భూ వివాదంలోనే సీఎం బంధువుల కిడ్నాప్!
posted on Jan 6, 2021 @ 9:50AM
ఐటీ అధికారుల వేషంలో వచ్చి కిడ్నాప్.. పోలీసుల గాలింపుతో అంతా సేఫ్.. కటకటాల్లో కిడ్నాప్ గ్యాంగ్.. హైదరాబాద్ లో మంగళవారం రాత్రి సినీ ఫక్కిలో జరిగిన కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కిడ్నాపైన వారంతా సేఫ్ గా బయటపడ్డారు. అయితే కిడ్నాపర్లు బంధించి తీసుకెళ్లిన వారు.. తెలంగాణ ముఖ్యమంత్రి బంధువులు కావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరకి అంతా సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండ్ వివాదంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు తేలింది. తమ అదుపులో ఉన్న కిడ్నాపర్ల నుంచి పూర్తి సమాచాం రాబడుతున్నారు పోలీసులు.
హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ఉండే సీఎం కేసీఆర్ సమీప బంధువులు.. మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు (51), సునీల్‌రావు (49), నవీన్‌రావు (47)ను దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులం అని లోపలికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారని చెబుతున్నారు. ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేశారు. ల్యాండ్ పత్రాలతో పాటు , ల్యాప్ టాప్ లను తీసుకెళ్లారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సీఎ బంధువులు కిడ్నాప్ కావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి.. ఆ మార్గంలో గాలించారు. చివరికి కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్‌లను గుర్తించారు. ముగ్గురు కిడ్మాపర్లతో పాటు మరో 8 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ సోదరుడు చంద్రహాస్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది.
కిడ్నాప్ కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్ సీఎం కేసీఆర్ సోదరి తరఫు సమీప బంధువులు. సీఎం కేసీఆర్ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. తమ ముగ్గురు సోదరులు క్షేమంగా ఉన్నారని ప్రవీణ్ సోదరుడు ప్రతాప్ తెలిపారు. వెంటనే స్పందించిన తెలంగాణ పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కిడ్నాప్ వివరాలను ఆయన తెలిపారు. ప్రొఫెషనల్స్ లా దుండగులు ఇంట్లోకి వచ్చారని.. నెట్ ద్వారా సీసీటీవీ కెమెరాల్లో ఇంటి దగ్గర ఏం జరిగిందో గమనించానని చెప్పారు. అనుమానం రావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. ఐటీ ఆఫీసుకు తీసుకెళ్లాలని చెప్పడం, పోలీసుల వేషంలో రావడంతో వాళ్లను గట్టిగా ప్రశ్నించలేకపోయారన్నారు. ముఖానికి మాస్కులు వేసి తమ సోదరులను కారులో తరలించారని ప్రతాప్ తెలిపారు. ఓ ఫామ్ హౌజ్ కు తీసుకెళ్లి కొన్ని పేపర్ పైన సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. 50 ఎకరాల భూమి వివాదం లోనే ఈ కిడ్నాప్ జరిగిందని భావిస్తున్నామన్న ప్రవీణ్.. ఆ స్థలం ప్రభుత్వ భూమి కాదని, సుప్రీంకోర్టులో ఈ కేసు క్లియరెన్స్ వచ్చిందని తెలిపారు. తమతో పాటు చాలామంది పాట్నర్లు ఉన్నారన్నారు. 50 ఎకరాల స్థలాన్ని తాము కొనుగోలు చేశామని చెప్పారు ప్రవీణ్ రావు.