సీఎంవోనే టార్గెట్ చేసిన నిమ్మగడ్డ! మగాడ్రా బుజ్జీ అంటున్న జనాలు
posted on Jan 29, 2021 @ 11:53AM
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తన పవర్ చూపిస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్నే టార్గెట్ చేశారు నిమ్మగడ్డ. సీఎంఓలో ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేసిస్తూ.., సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కు లేఖరాశారు నిమ్మగడ్డ. ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను తాను నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఏపీ సర్కార్ తిరస్కరించిన కొద్దిసేపటికే ... నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు.
సాధారణ పరిపాలనా శాఖ అధిపతిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తన విధులను సరిగా నిర్వర్తించలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కలెక్టర్లు,ఎస్ పి లు ఉన్నతాధికారులతో ప్రవీణ్ ప్రకాష్ సమీక్షలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్న తన సిఫార్సు లేఖలు పట్టించుకోలేదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈనెల 23న కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని.. జీఏడీకి అధిపతిగా ఉన్న ఆయన తన ఆదేశాలను పట్టించుకోలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికలసు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ విఫలమయ్యారని ఆరోపించారు.
ఎన్నికల సందర్భంగా జారీ చేసే కులధ్రువీకరణ పత్రాలు, ఎన్ఏసీల జారీ అంశంపైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్..., ఎస్ఈసీకి లేఖరేశారు. కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తొలగించాలని.. ఈ మేరకు తహసీల్దార్లకు ఆదేశాలివ్వాలని లేఖలో పేర్కొన్నారు. ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. అలాగే కుల ధ్రువీకరణ పత్రాలను జారీలో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం లేకుండా చూడాలన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 12 జిల్లాల్లో 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలి దశకు సంబంధించి సర్పంచి, వార్డు స్థానాలకు పోటీ చేయాలనుకునేవారు జనవరి 31 ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేసేందుకు ఎస్‌ఈసీ గడువు ఇచ్చిం ది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. 7వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. తొలి దశలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలోని 454 పంచాయతీలు.. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 163 పంచాయతీలకు ఎన్నిక జరగనుంది.