సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
posted on Jan 5, 2021 @ 1:44PM
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై మంగళవారం తీర్పు వెల్లడించింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అయితే, నిర్మాణం మొదలుపెట్టే ముందు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని సూచించింది
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.20,000 కోట్లతో 'సెంట్రల్ విస్టా' ప్రాజెక్టును తలపెట్టింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక కొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనంతో పాటు ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తారు. పార్లమెంట్ భవనంలో ఒక పెద్ద హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ ప్లేసులు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి నివాసం సౌత బ్లాక్‌కు, ఉపరాష్ట్రపతి కొత్త నివాసాన్ని నార్త్ బ్లాక్ సమీపంలోకి తరలిస్తారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి గత డిసెంబర్ 10న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయితే, ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రాజెక్టు పలు నిబంధనలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ఏకీభవించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.