బయోటెక్. ప్రస్తుతం ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించింది. దానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఫేజ్-1 క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమవుతాయని స్వదేశీ ఔషధ రంగ సంస్థ తెలిపింది.  ఈ టీకా అభివృద్దికి సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో ఒప్పందం చేసుకుంది. ముక్కు ద్వారా ఒక్క డోసులోనే కరోనా టీకాను అందించే విధంగా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్  వెల్లడించింది.    కోవిడ్ నివారణకు   ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ రెండు మోతాదుల్లో అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం 2.6 బిలియన్ల సిరంజీలు వాడాల్సి ఉంటుందని అంచనా.వందల కోట్ల సిరంజీలు వాడి పడేయడం వలవ అవి కాలుష్యానికి కారణమవుతాయనే ఆందోళన ఉంది.అందుకే కాలుష్య సమస్య లేకుండా ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించామని చెప్పారు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల . తమ టీకా భారత్‌ తలపెట్టిన భారీ టీకా కార్యక్రమ ఖర్చుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని తెలిపారు.      ‘ముక్కు ద్వారా అందించే టీకా (BBV154) వల్ల ఎదురయ్యే దుష్ర్పభావాలు, రోగ నిరోధకత, సవాళ్లను గుర్తించేందుకు భారత్‌, యూఎస్‌లో ప్రి క్లినికల్ ప్రయోగాల నిర్వహణ పూర్తయింది. మొదటి దశ మానవ ప్రయోగాలు 2021 ఫిబ్రవరి-మార్చిలో మనదేశంలో ప్రారంభం కానున్నాయి’ అని భారత్ బయోటెక్ వెల్లడించింది.     

యువకుల టీజింగ్‌తో రన్నింగ్ బస్సులోనుండి దూకేసిన అమ్మాయిలు..  తీవ్ర గాయాలు 

కొంతమంది యువకులు చేస్తున్న టీజింగ్ తట్టుకోలేక ఇద్దరు కాలేజీ విద్యార్థినులు ఏకంగా రన్నింగ్ బస్ లో నుంచి కిందకు దూకేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులందర్ షహర్ లో చోటుచేసుకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రస్ హెరా గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్ధినులు సొంత గ్రామానికి వెళ్లటానికి గురువారం పది గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్‌ బస్సు ఎక్కారు. బస్సు ముందు సీట్లలో కొంతమంది యువకులు కూర్చుని ఉండటంతో వారి వెనుక సీట్లలో ఈ యువతులు కూర్చున్నారు. తమ ఊరు దగ్గరపడుతున్న సమయంలో వారు డ్రైవర్‌ వద్దకు వెళ్లి.. తమ ఊరు రాగానే బస్సు ఆపాల్సిందిగా కోరారు. అయితే డ్రైవర్‌ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ బస్సు ఆ ఊరు మీద నుంచి వెళ్లదని వారికి చెప్పాడు. అదే స‌మ‌యంలో ముందు సీట్లలో కూర్చుని ఉన్న యువకులు ఆ అమ్మాయిల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసే వ్యాఖ్య‌లు చేయడం మొదలు పెట్టారు. "ఆ బ‌స్సు వారి గ్రామంలో ఆగ‌ద‌ని, ఆ వూరు దాటిన తరువాత ప‌రిణామాలు చాలా మజాగా ఉంటాయ‌ని" వారు వ్యాఖ్యలు చేసారు. దీంతో ఆయువకుల తీరుతో మరింత భయాందోళనకు గురైన అమ్మాయిలు బ‌స్సు ఆపాల‌ని మ‌రోసారి డ్రైవ‌ర్ ను కోరిన‌ప్ప‌టికీ ఒప్పుకోకుండా అతడు బస్సును ముందుకు తీసుకువెళ్ల‌‌సాగాడు. దీంతో ఆ యువకులు మ‌రింత రెచ్చిపోయి వెక్కిరింపు ధోరణితో కేకలు వేశారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు విద్యార్ధినులు భయంతో ఒకరి తర్వాత ఒకరు బస్సులోనుంచి కిందకు దూకేశారు. దీంతో ఒక యువతికి నడుము, తల, పాదాలకు తీవ్ర గాయాలు కాగా.. మరో యువతికి కాలు, చేయి ఫ్రాక్చర్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై బాధిత యువతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదైంది. అయితే డ్రైవర్‌ ఆ యువతుల కుటుంబాలతో రాజీ పడటంతో గొడవ సద్దుమణిగింది.

ఈనెల 11న కేసీఆర్ ఉన్నతస్థాయి  సమావేశం! పాలనలో కీలక నిర్ణయాలకు అవకాశం 

ఎన్నికల్లో వరుసగా వస్తున్న వ్యతిరేక ఫలితాలతో పాలనలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ నెల 11న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారని సీఎంవో తెలిపింది.  రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యా, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొంది. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ,  ట్రైబ్యున‌ళ్ల‌ ఏర్పాటు, పార్ట్ బీ లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చించనున్నారు.  రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారని సీఎంవో తెలిపింది.     రాష్ట్రంలో కరోనా  వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు,  కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై కూడా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించబోతున్నారు. వ్యాక్సిన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందించనున్నారు.  పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. గ్రామాలకు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా? వాటి వినియోగం ఎలా ఉంది? తదితర అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని ముఖ్యమంత్రి అధికారుల నుంచి తెలుసుకుంటారని సీఎంవో తెలిపింది.    రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలు,  గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ సమీక్షించబోతున్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపైనా  ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వహించాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారని  సీఎంవో తన ప్రకటనలో వెల్లడించింది.   సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయన గురువారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ పర్యవేక్షణలో కేసీఆర్ కు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌ ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు  కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. అయినా కేసీఆర్ హై లెవల్ మీటింగ్ నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఆ వార్తలన్నీ కట్టుకథలే..  తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టులో అంతర్గతంగా జరిగే వ్యవహారాలన్నీ అత్యంత రహస్యంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉన్నత న్యాయవ్యవస్థలో ఉన్న వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.బాబ్డే చర్యలు తీసుకోనున్నట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. సర్వోన్నత న్యాయస్థానం చేపట్టే అంతర్గత విచారణలు చాల గోప్యంగా జరుగుతాయని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇటువంటి వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టు మీడియాకు ఎప్పుడూ సమాచారం విడుదల చేయదని తెలిపింది.   "సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన సభ్యులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వచ్చిన ఫిర్యాదుల గురించి మీడియా ఇటీవలి కాలంలో కొన్ని వార్తలు ప్రచురిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి వారిపై చర్యలు తీసుకున్నారని, తీసుకునే అవకాశాలున్నాయని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయని పేర్కొంటున్నాయి. అయితే పూర్తి గోప్యతతో చేపట్టే అంతర్గత దర్యాప్తులకు సంబంధించి సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా సమాచారాన్ని బయటకు విడుదల చేయదు" అని సదరు ప్రకటనలో స్పష్టం చేసింది. తాము ప్ర‌చురిస్తోన్న‌ క‌థ‌నాల ప‌ట్ల‌ విశ్వసనీయతను కాపాడుకోవ‌డానికే కొన్ని మీడియా సంస్థ‌లు.. సుప్రీంకోర్టు నుంచే త‌మకు ఆ స‌మాచారం తెలిసిందంటూ పేర్కొంటున్నాయని కూడా ఆ ప్రకటనలో తెలిపింది.   అయితే ఈ ప్రకటనలో ఎటువంటి మీడియా వార్తనూ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇదిలాఉండగా కొద్దిరోజుల క్రితం ఎపి ‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు వ్యతిరేకంగా చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే కు చేసిన ఫిర్యాదులపై అయన చర్యలు తీసుకుంటున్నారంటూ వచ్చిన వార్తలపైనే ఈ ప్రకటన విడుదల చేసి ఉంటారని తెలుస్తోంది. అయితే కొత్త సంవత్సరంలో సుప్రీంకోర్టు నుండి వచ్చిన మొట్టమొదటి ప్రకటన ఇదే కావడం గమనార్హం.

ఎదురు అమావాస్యకు ముందు ఆలయాల నిర్మాణమా! 

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన తొమ్మిది ఆలయాల పునర్నిర్మాణంపై వివాదం జరుగుతోంది. ఆలయాల పునర్నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరేకించనప్పటికి.. అందుకు ఎంచుకున్న సమయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల ఘటల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా చెప్పారు జనసేన రాష్ట్ర ధికార ప్రతినిధి పోతిన మహేష్ . ‘‘ఆలయాల పునర్నిర్మాణం శంకుస్థాపన గురు బలం లేని, ఎదురు అమావాస్యకు ముందు ఎందుకో.  దక్షిణాయనంలో, నెల ఘంటా సమయంలో, అమ్మవారి పాదాల చెంత శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టవచ్చా? ఇదంతా రామతీర్థ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకేనా? ఆగమశాస్త్రం, కృష్ణయజుర్వేదమును పరిగణలోకి తీసుకున్నారా? హిందువుల ఆచారాలు శాస్త్రాలపై గౌరవం లేదని ముఖ్యమంత్రి గారు మరోసారి రుజువు చేసుకుంటున్నారా? రాష్ట్రానికి దుష్పరిణామాలు తప్పవేమో అనే ఆందోళన కలుగుతుంది’’ అని పోతిన మహేష్ ట్వీట్ చేశారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం గతంలో కొన్ని ఆలయాలను తొలగించారు. అప్పుడు  కూల్చిన ఆలయాలను ప్రభుత్వం పునర్ నిర్మించాలని నిర్ణయించింది. అందులో మొదటగా తొమ్మిది ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహ‌న్‌రెడ్డి ఆలయాలకు భూమిపూజ చేశారు.  శనీశ్వర ఆలయ ప్రాంతంలో రెండు శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు సీఎం  జగన్ శంకుస్థాపన చేశారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో నిరసనకు దిగిన టీడీపీ.. ఉద్రిక్తత

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో తాజాగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గౌతు లచ్చన్నపై రాష్ట్ర మంత్రి అప్పలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద టీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు భారీగా విగ్రహం వద్దకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ నిరసనలో పాల్హోనేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, సీనియర్ నేతలు లచ్చన్న విగ్రహం వద్దకు చేరుకున్నారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసి, ఆ తరువాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, బీసీల నాయకుడుగా గౌతు లచ్చన్నకు ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలో కూడా మంచి పేరుంది. అలాంటి నాయకుడిపై మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పని, ఆ మంత్రిని బర్త్ రఫ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు .

రెండు జిల్లాల్లో వందల కోళ్లు మృతి! తెలంగాణలో బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. వందల సంఖ్యలో కోళ్ల మృతి రెండు జిల్లాల్లో కలకలం రేపుతోంది. బర్డ్‌ఫ్లూ భయంతో స్థానికులు  బెంబేలెత్తిపోతున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులో 120 నాటు కోళ్లు మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ ప్రాంతానికి చెందిన  గద్ద సారయ్య అనే వ్య‌క్తి నాటు కోళ్ల పెంప‌కం, అమ్మ‌కం వ్యాపారాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఉన్న‌ట్టుండి రెండు రోజుల వ్యవధిలోనే 120 కోళ్లు మృతి చెందాయి. కోళ్లు మృతి చెందాయ‌న్న విష‌యాన్ని తెలుసుకున్న మండల పశువైద్యాధికారి మాలతి వాటిని పరిశీలించారు. మృతి చెందిన కోళ్ల‌ నమూనాలను పరీక్షల‌ నిమిత్తం మొద‌ట‌ వరంగల్‌ ప్రాంతీయ పశు వైద్యశాలకు పంపారు. అనంత‌రం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. బర్డ్‌ ఫ్లూ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో  కోళ్లు చనిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.    పెద్దపల్లి జిల్లా ఓదెలలో వారం రోజుల నుంచి 300 నాటు, బ్రాయిలర్‌ కోళ్లు మృత్యువాత పడ్డాయి. వాటిని ఎస్సారెస్పీ డీ-86 కాలువలో పడేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది.మృతి చెందిన వాటిని కాల్వలో, రోడ్డు పక్కన పడేయడం మరింత భయాందోళనలకు గురి చేసింది. బర్డ్‌ఫ్లూ సోకిందనే అనుమానంతో స్థానికులు వణికిపోతున్నారు. వారం రోజుల్లో రోజుకు తనవి 4-5 కోళ్లు చనిపోతున్నాయని రామినేని రాజవీర్‌  చెప్పారు. ప్రతిరోజు ఏదోక వీధిలో పదుల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయని.. ఈ విషయం పశుసంవర్థక శాఖాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ చేయించకపోవడం, వాతావరణంలో మార్పుల వల్ల కోళ్లు చనిపోతాయన్నారు మండల పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ కుమారస్వామి. వైరస్‌లు సోకకుండా ఆర్‌డీ వ్యాక్సిన్‌, గంబోరా రాకుండా ఐబీడీ వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. చనిపోయిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనబడలేదని  చెప్పారు.   

కనకపు సింహాసనంపై శునకం కూర్చొన్నట్లు: మండిపడ్డ బాలకృష్ణ

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే.. ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండు రోజులుగా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-క్రాప్ బుకింగ్‌లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఏం చెప్పినా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అయన మండిపడ్డారు.   ‘‘కనకపు సింహాసనంపై శునకం కూర్చొన్న విధంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోంది. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోగా... పంట ఉత్పత్తులను దళారుల పాలుచేస్తోంది’’ అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం శిరివరంలో ప్రస్తుతం కల్లాలలో ఉన్న మొక్కజొన్నలను పరిశీలించి, రైతులతో ఆయన మాట్లాడారు. కులాలు, మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పాలన సాగిస్తున్నారని అయన ఆరోపించారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపైనా అయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను కనుక నెరవేర్చకపోతే త్వరలో ఢిల్లీ తరహా రైతు ఉద్యమాన్ని చేపడతామని బాలకృష్ణ ఈ సందర్భంగా హెచ్చరించారు.

అప్పు కోసం ప్రజలపై పన్నుల భారం! తెలుగు ముఖ్యమంత్రుల ఇష్టారాజ్యం 

అంధ్రప్రదేశ్ కు 2 వేల ఐదు వందల కోట్లు.. తెలంగాణకు 2 వేల 508 కోట్ల రూపాయల అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దేశంలో మధ్యప్రదేశ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకే కేంద్రం ఈ అవకాశం ఇచ్చింది. అయితే ఇది తెలుగు రాష్ట్రాలపై ప్రేమతో కేంద్రం ఇవ్వలేదు. కరోనాతో  ఎదురైన ఆర్థి ఇబ్బందులు తీర్చేందుకు కూడా కాదు. కరోనా  కష్టకాలంలోనూ    ప్రజలపై పన్నుల మోత  మోపినందుకు మెచ్చి .. జగన్ రెడ్డి, కేసీఆర్  ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చిన వరమిది. ప్రజలకు మరిన్ని పాట్లు కల్పిస్తూ పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు చేసినందుకే..  ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా  రుణం తీసుకునేందుకు కేంద్రం ఓకే చెప్పింది. పట్టణ సంస్కరణలు అమలు చేయడానికి ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించడం వల్లే అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని కేంద్రమే స్వయంగా ప్రకటించింది.  కేంద్రం ఇచ్చే ఈ అదనపు రుణం తీసుకునే అనుమతి కోసమే  జగన్ సర్కార్  పట్టణాల్లో  పన్నుల మోత మోగించింది. ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పెంచి మార్చి నెల నుంచి అమలు చేయబోతోంది. ఇకపై  ఆ పన్నును ఏటేటా పెంచుకుంటూ పోనుంది.  కేంద్ర ఆర్థిక శాఖ  అనేక సంస్కరణలను నిర్ణయించింది. అందులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఒకటి. తాగునీరు, డ్రైనేజీ, ఆస్తులపై ప్రతి ఏటా పన్నులు పెంచాల్సి ఉంటుంది. సంస్కరణలు తెస్తేనేఅప్పులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అప్పుల కోసం.. దేనికైనా రెడీ అన్నట్లుగా ఉన్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అన్నింటినీ అమలు చేయడానికి సిద్ధమయింది. పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలకు అంగీకరించాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొదట ఇందుకు వ్యతిరేకించినా.. తాజాగా తెలంగాణ సర్కార్ కూడా  వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతోంది.   కేంద్రం చెప్పినట్లు సంస్కరణలు అమలు చేస్తుండటంతో ఏపీలోని  పట్టణాల్లో ఇకపై పన్నుల మోత మోగబోతుంది. 15 శాతం మాత్రమే పెంచామని ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతున్నా.. ఐదేళ్లలో ఇది ఐదు సార్లు పెరిగేలా జీవోలో పొందుపరిచారు. సొంతింటి యజమానికి పన్ను పెరిగితే ఆ భారం అద్దెకు ఉండే వారిపై కూడా పడుతుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పౌర సమాజం అంతా ఆ భారాలను ప్రతి ఏడాదీ కొంత చొప్పున మోయక తప్పదు.  పట్టాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఉండేవారు, ప్లాన్‌ లేకుండా ఇల్లు కట్టుకున్న వారు వందకు వందశాతం పెరిగిన పన్ను చెల్లించాల్సిందే. నిజానికి ఏపీలో విజయవాడ, విశాఖపట్టణం మాత్రమే ఓ మాదిరి నగరాలుగా ఉన్నాయి. మిగతావన్నీ పేరుకు పట్టణాలే కానీ ఎక్కువగా గ్రామాల లక్షణాలతోనే ఉంటాయి. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ పన్నులు బాదేయడం కోసం వాటిని మున్సిపాల్టీలుగా ప్రకటించేస్తున్నాయి. తెలంగాణలోనూ కేసీఆర్ సర్కార్ ఇదే చేసింది. 10 వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాల్టిగా మార్చేసింది.   తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కూడా ఇటీవల ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం తీసుకొచ్చింది. ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపట్టింది. కాని విపక్షాల ఆరోపణలు, ఎన్నికల్లో ఓటమితో మళ్లీ వెనక్కి తగ్గింది. అయితే కేంద్ర సంస్కరణల్లో భాగంగానే మరిన్ని అప్పులు తీసుకోవడం కోసమే కేసీఆర్ సర్కార్ ఈ పథకాల అమలుకు ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. గత ఆరేండ్లలో కోట్లాది రూపాయల అప్పులు చేసింది కేసీఆర్ సర్కార్. రుణ పరిమితి మించడంతో చేసేది లేక కేంద్రం చెప్పినట్లు చేస్తోంది.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు రుణభారంలో కూరుకుపోయాయి. ఏపీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఏపీ అప్పులు గత నవంబర్ నాటికే రూ. 3.74 లక్షల కోట్లకు చేరిందని కాగ్ ఇటీవలే నివేదిక ఇచ్చింది. ఒక్క నవంబర్ నెలలోనే ఏకంగా 17 వేల కోట్ల రుణం తీసుకుంది. ఏపీలో ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్న అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ అప్పులు కూడా రూ. 3 లక్షల కోట్ల దాటాయి.  కేంద్రం ఇచ్చే అప్పుల కోసం  ఆస్తి పన్నుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వాలు  చీకటి చట్టాలను తీసుకొచ్చాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ చట్టాల అమల్లో భాగంగానే ఆస్తి విలువ ఆధారంగా పట్టణాల్లో పన్నులు విధించిందని మండిపడుతున్నాయి. అడ్డగోలుగా అప్పులు చేసి .. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అప్పు కావాలంటే ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచాలని కేంద్రం ఆదేశిస్తే ఇక్కడున్న ప్రభుత్వాలు  అమలు చేసేందుకు అసెంబ్లీలో చట్టాలు  చేయడం దుర్మార్గమంటున్నారు ప్రతిపక్ష నేతలు.  ఏ నగరంలో, ఏ పట్టణంలో ఎంత పన్ను ఉండాలో ఢిల్లీలో ఉన్న మోడీ, అమరావతిలో ఉన్న జగన్‌ నిర్ణయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటున్నారు ఏపీ టీడీపీ నేతలు.

తమిళనాడు గవర్నర్ గా కృష్ణం రాజు..! 

ప్ర‌ముఖ న‌టుడు, మాజీ కేంద్ర‌మంత్రి, బీజేపీ నేత అయిన కృష్ణంరాజును త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా నియమిస్తున్నట్లుగా ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయ‌న‌కు గవర్నర్ ప‌ద‌వి ఇచ్చార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంతో ఏకంగా ‌కొందరు నేత‌లు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ఏపీలోని కాకినాడ నుండి 1998, 1999సంవ‌త్స‌రాల్లో బీజేపీ త‌రుపున అయన లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2000 సంవ‌త్స‌రంలో ప్రధాని వాజ్ పేయి హాయంలో కేంద్ర స‌హాయ‌మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీలో చేరిన ఆయ‌న 2014 త‌ర్వాత మళ్ళీ బీజేపీలో చేరారు. కృష్ణంరాజుతో పాటే కేంద్ర‌మంత్రిగా ప‌నిచేసిన విద్యాసాగ‌ర్ రావు కొంత‌కాలం మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా, అదే సమయంలో కొంతకాలం తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా కూడా ప‌నిచేసిన సంగతి తెలిసిందే.

కేసీఆర్‌కు యశోదలో  వైద్య పరీక్షలు! కరోనా లక్షణాలు లేవన్న డాక్టర్లు 

 సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కేసీఆర్ హాస్పిటల్ కు రాగా.. ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ పర్యవేక్షణలో అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు సూచనలతో ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. వ్యాధి నిర్ధారణ కోసం అక్కడ పలు పరీక్షలు చేశారు. సీఎం బ్లడ్ శాంపిల్స్‌  వైద్యులు తీసుకున్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌ యశోద ఆస్పత్రికి వచ్చారు. కేసీఆర్ కు వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత  సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు కరోనా లక్షణాలు లేవని చెప్పారు.కేసీఆర్‌ ఆరోగ్యం చాలా బాగుందని.. ప్రతి ఏడాది చేసే వైద్య పరీక్షలే ఆయన చేయించుకున్నారని తెలిపారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో సిటీ స్కాన్ చేశాం.. రిపోర్ట్ శుక్రవారం వస్తుందని ప్రకటించారు. ఎంఐఆర్ స్కానింగ్ అవసరం లేదని, కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఎంవీ.రావు వెల్లడించారు. కేసీఆర్ కు పెద్ద సమస్య ఏమి లేదని టీఆర్ఎస్ నేతలు కూడా చెబుతున్నారు. 

జగన్ చెప్పినట్లే బీజేపీ చేస్తోందా?  పవన్ కల్యాణ్ మాటలకు అర్దమేంటీ? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ఆరోపణలు హాట్ హాట్ గా మారాయి. ఒక్క లెటర్ రాస్తే సీజేలే బదిలీ అయ్యారు.. మీపై గెరిల్లా యుద్ధం సాధ్యమా అంటూ  జగన్ పై పవన్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవే ఇప్పుడు చర్చనీయాంంశంగా మారాయి. న్యాయస్థానాలకు సంబంధించిన విషయాలన్ని కేంద్రం పరిధిలోనే ఉంటాయి.  సీజేల బదిలీ, నియామకాలన్ని కొలిజీయం సిఫారసుల మేరకే కేంద్రం చేపడుతుంది. అయితే  ఒక్క లేఖ రాస్తే చాలు ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణాలలో బదిలీ అయిపోతారు అంటూ జగన్ ను ఉద్దేశించి పవన్ కామెంట్ చేయడంతో.. జగన్ లేఖ వల్లే ఏపీ హైకోర్టు సీజే బదిలీ అయ్యారా అన్న చర్చ జరుగుతోంది. అంటే బీజేపీ పెద్దలు జగన్ చెప్పినట్లే చేస్తున్నారనే అర్ధంతో పవన్ మాట్లాడారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత అక్టోబర్ లో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు  లేఖ రాశారు. ఏపీ హైకోర్టు ను సుప్రీంకోర్టు జడ్జి ఎన్ వి రమణ  ప్రభావితం చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని ఆ లేఖలో ఆరోపించారు జగన్. మొత్తం 8 పేజీలున్న లేఖలో  తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారని జగన్  పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సీజేకు  జగన్ రాసిన లేఖ అప్పట్లో దేశవ్యాప్తంగా  పెద్ద సంచలనమే అయింది. జగన్ లేఖ రాసిన కొన్ని నెలల్లోనే ఏపీ హైకోర్టు సీజే బదిలీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ వ్యాప్తంగా పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ జరిగినప్పటికి .. ఏపీ హైకోర్టు సీజే బదిలీ మాత్రం చర్చగా మారింది. తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో జగన్ కోరిక మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా అన్న అనుమానాలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.   వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన దాదాపు అన్ని బిల్లులకు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు సపోర్ట్ చేశారు. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ బిల్లులకు కూడా వైసీపీ మద్దతు తెలిపింది. ఏపీకి కేంద్రం నుంచి నిధులు సరిగా రాకపోయినా మోడీ సర్కార్ పై పల్లెత్తు మాటలు మాట్లాడటం లేదు ఫ్యాన్ పార్టీ నేతలు. పోలవరం విషయంలో తేడా జరిగినా జగన్ కనీసం స్పందించలేదు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు ఏపీ సీఎం జగన్. ఈ సమావేశంలో న్యాయ సంబంధ విషయాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ హైకోర్టు సీజే బదిలీకి ఇది కూడా కారణం కావొచ్చనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ, వైసీపీ మధ్య పెద్ద డీల్ ఉందనే ప్రచారం జరుగుతోంది.   పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలకు సంబంధించి మరో  ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల విషయంలో కేంద్రం స్పందన తాను అశించినంతగా లేదనే అసంతృప్తిలో పవన్ కల్యాణ్ ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఆలయాలపై ఇంత దారుణంగా దాడులు జరుగుతున్నా సీరియస్ గా తీసుకోకపోవడమేంటో తనకు అర్ధం కావడం లేదని పవన్ భావిస్తున్నారట. వైసీపీ, బీజేపీ కలిసే ఓట్ల కోసం కుట్ర రాజకీయం చేస్తున్నాయా అన్న అనుమానం కూడా జనసేన నేతల్లో ఉందంటున్నారు. అందుకే నేరుగా  ఆరోపణలు చేయకుండా జగన్ ను విమర్శిస్తూ.. పరోక్షంగా కేంద్రాన్ని పవన్ కల్యాణ్ టార్గెట్  చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీజేల బదిలీపై కామెంట్ చేశారంటే పరోక్షంగా కేంద్ర సర్కార్ ను ప్రశ్నించినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక లోపు ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరగవచ్చంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీతో కలిసి జనసేన వెళ్లినా అశ్చర్యం లేదంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. తిరుపతిలో కూడా అలాంటిదేమైనా జరుగుతుందేమో చూడాలి మరీ.. 

అమెరికాలో కల్లోలం... పండగ చేసుకుంటున్న చైనా

అమెరికా చరిత్రలో ఎపుడూ జరగని విధంగా క్యాపిటల్ భవనంపై దాడి జరగడం.. దానికి ట్రంప్ మద్దతు పలకడం, ఆ తరువాత జరిగిన పోలీసుల కాల్పులలో నలుగురు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఒకపక్క సెనేట్ తో పాటు ప్రతినిధుల సభ సమావేశమైన సమయంలో.. నిరసనకారులు దారుణమైన విధ్వంసానికి దిగిన సమయంలో జరిగిన పరిణామాలు ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.   ఇది ఇలాఉండగా అమెరికా లోని క్యాపిటల్ బిల్డింగ్‌లో చోటుచేసుకున్న దృశ్యాలకు చైనా సామాజిక మీడియాలో ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలపై "అద్భుత దృశ్యం" అనే కామెంట్ తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా చైనా ప్రజలు అమెరికాలోని దృశ్యాలను ఒకప్పుడు హాంగ్‌కాంగ్‌లో జరిగిన నిరసనలతో పోల్చుతున్నారు. చైనా మీడియా కూడా హాంగ్‌కాంగ్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ప్రస్తావిస్తూ.. నాటి నిరసనలను నేటి అమెరికాలోని దృశ్యాలను కలిపి ఓ చిత్రాన్ని అక్కడి గ్లోబల్ టైమ్స్ పోస్ట్ చేసింది. "అమెరికా దిగువ సభ స్పీకర్ నాన్సీ పలోసీ.. అప్పట్లో హాంగ్‌కాంగ్ నిరసనలను సుందర దృశ్యం అని కొనియాడారు. మరి ప్రస్తుతం క్యాపిటల్ బిల్డింగ్‌లోని దృశ్యాలపై ఆమె ఏ వ్యాఖ్య చేస్తారో" అంటూ సెటైర్ వేసింది.   అమెరికాలో అధికార మార్పిడి సమయంలో తాజాగా జరుగుతున్న ఘటనలపై చైనా కమ్యునిస్టు పార్టీ యూత్ లీగ్ కూడా నాన్సీ పెలోసీ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంది. సుందర దృశ్యం పేరిట అక్కడి యువత అమెరికాకు వ్యతిరేకంగా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి పేరుతో ఉన్న హ్యష్ ట్యాగ్ చైనా సోషల్ మీడియా వియబోలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అప్పట్లో హాంగ్‌‌కాంగ్ నిరసనకారులకు మద్దతు తెలిపిన ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరి దీంతో స్పష్టమైందనే వ్యాఖ్యలు చైనా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

కరీంనగర్ లోనే బట్టలు ఊడదీసి కొడతాం! సంజయ్ కి సుమన్ వార్నింగ్

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ  మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆరోపణలు, విమర్శలు చేయడంలో హద్దులు  దాటుతున్నారు ఇరు పార్టీల నేతలు. కేసీఆర్ టార్గెట్ గా దూకుడుగా వెళుతున్న బీజేపీ చీఫ్ సంజయ్ కి అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు గులాబీ లీడర్లు. వరంగల్ పర్యటనలో కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేసిన బండి సంజయ్ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్  ఫైరయ్యారు. కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సంజయ్ కి నాలుక కోస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ని విమర్శిస్తే ఆయన సొంత గడ్డ కరీంనగర్ లోనే బండి సంజయ్ ని బట్టలు ఊడదీసి కొడతామన్నారు బాల్క సుమన్. కేసీఆర్ చేసిన ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందని... బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడని బాల్క సుమన్ చెప్పారు. కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులపై మహారాష్ట్రలోని శివసేన తరహాలో దాడి చేయాలని అన్నారు.  గుడులు, బడులు, ఇండియా, పాకిస్థాన్ అంటూ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంటే... రైతులను నట్టేట ముంచే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని బాల్క సుమన్ విమర్శించారు. ఢిల్లీలో చలికి వణుకుతూ రైతులు ఆందోళన చేస్తుంటే... చర్చల పేరిట కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు బాల్క సుమన్. 

ఒక్క లెటర్ రాస్తే సీజేలే బదిలీ అయ్యారు.. మీపై గెరిల్లా యుద్ధం సాధ్యమా.. పవన్ సంచలన కామెంట్స్ 

ఏపీలోని దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల పై స్పందించిన ఏపీ సీఎం జగన్ తమ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు గెరిల్లా వార్ ఫేర్ చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   "మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు కేవలం ఒక్క లేఖ రాస్తే చాలు ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణాలలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్‌ఫేర్‌ చేయడానికి ఎవరైనా సాహసిస్తారా?’ అని సీఎం జగన్‌ కు పవన్‌ కల్యాణ్‌ కౌంటర్ ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. 115 మంది ఐపీఎస్ లు... మరో 115 మంది అదనపు ఎస్‌పీలు.. వేలాది మంది పోలీసు సిబ్బందిని చేతిలో ఉంచుకొని విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని పవన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.    ‘‘నిస్సహాయుడైన దళిత డాక్టర్‌ సుధాకర్‌పైనా, మీపై, మీ పార్టీ వారిపైన సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టేవారిపైనా అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు...దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? వార్డుకో వలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడేవారి సమాచారం వారు కూడా ఇవ్వలేకపోతున్నారా? గత రెండేళ్లలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. రథాల దగ్ధాలు, విగ్రహాల ధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకూ ఎక్కడ ఉంది లోపం? మీలోనా..మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?’’ అని పవన్‌ ప్రశ్నించారు.   ఈ అరాచకంపై మాట్లాడితే, ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్‌ ఫేర్‌ నడిపిస్తున్నాయని సీఎం జగన్‌ అనడం సరికాదని, అది ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుందని అయన విమర్శించారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందని పవన్‌ మండిపడ్డారు.