వారంతా క్రైస్తవులే... అందుకే హిందూ దేవాలయాలపై దాడులు: కాల్వ ఫైర్
posted on Jan 4, 2021 @ 5:19PM
ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ముగ్గురూ క్రైస్తవులేనని.. మరి అటువంటి పరిస్థితుల్లో హిందూ మతం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే జగన్ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం లేదని విమర్శించారు.
"మంత్రి కొడాలి నాని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చేస్తున్న వ్యాఖ్యలను సీఎం జగన్ ఎందుకు ఖండించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశృంఖలత్వం తాజాగా రాముని శిరచ్ఛేధనం వరకు తెచ్చింది. దీంతో ఏపీలో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. జగన్ తన నిర్వాకంతో మెజార్టీ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బ తీస్తున్నారు." అంటూ కాల్వ తీవ్ర విమర్శలు చేసారు.
"ప్రస్తుతం ఏపీలో దేవుడికే రక్షణ లేని అనాగరిక సమాజాన్ని స్థాపించేందుకే సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారు. రాముడు తల తీసేయడం ఒక అనాగరికమైన, ఆటవిక చర్య. వరుసగా జరుగుతున్న ఈ దుర్ఘటనల వెనుక ఎవరున్నారో తేలాలి. బ్రిటీష్ జమానాలో కూడా హిందూ దేవాలయాలపై ఈ స్థాయిలో దాడులు జరగలేదు. ఏ వర్గం మనోభావాలైనా దెబ్బతింటే.. ఆ వర్గం పక్షాన టీడీపీ నిలబడి పోరాడుతుంది. అయినా చంద్రబాబు రామతీర్ధం వెళ్లే దాకా ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది.. ఎక్కడ గడ్డి పీకుతోంది. చంద్రబాబు పర్మిషన్ తీసుకుని వెళ్లినరోజే.. విజయసాయి ఎందుకెళ్లారు..." అని జగన్ ప్రభుత్వంపై కాల్వ మండి పడ్డారు.
చంద్రబాబును రామతీర్ధం వెళ్లకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడంతో.. ఆయనను ప్రజలే వెంట బెట్టుకు తీసుకెళ్లారు. మరోపక్క రామతీర్ధం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విజయసాయి రెడ్డి విశాఖ వెళ్లారు. అయినా విజయసాయిపై దాడితో టీడీపీకి, చంద్రబాబుకేం సంబంధం. హిందూ ఆలయాల రక్షణలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది..? అసలు హిందూ ధర్మంపై దాడి చేసే అధికారం సీఎం జగన్ కు ఎవరిచ్చారు..?" అని కాల్వ శ్రీనివాసులు నిలదీశారు.
అసలు "సీఎం, హోంమంత్రి, డీజీపీల పర్యవేక్షణలోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్రంలో ప్రచారం ఉంది. హిందూ ధర్మంపై ప్రభుత్వమే దాడులు జరుపుతోంటే ఇక ఎవరికి చెప్పాలి..? ఒకపక్క ఉత్తరాదిలోని అయోధ్యలో రాముని గుడి నిర్మిస్తోంటే.. ఇక్కడ ఏపీలో రాముని తల తీసేశారు. ఏపీలోని దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో సీబీఐ తో విచారణ జరిపించాలి. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించాలి" అని అయన డిమాండ్ చేశారు.