రైతుల ర్యాలీ, ఎర్రకోట ఘటనలతో దేశానికి మచ్చ! ప్రధాని మోడీ మౌనం ప్రమాదకరమని చర్చ
posted on Jan 29, 2021 @ 3:07PM
భారత ప్రధాన మంత్రి నరేంద్ర దాస్ మోడీ. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు. రాజకీయ నేతల్లో టాప్ లో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నది కూడా నరేంద్ర మోడీకే. 2014 నుంచి భారత్ కు ప్రధానిగా ఉన్న మోడీ హవా .. గత ఏడేండ్లుగా పెరుగుతూనే ఉంది. 2019లో ఆయన రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టాకా ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. తిరుగులేని పాలనతో.. దూరదృష్టితో అంతర్జాతీయంగా వెలిగిపోతున్నారని మోడీని కీర్తిస్తోంది కమలదళం. అయితే కొన్ని రోజులుగా ఆయన ప్రతిష్ట మసక బారుతుందనే ప్రచారం జరుగుతోంది. దేశంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రధాని మోడీకి మైనస్ గా మారాయని అంతర్జాతీయ, దేశియ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
స్వతంత్ర భారత దేశంలో గతంలో ఎన్నడూ జరగని.. ఎప్పుడు కనీవినీ ఎరుగని సంఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. వీటి ప్రభావం ప్రధాని నరేంద్ర మోడీపైనే ఎక్కువగానే ఉంది. రైతుల ఆందోళన, ఎర్రకోట అల్లర్ల ఘటనలు మోడీకి మచ్చ తెచ్చేవిగా మారిపోయాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా రైతులు పోరాడుతున్నారు. ఢిల్లీ సరిహద్దులో మోహరించి నెలల తరబడి ఉద్యమం చేశారు. ఎముకలు కొరికే చలిలోనూ వారు ఆందోళన కొనసాగించారు. ఫలితంగా మోడీ సర్కారుకు ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మోడీకి ఎదురీత ఎదురైంది. బ్రిటన్, కెనడా వంటి దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా రైతులకు మద్దతు పలికింది. రైతులపై బల ప్రయోగం వద్దంటూ పలు సంస్థలు సూచనలు చేశాయి. ఇవన్ని ప్రధాని మోడీకి ఇబ్బందికర పరిస్థితులే.
రైతు ఉద్యమాన్ని నిలువరించడంలోను, వారిని శాంత పరచడంలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదన దేశంలోనేకాదు. అంతర్జాతీయంగా కూడా వినిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర వివాదానికి, చరిత్రాత్మక కట్టడం ఎర్రకోట విధ్వంసానికి దారితీసింది. దీనిపై అంతర్జాతీయ సమాజం నివ్వెర పోయింది. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న వాదన బలంగా వినిపించింది. ఇది కూడా ప్రధాని మోడీ వైఫల్యంగానే భావిస్తున్నారు. ఢిల్లీలో అల్లర్లను నిలువరించలేక పోయారనే వ్యాఖ్యలు మోడీ సర్కార్ కు చుట్టుకుంటున్నాయి. కేంద్ర సర్కార్ వైఫల్యం వల్లే అత్యంత భద్రత ఉండే ఎర్రకోటలోకి సామాన్యులు వెళ్లారనే విమర్శలు వస్తున్నాయి.
ఢిల్లీ, ఎర్రకోట ఘటనల వేడిని కొనసాగిస్తూ విపక్షాలు కేంద్ర సర్కార్ దాడిని తీవ్రతరం చేశాయి. ఏకంగా 18 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడం అంతర్జాతీయ వేదికలపై ప్రధాన చర్చనీయాంశంగా మారింది. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రతిపక్షాలు ఉన్నాయి. అయితే ఆయా పార్టీలకు నచ్చజెప్పి లైన్‌లోకి తెచ్చుకున్న అధికార పక్షాలు ఉన్నాయి. కానీ మోడీ సర్కారు మాత్రం విపక్షాలను పట్టించుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ మౌనంగా ఉండటం అందరిని అశ్చర్యపరుస్తోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అతి తక్కువ కాలంలో అంతర్జాతీయంగా పాపులర్ అయిన మోడీ.. అంతే వేగంగా తన ప్రతిష్టను కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది.