సీఎం పోస్టు కోసం కేటీఆర్ లొల్లి! భరించలేకే కాశీకి కేసీఆర్ ఫ్యామిలీ
posted on Jan 29, 2021 @ 5:05PM
కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది? గులాబీ లీడర్లు కేటీఆర్ కు ఎందుకు జై కొడుతున్నారు? కల్వకుంట్ల ఫ్యామిలీ కాశీకి ఎందుకు వెళ్లింది? తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకుని కేటీఆర్ కు ఆ పదవి అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ ను సీఎం చేయాలంటూ ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై స్పందించడం లేదు. అదే సమయంలో సీఎం మార్పుపై ప్రకటనలు చేస్తున్న నేతలను వారించడం లేదు. తన ముందే సీఎం మార్పుపై పార్టీ నేతలు మాట్లాడుతున్నా... కేటీఆర్ ఖండించడం లేదు. ఇవే ఇప్పుడు అనేక సందేహాలకు కారణమవుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, ప్రగతి భవన్ లోని కీలక వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచనే కేసీఆర్ లేనే లేదని తెలుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి సీటుపై కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద యుద్ధమే జరుగుతుందని చెబుతున్నారు. తనను ముఖ్యమంత్రిగా నియమించాలని కేసీఆర్ పై కేటీఆర్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని.. ఈ విషయంలో కేటీఆర్ కు ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్సీ కవిత సహకరిస్తున్నారని సమాచారం. మొదట సీఎం సీటు కోసం కవిత పోటీ పడినా.. కేటీఆర్, సంతోష్ లు ఆమెను కూల్ చేశారని గతంలో కేసీఆర్ కు కుడి భుజంగా మెలిగిన, టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదె ఇన్నయ్య చెబుతున్నారు. తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇస్తానని కవితకు కేటీఆర్ హామీ ఇవ్వడం వల్లే ఆమె సైలెంట్ అయ్యారని ఆయన వెల్లడిస్తున్నారు. కేటీఆర్ హామీతో కవిత కూడా సీఎంగా తప్పుకోవాలని తండ్రిపై ప్రెషర్ పెడుతున్నారని ఇన్నయ్య చెబుతున్నారు.
కేటీఆర్, కేసీఆర్ గొడవలో మంత్రి హరీష్ రావు కూడా తలదూర్చారని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా నియమించడానికి ఇదే సమయమని కేసీఆర్ కు నచ్చచెప్పటానికి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం అందుకు ఇష్టపడటం లేదట. ఇందుకు బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను క్యాన్సిల్ చేశారు కేసీఆర్. పీఆర్సీ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు, ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే... పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందే. తాను విఫలమయ్యానే ఆరోపణలను కేసీఆర్ లాంటి ఉద్యమ నేతలు ఎప్పటికి జీర్ణించుకోలేరు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ కు సీఎం పగ్గాలు ఇవ్వడానికి కేసీఆర్ సిద్దంగా లేరని గాదె ఇన్నయ్య చెబుతున్నారు.
కేసీఆర్ కలల ప్రాజెక్ట్ యాదాద్రి పునర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. యాదాద్రి ప్రారంభోత్సవాన్ని వైభవంగా జరపాలని, ఆ సందర్భంగా యాగం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా కేసీఆర్ సొంత గడ్డలో నిర్మిస్తున్న .. కాళేశ్వరంలో అతి పెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది. అది పూర్తయ్యాకా ముఖ్యమంత్రిగా తానే దాన్ని ప్రారంభించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. కేటీఆర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడానికి నిఘా వర్గాల నివేదికలు కూడా కారణమని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. .ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు. అందుకే సీఎం మార్పు గురించి ఆయన ఆలోచన కూడా చేయడం లేదంటున్నారు. దీంతో కేసీఆర్ తన మాట వినే పరిస్థితి లేదని గ్రహించిన
కేటీఆర్ మరో దారిలో నరుక్కొస్తున్నారని.. అందులో భాగంగానే టీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రకటనలు చేస్తున్నారని భావిస్తున్నారు. కేటీఆర్ సీఎం అవుతారంటూ ప్రకటనలు చేస్తున్న వారంతా ఆయనతో సన్నిహితంగా ఉంటున్నవారేనని గులాబీ లీడర్లే చెబుతున్నారు. పార్టీ నేతల ద్వారా కేసీఆర్ పై ఒత్తిడి తేవడం కోసం కేటీఆరే డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందంటున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇంట్లో జరుగుతున్న గొడవలు భరించలేకే కవిత.. తన ఫ్యామిలీతో కాశీకి వెళ్లారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఇదిలా ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగేలా ఆయన సతీమణి శోభా చొరవ తీసుకోవాలని ఒకప్పుడు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గాదె ఇన్నయ్య కోరుకుంటున్నారు. ఇందుకోసం కేసీఆర్ తో పాటు కుటుంబసభ్యులను శోభమ్మ ఒప్పించాలని ఇన్నయ్య విజ్ఞప్తి చేసుకుంటున్నారు.
మరోవైపు కేటీఆర్ ఎంతగా ప్రయత్నించినా.. ఏ రకమైన ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ తలొగ్గే పరిస్థితులు ఉండవని.. ఆయనతో సన్నిహితంగా ఉండే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా మార్చుకోరని.. పార్టీ విషయంలో అసలే తీసుకోరని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయో చూడాలి మరీ..