పంచాయతీలకు పంచ సూత్రాలు.. టీడీపీ మేనిఫెస్టో విడుదల
posted on Jan 28, 2021 @ 1:45PM
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురువారం మేనిఫెస్టో విడుదల చేశారు. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో టీడీపీ మేనిఫెస్టో ఉంది. 1) ఉచిత కుళాయిలతో సురక్షితమైన తాగునీరు, 2) భద్రత-ప్రశాంతతకు భరోసా, 3) ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం, 4) స్వయం సమృద్ధి, 5) ఆస్తిపన్ను తగ్గింపు-పౌర సేవల పేరుతో ఐదు అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. గ్రామీణ ప్రజల స్వయం సమృద్ధి కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో ఆస్తి పన్ను తగ్గించి ప్రజలపై భారం తగ్గిస్తామన్నారు. పంచాయతీల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని వెల్లడించారు. భూ కబ్జాలను, రౌడీలను నియంత్రిస్తామని, పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. తమ సర్పంచ్ లను గెలిపిస్తే స్వయం సమృద్ధిని సాధించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
వైసీపీ చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదని.. దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకునేది లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. 20నెలలుగా ప్రభుత్వం ఏం చేసిందని ఓటేయాలన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అనేక రంగాల్లో నెంబర్ వన్ గా నిలెబట్టామన్న చంద్రబాబు.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క అభివృద్ధి పనైనా చేపట్టారా? అని ప్రశ్నించారు. మేం 25 వేల కి.మీల రోడ్లేస్తే ఇప్పుడు మీరెన్ని కి.మీ రోడ్లేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 125 దాడులు జరిగాయని, ఇదంతా ప్రభుత్వం అసమర్థతని చంద్రబాబు విమర్శించారు.