మళ్లీ రెచ్చిపోయిన మంత్రి తలసాని! బీజేపీ, కాంగ్రెస్ నేతలపై బూతులు
posted on Jan 29, 2021 @ 11:02AM
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి నోటికి పని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని గాంధీ నగర్ ,శ్రీరామ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తలసాని.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని కామెంట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించారో చెప్పాలని ఆయన సవాల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట చెప్తే అది ఒక్క చట్టమని... ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతారని తలసాని స్పష్టం చేశారు.లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ నిర్మించారని అడుగుతున్న విపక్ష నేతలు.. తన వెంటే వస్తే వాటిని చూపిస్తానని చెప్పారు మంత్రి తలసాని.
భారత్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం తెలంగాణ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు మంత్రి తలసాని. ఒక్క రూపాయి పేద వారిమీద భారం వేయకుండా గాంధీ నగర్,శ్రీరామ నగర్ లో కోట్ల రూపాయలతో ఇళ్ళు నిర్మించామన్నారు. కంటోన్మెంట్ ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించిన తలసాని... టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే కంటోన్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. వారంలో కంటోన్మెంట్ బోర్డు వాటర్ ఇవ్వాలని .. లేదంటే రాబోయే రోజుల్లో వేలాది మందితో మీ కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్ ముట్టడిస్తామని తలసాని వార్నింగ్ ఇచ్చారు.