కూరగాయల వల్లే ఏలూరులో వింత వ్యాధి!
కరోనా మహమ్మారితో వణికిపోతుండగానే..ఏలూరులో వెలుగుచూసి అందరిని కలవరపెట్టిన అంతు చిక్కని వ్యాధికి అసలు కారణమేంటో తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనపై నివేదిక ఇచ్చిన ఉన్నతస్థాయి కమిటీ .. కూరగాయలే వింత వ్యాధికి కారణమని తేల్చింది. మంచినీటిలో కొన్ని కలుషితాలు ఉన్నప్పటికీ అస్వస్థతకు అది కారణం కాదని, కూరగాయలు కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని వెల్లడించింది. ఏలూరు మార్కెట్ నుంచి కూరగాయలు వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో.. బాధితులు నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించారని ఉన్నతస్థాయి కమిటీ వివరించింది.
జనం ఉన్నట్టుండి ఆసుపత్రి పాలు కావడానికి ఇన్ఫెక్షన్లు కారణం కాదని, అదే నిజమైతే బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని నిపుణుల కమిటీ పేర్కొంది. రక్త పరీక్షల ఫలితాలు కూడా అసాధారణంగా ఉండేవని తెలిపింది. పురుగు మందుల్లోని ఆర్గానో ఫాస్ఫేట్లు, ఆర్గానో క్లోరైడ్లలో ఏదో ఒకదాని వల్ల ఈ సమస్య ఉత్పన్నమై ఉండొచ్చని కమిటీ అభిప్రాయపడింది. బాధితుల రక్త నమూనాలతోపాటు, నీటి నమూనాల్లోనూ ఆర్గానో ఫాస్ఫేట్లు కనిపించాయని తెలిపింది. ఒకవేళ నిజంగానే ఆర్గానో ఫాస్ఫేట్ ఇందుకు కారణమైతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని, దగ్గు, ఆయాసం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపించేవని పేర్కొంది. బాధితుల్లో ఆ లక్షణాలు లేవు కాబట్టి ఈ ఘటనకు ఆర్గానో ఫాస్ఫేట్లు కూడా కారణం కాదని కమిటి స్పష్టం చేసింది.
ఏలూరులో వ్యాపించిన వింత వ్యాధి సమస్యకు ఆర్గానో క్లోరైడ్ కారణమని కమిటీ అంతిమంగా ఓ నిర్ణయానికి వచ్చింది. వ్యాధి లక్షణాలు, కోలుకోవడాన్ని బట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొంది. శరీరంలో చేరిన 24 గంటల తర్వాత పరీక్షిస్తే ఆర్గానో క్లోరైడ్ ప్రభావం కనిపించదని, అందుకే బాధితుల రక్తనమూనాల్లో అది లేదని వివరించింది. బాధితుల్లో చాలామంది రెండుమూడు రోజులుగా మాంసాహారం తీసుకోలేదు కాబట్టి కూరగాయల ద్వారానే అది శరీరంలోకి చేరి ఉంటుందని ఉన్నతస్తాయి నిపుణల కమిటీ అభిప్రాయపడింది. వింత వ్యాధి భారీన పడిన బాధితుల ఇళ్ల నుంచి సేకరించిన టమాటా, వంకాయలలో ‘మెట్రిబుజిన్’ అనే రసాయనాన్ని గుర్తించామని, సమస్యకు ఇదే కారణం అయి ఉండొచ్చని కమిటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే మెట్రిబుజిన్‌ను ఇక్కడ రైతులు చాలా తక్కువ స్థాయిలో ఉపయోగిస్తారని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి సరఫరా వ్యవస్థను కొన్ని నెలలపాటు అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఓ అభిప్రాయానికి రావాలని నిపుణులు సూచించారు.
గత డిసెంబరు 4 నుంచి 12వ తేదీ మధ్య ఏలూరులో ఈ వింత వ్యాధి విజృంభించి తీవ్ర కలకలం రేపింది. 622 మంది ఈ వ్యాధి భారీన పడి హాస్పిటల్ లో చేరారు. వ్యాధికి అసలు కారణమేంటో తెలియక వైద్యులు కూడా చికిత్స చేసే సమయంలో ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్ బృందం కూడా ఏలూరు వచ్చి పరిశీలించింది. వింత వ్యాధికి కారణం తెలుసుకోవడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటి నియమించింది. అప్పటి నుంచి పరిశోధనలు చేసిన కమిటి.. చివరికి కూరగాయలే కారణం కావచ్చంటూ నివేదిక ఇచ్చింది. అంతేకాదు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేసింది. నిషేధిత రసాయనాలు పొల్లాలోకి చేరకుండా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని, ఉభయ గోదావరి జిల్లాల్లో నీటి నమూనాలను తరచూ పరీక్షించాలని ప్రతిపాదించింది. కార్లు, ఇతర వాహనాలను సర్వీసింగ్ చేసిన నీరు ఏలూరు కాలువలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.