గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన! వెల్లంపల్లిపై విరుచుకుపడుతున్న జనాలు
కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టిన.. వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ.. గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన... ఇవన్ని అర్హత లేని వారిని అందం ఎక్కిస్తే ఎలాంటి పరిణమాలు వస్తాయో చెప్పటానికి ఉపయోగించే సామెతలు. నీచుడైన వానిని ఎంత గౌరవించినా, వాడి నీచగుణాలను వదిలించుకోడని తన పద్యంలో వివరించారు సుమతీ శతకకారుడు.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇలాంటి సీనే కనిపిస్తోంది. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు వీధి రౌడీకన్నా దిగజారి పోయాడు. పరమ పవిత్రంగా భావించే దేవాదాయ శాఖకు అమాత్యులుగా ఉండి పరమ నీచంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయనెవరో కాదు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ రెడ్డి పాలనలో ఆలయాల పర్యవేక్షణ చూసే శాఖకు మంత్రిగా ఉంటూ.. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ.. ఆ పవిత్ర పదవికే కళంకం తెస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజును ఉద్దేశించి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు ఫైరవుతున్నారు. ఇలాంటి మంత్రి ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని కొందరు క్షమాపణలు చెబుతున్నారు.
జగన్ రెడ్డి పాలన వచ్చాకా ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే 150కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. వరుస ఘటనలు జరుగుతున్నా జగన్ సర్కార్ స్పందించలేదు. రామతీర్థంలోని కోదండరామాలయంలోని రాముడి విగ్రహాన్ని రెండు ముక్కలు చేశారు దుండగులు. దీంతో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో... ఆ నెపాన్ని ఇతర పార్టీలపై వేసే ప్రయత్నం చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. అందులో భాగంగానే రామతీర్థం ఘటనకు బాధ్యుడిని చేస్తూ.. ఆ ఆలయ ట్రస్టీ చైర్మెన్ గా ఉన్న అశోక గజపతి రాజును హడావుడిగా తొలగించింది . 150 ఆలయాల్లో దాడులు జరిగితే.. ఏ గుడి చైర్మెన్ ను తొలగించని సర్కార్.. అశోక గజపతి రాజును తొలగించడంతో జగన్ రెడ్డి సర్కార్ కుట్రలు భయటపడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. అశోక గజపతి రాజును పదవి నుంచి తొలగించేందుకే రాములోరి తల నరికారా అన్న ఆరోపణలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఇదిలా ఉండగానే రామతీర్థం ఘటనపై మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి.. విగ్రహం ధ్వంసం గురించి చెప్పకుండా అశోక గజపతి రాజుపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఏపీ జనాలు భగ్గుమంటున్నారు. పార్టీలు, ప్రాంతాలకతీతంగా తీవ్రంగా స్పందిస్తున్నారు.
రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ గా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు పూసపాటి అశోక్ గజపతి రాజు. రామతీర్థం ఆలయం కట్టించిన అశోక్ గజపతిరాజు పూర్వీకులు ఆలయ ధూపదీప నైవేద్యాలకు తమ ఏలుబడిలోని 12 గ్రామాలను కేటాయించారు. విజయనగరం సంస్థానంలోని 105 దేవాలయాల నిర్మాణం, పోషణ పూసపాటి వంశీకులదే. మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే. పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా అశోక్ గజపతిరాజు గారిని అందరూ గౌరవిస్తారు. వాళ్ల అమ్మాయికి కరీంనగర్ లో మెడిసిన్ సీట్ వస్తే మంత్రిగా ఉండి , మార్పించుకునే అవకాశం వున్నా ఒప్పుకోకుండా వచ్చిన ర్యాంక్ కి అక్కడే చదవాలి అని ఆయన చదివించారు. ఆంధ్ర యూనివర్సిటీ కి, విజయనగరం మహారాజా కళాశాలకు వందల ఎకరాలు ఇచ్చిన కుటుంబం పూసపాటిది. అందుకే అవినీతి మరకలు లేని హుందాగా దేవాలయాల ధర్మ కర్తగా వ్యవహరించే అశోక గజపతి రాజును వెధవ అని సంభోదించిన వెల్లంపల్లిపై ఆయన నియోజకవర్గ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి గారి నోటిదురుసుతనానికి సిగ్గుపడుతూ, పెద్దరికాన్ని, గౌరవాన్ని మరిచిపోయేలా చేసిన పదవి శాశ్వతం కాదని, విజయవాడ పరువు నిలిపేలా, అందరు మెచ్చుకునేలా వ్యవహార శైలి ఉండాలని, వయసుని గౌరవించటం నేర్చుకోవాలంటూ.. వెల్లంపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
అశోక గజపతి రాజును ఉద్దేశించి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన అంటూ మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు గారి వంశీకులు కట్టించిన ఆలయాల ముందు కొబ్బరిచిప్పలు కొట్టేసే దొంగకి మహారాజు ఔన్నత్యం ఎలా తెలుస్తుందని చురకలంటించారు. నీతికి, బూతుకు తేడా తెలియనివాడి నోటి నుంచి అంతకంటే మంచి భాష ఎలా వస్తుందని కౌంటరిచ్చారు నారా లోకేష్. మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే కంత్రీ మంత్రీ తెలుసుకో! అంటూ హితవు పలికారు నారా లోకేష్.
ఇక అశోకగజపతి రాజును ఉద్దేశించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. జగన్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఓ జర్నలిస్ట్ రాసిన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ పోస్టును యథాతథంగా కింద ఇస్తున్నాం..
విజయనగరం వేదికగా అనేక ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను ధారాదత్తం చేసిన ఘనత విజయనగరం మహారాజా స్వంతం. నేటి విశాల విశాఖ నగరం కోసం వేలాది ఎకరాలను విరాళంగా ఇచ్చిన చరిత్ర వారిది. విశాఖ నేవల్ డాక్ యార్డ్ విజయ్ నగర్ గేట్ ను అడిగినా, సింహాచలం దేవస్థానం చుట్టూ వున్న కొండలను అడిగినా, దిగువున నలుదిశలనూ ప్రశ్నించినా ఈ విషయం రూఢీ అవుతుంది. ఆధ్యాత్మిక, విద్య వైద్యం, సమాజిక, రాజకీయ రంగాలలో పూసపాటి చేసిన సేవ హర్షించదగినది. అలాంటి అశోక గజపతి రాజు వ్యక్తిగత జీవితంపై దారుణమైన వ్యాఖ్యానాలు చేయడం అత్యంత బాధాకరం. ముఖ్యంగా బాధ్యతాయుతమైన ఓ మంత్రి గారు అత్యంత బాధ్యతారహితంగా అశోక్ గజపతి రాజును వెధవ (మంత్రి మాటల్లో అయితే యదవ) అని పదేపదే దూషించడం చూసి సభ్య సమాజం తల దించింది. రాజకీయాలలో పరస్పరం వ్యతిరేక వ్యాఖ్యానాలు సహజమే. అయితే మరీ ఇంత దారుణంగా, నిస్సిగ్గుగా, గతి తప్పి చేసే విమర్శలతో ఏలిన వారు ఏ వర్గానికి ఏ విధమైన సంకేతాలు పంపుతున్నారో ఆలోచించుకోవాలి. ముఖ్యంగా కొందరు మంత్రుల మాయదారి మాటలకు ముఖ్యమంత్రే చివరికి బాధ్యత వహించాల్సి ఉంటుందనే వాస్తవం గ్రహిస్తే మంచిది. ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు ఆయా సామాజిక వర్గాలు లేక వర్ణాలను తీవ్రంగానే ప్రభావితం చేసే అవకాశం వుంది. ఏ రాజకీయ నాయకుడు లేక పార్టీకి ఇది ఎంతమాత్రం మంచిదికాదు. అశోక్ గజపతి రాజుపై సదరు మంత్రి అనుచిత వ్యాఖ్యానాలు ఇప్పుడు యావత్ క్షత్రియ సామాజిక వర్గాన్నే ఓ కుదుపు కుదిపాయనడంలో సందేహం ఉందా? . అధికార పార్టీ లేక అధికారం వలయం నుండి దూసుకు వచ్చిన నోటి దురద మాటలకు సదరు సామాజిక వర్గం యావత్తూ ఉలిక్కిపడి చూసింది. మదనపడింది... అవకాశం కోసం, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తోంది... ఈ విధంగా ఏ ఒక్క వర్గానికి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తప్పకుండా అధినేత జగనే.. ఉత్తర కుమారులను తలదన్నే ఇటువంటి నేతల ఉత్తుత్తి ప్రవచనాలకు చెక్ పెట‌్టలేని పక్షంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని గమనించండి ముఖ్యమంత్రి గారూ...