పేకాట డెన్ తో ఆ మంత్రికి ఊస్టింగేనా ? జగన్ సర్కార్ కు ఆయన గండమేనా?
posted on Jan 5, 2021 @ 11:15AM
గడ్డం గ్యాంగ్ తో గండం వచ్చిందా? కృష్ణా జిల్లా రాజకీయాల్లో మార్పులు జరగబోతున్నాయా? తాడేపల్లికి ఆయన పరుగులెందుకు? ఇదే ఇప్పుడు అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ లో చర్చగా మారింది. గుడివాడలో పేకాట డెన్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది. తమ్మిరిస పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేసి.. 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుంది. 28 కార్లు, భారీగా నగదు సీజ్ చేసింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పేకాట క్లబ్ నడుపుతున్నారని.. సాక్షాత్తూ మంత్రి అండ కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వైసీపీ సర్కార్ ఇబ్బందుల్లో పడింది. దాడులతో మంత్రి కొడాలి నాని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపువల్లే మంత్రి హడావుడిగా తాడేపల్లికి పరుగులు పెట్టారంటున్నారు.
కొద్ది రోజుల క్రితం గుడివాడలో జరిగిన బహిరంగ సభలో పేకాట క్లబ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు."మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగా లేనిది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి?" అని మంత్రిని ప్రశ్నించారు. పవన్ ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఇలా పేకాట క్లబ్ పై దాడులు జరగడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. గుడివాడ పేకాట డెన్ కొడాలి నానీకి పెద్ద తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. పేకాట డెన్ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారని, మంత్రి కొడాలిని క్యాంప్ కార్యాలయానికి పిలిపించి చివాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. అంతే కాదు కొడాలి మంత్రి పదవికి ఎసరు వచ్చిందనే చర్చ జరుగుతోంది. పేకాట డెన్ తో ప్రభుత్వం అభాసుపాలైందని భావిస్తున్న జగన్.. కొడాలిని మంత్రి వర్గం నుంచి తొలగించి.. ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల సమాచారం.
జగన్ కేబినెట్ లో ఉన్న కొడాలి నాని వ్యవహారం మొదటి నుంచి వైసీపీకి ఇబ్బందిగానే మారిందనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. మంత్రిగా ఉంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు కొడాలి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై బూతులు మాట్లాడుతున్నారు. అమ్మ మొగుడు వంటి అన్ పార్లమెంటరీ పదాలు కొడాలి నానికి ఊతపదాలుగా మారిపోయాయి. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే కొడాలి అలా మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కేబినెట్‌లోని 90 శాతం మంత్రుల పదవి కాలం రెండున్నర సంవత్సరాలేనని సర్కార్ ఏర్పాటు చేసిన కొన్ని రోజులపై జగన్ స్పష్టం చేశారు. దీంతో అయిదు సంవత్సరాలు ఉండే 10శాతం జాబితాలో చోటు కోసం మంత్రులలో పోటీ నెలకొంది. ఇందు కోసం అందరికి భిన్నంగా పనితీరు కంటే.. బూతు సాహిత్యాన్నే కొడాలి అస్త్రంగా ఎంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గతంలో నరేంద్ర మోడీ, బీజేపీ నేతలను ఉద్దేశించి మంత్రి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు సీఎం జగన్ సతీసమేతంగా రావాలని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు ప్రధాని నరేంద్ర మోడీని సతీసమేతంగా రామాలయానికి వెళ్లి భూమి పూజ చేసిన తర్వాత బీజేపీ ఆ మాటలు ఇతరులకు చెబితే బాగుంటుందని చెప్పారు. మోడీని ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీలోనూ కొంత ఆందోళన కలిగించింది. అందుకే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను తిట్టినప్పుడు శభాష్ అన్నవాళ్ళు, ప్రధాని మోడీని, ఇతర బీజేపీ నేతలను విమర్శించినప్పుడు మాత్రం కంగారు పడ్డారు. దీంతో ఆ సమయంలోనే కొడాలిని జగన్ తన కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. మంత్రి పదవి ప్రతిష్టని దిగజార్చే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విపక్షాలతోపాటు సామాన్య ప్రజలలోనూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి బూతులు మాట్లాడుతున్నా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలెవరు అతన్ని వారించలేదని చెబుతున్నారు. అందుకే అతను మరింతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకి అవే ఆ మంత్రితో పాటు జగన్ సర్కార్ కు గండంగా మారాయంటున్నారు.
కొడాలి నానికి సంబంధించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. గుడివాడ నుంచి ఎన్నికైనవారికి మంత్రి పదవి ఇస్తే .. ఆ ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయదు అనే సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. 1955లో గుడివాడ నుంచి ఎంపికైన వేముల కూర్మయ్యకు ప్రకాశం పంతులు తన కేబినెట్ లో స్ధానం కల్పించారు. కాని ప్రకాశం పంతులు ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయలేదు. తరువాత 1983లో గుడివాడ నుంచి గెలిచిన టీడీపీ వ్యవస్ధాపకులు NTR ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే 1984లో నాదేండ్ల భాస్కరరావు కారణంగా ఎన్.టి.ఆర్ కు పదవి గండం ఎదురైంది. అందుకే 1985లో ఎన్.టి.ఆర్. గుడివాడ నుంచి శాసనసభ్యుడుగా గెలిచినా ..సెంటిమెంట్ భయంతోనే గుడివాడకు రాజీనామా చేశారని చెబుతారు. 1989లో గుడివాడ నుంచి ఎంపికయిన కఠారి ఈశ్వర్ కుమార్‌కు.. చెన్నారెడ్డి తన కేబినట్‌లో చోటు కల్పించారు. అయితే చెన్నారెడ్డి ప్రభుత్వం కూడా పూర్తికాలం కొనసాగలేదు. వీటన్నిటిని పట్టించుకోకుండా జగన్ గుడివాడ నుంచి ఎంపికయిన కొడాలి నానికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. దీనితో ఇప్పుడు కొడాలి నాని కారణంగా జగన్ సర్కార్‌కు కాలగండం ఏర్పడనుందా అనే చర్చ కూడా ఏపీలో జోరుగా సాగుతుంది.