'జాక్ మా' కనబడుటలేదు.. ఏమైపోయాడు?
posted on Jan 4, 2021 @ 3:38PM
చైనా కుబేరుడు, అలీ బాబా సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ మా గత రెండు నెలలుగా కనిపించడంలేదు. ఆయన ఆస్తుల విలువ కూడా పడిపోయింది. కొన్ని నెలల కిందట 61 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద ఇప్పుడు 50 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనంతటికీ ఆయన మాట్లాడిన ఒక్క మాటే కారణం. ఆ ఒక్క మాట ఆయన జీవితాన్నే మార్చేసింది.
గత అక్టోబరులో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలు, బ్యాంక్ రెగ్యులేటరీలపై జాక్ మా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల తరహాలో వ్యవహరిస్తున్నాయని, విస్తృత స్థాయిలో ఆలోచించడం అలవర్చుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో జాక్ మాపై ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసింది. ఆయన సంస్థలు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా వేసింది. వ్యాపారాలపై విచారణకు ఆదేశించింది. జాక్ మా ఎదిగేందుకు ఉపకరించే చర్యలను అడ్డుకుంది.
చైనా ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో జాక్ మాకు గడ్డుకాలం మొదలైంది. ఆయన ఆస్తులు హరించుకుపోతున్నాయి. రెండు నెలల్లోనే 11 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంతేకాదు, రెండు నెలలుగా ఆసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడంలేదు. నిజానికి జాక్ మా స్వయంగా నిర్వహించే 'ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్' అనే టాలెంట్ షోలో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన ఆ షోకు కూడా రాలేదు. ఆయన తరపున ఆలీబాబా ఎగ్జిక్యూటివ్ ఒకరు పాల్గొన్నారు. జాక్ మా షెడ్యూల్ బిజీగా ఉన్నందునే రాలేకపోయారంటూ ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కానీ దీనిపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. జాక్ మా అదృశ్యం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది.