ఏం పీకుతారో పీకి మీ సత్తా చూపించండి.. మంత్రి అనిల్ అభ్యంతరకర వ్యాఖ్యలు!
posted on Jan 28, 2021 @ 4:16PM
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపక్షాలపై విమర్శలు చేసే క్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల్లో సత్తా చూపిస్తాం అంటూ ఉర్రూతలు ఊగారు.. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి.. ఏం పీకుతారో పీకి మీ సత్తా చూపించండి' అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కనీసం 25 శాతం సీట్లు అయినా సాధించే సత్తా ఉందా? అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఇక కొన్ని తోక పార్టీలకు 5 శాతం సీట్లు సాధించే సత్తా కూడా లేదని అన్నారు. కనీసం నామినేషన్ వేసే సత్తా, దమ్ము కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు. నామినేషన్లు వేసేందుకు దమ్ము లేదు కానీ ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీ సత్తా ఏమిటో చాటుతామని మంత్రి అన్నారు.
కాగా, ఏపీలో ఇప్పటికే మంత్రుల భాషపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీ అమ్మా మొగుడు అంటూ ఓ మంత్రి, రాయడానికి వీలులేని భాషలో మరి కొందరు మంత్రులు పదేపదే నోరు పారేసుకుంటున్నారు. మంత్రుల భాషపై ఎన్ని విమర్శలు వ్యక్తమైనా.. మంత్రుల భాషలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా 'ఏం పీకుతారో పీకి మీ సత్తా చూపించండి' అంటూ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.