నిమ్మగడ్డ, జగన్ సర్కార్ మధ్య కొత్త పంచాయితీ!
posted on Jan 29, 2021 @ 9:55AM
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ పోల్స్ హీట్ పెరిగింది. తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. పంచాయతీలను గెలుచుకునేందుకు పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తుండగా.. ఎన్నికల నిర్వహణ విషయంలోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ సర్కార్ మధ్య యుద్దం జరుగుతూనే ఉంది. ఎన్నికల నిర్వహణలో దూకుడుగా వెళుతున్న నిమ్మగడ్డకు బ్రేకులు వేసేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఎస్ఈసీ, ఏపీ సర్కార్ మధ్య మరో వివాదం ముదురుతోంది.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను మరోసారి పక్కనబెట్టింది జగన్ సర్కార్. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపారు. కానీ నిమ్మగడ్డ ఆదేశాలను పక్కనబెట్టిన ప్రభుత్వం కాసేపటికే ఆయన్ను వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా నియమించి.. ఆయనకు కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యతలు అప్పగించింది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖలో ఎక్స్ కేడర్ కార్యదర్శి పోస్టును సృష్టించి మరీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం.
కొన్ని రోజుల క్రితం ఎస్ఈసీకి కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్ ను నిమ్మగడ్డ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో కార్యదర్శి అవసరం ఏర్పడింది.ప్రస్తుతం ముద్దాడ రవిచంద్రకు ఎలాంటి పోస్టింగ్ లేదు. గతంలో ప్రభుత్వం ఆయన్ను జీఏడీకి అటాచ్ చేయడంతో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగూ ఆయనకు పోస్టింగ్ లేదు కాబట్టి.. ఎన్నికల సంఘం కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. కానీ ప్రభుత్వం ట్విస్ట్ ఇస్తూ రవిచంద్రకు వేరే పోస్టింగ్ ఇచ్చింది.
సెక్రటరీ పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను పంపాల్సిందిగా ప్రభుత్వానికి రెండుసార్లు లేఖరాసినా స్పందించకపోవడంతో ముద్దాడ రవిచంద్రను కార్యదర్శిగా నియమించినట్లు రమేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం హడావుడిగా ఆయన కోసం ఓ పోస్టును సృష్టించి మరీ అక్కడికి పంపడం వివాదాస్పదమైంది. అంతేకాదు ఎన్నికల సంఘం కార్యదర్శి పోస్టుకు ఐఏఎస్ అధికారులైన విజయ్ కుమార్, రాజబాబు, కన్నబాబుల పేర్లను ప్రభుత్వం పంపింది.
అధికారుల బదలీ వ్యవాహంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను.., ప్రభుత్వం తిప్పి పంపిస్తూనే ఉంది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీతో పాటు పలువురు అధికారుల బదిలీలను ఓకే చేసిన ప్రభుత్వం.., పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ అభిశంసనను మాత్రం వెనక్కిపంపింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ కార్యదర్శి పోస్టింగ్ వ్యవహారం మరో వివాదానికి తెరతీసింది.దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.