ప్రచార కమిటి చైర్మెన్ గా పాదయాత్ర! రాహుల్ , రేవంత్ ప్లాన్ ఇదేనా ?
posted on Jan 5, 2021 @ 10:26AM
తెలంగాణ కాంగ్రెస్ కమిటి కూర్పు ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నెలరోజుల మంత్రాంగం తర్వాత టీపీసీసీ పగ్గాలపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా ఎవరూ ఊహించని ట్విస్ట్ టీపీసీసీ ఎంపికలో కనిపిస్తోంది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలలో ఎవరో ఒకరికి పీసీసీ పగ్గాలు ఇస్తారని భావించినా.. హైకమాండ్ మాత్రం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఖరారు చేశారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఖాయమనుకున్న రేవంత్ రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్‌గా , రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, సీఎల్పీ నేతగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సమన్వయ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించారని సమాచారం. పీసీసీ పగ్గాల కోసం తీవ్ర పోటీ ఉండటం, నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మధ్యే మార్గంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా జీవన్ రెడ్డి ఎంపిక చేశారని భావిస్తున్నారు.
టీపీసీసీ కూర్పు వెనక హైకమాండ్ భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నించినా..
సొంత పార్టీ నేతలే తనను వ్యతిరేకించడంతో ఒక దశలో ఆయన అసంతృప్తి లోనయ్యారని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డిని తమ తురుపు ముక్కగా భావిస్తున్న మరో ఐడియా వేసిందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున... కొన్ని రోజుల వరకు జీవన్ రెడ్డిని పీసీసీగా కొనసాగించి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డికి అ బాధ్యత అప్పగించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. పీసీసీ పదవి వస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని గతంలో రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు ప్రచార కమిటి చైర్మెన్ గా రేవంత్ రెడ్డితో పాదయాత్ర చేయించే యోచనలో హైకమాండ్ ఉందట. వయసు రిత్యా ఎలాగూ జీవన్ రెడ్డి పాదయాత్ర చేయలేరు కాబట్టి.. రేవంత్ కు ఇక్కడ వచ్చిన ఇబ్బందేమి ఉండదు.
తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసే సరికి .. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చి... ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలు ఎదుర్కొవాలనే ఆలోచనతోనే హైకమాండ్ తాజా పీసీసీ కూర్పు చేసిందనే చర్చ గాంధీభవన్ లోనే జరుగుతోంది. అందుకే రేవంత్ రెడ్డి తనంతట తానుగా జీవన్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానానికి ప్రతిపాదించారని సమాచారం. పీసీసీ రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ , శ్రీధర్ బాబుకు సీఎల్పీ, మల్లు భట్టి విక్రమార్కకు సమన్వయ కమిటి చైర్మెన్ పదవులు ఇచ్చినందున ఎవరిలోనూ నిరాశ ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందట.
రేవంత్ రెడ్డికి ప్రచార కమిటి చైర్మెన్ పదవి ఇవ్వడానికి మరో లాజిక్ కూడా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రధాని కాక ముందు.. అంటే 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రచార కమిటి చైర్మెన్ గా పని చేశారు. ఆ పదవితోనే ఆయన దేశ మంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. ప్రచార కమిటి చైర్మెన్ గా పార్టీ బలోపేతానికి పాటుపడిన నరేంద్ర మోడీకే ప్రధానమంత్రి పదవి వరించింది. రేవంత్ కూడా అదే రూట్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ గా రాష్ట్ర మంతా పాదయాత్ర చేసి.. ప్రస్తుతం నిరాశలో ఉన్న కాంగ్రెస్ కేడర్ లో జోష్ తేవాలని రేవంత్ ఆలోచన. రేవంత్ ఈ ఆలోచనకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. పాదయాత్రతో పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఖాయమని అతని అనుచరులు కూడా చెబుతున్నారు.
అందుకే ప్రచారకమిటీ చైర్మన్ అంటేనే తనకు చాలా ఇష్టమని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ పదవి ఇస్తే రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తూ ప్రచారం చేస్తానంటున్నారు. రాష్ట్రానికి , దేశానికి ప్రచార కమిటీ చైర్మన్ చాలా కీలకమైన పదవులన్న రేవంత్ రెడ్డి.. పీసీసీ పదవి కార్యక్రమాల రూపకల్పన,సమన్వయ చేసేందుకు మాత్రమే పని కొస్తుందన్నారు. రాష్ట్ర మొత్తం తిరగాలంటే ప్రచారకమిటీ చైర్మన్ పదవే కీలకమన్నారు. పీసీసీ పదవి ఎవరికి వచ్చిన సంతోశషంగా అందరితో కలిసి పనిచేస్తానని రేవంత్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ తను తీసుకున్న గోతిలో ఆయనే పడి కొట్టుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ను నాశనం చేద్దామని గోయి తవితే ఆ గోయిలోనే కేసీఆర్ పడిపోయాడరన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ బొమ్మ బోరుసులాంటివని.. ఆ రెండు పార్టీలను ఓడించడమే తమ లక్ష్యమంటున్నారు రేవంత్ రెడ్డి.